Friday 31 January 2014

ఏ సినిమా నిజంగా సొసైటీకి మేలు చేస్తుంది?

"సొసైటీకి మేలు చేసే సినిమా అంటూ ఉంటారందరూ. ఏ సినిమాకి అయితే ఎక్కువ డబ్బు వస్తుందో అదే సొసైటీకి ఎక్కువ మేలు చేస్తుంది. మెసేజ్‌ ఉన్న సినిమా అయితే సొసైటీకి పనికొస్తుందని జనం అనుకుంటారు. కానీ మెసేజ్‌ ఉన్న సినిమాని ఎవడూ చూడడు. ఏ సినిమా అయితే నచ్చి జనం చూస్తారో అదే సొసైటీకి పనికొస్తుంది. ఎందుకంటే... అందరికీ డబ్బొస్తది. అందరం గవర్నమెంట్‌కి టాక్స్‌ కడతాం. కాబట్టి నా దృష్టిలో సొసైటీకి పనికొచ్చే సినిమా అంటే కమర్షియల్‌ సినిమానే. దానికి అవార్డులు వచ్చినా రాకపోయినా ఏం ఫర్లేదు." -- పూరి జగన్నాథ్ 

^^^

"నేషనల్‌ అవార్డ్‌ వచ్చేదా... వంద కోట్లు వచ్చేదా... ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు?" .. 
అన్న ప్రశ్నకి, ఒక ఇంటర్‌వ్యూలో.. పైవిధంగా, నిర్మొహమాటంగా, సూటిగా, సుత్తిలేకుండా జవాబు చెప్పాడు పూరి జగన్..

"
వంద కోట్లు వచ్చే సినిమానే తీస్తాను" అని.

ఇలా చెప్పడానికీ గట్స్ ఉండాలి!

దీన్ని మనవాళ్లు ఒప్పుకోడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా సో కాల్డ్ జర్నలిస్టులు-లేదా-క్రిటిక్స్. ఇంకా కొంతమంది
 "మేం మేధావులం" అనుకొనేవాళ్లు. 

వీళ్లేకాదు..  ఇంకా కొంతమంది, చచ్చేదాకా కేవలం హిపోక్రసీలోనే బ్రతికే జీవులు కూడా.. ఈ లాజిక్కుని ఒప్పుకోవు గాక ఒప్పుకోవు. 

సిగరెట్లమీద సిగరెట్లు కాలుస్తూ, చాయ్‌ల మీద చాయ్‌లు తాగుతూ.. నానా నీతిసూత్రాలు చెబుతూ, ఏదేదో రాసేస్తారు వీళ్లంతా.  

కాలానుగుణంగా ప్రపంచంలో వచ్చే అన్ని మార్పులూ, చేర్పులూ, సౌకర్యాలూ, విలాసాలూ, గాడ్జెట్సూ, గాడిదగుడ్సూ అన్నీ ఓకే. అన్నిటికీ స్వాగతం. 

ఒక్క కమర్షియల్ సినిమా దగ్గరికి 
చ్చేటప్పటికే ఎక్కడలేని నీతిసూత్రాలు గుర్తుకొస్తాయి! 

"ఇలా తీయొచ్చు.. అలా తీసుండాల్సింది.. సెకండాఫ్ లాగారు.. ఫస్టాఫ్ పీకారు.." అంటూ నానా ఈకలు పీకుతారు.


కట్ టూ ప్రాక్టికాలిటీ - 


ఈ మహానుభావులందరూ ఒక్క నిజం తెలుసుకోవాలి. ఒక్క పని చేసి చూపించాలి. 

సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఎన్ని మిలియన్ల కుటుంబాలు బ్రతుకుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా? ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ ఒక్కటే ఎంత ఆదాయాన్ని అందిస్తోంది? అన్ని బిలియన్ల ఆదాయం, అంతమంది బ్రతకడం.. నేషనల్ అవార్డులు వచ్చే సినిమాలు మాత్రమే తీయడం ద్వారా సాధ్యమా? .. ఇదీ వీరు తెల్సుకోవాల్సిన నిజం.

సినిమాలు ఇలా తీయాలి..అలా తీయాలి అని ఓ సొద రాసే వీళ్లందరూ.. డబ్బులు సమకూర్చుకొని/లేదా/ఒక ప్రొడ్యూసర్‌ను సంపాదించుకొని వీరు చెప్పే కళాఖండాల్ని తీసి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి చూపించాలి. ఇదీ .. వీరంతా చేయాల్సిన ఒకే ఒక్క పని.  

Tuesday 28 January 2014

దేవదాసు మళ్లీ తీస్తున్నారు!

"ఆల్ టైమ్ టాప్ 100 ఇండియన్ మూవీస్" లో అక్కినేని నటించిన "దేవదాసు" ఉంది. దానికా అర్హత ఉంది. ఇంకెంతకాలం తర్వాతయినా ఈ 100 అత్యుత్తమ భారతీయ చిత్రాల లిస్టులోంచి 1953 లో తీసిన ఈ  దేవదాసు చిత్రాన్ని తొలగించే పరిస్థితి రాదు. తొలగించలేరు.

కళాత్మకంగా చూసినా, ఫక్తు సినిమాపరంగా చూసినా ఎన్నెన్నో కోణాల్లో అక్కినేని నటించిన దేవదాసు సినిమా ఒక క్లాసిక్.

బెంగాలీ రచయిత శరత్ నవల "దేవదాస్" మూలకథను ఒక అద్భుత ప్రేమకథాకావ్యంగా మలచి, చరిత్రలో నిల్చిపోయేట్టు చేసిన మహామహులెందరో ఆ చిత్రానికి పనిచేసిన టీమ్‌లో ఉన్నారు.

ఒక డైరెక్టర్‌గా, ఆ టీమ్ అంతటికీ కెప్టెన్ వేదాంతం రాఘవయ్య. అయితే, ఆ కెప్టెన్ కలను నిజం చేసిన వ్యక్తులు మాత్రం ప్రధానగా ముగ్గురు.

ఒకరు ఘంటసాల. కాగా.. దేవదాసుగా నటించిన అక్కినేని, పార్వతిగా నటించిన సావిత్రి మిగిలిన ఇద్దరు.

దేవదాసు చిత్రాన్ని అప్పట్లోనే హిందీలో దిలీప్ కుమార్ హీరోగా తీశారు. ఇటీవలే షారుఖ్ ఖాన్ హీరోగా కూడా అత్యంత భారీగా తీశారు.  ఇంకా బెంగాలీ, అస్సామీ, ఉర్దూల్లో కూడా దేవదాసు చిత్రాన్ని నిర్మించారు. మన తెలుగులోనే, సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విజయనిర్మల కూడా 1974 లో దేవదాసు తీశారు.

అప్పట్లో హీరో కృష్ణ దేవదాసుగా చేసిన దేవదాసు చిత్రాన్ని అందరూ "కొత్త దేవదాసు" అనేవాళ్లు. అది వేరే విషయం.

సందేహం లేదు. ప్రతి ఒక్కరూ అక్కినేని దేవదాసు కంటే అద్భుతంగా తీయడానికే ప్రయత్నించారు. కానీ.. అక్కినేని దేవదాసును వరించినంత విజయం గానీ, పేరుగానీ ఏ ఒక్క చిత్రానికీ రాలేదు. రాదు కూడా.

ఇకముందు రాబోయే ఎన్ని దేవదాసులకయినా ఇదే వర్తిస్తుందని నా అభిప్రాయం.

కారణం చాలా స్పష్టం. కొత్తగా తీసిన/తీసే దేవదాసుల్లో కొత్త హంగులు, రంగులు, కొత్త టెక్నాలజీ, భారీతనం.. ఇంకా ఏవేవో ఉండవచ్చు. కానీ, ఆ దేవదాసులోని 'లైఫ్' వీటిలో ఉండదు.

విజయనిర్మల కూడా తన దేవదాసుతో ప్రేక్షకులకు ఒక "విజువల్ ట్రీట్"ని ఇచ్చారు. కానీ, అది హృదయాన్ని తాకలేకపోయింది.


