Monday 3 March 2014

గోలీసోడా కిక్కే వేరు!

ఏ మారుమూల గ్రామాల్లోనో, లేదంటే ఏ పక్కా మాస్ ఏరియాల్లోనో తప్ప - ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడా గోలీసోడా కనిపించట్లేదు.

నా చిన్నతనం నుంచి, గుంటూరులో నేను ఉద్యోగం చేసిన దశవరకూ.. నాకు గోలీసోడా బాగా తెలుసు. ఇష్టం కూడా. దాన్లో మామూలు సాదాసోడాతోపాటు నిమ్మకాయసోడా, జింజర్ సోడా అని కొన్ని ఫ్లేవర్లు కూడా ఉండేవి.

అంతెందుకు.. చిన్నప్పుడు నేను మా వరంగల్లోని సరోజ్ టాకీస్‌లోనో, నవీన్ టాకీస్‌లోనో సినిమా చూసినప్పుడు - ఇంటర్వల్‌లో బయటికి వచ్చామంటే గోలీసోడా త్రాగాల్సిందే! ఎప్పుడు సినిమాకెళ్లినా అదో తప్పనిసరి అయిన రొటీన్ మాకు..

కట్ టూ కోలీవుడ్ గోలీసోడా - 

ఈ మధ్య తమిళంలో వచ్చిన "గోలీసోడా" చిత్రం బాక్సాఫీస్ హిట్ అయింది.

చెన్నైలోని కోయంబీడ్ మార్కెట్ నేపథ్యంలో ఊరూ పేరూ లేని నలుగురు కుర్రాళ్ల జీవన నేపథ్యం, గుర్తింపు కోసం వాళ్లు పడే ఆరాటం ఈ గోలీసోడా సినిమా కథ.  

ఈ సినిమా చివరిదశ షూటింగ్‌లో ఉండగా నిర్మాత చేతులెత్తేశాడు. అవసరానికి శాటిలైట్ రైట్స్ అమ్ముకుందామంటే, కనీసం 10 లక్షల ఆఫర్ కూడా రాలేదట! ఎలాగో నానా తిప్పలుపడి పూర్తిచేసి రిలీజ్ చేసేశారు.

ఇప్పుడు సినిమా భారీ హిట్టయి కూర్చుంది. ఒక భారీ చిత్రం రేంజ్‌లో 3 కోట్ల శాటిలైట్ రైట్స్ అందుకుంది గోలీసోడా!

సినిమా చిన్నదా, పెద్దదా అన్నది కాదు విషయం. స్టోరీలో ఎంత దమ్ముంది. ప్రేక్షకుల్ని అది ఎలా ఆకట్టుకుంది అన్నదే అసలు విషయం. అప్పుడయినా, ఇప్పుడయినా, ఎప్పుడయినా..

దటీజ్ ద పవర్ ఆఫ్ గోలీసోడా! 

2 comments:

  1. "......ఏ మారుమూల గ్రామాల్లోనో, లేదంటే ఏ పక్కా మాస్ ఏరియాల్లోనో తప్ప - ఇప్పుడు చూద్దామన్నా ఎక్కడా గోలీసోడా కనిపించట్లేదు..."

    మరీ అంత విపరీతపు జనరలైజేషన్ నిజం కాదు. కోస్తా ఆంధ్ర లో, ముఖ్యంగా విజయవాడ నగరంలో ఇప్పటికీ గోళీ సొడా చాలా ప్రముఖంగా అమ్ముడవుతున్నది. ఇప్పుడు నిమ్మకాయ సోడాగా ఐస్ లో పెట్టి తీసినది, ముఖ్యంగా వేసవిలో విపరీతంగా అమ్ముడయ్యే పానీయం. ఈ సోడా ఎంతటి ప్రాచుర్యం పొందింది అంటె కోకా కోలా వంటి ఫ్యాషన్ పానీయాలను దెబ్బకొట్టేసింది. కోస్తా ప్రాంతాల్లో గోళీ సోడాదే హవా. పానీయాల అమ్మకపు సర్వే తీస్తే కంపెనీ వాళ్ళు బాటిళ్ళల్లో అమ్మే రంగు నీళ్ళు, గోళీ సోడా అమ్మకాలు పోటీపడి, గోళీసోడాదే పై చేయిగా ఉన్నది.

    ReplyDelete
    Replies
    1. "కోస్తా ప్రాంతాల్లో గోళీ సోడాదే హవా. పానీయాల అమ్మకపు సర్వే తీస్తే కంపెనీ వాళ్ళు బాటిళ్ళల్లో అమ్మే రంగు నీళ్ళు, గోళీ సోడా అమ్మకాలు పోటీపడి, గోళీసోడాదే పై చేయిగా ఉన్నది." ...

      ఇది నిజంగా నాకు తెలియదు! మీ కామెంట్స్ కి ధన్యవాదాలు, శివరామప్రసాద్ గారూ!

      Delete