Saturday 21 November 2015

2017 లో ఫేస్‌బుక్ కొలాప్స్ కానుందా?

ప్రముఖ రచయిత్రి శోభా డే ట్వీట్ ద్వారా ఇందాకే తెలిసింది నాకు, మన పక్కనే ఉన్న ఢాకా లో కూడా ఫేస్‌బుక్ లేదని!

అయినా వాళ్లు బ్రతగ్గలుగుతున్నారని!!  

ఒక్క బంగ్లాదేశ్ ఏంటి.. ఆ మాటకొస్తే - చైనా, మారిషస్, ఇరాన్, నార్త్ కొరియా, సిరియా, ఈజిప్ట్, క్యూబా లాంటి ఇంకో 10 దేశాల్లో కూడా ఫేస్‌బుక్ కు ఎంట్రీ దొరకలేదు. అది వేరే విషయం.

అయితే - అంతకుముందున్న ఎన్నో హేమాహేమీల్లాంటి సోషల్ మీడియా సైట్స్‌ను కనుమరుగయ్యేలా చేసి, ఒక వైరస్‌లా ప్రపంచమంతా విస్తరించిన ఈ ఫేస్‌బుక్ కూడా 2017 లో కనుమరుగు కానుందని ఒక లేటెస్ట్ అంచనా.

నమ్మశక్యం కాదుగానీ, 2017 లో కనీసం ఒక 80% యూజర్స్‌ను కోల్పోనుంది ఫేస్‌బుక్!  

నల్లమోతు శ్రీధర్ అనుకుంటాను .. ఫేస్‌బుక్ మీద ఆమధ్య ఒక అద్భుతమైన ఆర్టికిల్ రాశారు. అది చాలామందికి నచ్చకపోవచ్చు కానీ, దాని సారాంశం ఇది: ప్రపంచాన్నంతా కలిపేస్తున్న ఈ ఫేస్‌బుక్, మరోవైపు  కుటుంబాల విఛ్ఛిన్నానికి కారణమౌతోందని.

ఎంత నిజం!

ఇంట్లో ఉండే నలుగురూ నాలుగు చోట్ల కూర్చుని ఎవరికివారు ఫేస్‌బుక్‌లో ఇంకెవరితోనో చాట్ చేస్తుంటారు. ఏదేదో పోస్ట్ చేస్తుంటారు. లేదా ఇంకేదో చూస్తుంటారు. లేదా ఇంకేదో చదువుతుంటారు.

ఫేస్‌బుక్ లేకపోతే లైఫే లేదు అన్నట్టుగా అయిపోయింది చివరికి.

కుటుంబ సభ్యులే అలా అపరిచితులయిపోతున్నారు!

కట్ టూ జరగబోయే రియాలిటీ -  

మరోవైపు - ప్రొఫెషనల్‌గా కానీ, వ్యాపారపరంగా కానీ, రాజకీయ ప్రచారాలకు గానీ సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ చెప్పలేనంతగా ఉపయోగపడింది. ఇంకా ఆ పవర్, ఆ హవా కొనసాగుతోంది.

ఈ మూడు విషయాల్లో తప్ప - ఇకమీదట ఫేస్‌బుక్ ఉపయోగం పూర్తిగా తగ్గిపోనుంది. ఆల్రెడీ ఆ ట్రెండ్ ప్రారంభమైందని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి.

నాకూ నిజమే అనిపిస్తోంది.

నేను ప్రస్తుతం సినిమాల్లో ఉన్నాను కాబట్టి,  నా ప్రొఫెషనల్ అవసరాల కోసం ఫేస్‌బుక్ మీద మొన్నటివరకూ రోజుకు ఒక అరగంటో గంటో స్పెండ్ చేశాను. కానీ, ఇప్పుడు నాకు కూడా ఫేస్‌బుక్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం లేదు.

ఫేస్‌బుక్‌తో నా అవసరం ప్రొఫెషనల్ కోణంలోనే అయినప్పటికీ!

సింపుల్‌గా ట్విట్టర్‌లో ఒకే ఒక్క నిమిషంలో ఒక ట్వీట్ పెట్టేసి ఊరుకుంటున్నాను. నా ట్విట్టర్‌ను ఫేస్‌బుక్ కి కనెక్ట్ చేసాను. ఆటోమాటిగ్గా అది ఫేస్‌బుక్ లోనూ కనిపిస్తోంది. ఇంకేం కావాలి?

యూత్ కూడా ఇంతకుముందులా ఫేస్‌బుక్ వాడ్డం లేదు. చాలా తగ్గిపోయింది. వాళ్లకు మొబైల్లోనూ, బయటా ఫేస్‌బుక్ ను మించినవి ఇంకెన్నో ఉన్నాయి.