కట్ టూ 'సుమంత్' దేవదాసు - 

ఇప్పుడు మళ్లీ.. అక్కినేని మనవడు సుమంత్‌కు తనే హీరోగా దేవదాసును మళ్లీ తీయాలన్న కోరిక పుట్టింది. తప్పేంలేదు. ఒక ఆర్టిస్టుగా తన కలను నిజం చేసుకోడానికి ప్రయత్నించే స్వాతంత్ర్యం ఆయనకుంది. దాన్ని ఎవ్వరూ కాదనడానికి వీళ్లేదు.

వాస్తవానికి సుమంత్‌లో ఈ కోరిక పుట్టడానికి కారణం కూడా దేవదాసులో అద్భుతంగా నటించి, ఆయనమీద అంత చెరగని ముద్ర వేసిన తాతయ్య అక్కినేనే అని చెప్పవచ్చు.

ఇటీవలే దివంగతులైన తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ప్రేమతో సుమంత్‌కు ఈ ఆలోచన వచ్చి ఉండవచ్చు. చాలా సహజమైన విషయం. సుమంత్ తను అనుకున్నది చేసి తీరాల్సిందే. అలా చేసి, స్వర్గంలో ఉన్న తన తాతగారికి సంతోషం కలిగించాల్సిందే.

కాకపోతే సుమంత్ చేయబోయే దేవదాసుని.. తన తాతయ్య బ్రతికుంటే.. దాన్ని చూసి, "శభాష్!" అని మెచ్చేలా ఉండాలి. అంతే తప్ప, అదేదో ఆ మధ్య మన ఆర్‌జీవీ "షోలే" ను "ఆగ్" చేసినట్లు కాకూడదన్నది నా కోరిక.

Monday 27 January 2014

ఎవరి "పిచ్" వారికి ఆనందం!

మొన్న నా ఫ్రెండ్ ఒకరు తన ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వాక్యం పై టైటిల్‌కి ఇన్స్‌పిరేషన్!

ఫేస్‌బుక్‌లో తను ఏదో పోస్ట్ చేస్తే.. "మగాళ్లు దానివైపు అసలు చూడకపోయినా ఓకే. కనీసం ఆడాళ్లయినా దాన్ని లైక్ చేసి, షేర్ చేయాల్సింది. వాళ్లూ చేయలేదు" అంటూ బోల్డంత ఇదయిపోయారామె!

మన సొంత పిచ్చితో మనం పోస్ట్ చేసిన ప్రతిదాన్నీ మనం అనుకున్నవాళ్లంతా లైక్ చేస్తారన్న గ్యారంటీ ఏమీలేదు. సో, చివరాఖరికి నా ఉద్దేశ్యం ఏంటంటే - ఈ విషయంలో నా ఫ్రెండు అంతలా ఇదయిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 

బై ది వే, ఆ ఫ్రెండ్‌తో నా "షాట్-బై-షాట్" ఇంటర్వ్యూ ఫిబ్రవరిలో ఇదే బ్లాగ్‌లో పోస్ట్ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి "పిచ్" లేదు. జస్ట్.. నా పిచ్చి మాత్రమే!


కట్ టూ నా సోషల్ నెట్‌వర్కింగ్-కమ్-ఆన్‌లైన్ యాక్టివిటీ - 

ఇప్పుడు, ఈ క్షణం.. మీరు చదువుతున్న ఈ బ్లాగ్ నా పిచ్. నా పిచ్చి కూడా. దీనిమీద ఆటాడుకోవడం అన్నది నా వ్యక్తిగత ఆనందం. నాకున్న ఎన్నో వ్యక్తిగత టెన్షన్ల నుంచి ఇదో చిన్న రిలీఫ్.

ఈ బ్లాగ్ ఒక్కటే కాదు. ఇంకా.. ఫేస్‌బుక్, ట్విట్టర్, కొన్ని ఫోరంస్‌రూపంలో కూడా నాకు రకరకాల పిచ్‌లున్నాయి. వీటిల్లో ఒక్కో పిచ్ నాకు ఒక్కో రకంగా సహకరిస్తుంది.

నా ఫేస్‌బుక్‌లో, ఫేస్‌బుక్ పేజ్‌లో ఏదేదో స్టఫ్, ఏదేదో నాన్‌సెన్స్ నేను పోస్ట్ చేస్తుంటాను. అదంతా నా పిచ్చి, నా ఆనందం. నేను పోస్ట్ చేసినవాటిలో ప్రతి ఒక్కటీ ప్రతి ఒక్కరికీ నచ్చాలన్న రూలేమీ లేదు.

కాకపోతే.. ఆ పోస్టులను చూసిన ఆయా నిర్ణీత సమయాల్లో, వారి అప్పటి మానసిక స్థితిని, వారున్న పరిస్థితిని బట్టి.. ఒక్కొక్కరికి ఒక్కో పోస్ట్ నచ్చవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో పోస్టులో తమని తాము ఐడెంటిఫై చేసుకోవచ్చు.

నా ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే.

మొన్నీ మధ్య నేను పోస్ట్ చేసిన ఒక "నోట్" పైన, నా పూర్వ విధ్యార్థి అయిన ఒకమ్మాయి అమెరికా నుంచి ఒక కామెంట్ పెట్టింది. చాలా హానెస్ట్ కామెంట్. నేను నిజంగా చాలా సంతోషంగా ఫీలయ్యాను.

నేను పోస్ట్ చేసిన ఆ నోట్ తనకు సంబంధించిన ఒకానొక విషయంలో ఒక నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడిందట!

ఇంతకన్నా ఆనందం ఇంకేం కావాలి?

ఇంకో విధంగా చెప్పాలంటే - నా ఈ సోషల్ నెట్‌వర్కింగ్, నా బ్లాగ్, నా ఆన్‌లైన్ ప్రజెన్స్, నేను చేసే ఈ "స్క్రిబ్‌లింగ్, స్టఫ్, నాన్‌సెన్స్" .. ఇదంతా నాకోసం నేను క్రియేట్ చేసుకొన్న పిచ్‌లు. ఈ పిచ్‌ల మీద నా ఇష్టమున్నట్టు నేను ఆడుకుంటాను. నేనే ఇండియా, నేనే పాకిస్తాన్!

నన్ను నేను క్లీన్ బోల్డ్ చేసుకుంటాను. నేనే సిక్సర్ కొడతాను. సింగిల్ తీస్తాను. సెంచరీలు చేస్తాను. డకవుట్ అవుతాను.

నా పిచ్. నా పిచ్చి. నా ఇష్టం.

ఇదంతా నా జీవితం. నేను కోరుకొంటున్న జీవితం. నేను నేర్చుకుంటున్న జీవిత సత్యం.

నా వ్యక్తిగత జీవితంలోని ఈ మజిలీలో నన్ను ఎంటర్‌టైన్ చేస్తున్న ఒక క్రియేటివ్ ప్లాట్‌ఫామ్. ఒక థెరపీ. ఒక అధ్యయనం.

అంతిమంగా ఇదంతా ఇప్పుడు నాకు అవసరమైన ఒక ఆనందం.

Thursday 23 January 2014

అక్కినేనిలో నాకు నచ్చిన ఒకే ఒక్క అంశం..

అక్కినేని నటించిన సినిమాల్లో నేనిప్పటికీ చాలా బాగా ఇష్టపడే సినిమా.. దేవదాసు.

ఆయన నటించినవాటిల్లో ఇంకెన్నో అద్భుతమైన సినిమాలుండగా దేవదాసు ఒక్కటే ఎందుకంత బాగా నచ్చిందీ అంటే.. అదంతే. దాని గురించి రాయాలంటే ఒక బ్లాగ్ పోస్ట్ చాలదు. ఓ పుస్తకమే రాయొచ్చు. అదలా ఉంచుదాం.

