Wednesday 31 December 2014

థాంక్ యూ, ఫేస్‌బుక్!

నాకు నచ్చని విషయం, నేను ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ రాయలేని విషయం .. నేనస్సలు ఈ బ్లాగ్‌లో రాయలేను.

అది అబధ్ధమయినా సరే. ముందు నాకు నచ్చాలి. నేను ఇష్టపడాలి. ఎట్‌లీస్ట్, ఆ క్షణం .. అది నాకు కిక్ ఇవ్వాలి.

ఆ రాతల కోసమే ఈ నగ్నచిత్రం బ్లాగ్.

ఏ హిపోక్రసీ లేదు. ఏ ఇన్‌హిబిషన్స్ లేవు. నేను రాయాలనుకున్నది రాస్తాను. నచ్చినవాళ్లు చదువుతారు. నచ్చనివాళ్లు ఒకే ఒక్క క్లిక్‌తో ఇంకో బ్లాగ్‌లోకో సైట్ లోకో వెళ్లిపోతారు. అంతే.

ఇప్పుడు నేను చేస్తున్న రొమాంటిక్ హారర్ చిత్రం షూటింగ్, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర వ్యక్తిగతమయిన కమిట్‌మెంట్‌ల వత్తిడిలో అస్సలు సమయం లేక, సమయం మిగుల్చుకోలేక .. అసలీమధ్య నేను నా బ్లాగ్‌ని దాదాపు మర్చేపోయాను.    

ఎప్పుడో ఒకటీ అరా బ్లాగ్ పోస్ట్ తప్ప అసలేమీ రాయలేదీ మధ్య.

ఇది పెద్ద నేరం. నా దృష్టిలో.

రాయగలిగివుండీ, రకరకాల కారణాలను వెతుక్కొంటూ రాయకుండా ఉండటం, అలా ఉండగలగటం .. నిజంగా పెద్ద నేరం.

ఏదో రాసి ఎవర్నో ఉధ్ధరించాలన్నది కాదు ఇక్కడ విషయం.

రాయడం ఒక థెరపీ. ఒక యోగా. ఒక ఆనందం. ఒక కళ. ఒక గిఫ్ట్.

ఇది అందరకీ రాదు. అందరివల్లా కాదు.

ఇలాంటి గొప్ప అదృష్టాన్ని వినియోగించుకోకపోవడం నిజంగా నేరమే.

ఈ నిజాన్ని నేను పదే పదే రిపీటెడ్‌గా రియలైజ్ అవుతుంటాను. అదో పెద్ద జోక్!

కట్ టూ ఫేస్‌బుక్ - 

ఈ బ్లాగ్ పోస్ట్‌ని నేను "థాంక్ యూ 2014" అని రొటీన్‌గా రాయాలనుకున్నాను. అందరికోసం. కానీ, అది పచ్చి అబధ్ధం. హిపోక్రసీ.

నేను థాంక్స్ చెప్పాల్సింది ఫేస్‌బుక్ కి. దాని రూపశిల్పి మార్క్ జకెర్‌బర్గ్‌కి.

ప్రపంచం నలుమూలల్లో ఎక్కడెక్కడో ఉంటున్న నా స్నేహితులతో, శ్రేయోభిలాషులతో ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టే నేను మాట్లాడగలుగుతున్నాను. నాకంతకుముందు అస్సలు పరిచయంలేని, నా భాషకాని, నా సంస్కృతికాని అద్భుతమయిన సృజనశీలురు ఎందరితోనో కూల్‌గా హస్కులు వేయగలుగుతున్నాను.

నేను కలలోకూడా ఊహించని ప్రపంచస్థాయి వ్యక్తులతో ఎన్నెన్నో విషయాల్లో ఎంతో సులభంగా సంభాషించగలుగుతున్నాను.

అయితే ఇదంతా ఉట్టి టైమ్‌పాస్ కాదు. వైరుధ్యాలమయమైన అంతరంగాన్ని ఆవిష్కరించుకొనే ఒక అవుట్‌లెట్. ఒక అద్భుతం. అవధులు లేని ఒక జీవితం.

ఇప్పుడు, ఇవాళ .. అనుకోకుండా కుదిరిన ఒక మంచి అవకాశం ఇది.

అవధులు లేని ఒక కొత్త జీవితాన్ని అద్భుత రూపంలో అందించిన ఫేస్‌బుక్ కి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను?

సో, థాంక్ యూ, ఫేస్‌బుక్!

