Wednesday 13 July 2016

@ మై గుంటూరు క్యాంప్ ఆఫీస్!

స్విమ్మింగ్‌పూల్ తర్వాత, నా కొత్త సినిమా ప్రి-ప్రొడక్షన్ పనులకోసం, ఫండ్స్ కోసం హైద్రాబాద్ వదిలి నిన్నటికి సరిగ్గా 14 రోజులు!

ఒకసారి మారిషస్, కొన్నిసార్లు పాండిచ్చేరి ట్రిప్‌ల తర్వాత, నా మొత్తం జీవితంలో ఇంటి నుంచి నేను ఇంత పెద్ద గ్యాప్ తీసుకోవడం ఈమధ్య ఇదే.

దాదాపు సగం నెల!

మొన్నే, జూన్ 18/19 తేదీల్లో కొత్త సింగర్స్, ఆర్టిస్టులకోసం నేను, ప్రదీప్‌చంద్ర గుంటూరులో నిర్వహించిన ఆడిషన్ కోసం ఒక 5 రోజులు ఉండివచ్చాను.

అంటే, కేవలం గత నెల రోజుల్లోనే, సుమారు 19 రోజులు నేను పూర్తిగా గుంటూరులోనే గడిపానన్నమాట! చూస్తుంటే, కనీసం ఇంకో నాలుగయిదు రోజులయినా మళ్ళీ నేను గుంటూరు వెంటనే వెళ్లిరావల్సిన అవసరం కనిపిస్తోంది. పనులు అంత ముఖ్యమైనవి.

సో, మొత్తంగా ఒక నెలలో, సుమారు 24 రోజులు నేను పూర్తిగా గుంటూరులోనే ఉన్నట్టు లెక్క!

గుంటూరులో ఉన్నన్ని రోజులూ హోటల్ సిందూరి,  వజ్రం రెసిడెన్సీ, హోటల్ వైస్రాయ్ ల్లో ఎక్కువగా గడిపాను. ఈమధ్యే కొన్నిరోజులు మాత్రం మా ప్రొడ్యూసర్ వాళ్ల ఆఫీసులో కూడా ఉన్నాను.

ఆఫీసులో గడిపిన ఆ కొద్దిరోజుల అనుభవాలతో, సరదాగా ఒక "వాచ్‌మన్ ఎపిసోడ్" అన్న టైటిల్‌తో మరో బ్లాగ్ కూడా రాయగలను. అయితే, ఆ పని తర్వాత చేస్తాను .. నా బ్లాగ్‌లోనో, లేదంటే తర్వాత నేను రాయబోయే "ది మేకింగ్ ఆఫ్ .." పుస్తకంలోనో.

కట్ టూ డైరెక్ట్ పాయింట్ -

అసలు ఇన్ని రోజుల నా గుంటూరు ట్రిప్ ప్రధానోద్దేశ్యం నెరవేరిందా అంటే .. నేను తాజాగా తెలుసుకున్న ఒక్క నిజం గురించి మాత్రం చెప్పగలను.

ఏంటంటే .. ఏ పని గురించైనా సరే .. ఎప్పుడూ ఒకే ఒక్క సోర్స్ మీదనో, ఒకే ఒక్క వ్యక్తిమీదనో అస్సలు ఆధారపడవద్దు. పని కానప్పుడు బాధపడవద్దు. మన నిర్ణయాన్ని మాత్రమే సరైన నిర్ణయం కాదని భావించి మనమే బాధ్యత వహించాలి.

అయినా సరే, ఇప్పుడు మేము సత్ఫలితాల రేసులో ఉన్నాం.

ఇక ఎప్పుడూ ఉంటాం.

No comments:

Post a Comment