కేవలం నాలుగో తరగతివరకు మాత్రమే చదువుకొన్న అక్కినేని, ఆరోజుల్లోనే నటనను వృత్తిగా ఎన్నుకొనే సాహసం చేశారు. ఎన్‌టీఆర్ వంటి దిగ్గజం మరోవైపు గట్టిపోటీ ఇస్తున్నా, తట్టుకొని హీరోగా శిఖరాగ్రస్థాయికి ఎదిగగలిగారు. 256 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు సంపాదించారు. ఎంతో డబ్బు కూడా సంపాదించారు.  

తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మద్రాసు నుంచి హైద్రాబాదుకు తీసుకురావడంలో ఆయన ఓ అపర బగీరథుడయ్యారు. ఆ విషయంలో వందశాతం సక్సెస్ సాధించారు.

తను స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోను బాగా అభివృధ్ధి చేసి, దానికో బ్రాండ్ ఇమేజ్ తీసుకురాగలిగారు. కొడుకు నాగార్జునని ఒక భారీ హీరోను చేయగలిగారు.

ఆయన ఇన్‌స్పిరేషనే కొనసాగిస్తూ - మనవళ్లు సుమంత్, నాగచైతన్య, సుశాంత్ లు కూడా హీరోలయ్యారు. మనవరాలు సుప్రియ కూడా హీరోయిన్‌గా చేసింది. రేపు, ఇంకో మనవడు అఖిల్ కూడా హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు.

ఇదంతా ఒక "రాగ్స్ టూ రిచెస్" సక్సెస్ స్టోరీ. ఎలాంటి సందేహం లేదు.

కానీ - వీటన్నింటిని మించి, అక్కినేనిలో నాకు బాగా నచ్చిన అంశం ఒక్కటే ఒక్కటి.

అక్కినేని అందరిలా దేవుణ్ణీ, అదృష్టాన్నీ ఎప్పుడూ నమ్మలేదు. పక్కా నాస్తికుడు. తన కృషి, పట్టుదలలే తన నిజమైన దేవుడనుకొని ఒక క్రమశిక్షణతో కష్టపడ్డారు. తను అనుకున్న ప్రతీదీ సాధించారు. ప్రతి అనుభవాన్నీ సంపూర్ణంగా ఆస్వాదించారు.

దేవుడినో, అదృష్టాన్నో నమ్ముకోకుండా ఇన్ని విజయాలు సాధించడం, ఇంత సంపూర్ణ జీవితం గడపగలగటం అనేది చాలా గొప్ప విషయం. అక్కినేనిలో నాకు నచ్చింది ఇదే.  

Saturday 18 January 2014

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు!

"ఇవాళ ఒక్క ఉదయ్ కిరణ్ మాత్రమే కాదు. ఎంతో మంది సినిమాలు మాత్రమే జీవితం అనుకుంటున్నారు. సినిమా కోసం....సినిమాల్లో నటించేందుకోసం.....దేనికైనా సిద్దపడుతున్నారు. ఆఖరికి చావడానికైనా..., బహుశా ఇటువంటి పరిస్థితి మన దగ్గర తప్ప మరెక్కడా ఉండదేమో. 
మిగతా దేశాల్లో సినిమాను ఓ ప్రొఫెషన్ లాగానే చూస్తారు. మన దగ్గర మాత్రం...సినిమా పరిశ్రమను వేరే లోకంగా భావిస్తారు. సినిమా మనుషులంటే దేవతలో...మరో గ్రహం మానవులో అనుకుంటారు.
 

సినిమా థియేటర్ లేని దేశాలు చాలా ఉన్నాయన్న సంగతి, అవి అభివృద్ధిలోనూ ముందుగా ఉన్నాయన్న సంగతి...సాంస్కృతికంగా బలంగా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. అంతేకాదు, సోమవారం, మంగళవారం లాంటి పనిదినాల్లో కూడా.....ఉదయం పదకొండు గంటలకే సినిమా థియేటర్ల ముందు క్యూలు కట్టే జనం ఉంటారని తెలిసి ఆ దేశాల ప్రజలు ఆశ్చర్యపోతారు కూడా. 


ఒక నాటకం, ఒక ప్రదర్శన, లేదా ఇతర కళారూపాలు ఎలాంటివో సినిమా కూడా అలాంటిదేనన్న వాస్తవం గుర్తించాలి. సినిమాలో అవకాశాలు రాకపోయినంత మాత్రాన పోయిందేమీ లేదని యువతరం గుర్తించాలి."

^^^
పైన కోట్ చేసిన పది వాక్యాలు నేను రాసినవి కాదు. "అస్తమించిన ఉదయకిరణం.." పేరుతో నేను రాసిన బ్లాగ్ పోస్ట్‌కి చందు తులసి స్పందన. 

సినిమాలు, సినిమావాళ్లు అంటూ వేరే లోకం ఇప్పుడు ఏదీ లేదు. అందరూ ఒక్కటే. అందర్లాగే సినిమావాళ్లూ వారికి నచ్చిన ఒక ప్రొఫెషన్లో ఉన్నారు అనుకుంటే గొడవేలేదు. 

అయితే, మిగిలిన అన్ని ప్రొఫెషన్లకూ, సినిమాకూ ఉన్న తేడా ఒక్కటే. 

సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణ ఒకటుంది. సెలబ్రిటీ స్టేటస్! 

మిగిలిన అన్ని ప్రొఫెషన్లలోనూ డబ్బు సంపాదించవచ్చు. కొన్నిట్లో పేరు కూడా సంపాదించవచ్చు. కానీ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ రావటం, కోట్లల్లో డిమాండ్ రావటం అనేది ఒక్క సినిమా ఫీల్డులోనే సాధ్యం.
  
క్రికెట్ వంటి అతి కొన్ని ఇతర ప్రొఫెషన్స్ కూడా ఇప్పుడు సినిమా గ్లామర్‌తో పోటీ పడుతున్నాయి. సినిమావాళ్లు కూడా ఇప్పుడు అందర్లాగే షాపింగ్ సెంటర్లలో తిరుగుతున్నారు. హోటల్స్, డిస్కోలు, క్లబ్బుల్లో అన్నిచోట్లా మామూలుగా తిరుగుతున్నారు. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. 

చెప్పొచ్చేదేంటంటే.. కాలం మారటం ఒక్కటే కాదు.ఇప్పుడు మనిషి ఆలోచనా దృక్పథం కూడా విస్తరించింది. 

సినిమా ఒక ప్రొఫెషన్ మాత్రమే. క్రికెట్ లాగే అక్కడ కూడా ఎప్పుడూ కొందరు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతారు. ఆ కొందరు మాత్రమే ఒక రేంజ్‌లో కొనసాగుతుంటారు. ఈ కొందరి సంఖ్య అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఒక డజనుకు మించదు! 

వచ్చేవాళ్లు వస్తుంటారు. పోయేవాళ్లు పోతుంటారు. సక్సెస్ సాధించి అగ్రభాగాన ఉండేది మాత్రం ఎప్పుడూ ఒక డజను మంది మాత్రమే.. 

ఇది ఇక్కడే కాదు. బాలీవుడ్డయినా, హాలీవుడ్డయినా ఇంతే.

కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ, వాస్తవం మాత్రం ఎప్పుడూ ఇదే. 

సినిమాల్లోకి ఎంటరయినవాళ్లూ, అయ్యేవాళ్లూ ముందుగా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. అప్పుడే సినిమాల్లో సక్సెస్ సాధించకపోవడం అనేది పెద్ద సమస్య అయి కూర్చోదు. సినిమాలోకం అవతల కూడా జీవితం ఉందని తెలుస్తుంది. 

అది తెలుసుకోవడమే చాలా ముఖ్యం. 

Thursday 16 January 2014

"1" మ్యూజిక్!

దేవిశ్రీప్రసాద్ తను పని చేసిన అందరు హీరోలకీ మంచి మ్యూజిక్ హిట్స్ ఇచ్చాడు. ఇక "ఐటమ్" పాటలంటే ఆయన రెచ్చిపోయినంతగా యెవరూ రెచ్చిపోరేమో!