2014 లో నీ తోడుని నేనెన్నటికీ మర్చిపోలేను. నీతో కలిసే ఇప్పుడు 2014 కి వీడ్కోలు చెబుతున్నాను. 2015 కి స్వాగతం పలుకుతున్నాను.       

Sunday 21 December 2014

అరుణ్‌కుమార్ స్టయిలే వేరు!

హోటల్ బసేరా - టూ - యాత్రి నివాస్ - టూ - రొమాంటిక్ హారర్ సినిమా!

అర్థం కాలేదు కదూ?

రెండే రెండు మీటింగ్స్. కట్ చేస్తే సినిమా లాంచ్. అదీ అరుణ్‌కుమార్ వ్యవహార శైలి.

అరుణ్‌కుమార్ ఎవరో కాదు. మై ప్రొడ్యూసర్.. ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్.

కట్ టూ ది ప్రొడ్యూసర్ -

నాలుగు ఈమెయిల్స్ కమ్యూనికేషన్ తర్వాత అరుణ్‌కుమార్, నేను మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ లోని బసేరా హోటల్లో కలిశాం. అక్కడ మా సిట్టింగ్ ఎందుకో కమ్‌ఫర్టబుల్‌గా అనిపించలేదు.

షిఫ్ట్ టూ యాత్రి నివాస్.

చిన్నా, పెద్దా మీటింగ్స్ ఏవయినా - యాత్రి నివాస్‌లో నాకు చాలా కమ్‌ఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ మీటింగ్స్ పర్సనల్‌వి కావొచ్చు. బిజినెస్‌వి కావొచ్చు. మొత్తానికి యాత్రి నివాస్‌ ఓ గుడ్ ప్లేస్.

అరుణ్‌కుమార్ మెకానికల్ ఇంజినీర్. యు కె లో ఎం ఎస్ చేశారు. చాలా చిన్న వయసులోనే యు కె లో స్వంతంగా బిజినెస్ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడిపిస్తున్న ట్రాక్ రికార్డ్ ఆయనకుంది.

నా దృష్టిలో ఇదేమంత చిన్న విషయం కాదు.

కట్ టూ ది స్టయిల్ - 

అరుణ్‌కుమార్ లో నాకు బాగా నచ్చిన మొదటి అంశం ఆయన పలకరింపు.

" హలో అండి! ఎలా ఉన్నారు?"

ఎక్కడో యు కె నుంచి .. అనవసరపు మాస్కులు లేని ఇలాంటి పలకరింపు ఈ రోజుల్లో దాదాపు మృగ్యం.

అరుణ్‌కుమార్ లో నాకు నచ్చిన రెండో అతి ముఖ్యమైన అంశం - క్లారిటీ!

ఉదాహరణకు, నేనొకదానికి 100 రూపాయలు ఖర్చవుతుందంటే - అది ఎలా ఖర్చవుతుందో క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో తెల్సుకుంటారు. అది ఖర్చు చేస్తున్న సమయంలో జరిగే పని, ఆ పనిలోని వివిధ దశలు, ప్రతి దశలోనూ ఉండే కనిపించని రిస్కులు .. ఇలా ప్రతి చిన్న అంశం గురించీ చాలా క్లియర్‌గా మన వెర్షన్ తీసుకుంటారు అరుణ్.

అయితే ఇది అక్కడితో అయిపోదు.

దీనికి సంబంధించి, తన వైపు నుంచి బోలెడంత రిసెర్చ్ చేస్తారు. తన వెర్షన్ మనకు డీటెయిల్డ్‌గా ఈమెయిల్లో పంపిస్తారు. స్టెప్ బై స్టెప్ .. అవసరమయితే ఎక్సెల్ షీట్‌లో చాలా క్లియర్‌గా ఉంటుందా ఇన్‌ఫర్మేషన్.

అరుణ్‌కుమార్ ఇచ్చే ఇన్‌ఫర్మేషన్ ఎంత క్లియర్‌గా ఉంటుందంటే, అది మనకు ముందే తెలిసిన బేసిక్ ఇన్‌ఫర్మేషనే అయినా - ఒక బిజినెస్‌మ్యాన్ యాంగిల్ లో, ఎక్సెల్ లో ఆయన ఇచ్చే ఆ ప్రజెంటేషన్‌కు మనమే ఆశ్చర్యపోతాం!

