Tuesday 15 November 2016

సినిమా చూపించాడు మోదీ!

ఒక్క దెబ్బకు దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 90% సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

మిగిలిన 10% కొంచెం ఎక్కువ ముందు జాగ్రత్తపరులై ఉంటారు. అంతే తేడా.

ఇండస్ట్రీలో "సినిమా తీస్తున్నాం" అని అనుకొన్న రోజు నుంచి, ప్రతిరోజూ డబ్బు పెట్టటమే ఉంటుంది కాని ఎలాంటి రొటేషన్ ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, కలెక్షన్లు వచ్చినతర్వాతే .. మళ్లీ డబ్బు వెనక్కిరావడం చూస్తారు సినిమావాళ్లు.

ఈ నేపథ్యంలో - ప్రతిరోజూ షూటింగ్‌లో ట్రాన్స్‌పోర్ట్, భోజనం, ఇక్విప్‌మెంట్ రెంట్లు, ఇతర రోజువారీ రెంట్లు, డీజెల్, టీమ్‌లో కిందిస్థాయి వర్కర్స్ కు ఇవ్వాల్సిన రోజువారీ భత్యాలు .. ఇవ్వన్నీ ఏరోజుకారోజు తప్పనిసరి. వీటిల్లో దాదాపు మొత్తం క్యాష్ రూపంలోనే అవసరం.

మోదీజీ పుణ్యమా అని ఒక్క దెబ్బతో సీన్ మారిపోయింది.

నో క్యాష్! నో షూటింగ్!!

దేశాన్ని మోదీ ఏదో చేద్దామనుకొంటోంటే నీ సినిమాలెవడిక్కావాలయ్యా అనొచ్చు.

కరెక్ట్. అదే నెక్స్‌ట్ కొష్చన్. నాకు తెలుసు.

ఇక్కడ సినిమాలా, టీవీలా అన్నది కాదు ముఖ్యం. ఇదొక అతిపెద్ద ఇండస్ట్రీ. దేశానికి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న ఒక ప్రధాన పరిశ్రమ. ఈ పరిశ్రమ మీద ఆధారపడి దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి.

ఆ లక్షల కుటుంబాల్లో 90% మంది సినిమా నిర్మాణంలోని వివిధ డిపార్ట్‌మెంట్లలో రోజు కూలీకి పనిచేసే కార్మికులు. సినిమా భాషలో ఏరోజుకారోజు వీరికిచ్చే డబ్బుని "డైలీ బేటా" అంటారు. తెలుగులో దిన భత్యం. ఇదిలేకుండా వారికి దినం గడవదు.

ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు. ఇలాంటి డైలీ వేజెస్‌కు కార్మికులు పనిచేసే ఇండస్ట్రీలు, వ్యాపారాలు దేశంలో ఇంకెన్నో ఉన్నాయి.  

వీళ్లంతా ఎన్నిరోజులు అప్పులు చేస్తారు? ఎన్నాళ్లని అప్పు దొరుకుతుంది? అసలెవరిస్తారు?

మనం మనం అనుకోవడం కాదు. కేంద్రంలో ఎన్నో కసరత్తులు 24 గంటలూ జరుగుతుంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సమస్య తొందరగానే ఒక కొలిక్కివస్తుందని ఆశిద్దాం.

ఎందుకంటే ..

మనిషి రోడ్డునపడ్డాడు.       

No comments:

Post a Comment