Sunday 16 November 2014

రోజుకో పేజీ!

రకరకాల షేపుల్లో, రకరకాల పేర్లతో మనం ఇప్పుడు తింటున్న పొటాటో చిప్స్‌కి ఆదిగురువు 1967 లోనే మార్కెట్లోకి వచ్చిన ప్రింగిల్స్.

ఈ చిప్స్ ఇలా ఉండాలని ఊహించిన జక్కన్న లీపా. కాగా, వీటికి ఆ షేప్‌లు తీసుకురావడానికి ఉపయోగించే మిషన్‌ను రూపొందించిన రామప్ప జీన్ వుల్ఫ్.

ఇక్కడ విషయం చిప్స్ కాదు.

జీన్ వుల్ఫ్.

ఆయనకు తెలిసిన ఓ అతి పెద్ద రహస్యం.

జీన్ వుల్ఫ్ మెకానికల్ ఇంజినీర్. రచయిత కూడా. జీన్‌కి తెలిసిన రహస్యం .. రోజుకు ఒకే ఒక్క పేజీ రాయడం.

జీన్‌కు ఇప్పుడు 83 సంవత్సరాలు. అంటే సుమారు 30, 000 రోజులు. అందులో సగం రోజులు ఆయన ఒక సాధారణ రచయిత స్థాయి మెచ్యూరిటీకి ఎదగడానికి పట్టాయి అనుకొని తీసేద్దాం.

తనకు తెలిసిన ఈ అతి చిన్న సీక్రెట్‌ను ఉపయోగించి, ఈ 15,000 రోజుల్లో ఆడుతూ పాడుతూ జీన్ రాసిన పుస్తకాల సంఖ్య 50.    

అవును అక్షరాలా 50 పుస్తకాలు!

వీటిలో నవలలున్నాయి. బెస్ట్ సెల్లర్ బుక్స్ ఉన్నాయి. అవార్డ్ పొందిన పుస్తకాలూ ఉన్నాయి.

ఏ రకంగా చూసినా ఇదొక అద్భుతమయిన అచీవ్‌మెంటే. ఎందుకంటే జీన్ కేవలం రోజుకు ఒక్క పేజీ మాత్రమే రాస్తూ ఇది సాధించాడు!

కట్ టూ ది అదర్ సైడ్ - 

మనకు బద్దకం ఎక్కువ. సమస్యల్ని తలచుకొంటూనే జీవితాల్ని ముగించేస్తాం.

నేను రాసిన ఒక ఆధునిక జర్నలిజం పుస్తకం ఒక యూనివర్సిటీలో పీజీ స్థాయి సిలబస్‌లో "రికమండెడ్ బుక్స్" లిస్టులో ఉంది. సినిమా స్క్రిప్ట్ పైన నేను రాసిన మరో పుస్తకం నంది అవార్డు పొందింది. ఈ రెండూ బెస్ట్ సెల్లర్ బుక్సే. నేను అచ్చు వేసిన రెండు ఎడిషన్లూ టపటపా అయిపోయాయి. నవోదయ, విశాలాంధ్రవాళ్లు రీప్రింట్ మళ్లీ వేయండి అని ఎన్నోసార్లు చెప్పినా వినలేని బద్దకం!

లేటెస్ట్ డెవెలప్‌మెంట్స్‌ని, నా అనుభవాల్నీ పొందుపరుస్తూ ఈ పుస్తకాల్నిరివైజ్ చేసి పబ్లిష్ చేయాలని నా ఉద్దేశ్యం. కాని ఆ పని ఒక దశాబ్దం గడిచినా నేను చేయలేకపోయాను!

సంవత్సరం క్రితం ఓ పబ్లిషర్ మిత్రుడు నన్ను వేధిస్తోంటే ఇక పడలేక - వారం పాటు అదే పనిమీద కూర్చుని  ఒక పుస్తకం రివైజ్ చేసి రాసిచ్చాను. ఆ పబ్లిషర్ మిత్రుడు ఇస్తానన్న డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదు. పుస్తకాన్నీ పబ్లిష్ చేయలేదు. ఇదొక రకం బద్దకం.

ఈ మధ్య నా అవసరం కోసం మళ్లీ  సినిమాల బిజీలో పడిపోయి ఈ బ్లాగ్‌ని కూడా మర్చిపోయాను.

రైటింగ్ అనేది ఒక థెరపీ.

రాయటం అలవాటు ఉన్నవాళ్లు దాన్ని మర్చిపోతే బ్రతకలేరు. తేడా తెలుస్తుంది. జీవితం ఉట్టి బ్రతుకైపోతుంది.

జీన్ వుల్ఫ్ నుంచి జె కె రౌలింగ్ దాకా - ప్రపంచస్థాయి రచయితలందరూ నానా కష్టాలుపడుతూనే రాశారు. జీవితాన్ని జీవించారు. గౌరవించారు.

రకరకాల కారణాలు నాకు నేనే చెప్పుకొంటూ, రోజుకు కనీసం ఒక్క పేజీ కూడా నేను రాయలేకపోతున్నానంటే నిజంగా ఇప్పుడు నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది.

జీన్, యు ఆర్ రియల్లీ గ్రేట్!