తను చేయాలనుకొంటున్న పనికి సంబంధించిన ప్రతి విషయంలోనూ స్పష్టత పట్ల ఆయన చూపించే శ్రధ్ధ, ఆయన ఆలోచనా విధానం .. ఇవే ఆయన్ను ఓ సక్సెస్‌ఫుల్ ఎంట్రెప్రెన్యూర్‌ను చేశాయన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

కట్ టూ మన రొమాంటిక్ హారర్ - 

మేం కలిసి సినిమా చేద్దాం అనుకున్న తర్వాత ఆయన నన్ను కోరిన ఒకే ఒక్క విషయం సినిమా జోనర్.

హారర్ తీద్దామని!

మాట్లాడకుండా ఓకే అన్నాను. అదే ఇప్పుడు మేము షూటింగ్ పూర్తి చేసిన రొమాంటిక్ హారర్. బహుశా ఎల్లుండి ఈ సినిమా టైటిల్ చాంబర్ నుంచి అఫీషియల్‌గా మాకు అందుతుంది.

సినిమా బిజినెస్ పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న అరుణ్‌కుమార్‌కు - కాన్‌సెప్ట్ స్టేజ్ నించి ఫిలిం రిలీజ్ అయ్యేవరకూ - ప్రతి స్టేజ్ లోనూ, ప్రతి విషయం తెలిసేలా చేయడమే నేను పర్సనల్‌గా తీసుకున్న బాధ్యత. ఈ అవగాహనే, తర్వాతి ప్రాజెక్టుల ప్లానింగ్‌లో ఆయనకు చాలా ఉపయోగపడుతుంది.

చిన్నదయినా, పెద్దదయినా - జరగాల్సిన పనిని ఎంత బాగా, ఎంత సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేయాలో అరుణ్‌కుమార్ కు తెల్సినంతగా ఎవ్వరికీ తెలియదు.

ఈ లక్షణం సహజంగా రావాల్సిందే. లేదంటే ఒక ప్యాషన్‌తో స్వయంగా నేర్చుకోవాల్సిందే.

అలాకాకుండా - ఒకరిని చూసి నేర్చుకున్నా, ఒకరిని ఫాలో అయినా .. అది రాదు కాక రాదు. నాకు తెలిసి ఈ గిఫ్ట్ అరుణ్‌కుమార్ కే సొంతం.

షూటింగ్ సమయంలో కొన్ని రోజులు అరుణ్‌కుమార్ లేనప్పటి లోటు మా టీమ్ మొత్తం మందికీ తెలిసింది.  ఆ లోటుని మేమంతా నిజంగా ఫీలయ్యాం. అలా ఫీలయ్యేలా చేయగల శక్తి ఆయనకుంది.

ఇలాంటి ఔత్సాహిక యువ ప్రొడ్యూసర్ మిత్రులు ఇండస్ట్రీలో ఎక్కువమంది రావాలని నా అభిలాష.

బిజినెస్ పరంగా అరుణ్‌కుమార్ కు సంబంధించి - ఇప్పుడు మేము చేస్తున్న ఈ రొమాంటిక్ హారర్ కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. ఈ పైలట్ ప్రాజెక్టుకు చాలా ప్రత్యేకతలున్నాయి. టైటిల్ లోగో రిలీజ్ తర్వాత, అవన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తాయి.

టైటిల్ లోగో ఆవిష్కరణ తర్వాతే మా అసలైన ప్రమోషన్ ఆరంభమవుతుంది.

ఇక ఈ పైలట్ ప్రాజెక్ట్ అనుభవంతో అరుణ్ భవిష్యత్ ప్రాజెక్టుల ప్రణాళికలు కొంచెం భారీగానే ఉంటాయి.

అన్నీ అనుకూలం చేసుకొని, సరిగ్గా ప్లాన్ చేసుకొని, త్వరలో మా ఇద్దరి కాంబినేషన్లో మేం ప్రారంభించబోయే మా రెండో చిత్రం ఒక రేంజ్‌లో సంచలనం సృష్టించగలదని నా నమ్మకం.

ఆ నమ్మకాన్ని నిజం చేయగల శక్తి అరుణ్‌కుమార్ కు ఉంది.

అదే ఆయన స్టయిల్.  

Monday 15 December 2014

హాట్ హీరోయిన్ ప్రియ వశిష్ట!

కొన్ని అరంగేట్రాలు అనుకోకుండా జరిగిపోతాయి.

నా ఈ రొమాంటిక్ హారర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా గ్లామర్ ఫీల్డులోకి ప్రియ వశిష్ట అరంగేట్రం కూడా అలాంటిదే.

