Monday 19 January 2015

"అలా"నాటి అఖిల్ కార్తీక్!

2006 జూన్‌కు, 2015 ప్రారంభానికి మధ్యలో దాదాపు ఎనిమిదేళ్లు గడిచాయి.

ఎనిమిదేళ్లంటే అంత తక్కువ సమయమేం కాదు. ఈ మధ్యలో ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనిషి ఎన్నోరకాలుగా మారిపోతాడు.

నిజానికి, మన అనుభవాలు మనల్ని అలా మారుస్తాయి.

అలాంటి ఎన్నో మార్పులు జరగటానికి కారణమైన సంఘటనలు ఈ ఎనిమిదేళ్లలో నా జీవితంలో చాలా జరిగాయి. బహుశా అఖిల్ కార్తీక్ జీవితంలోనూ ఎన్నో జరిగుంటాయి.

ఇది సహజం.

కట్ టూ మా ఫేవరేట్ "అలా" - 

అప్పట్లో నేనూ, నా మిత్రులు కొందరు డబ్బులు మోబిలైజ్ చేసి తీసిన చిత్రం "అలా".

ఈ అనఫీషియల్ విషయాన్ని ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే - "అలా" చిత్రానికి అఫీషియల్‌గా నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ని కూడా కాబట్టి!

ఆ విషయం అలా వదిలేద్దాం ..

"అలా"లో నేను పరిచయం చేసిన హీరోయిన్ విదిశ శ్రీవాస్తవ సొంత చెల్లెలే ఇప్పటి రైజింగ్ సౌత్ హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ (వర్మ "రౌడీ" ఫేమ్).

ట్రెడిషనల్‌గా చెప్పాలంటే - "అలా" హీరో హీరోయిన్లు రోహన్, విదిశ శ్రీవాస్తవ. కథలో వీరిదో సెపరేట్ ట్రాక్. అంతే.

కానీ - కథాపరంగా అయితే, "అలా" లో అసలు హీరో కార్తీక్.

మరో ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉన్నా కూడా .. మొత్తంగా కథంతా కార్తీక్ పాత్ర చుట్టూ జరిగేదే.

ఒక సినిమా నిడివి ఎలా రెండున్నర గంటలో .. "అలా" చిత్రంలో కథ జరిగే సమయం కూడా రెండున్నర గంటలే.
ఆ విధంగా చూసినప్పుడు "అలా" సినిమా ఒక రియల్ టైమ్ స్టోరీ అన్నమాట!

ముంబై హైవేలో ఉన్న ఇస్నాపూర్ ఫిల్లింగ్ స్టేషన్‌లోనే దాదాపు అత్యధికభాగం చిత్రీకరించిన ఆ సినిమా అంటే వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం.

కార్తీక్ కి కూడా.

కర్ణుడి చావుకి ఎన్నో కారణాలున్నాయంటారుగానీ, "అలా" నడవకుండాపోవడానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి: కనకపు సిమ్‌హాసనమిచ్చి ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మటం. రెండోది:  తనమీద పెట్టిన ఆ నమ్మకాన్ని ఆ వ్యక్తి కనీసం ఒక మనిషిగానైనా నిలుపుకోలేకపోవడం.

సినీ ఫీల్డులో ఇది చాలా సర్వసహజమయిన విషయం అని తర్వాత అనుభవం మీద గ్రహించాను. అలాంటి చెత్త నిర్ణయాలు ఇకమీదట నావైపు నుంచి జరక్కుండా ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను.

దీనర్ధం .. ఫీల్డులో అలాంటి షార్క్స్ ఎప్పుడూ ఉంటాయన్నమాట!  

మొన్నీమధ్య ఒక పార్టీలో కలిసినప్పుడు - "అలా" నడవకపోడానికి కార్తీక్ కూడా రెండే రెండు కారణాలు చెప్పాడు. ఒకటి ప్రమోషన్, రెండోది రిలీజ్ అని.

పైన నేనుచెప్పిన కారణాలకు, కార్తీక్ చెప్పిన ఈ కారణాలు కేవలం పర్యాయపదాలు మాత్రమే. సేమ్ టు సేమ్!

అప్పటి ట్రెండ్‌లో ఒక "ఐతే" లా బ్రహ్మాండంగా నడిచే స్టఫ్ ఉన్న మా "అలా" సినిమాని, కేవలం వ్యక్తిగతమైన శుష్క, స్వార్థ, నీచ, మనీ కక్కుర్తి ప్రయోజనాలకోసం కావాలని అలా జరక్కుండా చేశారు.

ఇలాంటివే మరికొన్ని నాదృష్టికి రాని కొన్ని సంఘటనలు, అవమానాలు కూడా జరిగాయని ఇటీవలే కార్తీక్ ద్వారా విని నేను నిజంగా షాకయ్యాను. బాధపడ్డాను కూడా.

అ యి నా .. 

"అలా" నాటి అఖిల్ కార్తీక్‌కీ, ఇప్పటి "స్విమ్మింగ్‌పూల్" అఖిల్ కార్తీక్‌కీ - మనోహర్ చిమ్మనితో స్నేహంలో, అనుబంధంలో ఎలాంటి మార్పులేదు.

దటీజ్ అఖిల్ కార్తీక్!  

No comments:

Post a Comment