Sunday 7 December 2014

ఒక రొమాంటిక్ హారర్ సినిమా!

ఇప్పుడంతా తెలుగులో హారర్ సినిమాల హవా  నడుస్తోంది.

ఈ ట్రెండ్‌ను ఫాలో కావాలని నేనేం అనుకోలేదు కానీ, నా ప్రొడ్యూసర్ మిత్రుడు అరుణ్‌కుమార్ "హారర్ సినిమానే తీద్దాం" అన్నారు.

మరింకేం ఆలోచించకుండా నేను "ఓకే" అనేశాను.

ఈ నిర్ణయం తీసుకోవడంలో మా ప్రొడ్యూసర్ పాయింటాఫ్ వ్యూ, నా పాయింటాఫ్ వ్యూ వేర్వేరు కావొచ్చు. అది సహజం. కానీ, అంతిమంగా మా ఇద్దరి గోల్ మాత్రం ఒక్కటే. తర్వాత నేను ఎన్నిక చేసిన నా టీమ్ లక్ష్యం కూడా అదే.

సక్సెస్.

చాలా చిన్న బడ్జెట్ కాబట్టి "హారర్" ఒకరకంగా బెటర్. లొకేషన్స్ తక్కువగా ఉంటాయి. కేరెక్టర్లూ తక్కువగా ఉంటాయి. అయితే - మేకింగ్ పరంగా ఒక స్థాయి స్టాండర్డ్ లేకపోతే చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతుంది. అందుకే ఈ విషయంలో మేమెక్కడా కాంప్రమైజ్ కాలేదు.

ఇక హారర్ కథలన్నీ దాదాపు ఒకేలా అనిపించినా, స్క్రీన్ ప్లే దగ్గర కొంతయినా కష్టపడాల్సివస్తుంది. మిగిలిన సినిమాల్లో లేని "ఇంకేదో" కొత్త అంశం ఒకటి చొప్పించాల్సి ఉంటుంది.

ఈ సినిమా విషయంలో ఆ పని నేను చేయగలిగాను.

స్క్రీన్ ప్లే తర్వాత హారర్ సినిమాకు కెమెరా, సౌండ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ముఖ్యం. కెమెరా దగ్గర మా ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ కాలేదు. కెమెరామన్ దగ్గర నేను కాంప్రమైజ్ కాలేదు.

కట్ టూ "లోకం చుట్టిన వీరుడు" -  

రెడ్ ఎం ఎక్స్, స్టెడీకామ్ లను మస్త్‌గా ఉపయోగించి షూట్ చేసిన ఈ సినిమా "డి ఓ పి" కి ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అంటే పిచ్చి ప్యాషన్. ఎక్కువగా అంతర్జాతీయస్థాయిలో పనిచేసే ఈ టెక్నీషియన్ పాస్‌పోర్టులు బుక్కులు బుక్కులుగా అయిపోతుంటాయి. షూటింగ్ పనిలో ఈయన ఇప్పటికే 90 దేశాలకి పైగా తిరిగాడు. సుమారు ఇంకో 90 దేశాలు తిరిగితే చాలు.. లోకం చుట్టిన వీరుడవుతాడు!

సినిమాటోగ్రఫీ కళ పట్ల ఇంత ప్యాషన్ ఉన్న ఈ డి ఓ పి, సినీ ఇండస్ట్రీలో నేను వేళ్లమీద లెక్కపెట్టుకొనే నాకున్న అతికొద్దిమంది మిత్రుల్లో మొదటివాడు.

ఇతని పారితోషికాన్ని ఈ సినిమా బడ్జెట్ ఏమాత్రం భరించలేదు. అయినా కేవలం నాకోసం ఈ చిత్రానికి పనిచేశాడు ఈ మిత్రుడు.  ఇంకా చెప్పాలంటే - ఈ మిత్రుడు ఉన్నాడు కాబట్టే ఈ సినిమా షూటింగ్‌ని ఇంత వేగంగా, ఇంత క్వాలిటీతో, 2 పాటలతో కలిపి కేవలం 13 రోజుల్లో చాలా కూల్‌గా పూర్తిచేయగలిగాను.

ఈ ఆత్మీయ మిత్రుని పేరు వీరేంద్ర లలిత్.  

No comments:

Post a Comment