ఆల్‌రెడీ ప్రియాంకలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. గుంపులో గోవిందా లాగా ఎందుకు అనిపించి, మొన్న నవంబర్ 26 నాడు, తన పేరును "ప్రియ వశిష్ట"గా మార్చి, మొట్టమొదటగా మా టీమ్ వాట్సాప్ గ్రూప్‌లో ఎనౌన్స్ చేశాను. తర్వాత ప్రెస్‌లో వచ్చింది.

ఇకనుంచీ అదే తన స్క్రీన్ నేమ్, రియల్ నేమ్ కూడా అన్నమాట.

కట్ టూ హాట్ హీరోయిన్ - 

ఇప్పుడు నేను చేస్తున్న రొమాంటిక్ హారర్ సినిమాలో కొత్త హీరోయిన్ కోసం చివరి నిమిషం వరకూ హంటింగ్ బాగానే జరిగింది.

చెప్పాలంటే అదొక పెద్ద హంగామా!

ముందు నాకెంతో బాగా నచ్చిన కొత్త హీరోయిన్ వేరు. దాదాపు అగ్రిమెంట్ పైన సంతకం చేయాల్సిన రోజే, తను అప్పటికే సైన్ చేసిన ఓ తమిళ చిత్రం డేట్స్ కన్‌ఫర్మ్ అయ్యాయి. ఆ డేట్స్‌కీ, నా షూటింగ్ డేట్స్‌కీ కుదరక ఆ హీరోయిన్‌ను అలా వదులుకోవాల్సి వచ్చింది. ఆ హీరోయిన్ కూడా అలాగే ఫీలయింది.

నిన్న రాత్రి కూడా తను ఫోన్లో మాట్లాడినప్పుడు మరోసారి ఈ టాపిక్ మా మధ్య వచ్చింది. అది వేరే విషయం.

ఆ తర్వాత చాలా మందిని ఆడిషన్ చేసి, చివరికి ఓ క్యూట్ గాళ్‌ను ఫైనల్ అనుకొని, అగ్రిమెంట్ సైన్ చేయించాము. మళ్లీ ఇలాంటి డేట్స్ కారణాలవల్లనే ఆ అగ్రిమెంట్ కూడా కాన్సిల్ అయింది.  

అయితే - ముందు నేను బాగా నచ్చిన హీరోయిన్ మిస్సవడం నుంచి, ఈ క్యూట్ హీరోయిన్ అగ్రిమెంట్ కాన్సిల్ అవడం వరకూ - ప్యారలల్‌గా నా మైండ్‌లో మెదులుతున్న హీరోయిన్ వేరు. చివరికి తనే నా సినిమాకి హీరోయిన్ అవుతుందని కూడా ఎందుకో అనిపించింది అప్పుడప్పుడూ. ఇదీ అని కారణం లేదు.

కాని, చివరికి అలాగే జరిగింది.

లాస్ట్ మినిట్‌లో ప్రియను పిలిపించి సంతకం చేయించాను.

ప్రియ నాన్న వశిష్ట యూనివర్సిటీలో నా సీనియర్. ఇప్పుడో ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్. ఇంకా చాలా ఉన్నాయి. ఆ మధ్య మేము తరచూ కలుస్తున్నపుడు, ప్రియ గురించి చెబుతూ, "హీరోయిన్ కావాలన్నదే తన జీవితాశయం" అని ఒకటి రెండు సార్లు నాతో అన్న విషయం నాకు బాగా గుర్తుండిపోయింది.

ఆ జ్ఞాపకమే ప్రియను ఈ సినిమా ద్వారా హీరోయిన్‌ను చేసింది. సో, అలా ప్రియ నా ఫైండింగ్ అన్నమాట.

సిల్వర్ స్పూనో, గోల్డెన్ స్పూనో అంటారు. అలాంటి నేపథ్యం ప్రియకుంది. సినిమామీద పిచ్చి ప్యాషన్ ఉంది. హీరోయిన్ కావాలన్న తపన ఉంది. లేటెస్ట్ ట్రెండ్స్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. "నేనిది చేయను .. అది చేయను" అన్న హిపోక్రసీ లేదు.

ఒక కంప్లీట్ హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి.

వాటిని సద్వినియోగం చేసుకొని, ఒక మంచి ఆర్టిస్టుగా ఎదిగి, తన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టడం అనేది పూర్తిగా ఇక ప్రియ చేతుల్లోనే ఉంది.