అలాంటి "డిఎస్‌పి" (దేవిశ్రీప్రసాద్) కి మొదటిసారిగా మహేశ్ చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. అందరి ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశంలో ఉంటాయన్నది మామూలే.

కానీ అలా జరగలేదు!

దర్శకుడిగా సుకుమార్ తన "హాలీవుడ్ స్క్రిప్టు" తో ఆటాడుకుంటే, మ్యూజిక్ డైరెక్టర్‌గా డిఎస్‌పి తనకు మహేశ్‌తో వచ్చిన తొలి అవకాశాన్ని అసలు మామూలు స్థాయిలో కూడా వినియోగించుకోలేకపోయాడన్నది.. ఆన్‌లైన్‌లో ప్రచారమౌతున్న ఒక భారీ ఆరోపణ!


కట్ టూ వాస్తవం -  

దర్శకుడిగా సుకుమార్ ఒక రేంజ్‌లో ఉన్నాడు. పైగా, అంతకు ముందు డిఎస్‌పి తో కలిసి పనిచేశాడు. మహేశ్ ఒక టాప్ రేంజ్ హీరో. వీరిద్దరి అంగీకారం లేకుండా ఏ ఒక్క పాట కూడా ఫైనల్ అవదన్నది నిజం.

మహేశ్‌తో తనకు వచ్చిన తొలి అవకాశాన్ని డిఎస్‌పి అంత కేర్‌లెస్‌గా తీసుకుంటాడని నేననుకోను. తప్పక ఒక ఛాలెంజ్‌గానే తీసుకుని ఉంటాడు. అందులో సందేహం లేదు.


మరి పొరపాటెక్కడ జరిగింది?

నా ఉద్దేశ్యంలో "1" చిత్రానికి డిఎస్‌పి ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే అత్యున్నత స్థాయి ప్రతిభని చూపించాడు డిఎస్‌పి. ఇది సాధారణ ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోవడం ఆ మ్యూజిక్ డైరెక్టర్, ఆ టీమ్ దురదృష్టం అంతే.  

కథలో ఎక్కువ భాగం గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగేది కాబట్టి, అవసరమైనంతవరకు కొన్ని పాటల్లో ఆ గోవన్/కొంకణ్ మ్యూజిక్ ఫ్లేవర్‌ని అద్భుతంగా ఇచ్చాడు డిఎస్‌పి.

అదే పెద్ద ప్రాబ్లమై కూర్చుంది.. మన "రొటీన్ ను మాత్రమే మెచ్చే" ప్రేక్షకులకూ, మహేశ్ అభిమానులకూ.

స్క్రిప్త్ విషయంలో జరిగింది కూడా అదే. 

Wednesday 15 January 2014

మనం రోబోల్లా బ్రతుకుతున్నామా?

కొన్ని క్షణాలు అన్నీ మర్చిపోండి..

ఇంట్లోనో, ఆఫీస్‌లోనో.. మీకు నచ్చిన ఏ మూలనో ప్రశాంతంగా కూర్చోండి. ఆలోచించండి. ఒక అయిదు నిమిషాలు చాలు.

మనలో చాలామంది జీవితాల్లో అసలు ఏం జరుగుతోందో ఇట్టే తెలిసిపోతుంది..

మన జీవితం మన ఇష్టానుసారంగా నడుస్తోంది అనుకుంటాం. శుధ్ధ అబధ్ధం. జీవితంలో ప్రతి ఒక్కటీ మన చాయిస్‌తోనే జరుగుతోంది అనుకుంటాం. ఇది మరీ ఆత్మవంచన.

వాస్తవం ఏంటంటే - మనం "రోబో"ల్లా బ్రతుకుతున్నాం. మన జీవితంలో ప్రతిక్షణం, ప్రతి చర్య, ప్రతి దశ యాంత్రికం. చిన్నతనం నుంచీ మనం పెరిగిన వాతావరణం, మనం ఎదుర్కొన్న సమస్యలు, మనం చూసిన సంఘటనలు.. ఇవన్నీ ఎప్పటికప్పుడు మన మెదడులో కొన్ని ఫైల్స్‌ని సృష్టిస్తాయి.

మనం ఏ పని చేసినా, ఏం ఆలోచించినా అదంతా ఆ ఫైల్స్‌లోని ప్రోగ్రామింగ్ ప్రకారమే చేస్తాం తప్ప, మరో విధంగా కాదు.      

ఉదాహరణకు.. జేబులో ఓ వంద కాగితం ఉన్నప్పుడు పదిమంది ప్రవర్తన పది రకాలుగా ఉంటుంది:

ఒకరు ఆ వంద రూపాయల్ని సేవింగ్స్‌లో జమ చేయాలనుకుంటారు. మరొకరు ఆ వందలో యాభై జల్సా చేసి, మరో యాభైని ఇంట్లో వాళ్లావిడకు ఇవ్వాలనుకుంటారు. ఇంకొకరు ఆ వందకు తోడుగా ఇంకో యాభై అప్పు చేసి ఫుల్లుగా మందుకొట్టవచ్చు.

ఇవన్నీ నిజానికి వారి ఇష్టప్రకారం, ఛాయిస్ ప్రకారం జరిగే పనులు కావు. వారి మెదడులో జరిగిన ప్రోగ్రామింగ్ ప్రకారం, ఆ ప్రోగ్రామింగ్ కారణంగా ఏర్పడి స్థిరపడిపోయిన పాత అలవాట్ల ప్రకారం జరిగే పనులు.


కట్ టూ అసలు విషయం - 

పైన చెప్పినదంతా "సైకో సైబర్నటిక్స్". ఒక సైన్స్. ఈ సైన్స్ సృష్టికర్త మాక్స్‌వెల్ మాల్ట్. ఈనాటి అన్ని పర్సనల్ డెవెలప్‌మెంట్ పుస్తకాలు, ప్రోగ్రాములు, శిక్షణ.. వీటన్నింటికీ మూలం ఈ సైకో సైబర్నటిక్స్ అంటే అతిశయోక్తి కాదు. నిజం.

ఆ నిజం ఏంటో, ఎంతవరకు నిజమో.. తర్వాతి బ్లాగ్ పోస్టుల్లో ఎప్పుడయినా చర్చిద్దాం.

Sunday 12 January 2014

2014 నిన్ను పూర్తిగా మార్చివేస్తుంది!

అవును. ఈ మాట ఎవరో జ్యోతిష్కుడు చెప్పిందికాదు. నాకు నేను చెప్పుకుంటున్నదే. దాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఈ బ్లాగ్ ద్వారా..

నేను జ్యోతిష్యం, చేతబడులు వంటి మూఢనమ్మకాల్ని నమ్మను. దేవుడి పటం ముందు నిల్చుని, దండం పెట్టుకుని, ఏదయినా కోరుకుంటే అవి నిజమౌతాయి అన్న మాటను అసలు నమ్మను.

"నాకు ఈ పని అయిపోయేలా చేయి దేవుడా, నేన్నీకు ఇది చేస్తాను.. అది చేస్తాను!" అని మొక్కుకోవడం నా దృష్టిలో ఒక "క్విడ్ ప్రో కో " లాంటిదన్నమాట! అలాగని, నేను నాస్తికుణ్ణి కాదు.

నిజానికి.. ఇటీవలి మూడు నాలుగేళ్ల క్రితం వరకూ నేను పరమ నాస్తికుణ్ణే.

మనచుట్టూ ఉన్న, మనం జీవిస్తున్న, మనం చూస్తున్న, మనం అనుభవిస్తున్న ఈ అద్భుత సృష్టికి ఏదో "మూలం" అంటూ ఒకటి ఉందని మాత్రం మొదట్నుంచీ నేను నమ్ముతాను.  కానీ, ఆ నమ్మకానికి, ఆ మూలానికి, ఆ శక్తికి.. మనం ఇన్ని మతాలతో, ఇన్ని పేర్లతో మాస్కులు వేసి.. నానా కంగాళీ చేయడం మాత్రం నేను అస్సలు నమ్మేవాణ్ణి కాదు. అప్పటి నా నాస్తికత్వం వెనకున్న సింపుల్ లాజిక్ అదీ.

