Sunday 6 March 2016

చార్లీ చాప్లిన్ విజయరహస్యం!

తలరాత, విధిరాత, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది .. వంటి శాస్త్రాలను నేను నమ్మలేను. నమ్మను.

మన కృషినిబట్టే ఫలితం ఉంటుంది. మన నిర్ణయాలనుబట్టే కొన్ని కలిసిరావడమో, లేదా కలిసిరాకపోవడమో జరుగుతుంది. ఇది నా వ్యక్తిగత నమ్మకం. చాలా సందర్భాల్లో నా అనుభవం కూడా.  

కట్ టూ చార్లీ చాప్లిన్ -

తన జీవితకాలంలో సుమారు 80 సినిమాల్లో నటించి, 3 అకాడమీ అవార్డుల్ని అందుకున్న చార్లీ చాప్లిన్ అంటే కేవలం ఒక్క నటుడుగానే అందరికి తెలుసు. కానీ - అతనొక మంచి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, బిజినెస్‌మేన్ అన్న విషయం చాలామందికి తెలియదు.

మేరీ పిక్‌ఫోర్డ్, డగ్లస్ ఫెయిర్‌బాంక్స్, డి డబ్ల్యూ గ్రిఫిత్ లనే మరో ముగ్గురు ఆర్టిస్టులతో కలిసి చాప్లిన్ పూనుకోకపోతే, 1919 లో "యునైటెడ్ ఆర్టిస్ట్స్" అనే ప్రొడక్షన్ కంపెనీ అసలు హాలీవుడ్‌లో ఏర్పడేదే కాదు.

హాలీవుడ్ చరిత్రలో కేవలం ఆర్టిస్టులు మాత్రమే స్థాపించిన మొట్టమొదటి స్టూడియో అదే!    

చార్లీ చాప్లిన్ చెప్పిన ఒక మూడు కొటేషన్లను రికార్డ్ చేసుకోవడం కోసం, మరో కోణంలో స్వీయ విమర్శ కోసం మాత్రమే నేనీ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను:

“Nothing is permanent in this world, not even our troubles.”

“I like walking in the rain, because nobody can see my tears.”

“The most wasted day in life is the day in which we had not laughed.”

చాప్లిన్ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తాన్ని, ఆయన జీవితాదర్శాన్నీ ఈ మూడు కొటేషన్లలో మనం చూడొచ్చు. అలాంటి చార్లీ చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలో చెప్పుకున్నట్టు .. చాప్లిన్ విజయరహస్యం ఏ విధిరాతో కానే కాదు.

క్రియేటివ్ ఫ్రీడమ్!

ఈ క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కుల్ని ప్రారంభంలోనే గుర్తించకపోవడం, లేదా అలాంటి చిక్కుల్ని  కొనితెచ్చుకోవడం ఎంత తెలివితక్కువతనమో - వాటిల్లోంచి వెంటనే బయటపడకపోవడం అంతకంటే పెద్ద మూర్ఖత్వం.

ఈ చిక్కులు వ్యక్తిగతమైనవి కావొచ్చు, సాంఘికమైనవి కావొచ్చు, ఆర్ధికమైనవి కావొచ్చు. అడుగడుగునా మాత్రం అడ్డుపడతాయి. జీవితాన్ని అనుకున్నట్టుగా ముందుకు సాగనీయవు. జీవితంలో అసలు ఎన్నడూ ఊహించని అల్లకల్లోలం సృష్టిస్తాయి.    

ఈ లాజిక్ ఒక్క క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికే కాదు, అందరికీ వర్తిస్తుంది.

ఈ నిజాన్ని ముందే గ్రహించగలిగాడు కాబట్టే - చాప్లిన్ తన క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కులకు ముందే చెక్ పెట్టుకున్నాడు. 1919 లోనే హాలీవుడ్‌లో యునైటెడ్ ఆర్టిస్ట్స్ స్థాపించాడు. తను కోరుకున్న క్రియేటివ్ ఫ్రీడమ్‌ను సాధించుకొన్నాడు.

"చార్లీ చాప్లిన్" అనగానే పెదాలపైన నవ్వు వికసించేలా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో నిల్చిపోయాడు.  

No comments:

Post a Comment