మరోవైపు - కథ ఎంత డిమాండ్ చేసినా, డైరెక్టర్ ఎంత చూపించాలనుకున్నా, హీరోయిన్ ఎంత చూపించినా .. మధ్యలో సెన్సార్ అనే కత్తెర ఒకటుంది. ఆ కత్తెర పరిమితుల్లోనే ఒక హీరోయిన్‌గా ప్రియ తన ఫస్ట్ సినిమాలోనే బెస్ట్ మార్క్స్ సంపాదించుకుంది.  

అందుకే ప్రియను "హాట్ హీరోయిన్" అన్నాను.

ప్రియకు మంచి ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ తన చేతుల్లోనే ఉంది.    

Thursday 11 December 2014

హీరో "అఖిల్ కార్తీక్" కథేంటి?

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్, డబ్బు లేకుండా సినీ ఫీల్డులో హీరోగా అసలు ఎంట్రీనే కష్టం.

కానీ, ఏ సపోర్ట్ లేకుండానే - కేవలం తన యాక్టింగ్ టాలెంట్స్‌ని ప్రదర్శించి -  ఓ మంచి దర్శకుడి సినిమాలో, భారీ బ్యానర్‌లో ఎలాగో హీరోగా అవకాశం దొరికించుకున్నాడు ఓ కుర్రాడు.

ఆ సినిమా హిట్ అవలేదు.

కట్ చేస్తే, ఎవరయినా సరే "పీఛే ముడ్" అనక తప్పదు. లేదంటే, ఏ చిన్నా చితక పాత్రలకో పరిమితం కాక తప్పదు. లేదా.. ట్రాన్స్‌ఫర్ టూ టీవీ!

అయితే ఈ కుర్రాడి విషయంలో జరిగింది వేరు.

ఎలాంటి సపోర్ట్ లేకుండానే ఈ కుర్రాడు 9 సినిమాలు హీరోగా చేశాడు. ప్రత్యేక సహాయ పాత్రల్లో మరో 3 సినిమాలు చేశాడు. అన్నీ రిలీజయ్యాయి. రావల్సిన హిట్ మాత్రం ఇంకా రాలేదు.

అయినా ఎనర్జీ తగ్గలేదు. ఎయిమ్ మారలేదు.

అతనే అఖిల్ కార్తీక్.

కట్ టూ అఖిల్ కార్తీక్ ఎంట్రీ - 

వైజాగ్ సత్యానంద్ ఇన్స్‌టిట్యూట్ నుంచి నేరుగా మొదటిసారిగా హైద్రాబాద్ వచ్చాడు కార్తీక్. ఏ రోడ్డూ, ఏ ఏరియా తెలియదు. ఎవరు ఎక్కడుంటారో తెలియదు.

తెలిసింది ఒక్కటే. ఎలాగయినా హీరో కావాలి.

తెచ్చుకున్న కొంచెం డబ్బుతో పంజాగుట్టలో ఉన్న ఒక చిన్న హోటల్లో దిగిపోయాడు కార్తీక్. ఇప్పటికీ అక్కడే ఉన్న ఆ హోటల్ పేరు -  బాలాజీ లాడ్జ్.

అప్పట్లో ఒక ప్రముఖ దర్శకుని పిలుపుతో అలా హైద్రాబాద్‌కు వచ్చిన తర్వాత కార్తీక్‌కు కథ అడ్డం తిరిగింది. ఏదో ఒక సంవత్సరం కదా అని బాండ్ అగ్రిమెంట్‌కు ఓకే చెప్తే, ఆ ప్రముఖ దర్శకుడు దాన్ని చివరి నిమిషంలో ఐదేళ్లకు పెంచాడు!

ఆలోచించాడు కార్తీక్. సింపుల్‌గా "నో" అనుకున్నాడు.

తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్న టైమ్‌లో పంజాగుట్ట హోటల్ నుంచి మకాం మధురానగర్ గల్లీలోని బ్యాచ్‌లర్ రూమ్‌లోకి మారింది.

అప్పుడొచ్చిందొక అవకాశం.

ముప్పలనేని శివ కొత్తవాళ్లతో తీస్తున్న చిత్రం ఆడిషన్స్‌లో అదరగొట్టాడు కార్తీక్.

అంతే.

తన సినిమాలోని ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా ఎన్నిక చేశారు ముప్పలనేని శివ. ఆ తర్వాత అక్కడకూడా ఎన్నో ట్విస్టులు తట్టుకొని, చివరికి ముప్పలనేని శివ దర్శకత్వంలోనే హీరోగా నటించాడు కార్తీక్.

అలా తొలిసారిగా కార్తీక్ హీరోగా నటించిన ఆ చిత్రం పేరు "దోస్త్!"