అయితే - "ఇదంతా వ్యక్తిగతం" అన్న ఆలోచనను మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేదు. నా ఎదుటి వ్యక్తుల వ్యక్తిగత నమ్మకాలు ఏవయినా, వాటిని నేను ఎప్పుడూ గౌరవించేవాణ్ణి.

"మతం అనేది మానవ సృష్టి" అనేది నా అభిప్రాయం. ఇప్పటికీ.

వ్యక్తిగతంగా, సామాజికంగా ఎవర్నీ ఇబ్బంది పెట్టనంతవరకు ఈ మతాలు బోధించే ఏ నమ్మకాన్నయినా నేను గౌరవిస్తాను. అలాగే గౌరవిస్తూ వచ్చాను. ఒక నాస్తికుడిగా కూడా!  
   

కట్ టూ "దేవుడితో నేను" - 

ఇటీవలి మూడు నాలుగేళ్లకాలంలో నా జీవితంలో జరిగిన ఊహకందని, ఊహించలేని కొన్ని సంఘటనలు నా ఆలోచనల్ని, నా జీవనశైలిని, జీవితంపట్ల నా దృక్పథాన్ని.. సంపూర్ణంగా మార్చివేశాయి.

జీవితంలో ఏది ముఖ్యమో, ఏది నిజమో తెల్సుకునేలా చేశాయి.

ఇప్పుడు నేను ఒక సంపూర్ణ ఆస్తికుణ్ణి.

ఒక్కొక్కరూ ఒక్కో రూపంలో దేవుడ్ని నమ్ముతున్నట్టు.. నాకూ ఒక దేవుడున్నాడు. ఆయనే నన్ను కాపాడుతున్నాడు. కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.

నేను నా దేవున్ని ఏ కోరికలూ కోరటం లేదు. ఆయనకు తెలుసు.. నా జీవితం ఏమిటో, నా జీవితంలో ఇంకా ఏం జరగాలో.

ముందే చెప్పినట్టు - ఈ "క్విడ్ ప్రో కో" లకు నేను చాలా దూరం. జీవితంలో ఎత్తుపల్లాలు, సుఖదుఖాలు శాశ్వతం కాదు. నేను నేనుగా బ్రతకడమే శాశ్వతం. నిజం.

మిగిలినదంతా ఉట్టి భ్రమ.. మాయ. మన అహాన్ని సంతృప్తి పర్చుకోవడం కోసం మనం వేసుకుంటున్న మాస్కులు.

అయితే నేను మాత్రం నా దేవుడికి చాలా చేయాలనుకుంటున్నాను. అది పూర్తిగా నా సంతృప్తి కోసం.

ఇలా నేను చేయాలనుకుంటున్నవాటిల్లో కనీసం కొన్నింటినయినా పూర్తిచేయగలననే ఈ బ్లాగ్ రాస్తున్న ఈ క్షణంలో కూడా నేననుకుంటున్నాను. ఆయన నాతో చేయించుకుంటాడన్న నమ్మకం కూడా ఈ క్షణం నాకుంది.

నా నమ్మకాన్ని నేను చూస్తున్న రూపం, నా నమ్మకానికి నేను పెట్టుకున్న పేరు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను.

భగవాన్ శ్రీ షిర్డీ సాయిబాబా. 

Saturday 11 January 2014

"1" నేనొక్కడినే ఎందుకు నచ్చింది.. ఎందుకు నచ్చలేదు?

జూబ్లీ హిల్స్, ఫిలిమ్‌నగర్ నుంచి గణపతి కాంప్లెక్స్, క్రిష్ణానగర్ గల్లీలదాకా - నిన్నంతా ఇండస్ట్రీలో ఒకే ఒక్క అంశం పైన చర్చ. ఎక్కువశాతం కాల్స్, ఎస్ ఎం ఎస్ లు, ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్లు.. అన్నీ ఆ ఒక్క అంశంపైనే.

అది.. "1" నేనొక్కడినే గురించి.

దర్శకుడు సుకుమార్, మహేశ్ కాంబినేషన్ అనగానే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని అంటాయి. ఇద్దరూ, ప్లస్ వాళ్ల టీమ్ చాలా కష్టపడ్డారు.. బాగా ఖర్చుపెట్టించారు. బడ్జెట్ ఓ 65 కోట్లదాకా అయ్యిందని అంచనా. తెలుగు సినిమా 100 కోట్ల బిజినెస్‌కు చేరువవుతున్న ఈ సమయంలో 65 కోట్లు ఖర్చుపెట్టడం అంత పెద్ద సమస్య కాదు.


కట్ టూ నాకు ఎందుకు నచ్చింది ఈ సినిమా? 

రామ్‌గోపాల్‌వర్మ ఒక మాట అంటుంటాడు. "నేను తీయాలనుకున్న సినిమా తీస్తాను. మీరంతా ఖచ్చితంగా చూడాలనో, మీరందరూ మెచ్చుకోవాలనో నేను అనుకోను. చుస్తే చూడండి, లేదంటే లేదు. నా సినిమా.. నా ఇష్టం!"

సుకుమార్ అలా అనలేదు, అనలేడు.

కానీ, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హాలీవుడ్ స్టయిల్లో స్క్రిప్టు రాసుకొని, కాస్త ఆ స్థాయిలోనే తన సినిమా ఉండాలని చాలా కష్టపడ్డాడు. ఫోటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. మహేశ్ కమిట్‌మెంట్, కృతి సనన్ ఫ్రెష్‌నెస్.. అంతా ఓకే.

ఒక టెక్నీషియన్‌గా నేను సుకుమార్‌కు, మహేశ్ నిర్ణయానికి ఓటేస్తాను.

ఇంకా చెప్పాలంటే - ఈ చిత్రంలోని కేవలం కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ (కంపోజింగ్) చూడ్డం కోసం అయినా సరే.. సినిమా ఒకసారి తప్పకుండా చూడాలంటాను నేను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.


కట్ టూ ఎందుకు నచ్చలేదు?  

అంతా కొత్తవాళ్లతో తీసే బడ్జెట్ లేని చిన్న సినిమాల విషయం వేరు. వాటికి నానా తలనొప్పులు, పరిమితులు ఉంటాయి. అర్థం పర్థం ఉండదు. రకరకాల లెక్కలు, ఈక్వేషన్లతో ఏదో అలా చుట్టిపడెయ్యటమే ఎక్కువగా ఉంటుంది. వీటి విషయం అలా వదిలేద్దాం.

"1" విషయానికొస్తే, అలాంటి ఇబ్బందులు ఏవీలేవు.

భారీ బడ్జెట్ ఉంది. టాప్ రేంజ్ హీరో ఉన్నాడు. టాప్ రేంజ్ టెక్నీషియన్లున్నారు. వీటన్నిటినిమించి.. సుకుమార్ ఆల్రెడీ తన టాలెంట్‌ని బాగా ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్. ఓ కోణంలో చూస్తే.. ఒక డైరెక్టర్‌గా, తను అనుకున్నట్టుగా "1" ని బాగా తీశాడు కూడా.


మరెక్కడ ప్రాబ్లమ్?

రొటీన్ చిత్రాల సొద నచ్చనివాళ్లకు, బాగా చదువుకున్నవాళ్లకు, ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువగా చూసేవారికీ, "రిజల్ట్‌తో సంబంధం లేకుండా డైరెక్టర్ తను అనుకున్నది తీశాడు" అని కాన్‌ఫిడెంట్‌గా చెప్పగల సత్తా ఉన్నవాళ్లకు ఈ "1" బాగా నచ్చుతుంది.

అయితే, దురదృష్టవశాత్తూ పైన అనుకున్న కేటగిరీలకుచెందినప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువ.