ట్విట్టర్‌ను అలా పక్కన పెడితే - ఫేస్‌బుక్‌ని మించి ఇప్పుడు ఎక్కువగా వాట్సాప్‌ను వాడుతున్నారందరూ. కొత్తగా ఇంకెన్నో రావొచ్చు. లేదా, పడిపోతున్న ఫేస్‌బుక్ ట్రెండ్స్‌ను చూసి, మార్క్ జకెర్‌బర్గ్ కొత్తగా ఇంకేదో మార్కెట్లోకి తేవొచ్చు. అలాంటి లక్షణాలున్నది ఇంకేదో ఇప్పటికే మార్కెట్లో ఉన్నట్టైతే, దాన్నే జకెర్‌బర్గ్ కొనేసి ఇంకా డెవలప్ చెయ్యొచ్చు.

ఏదైనా సాధ్యమే.

కానీ, ఫేస్‌బుక్ మాత్రం 2017 నుంచి అత్యంత వేగంగా కనుమరుగు కానుందని స్టడీస్ చెబుతున్నాయి. నాకూ నిజమే అనిపిస్తోంది.

ఈలోగానే .. ఎవరైనా, ఏ పాజిటివ్ యాంగిల్లోనైనా .. దాన్ని వాడుకున్నంత వాడుకోవచ్చు. 

Wednesday 11 November 2015

నా బ్లాగింగ్ ఎందుకు స్లో అయ్యింది?

ఏదో కొంచెం స్లో అవుతుందనుకున్నాను కానీ, మరీ ఇంతలా నెలకు కేవలం ఓ 5, 6 పోస్టుల స్థాయికి పడిపోతుందనుకోలేదు!

నా కొత్త సినిమాల ప్లానింగ్, మీటింగ్స్, అగ్రిమెంట్లు, కమిట్‌మెంట్లు వంటి అన్నో అతిముఖ్యమైన పనుల్లో పూర్తిగా మునిగిపోయి పిచ్చి బిజీగా ఉంది లైఫ్.

కట్ టూ నాణేనికి మరోవైపు - 

పైన చెప్పిన బిజీ షెడ్యూల్ కారణంగానే నిజంగా ఏమీ రాయలేకపోతున్నానా? నాకెంతో ఇష్టమైన ఒక హాబీని, థెరపీని నిర్లక్ష్యం చేస్తున్నానా?

దీన్ని కేవలం ఒక 10 శాతం కారణంగానే నేను ఒప్పుకుంటాను.

ఎన్ని వ్యక్తిగతమైన, ఆర్థిక, వృత్తిపరమైన వత్తిళ్లు ఉన్నా - ఒక మెడిటేషన్ ప్రక్రియలా కనీసం ఓ పది నిమిషాలు ఏదో ఒకటి రాయగల శక్తి, ఓపిక, ఇష్టం నాకున్నాయి.

అయినా ఆ పని చేయటంలేదు, చేయలేకపోతున్నాను అంటే ఇంకేదో కారణం ఉండాలి.

ఉంది.  

2016 చివరివరకు, ఎన్ని వీలైతే అన్ని ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాను. వచ్చే 365 రోజులూ చాలా చాలా బిజీగా ఉండేట్టు చూసుకుంటున్నాను.

ఈ స్టేజ్‌లో ఇప్పుడిది చాలా అవసరం నాకు.

నాకున్న అతికొద్దిమంది ఆత్మీయ మిత్రులలో ఒకరిద్దరితో నాకున్న ఒకటిరెండు కమిట్‌మెంట్‌లు, నా కుటుంబం, నా బాధ్యతలు, నా వ్యక్తిగత క్రియేటివ్ ఫ్రీడమ్ - ఇప్పుడు ప్రతి క్షణం నా ఫోకస్ అంతా ఇదే.

వీటి మీదే.

ఇదే ఆర్డర్‌లో.

ఈ ఫోకస్‌ను పక్కనపెట్టి ఒక పది నిమిషాలు బ్లాగ్ రాసినా, దానికొక ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం నా ఫోకస్‌తో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఈ మధ్య నేను బ్లాగ్ రాయడం చాలా స్లో అయ్యింది.

నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో చాలా కొటేషన్లు, పోస్ట్‌లు నాకోసం నేను పోస్ట్ చేసుకున్నట్తే .. ఈ బ్లాగ్ పోస్ట్ కూడా నాకోసం నేను రాసుకున్నది.

ఇది సంజాయిషీ కాదు. స్వీయ అంతరంగ విశ్లేషణ.