2004 నుంచి 2014 వరకు పదేళ్లు గడిచినా, కార్తీక్ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులేదు. అనవసరపు చెత్త సినిమాటిక్ మాస్కులు లేవు. నా రెండో చిత్రం "అలా"లో నటించినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు కార్తీక్.

అదే అతని ఎసెట్. అదే అతనికి శ్రీరామ రక్ష.    

జస్ట్ ఎ గుడ్ గై.

కట్ టూ ఫినిషింగ్ టచ్ - 

ఆనాటి "దోస్త్" నుంచి, మొన్నటి "తీయని కలవో" వరకు - 9 చిత్రాల్లో హీరోగా చేసినా, తనకు రావల్సిన రేంజ్‌లో ఒక హిట్ ఇంకా కార్తీక్ ఖాతాలో పడలేదు.

అయితే 2015 వస్తోంది మాత్రం ఆ లోటు తీర్చడానికే. అదెలాగో వివరంగా చెప్పటం అవసరమని నేననుకోవటం లేదు.

ఇట్ జట్ హాపెన్స్ ..  

Sunday 7 December 2014

ఒక రొమాంటిక్ హారర్ సినిమా!

ఇప్పుడంతా తెలుగులో హారర్ సినిమాల హవా  నడుస్తోంది.

ఈ ట్రెండ్‌ను ఫాలో కావాలని నేనేం అనుకోలేదు కానీ, నా ప్రొడ్యూసర్ మిత్రుడు అరుణ్‌కుమార్ "హారర్ సినిమానే తీద్దాం" అన్నారు.

మరింకేం ఆలోచించకుండా నేను "ఓకే" అనేశాను.

ఈ నిర్ణయం తీసుకోవడంలో మా ప్రొడ్యూసర్ పాయింటాఫ్ వ్యూ, నా పాయింటాఫ్ వ్యూ వేర్వేరు కావొచ్చు. అది సహజం. కానీ, అంతిమంగా మా ఇద్దరి గోల్ మాత్రం ఒక్కటే. తర్వాత నేను ఎన్నిక చేసిన నా టీమ్ లక్ష్యం కూడా అదే.

సక్సెస్.

చాలా చిన్న బడ్జెట్ కాబట్టి "హారర్" ఒకరకంగా బెటర్. లొకేషన్స్ తక్కువగా ఉంటాయి. కేరెక్టర్లూ తక్కువగా ఉంటాయి. అయితే - మేకింగ్ పరంగా ఒక స్థాయి స్టాండర్డ్ లేకపోతే చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతుంది. అందుకే ఈ విషయంలో మేమెక్కడా కాంప్రమైజ్ కాలేదు.

ఇక హారర్ కథలన్నీ దాదాపు ఒకేలా అనిపించినా, స్క్రీన్ ప్లే దగ్గర కొంతయినా కష్టపడాల్సివస్తుంది. మిగిలిన సినిమాల్లో లేని "ఇంకేదో" కొత్త అంశం ఒకటి చొప్పించాల్సి ఉంటుంది.

ఈ సినిమా విషయంలో ఆ పని నేను చేయగలిగాను.

స్క్రీన్ ప్లే తర్వాత హారర్ సినిమాకు కెమెరా, సౌండ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ముఖ్యం. కెమెరా దగ్గర మా ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ కాలేదు. కెమెరామన్ దగ్గర నేను కాంప్రమైజ్ కాలేదు.

కట్ టూ "లోకం చుట్టిన వీరుడు" -  

రెడ్ ఎం ఎక్స్, స్టెడీకామ్ లను మస్త్‌గా ఉపయోగించి షూట్ చేసిన ఈ సినిమా "డి ఓ పి" కి ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అంటే పిచ్చి ప్యాషన్. ఎక్కువగా అంతర్జాతీయస్థాయిలో పనిచేసే ఈ టెక్నీషియన్ పాస్‌పోర్టులు బుక్కులు బుక్కులుగా అయిపోతుంటాయి. షూటింగ్ పనిలో ఈయన ఇప్పటికే 90 దేశాలకి పైగా తిరిగాడు. సుమారు ఇంకో 90 దేశాలు తిరిగితే చాలు.. లోకం చుట్టిన వీరుడవుతాడు!

సినిమాటోగ్రఫీ కళ పట్ల ఇంత ప్యాషన్ ఉన్న ఈ డి ఓ పి, సినీ ఇండస్ట్రీలో నేను వేళ్లమీద లెక్కపెట్టుకొనే నాకున్న అతికొద్దిమంది మిత్రుల్లో మొదటివాడు.