తెలుగు సినిమాలను "హిట్" చేసి, కోట్ల వర్షం కురిపించేది పైవాళ్లెవ్వరూ కాదన్న వాస్తవాన్ని ముందు మనం గుర్తించాలి. వాళ్లు కూడా సినిమాను ఎంజాయ్ చేయగల స్థాయికి మన "హాలీవుడ్ స్క్రిప్టు"ను చేర్చగలగాలి.

దురదృష్టవశాత్తూ అదే జరగలేదు. అక్కడే సుకుమార్, మహేశ్‌ల అంచనా తల్లకిందులయ్యింది బహుశా.

65 కోట్లు ఖర్చుపెట్టి, క్రియేటివిటీపరంగా, ముఖ్యంగా హీరోపరంగా ఎలాంటి పరిమితులు లేనప్పుడు ఈ మాత్రం చేయగలగాలి. చాలా మంది పెద్ద హీరోలు అడుగడుగునా తమ సోకాల్డ్ ఇమేజ్ ని అడ్దం తెస్తూ నానా హింస పెడుతుంటారు డైరెక్టర్లను.  అలాంటి సమస్య మహేశ్‌తో లేదు. అయినా ఈ పొరపాటు జరిగింది!

ఇంకా చెప్పాలంటే - స్వయంగా మహేశ్‌బాబు ఫాన్స్‌లో 90% మందికి ఈ సినిమా నచ్చలేదు. "రెండు వారాల సినిమా" అని థియేటర్ యజమానులనుంచి ఎస్ ఎం ఎస్ లు వచ్చాయి. వాళ్ల జడ్జ్‌మెంట్‌కు తిరుగులేదు!

ఇప్పటికే వచ్చిన నెగెటివ్ టాక్ వల్ల కలెక్షన్ల డ్రాప్ ప్రారంభమయిందనీ, సోమవారం నుంచి అది మరింత డ్రాప్ అవుతుందనీ, ఆ తర్వాత థియేటర్ల డ్రాప్ తప్పదనీ వాళ్ల ఖచ్చితమైన అభిప్రాయం. ఇదీ ఇండస్ట్రీ వాస్తవం..


కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఓ ఆరు నెలలక్రితం అనుకుంటాను. సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేని నా మిత్రుడు ఒకరు ఒక మాటన్నాడు. "మహేశ్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న "1" సినిమా.. అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, లేదంటే అట్టర్ ఫ్లాప్ అవుతుంది!" అని.

నా మిత్రుడు చెప్పింది అక్షరాలా నిజమయ్యింది.. 

Tuesday 7 January 2014

అస్తమించిన ఉదయకిరణం ..

మూడు వరుస సూపర్ హిట్స్‌తో హాట్రిక్ ఇచ్చి హీరోగా "రికార్డ్ ఎంట్రీ" ఇచ్చిన హీరో ఉదయ్‌కిరణ్ మరణం నా బ్లాగ్‌కి టాపిక్ అవుతుందని నేనూహిస్తానా?

కానీ ఈ రోజు అదే జరిగింది.

రాయకూడదనుకున్నాను. కానీ, రాయకపోతే నా నగ్నచిత్రం నన్నే వెక్కిరిస్తుంది. నేనూ ఓ పెద్ద హిపోక్రాట్‌నయిపోతాను.. ఇండస్ట్రీలోని వందలో తొంభైతొమ్మిదిమందిలా..


కట్ టూ నేను అసహ్యించుకున్న ఉదయ్‌కిరణ్ నిర్ణయం - 

మా ప్రియతమ్ ఓ మూడేళ్ల వయసున్నప్పుడనుకుంటాను. "నాకు నువ్వూ.. నీకు నేనూ" అని "నువ్వు నేను" సినిమాలోని యాడ్ టీవీలో వస్తున్నప్పుడల్లా - "హేయ్.. ఉదయ్‌కిరణ్!" అంటూ వాడు టీవీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లేవాడు.

ఆ ఉదయ్‌కిరణ్ ఇప్పుడు లేడు. ఉరేసుకుని చచ్చిపోయాడు.

అతన్ని కన్న తండ్రి అతని అంత్యక్రియలు చేయనంటూ కన్న కొడుకు శవాన్ని అనాథని చేశాడు. "తండ్రి తరపువాళ్లే అంత్యక్రియలు చేస్తారని ఇంక మేము ఆ విషయం పట్టించుకోలేదు!" అని స్వయంగా అతని భార్య, ఆమె తరపువాళ్లు సెలవిచ్చారు.

కారణాలు ఏవయినా కావొచ్చు..

అసలేంటీ మానవ సంబంధాలు? ఎటు వెళ్తున్నాం మనం?

ఇప్పటివరకూ ఏ టాప్‌స్టార్‌లు, స్టార్ల కొడుకులూ, ఇండస్ట్రీని ఏలుతున్న ఇంకెందరో దిగ్గజాల కొడుకులయిన సోకాల్డ్ హీరోలు ఎవ్వరూ సాధించని విధంగా - సూపర్ హిట్స్‌ హాట్రిక్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన "ఎలాంటి సినీ నేపథ్యం లేని హీరో" ఉదయ్‌కిరణ్ .. చివరికి శవంగా కూడా అనాథే అయ్యాడు.

పోస్ట్‌మార్టమ్‌కు వచ్చిన ఆ అనాథ శవాన్ని చూస్తూ వందలాదిమంది బోరున ఏడ్చారు. అలా విలపించినవాళ్లంతా ఉదయ్‌కిరణ్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కాదు. ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆయాలు, నర్సులు, ఇతర వందలాదిమంది స్టాఫ్.. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకెందరో అతనితో ఏమాత్రం సంబంధం, పరిచయం లేనివాళ్లు..

పోస్ట్‌మార్టమ్ అనంతరం ఆ అనాథ శవాన్ని NIMS మార్చురీకి తరలించారు. అక్కడకూడా సమయానికి మార్చురీ తాళం తీసేవాళ్లులేక చాలాసేపు ఉదయ్‌కిరణ్ శవాన్ని అలాగే..అక్కడే.. అనాథలా ఉంచారు.

ఆ తర్వాతే.. ఇంక తప్పదన్నట్లు సినిమావాళ్ల నాటకీయ హడావిడి ప్రారంభమైంది బహుశా.

షరా మామూలే. ఫిలిమ్‌చాంబర్లో భౌతిక కాయం. టీవీ చానెళ్ల మైకులముందు అదే యూజువల్ సంతాపాలు.. "ఉదయ్‌కిరణ్ ఇంద్రుడు, చంద్రుడు, నాకు బాగా తెలుసు, అదీ ఇదీ.." అంటూ.


కట్ టూ కన్నతండ్రి -  

వాళ్లమధ్య ఎన్ని గొడవలు, విభేదాలున్నాయో మనకు తెలియదు. అంత్యక్రియలు నేను చేయను గాక చేయను అన్న కన్నతండ్రే చివరికి ఉదయ్‌కిరణ్ అంత్యక్రియలు పూర్తిచేశాడు.

అందమయిన ఆ ఉదయకిరణం పూర్తిగా ప్రసరించకముందే అస్తమించింది.. అదృశ్యమైపోయింది.


కట్ టూ ఉదయ్‌కిరణ్‌తో నేను -

సుమారు పదేళ్లక్రితం.. బహుశా అది 2003 అనుకుంటాను. పద్మాలయ స్టూడియోలో మొదటిసారి ఉదయ్‌కిరణ్‌ని నేను చూసాను.

అప్పుడు బహుశా రాత్రి 9 గంటలు అవుతోంది. ఆ మర్నాడు ఉదయం ఉదయ్‌కిరణ్ కొత్త సినిమా ప్రారంభం ఉంది అక్కడే పద్మాలయా స్టూడియోలో.

స్టూడియో ఫ్లోర్‌లో జరుగుతున్న ఆ ఏర్పాట్లు చూడ్డంకోసం అప్పుడు అక్కడికి వచ్చాడు ఉదయ్‌కిరణ్.