ఇతని పారితోషికాన్ని ఈ సినిమా బడ్జెట్ ఏమాత్రం భరించలేదు. అయినా కేవలం నాకోసం ఈ చిత్రానికి పనిచేశాడు ఈ మిత్రుడు.  ఇంకా చెప్పాలంటే - ఈ మిత్రుడు ఉన్నాడు కాబట్టే ఈ సినిమా షూటింగ్‌ని ఇంత వేగంగా, ఇంత క్వాలిటీతో, 2 పాటలతో కలిపి కేవలం 13 రోజుల్లో చాలా కూల్‌గా పూర్తిచేయగలిగాను.

ఈ ఆత్మీయ మిత్రుని పేరు వీరేంద్ర లలిత్.  

Friday 5 December 2014

ఒక ఐడియా ..

"ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది" అన్నది కొంచెం స్టయిలిష్‌గా చెప్పేమాట. "ఒక ఐడియా ఏకంగా కొంపలు ముంచుతుంది" అన్నది ముఖం మీద గుద్దినట్టు చెప్పేమాట.

మొదటిది పాజిటివ్ భావన. రెండోది పక్కా నెగెటివ్ ఎఫెక్టు. రెండూ అనుభవపూర్వకంగా తెలిసేవే.

ఈ రెండు రకాల ఐడియాల ప్రభావాన్ని వివిధ దశల్లో వ్యక్తిగతంగా చవిచూసినవాణ్ణి కాబట్టి నాలో ఒకరకమైన స్థితప్రజ్ఞత క్రమంగా అలవడింది.

థాంక్స్ టూ మై ఐడియాస్. గుడ్ ఆర్ బ్యాడ్. బెటర్ ఆర్ వరస్ట్ ..

కట్ టూ మై లేటెస్ట్ ఐడియా -

ప్రస్తుతం నేను చేస్తున్న తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా కోసం ఒక టైటిల్ అనుకున్నాము. అయితే అఫీషియల్‌గా ఆ టైటిల్ మాకు రావడానికి ఇంకో రెండు వారాలు పడుతోంది. అంతదాకా నో ప్రెస్‌మీట్! అవసరమయితే ప్రెస్‌నోట్ ఒకటి మాత్రం రిలీజ్ చేస్తాం.

సినిమా షూటింగ్ అయిపోయిందనీ, ప్లస్ ఇంకా కొన్ని విశేషాలతో.

ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ యమ ఫాస్ట్‌గా చేస్తూనే - ఈ సినిమా అనుకున్న రోజునుంచి ఇప్పటివరకూ, ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ వరకూ .. అన్ని విశేషాలతో, రోజూ కనీసం ఓ 15 నిమిషాలు కెటాయించి బ్లాగింగ్ చేయాలనుకుంటున్నాను.

ఇది మాత్రం చెత్త ఐడియా కాదని నా నమ్మకం. ఏమో .. ఈ బ్లాగ్ పోస్టులతోనే రేపు "ది మేకింగ్ ఆఫ్ .." అని ఓ పుస్తకం కూడా పబ్లిష్ చేయొచ్చు! ఎవరికి తెలుసు ..  

Wednesday 3 December 2014

సిల్క్ స్మిత చాలా సాధించింది!

చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశాను.

అదీ రికార్డ్ టైమ్‌లో.

సుమారు 30 రోజులయినా పట్టే ఒక తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా షూటింగ్‌ని కేవలం 13 రోజుల్లో పూర్తిచేశాను.

నిజానికి షూటింగ్ 12 రోజులే ప్లాన్ చేశాను. కానీ.. రకరకాల ఆలస్యాలు, ఆటంకాల వల్ల ఒక రోజు పెరక్క తప్పలేదు. అయినప్పటికీ క్వాలిటీదగ్గర ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా - రెడ్ ఎమ్ ఎక్స్ కెమెరాతో, స్టెడీకామ్ కూడా ఉపయోగిస్తూ, 2 పాటలతో, రాత్రీ పగలూ టీమ్‌ని ఉత్సాహపరుస్తూ 13 రోజుల్లో షూటింగ్ పూర్తిచేయడం అంత చిన్న విషయమేం కాదు. థాంక్స్ టూ మై టీమ్ అండ్ ప్రొడ్యూసర్! 

అసలు కథ ముందుంది. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్, బిజినెస్. వీటి విషయంలో కూడా షూటింగ్ అప్పటి ఊపునీ, ఫోకస్‌నీ కొనసాగించగలమనే నా నమ్మకం.