వాళ్లపని వాళ్లు హడావిడిగా చేసుకుంటూ - దాదాపు ఏడెనిమిది మంది ఆర్ట్ డిపార్ట్‌మెంటువాళ్లు మాత్రమే ఉన్నారప్పుడు.

నేనూ, నాతోపాటున్న మరో ఇద్దరు సినీ మిత్రులం ఉదయ్‌కిరణ్‌ని విష్ చేశాం. అక్కడే అడ్డదిడ్డంగా వేసి ఉన్న ప్లాస్టిక్ చెయిర్స్‌లో అతనితోపాటు కూర్చుని కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నాం.

ఆ అందమయిన సొట్టబుగ్గ, ఏ మాస్కూలేని నిష్కల్మషమయిన ఆ చిరునవ్వు.. నాకళ్లముందు ఇప్పుడూ కనిపిస్తున్నాయి.

సినిమాల్లో కాకుండా, అదే మొదటిసారి నేను ఉదయ్‌కిరణ్‌ని చూడ్డం. మళ్లీ ఇదిగో, ఇప్పుడు, ఈరోజున .. ఇలా చూడ్డం.
     

కట్ టూ ఫిలిమ్ ఇండస్ట్రీ - 

"స్విమ్మింగ్ విత్ షార్క్స్" అనుకుంటాను. హాలీవుడ్ నేపథ్యంలో రాసిన పుస్తకం అది. తర్వాత దాన్ని సినిమాగా కూడా తీశారనుకుంటాను. తెలుగులో అలాంటి పుస్తకం ఇప్పటివరకూ ఎవరూ రాయలేదు. రాయరు బహుశా.

ఉదయ్‌కిరణ్ మరణం ఎందుకో నాకు ఆ పుస్తకం టైటిల్‌ను బాగా గుర్తుకు తెస్తోంది.

ఎవరు బయటికి ఏ సొల్లు చెప్పినా - ఇండస్ట్రీలో కులాలు, ప్రాంతాలు, లాబీలు..అనీ ఉన్నాయి. పరమ నీచంగా. నికృష్టంగా. ఆ ఆధిపత్యాల అడుగులకు మడుగులొత్తే చెంచాల సంఖ్య కూడా చిన్నదేం కాదు.  

తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఊడలమర్రిల్లాంటి కొందరు నిర్మాతలు, దర్శకులు, నటుల కొడుకుల ముఖాలు ఎంత చెత్త పేడి ముఖాలయినా, ఎంత చూడబుధ్ధికాని కనీస సంస్కారం లేని  చవటలయినా .. వాళ్ల డేట్స్ కోసమే నిర్మాతలు, దర్శకులు క్యూ కడతారు తప్ప - ఏ సినీ నేపథ్యం లేని, ఎవరి లాబీలకీ గులామ్‌లు కాని "ఉదయ్‌కిరణ్"లు ఎలా కనిపిస్తారు?

అరా కొరా ఎవరో ఒకరిద్దరికి అలా తీసుకోవాలని అనిపించినా - ఆ తర్వాత, ఏ "దుష్ట శక్తుల" నుంచి (ఈ పదం ఇవాళ స్వయంగా దర్శకరత్న దాసరి గారే ఉపయోగించారు!) ఎలాంటి రియాక్షన్ ఉంటుందోనన్న భయం!

ఇదంతా ఒక ఫాసిస్ట్ పరంపర. దీని అంతిమ దశకు, అంతానికి, సమాధికి.. ఇప్పుడిప్పుడే పునాదులు పడుతున్నాయి. అది వేరే విషయం.


కట్ టూ ఉదయ్‌కిరణ్ చేసిన రెండు తప్పులు - 

కేవలం హీరోగా అవకాశాలు రాకపోవటం, దానివల్లనే అతను డిప్రెషన్‌కు లోనయి అలా చేసుకున్నాడని నేననుకోను. ఇంకేదో ఉందని నాకనిపిస్తోంది. అది అలా వదిలేద్దాం..

నా వ్యక్తిగత ఉద్దేశ్యం ప్రకారం ఉదయ్‌కిరణ్ తన జీవితంలో చేసిన తప్పులు రేండే రెండు. ఆ రెండు తప్పులే అతని జీవితం ఇలా ముగియడానికి కారణమయ్యాయి:

ఒకటి - చిరంజీవి కూతురితో పెళ్లికి ఒప్పుకొని ఎంగేజ్‌మెంట్ వరకూ వెళ్లటం.

రెండు - జీవితంలో కనీసం ఒకరిద్దరయినా నిజమయిన స్నేహితుల్ని కలిగి ఉండకపోవటం. ఒకవేళ ఉన్నా, వారికి దూరంగా ఉండటం.

మొదటి కారణం, దాని తదనంతర పరిణామాలు.. ఉదయ్‌కిరణ్ ప్రొఫెషనల్‌గా చావడానికి కారణమయ్యాయి.

రెండోది, "జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు!" అన్న సింపుల్ వాస్తవం అతను తెలుసుకోలేకపోవడానికి కారణమయింది. 

Saturday 4 January 2014

ఏ ఆనందం గొప్పది?

నేను తీసుకోకపోతే ఒక వ్యక్తి నా తొలి సినిమాకి మేనేజర్ అయ్యేవాడు కాదు. నేను చేయకపోయి ఉంటే, అదే వ్యక్తి నా మలి సినిమాకి ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయివుండేవాడు కాదు. ఐదేళ్లుగా ఖాలీగా ఉన్న అదే వ్యక్తిని మళ్లీ.. నేను చేయకపోయివుంటే "ప్రొడ్యూసర్"కూడా అయి ఉండేవాడు కాదు!  

ఇది ఇండస్ట్రీ అంతా తెలిసిన వాస్తవం..

అలాగే - ఇప్పటివరకు నేను చేసిన మూడు సినిమాలూ ఒక రూపందాల్చి, పూర్తయ్యి, బయటపడటానికి, నలుగురూ నాలు డబ్బులు సంపాదించుకోడానికీ, నా ద్వారా పరిచయమైన ఎందరో ఇండస్ట్రీలో నిలదొక్కుకొని పైకి రావడానికి మూలకారణమైన వ్యక్తిని నేను. 

కట్ టూ నా ఆనందం -

అయితే, ఇదంతా నేను "తిరిగి వాళ్లేదో నాకు ఉపకారం చెయ్యాలని" చేసింది మాత్రం కాదు. ఎప్పుడయినా ఎక్కడయినా ఎదురుపడినప్పుడు కనీసం "హాయ్" చెప్తే కలిగే ఆ ఆనందం వేరు.  ఇంకెక్కడో.. టీవీల్లోనో, సినిమాల్లోనో వీళ్లందరినీ చూస్తున్నప్పుడు నాకు కలిగే ఆ ఆనందం వేరు.

ఆ ఆనందం చాలా గొప్పది నా దృష్టిలో.

"యూజ్ అండ్ త్రో" కల్చర్ కాదు!

కట్ టూ 2014 -

మళ్లీ అదే ఆనందం కోసం 2014 ని నాకు సంబంధించి ఒక "ఎపిక్ ఇయర్" చేసుకోబోతున్నాను. చాలా కష్టమే. అనుకున్నంత సులభం కాదు. కానీ, ఆ కష్టంలో ఉన్న మజానే వేరు!

ఇంక మనకు కావల్సినవి అంటారా? అవే ఫాలో అవుతాయి. ఇప్పుడు నేను వేరు. 

Friday 3 January 2014

ఫర్ ఎ చేంజ్.. 10 సినీ ట్వీట్‌లు!

"దేవుడు కూడా కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకుంటాడా అని నాక్కొంచెం వండర్‌గా ఉంది!"
-- రామ్‌గోపాల్‌వర్మ

"సంగీతం మనకు ఏకాంతం అంటే ఎలా ఉంటుందో నేర్పిస్తుంది!"
-- శృతిహాసన్

"జనవరిలో, ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్ ఆఫ్ సౌతాఫ్రికా (IIFSA) కు "గుండెల్లో గోదారి" సెలెక్టయ్యింది!"
-- లక్ష్మీ మంచు  

"పలురకాలుగా దురదృష్టవంతులయిన వారికోసం ప్రార్థిస్తూ, వారికి కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుదాం!"
-- రాధికా శరత్ కుమార్

"ఎవరో గ్రామస్తులు మా షూటింగ్‌ని భగ్నం చేశారని విన్నాను. అది నాకు కూడా వార్తే!"
-- ఎస్ ఎస్ రాజమౌళి

"సిమ్రాన్ మామ్ (మోస్ట్ ప్రామిసింగ్ స్టార్ హన్సిక!) మాటలకి కదిలిపోయాను. థాంక్యూ మామ్! 2014 నాకు మరింత ఎక్‌జైటింగ్‌గా ఉంటుందనుకుంటున్నా!"
-- హన్సిక 

"రామ్-లీలా" 200 కోట్ల కలెక్షన్‌ను దాటింది. ఈ సినిమా క్రిటికల్, కమర్షియల్ విజయానికి శుభాకాంక్షలు!"
-- దీపికా పడుకొనే 

"ఒక సంవత్సరాంతమో, తేదీనో, ఏదయినా సందర్భమో మన జీవితంలో స్టాక్స్ చూసుకోడానికి, నిర్ణయాలు తీసుకోడానికి కారణం కాకూడదు. అది మనం ప్రతిదినం చేయాల్సిందే!"
-- కరణ్ జోహార్

"నగేశ్ కుకునూర్ "లక్ష్మి" మ్యూజిక్ లాంచ్ చేశాను. తపస్ మ్యూజిక్. మనోజ్ లిరిక్స్. ప్రాజెక్ట్ అద్భుతం!"
-- శంకర్ మహదేవన్

"బాగా దుస్తులు వేసుకున్న అబధ్ధం కంటే, నగ్నసత్యమే ఎప్పుడూ బెటర్!"
-- కత్రినా కైఫ్

Wednesday 1 January 2014

మల్టీప్లెక్స్ సినిమాలా? మాస్ మసాలా సినిమాలా?

పొద్దుటే "ఈనాడు" సినిమా పేజ్‌లో నాగార్జున ఇంటర్వ్యూ చదివాను. బావుంది.

టీవీ ఇంటర్వ్యూల్లో, ఫంక్షన్‌లలో స్టేజ్‌మీద నాగార్జున కూర్చునే పధ్ధతిలో, మాట్లాడే స్టయిల్లో కొంత "ఈగో" కనిపించవచ్చు. నా దృష్టిలో అదో మామూలు విషయం. "నాక్కొంచెం ఈగో ఎక్కువ" అని స్వయంగా నాగార్జునే ఏదో ఇంటర్వ్యూలో అన్నట్టు కూడా నాకింకా గుర్తుంది.  

ఒక నిజం ఏంటంటే.. నాగ్ మాటల్లో (చాలా మంది హీరోల్లా) ఎలాంటి హిపోక్రసీ ఉండదు. ఎలాంటి పనికిరాని "మాస్క్"లుండవు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాడు.

ఇవాళ నేను చదివిన నాగ్ ఇంటర్వ్యూలో నన్ను బాగా ఆకట్టుకున్న పాయింట్స్ మూడు..  

పాయింట్ వన్:
నాగ్ వాళ్ల నాన్నగారయిన "లెజెండ్" అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈ మధ్య ఎక్కువ సమయం గడుపుతుండటం. "గత అయిదారేళ్లలో ఎంతసేపు ఉన్నానో, దానికి మించి ఈ రెండు మూడు నెలల్లో నాన్నతో ఉన్నాను" అన్నాడు నాగ్.

పాయింట్ టూ:
తను నిర్మించి నటించిన "భాయ్" సినిమా వైఫల్యం గురించి నిర్మొహమాటంగా.. " ఆ సినిమావల్ల నామీద నాకే గౌరవం పోయింది" అన్నాడు.

కట్ టూ లాస్ట్ బట్ మెయిన్ పాయింట్ -

ప్రస్తుతం మనదగ్గర.. "అయితే మల్టీప్లెక్స్ సినిమాలు, లేదంటే వాణిజ్యపరమైన సినిమాలు" (రెగ్యులర్ మాస్ మసాలా/కమర్షియల్) మాత్రమే వస్తున్నాయన్నాడు నాగ్. ఇది నూటికి నూరుపాళ్లూ నిజం.

మల్టీప్లెక్స్ సినిమాల్లో యూత్‌ని టార్గెట్ చేసుకొని తీసినవే ఎక్కువగా వస్తాయి. ఇది సహజం. ఎందుకంటే, ఇప్పుడు అసలు సినిమాలు ఎక్కువగా చూస్తున్నదీ, మల్టీప్లెక్స్ కల్చర్‌కు ఎడిక్ట్ అయిపోయిందీ వాళ్లే కాబట్టి.

ఇక కమర్షియల్ అంటే భారీ బడ్జెట్లు తప్పవు. భారీ హీరోలూ, హీరోయిన్లూ, మాంచి ఫామ్‌లో ఉన్న డైరెక్టర్లకు మాత్రమే ఇవి పరిమితం.  

30, 40 కోట్లు పెట్టి భారీ హీరోలతో సినిమాలు చేయడమన్నది అందరికీ ప్రాక్టికల్‌గా సాధ్యం కాని పని. ఈ రేంజ్ సినిమాల కోసం క్యూ కనీసం ఇంకో రెండేళ్లదాకా ఉంటుంది. మనం ఎంత డబ్బు కుమ్మరిద్దామన్నా.. వాళ్ల లాబీలు దాటి బయటికి రారు హీరోలు. దర్శకుడు అప్పుడే ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చివుంటే తప్ప!

ఇక మిగిలింది.. "మల్టీప్లెక్స్ సినిమాలు" అనబడే ట్రెండీ యూత్ సినిమాలు..

వీటిని నిర్మించడం కోసం "స్టార్" హీరోలు, హీరోయిన్లు అవసరంలేదు. అందరూ సొదపెట్టే "ప్యాడింగ్" అంతకంటే అవసరం లేదు. కొత్త నటీనటులు, అప్ కమింగ్ నటీనటులు చాలు. బడ్జెట్లు కూడా కోట్లు అవసరం లేదు. కొన్ని లక్షలు చాలు.

సినీ నిర్మాణంలో వచ్చిన ఆధునిక కెమెరాలను, టెక్నాలజీని ఉపయోగించి.. అతి తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఎవరయినా ఎన్నయినా సినిమాలను తీయవచ్చు. 

కావల్సిందల్లా ఒక్కటే..

కథ పాతదయినా, కొత్తదయినా.. దాన్ని సరికొత్తగా చెప్పగలగటం. అదీ యూత్‌కి నచ్చేలా, వారిని వారు ఐడెంటిఫై చేసుకునేలా చెప్పగలగటం. వారిని ఆకట్టుకోవటం.

ఇది సాధించిన ఏ దర్శకుడయినా ఉన్నట్టుండి హీరో అయిపోతాడు. ఆ తర్వాత ఓ దశాబ్దంపాటు ఈజీగా ఇండస్ట్రీలో ఉండగలుగుతాడు.

అయితే - ఇది చెప్పినంత సులభం కాదు. దీని వెనక ఎన్నో "చెప్పుకోలేని" తలనొప్పులూ, తిప్పళ్లూ ఉంటాయి. వీటిని అధిగమించాలంటే ఒక లైక్‌మైండెడ్ టీమ్ (ప్రొడ్యూసర్‌తో కలిపి) అవసరం.

అలాంటి ఒక టీమ్‌ని తయారుచేసుకొని, ఈ తలనొప్పులన్నిటినీ అధిగమించి.. ఒక నిజమైన "హిట్" సినిమాను ఇవ్వగలిగిననాడు.. మనం పొందే ఆ మజానే వేరు. ఆ కిక్కే వేరు.

ఏమంటారు?