రేపో, ఎల్లుండో తెలిసే టైటిల్ కన్‌ఫర్మేషన్ కోసం చాలా ఎక్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాము. నేనూ, నా టీమంతా.

కట్ టూ సిల్క్ స్మిత -

ఎన్నో ప్రత్యేకతలున్న నా ఈ రొమాంటిక్ హారర్ సినిమా షూటింగ్ పుణ్యమా అని చాలారోజులుగా మర్చిపోయిన నా బ్లాగ్‌ని ఇవాళ అనుకోకుండా విజిట్ చేశాను. ఏదయినా రాద్దామని.

ఆశ్చర్యంగా, నేనెప్పుడో చాలాకాలం క్రితం రాసి మర్చిపోయిన నా పాత బ్లాగ్ పోస్ట్ "సిల్క్ స్మిత ఏం సాధించింది?" పాపులర్ పోస్టుల్లో టాప్ పొజిషన్‌లో కనిపించింది!

అది చూశాక, ఆ క్షణం నాకు అనిపించిన భావనే ఈ బ్లాగ్ పోస్ట్‌కు టైటిల్ అయి కూర్చుంది.

హేయ్ స్మితా! హెవెన్‌లోనూ దుమ్మురేపుతున్నావా లేదా? నీ పేరుతో విద్యా బాలన్ ఇక్కడ ఆల్రెడీ దుమ్ములేపింది మరి ..     

Sunday 16 November 2014

రోజుకో పేజీ!

రకరకాల షేపుల్లో, రకరకాల పేర్లతో మనం ఇప్పుడు తింటున్న పొటాటో చిప్స్‌కి ఆదిగురువు 1967 లోనే మార్కెట్లోకి వచ్చిన ప్రింగిల్స్.

ఈ చిప్స్ ఇలా ఉండాలని ఊహించిన జక్కన్న లీపా. కాగా, వీటికి ఆ షేప్‌లు తీసుకురావడానికి ఉపయోగించే మిషన్‌ను రూపొందించిన రామప్ప జీన్ వుల్ఫ్.

ఇక్కడ విషయం చిప్స్ కాదు.

జీన్ వుల్ఫ్.

ఆయనకు తెలిసిన ఓ అతి పెద్ద రహస్యం.

జీన్ వుల్ఫ్ మెకానికల్ ఇంజినీర్. రచయిత కూడా. జీన్‌కి తెలిసిన రహస్యం .. రోజుకు ఒకే ఒక్క పేజీ రాయడం.

జీన్‌కు ఇప్పుడు 83 సంవత్సరాలు. అంటే సుమారు 30, 000 రోజులు. అందులో సగం రోజులు ఆయన ఒక సాధారణ రచయిత స్థాయి మెచ్యూరిటీకి ఎదగడానికి పట్టాయి అనుకొని తీసేద్దాం.

తనకు తెలిసిన ఈ అతి చిన్న సీక్రెట్‌ను ఉపయోగించి, ఈ 15,000 రోజుల్లో ఆడుతూ పాడుతూ జీన్ రాసిన పుస్తకాల సంఖ్య 50.    

అవును అక్షరాలా 50 పుస్తకాలు!

వీటిలో నవలలున్నాయి. బెస్ట్ సెల్లర్ బుక్స్ ఉన్నాయి. అవార్డ్ పొందిన పుస్తకాలూ ఉన్నాయి.

ఏ రకంగా చూసినా ఇదొక అద్భుతమయిన అచీవ్‌మెంటే. ఎందుకంటే జీన్ కేవలం రోజుకు ఒక్క పేజీ మాత్రమే రాస్తూ ఇది సాధించాడు!

కట్ టూ ది అదర్ సైడ్ - 

మనకు బద్దకం ఎక్కువ. సమస్యల్ని తలచుకొంటూనే జీవితాల్ని ముగించేస్తాం.

నేను రాసిన ఒక ఆధునిక జర్నలిజం పుస్తకం ఒక యూనివర్సిటీలో పీజీ స్థాయి సిలబస్‌లో "రికమండెడ్ బుక్స్" లిస్టులో ఉంది. సినిమా స్క్రిప్ట్ పైన నేను రాసిన మరో పుస్తకం నంది అవార్డు పొందింది. ఈ రెండూ బెస్ట్ సెల్లర్ బుక్సే. నేను అచ్చు వేసిన రెండు ఎడిషన్లూ టపటపా అయిపోయాయి. నవోదయ, విశాలాంధ్రవాళ్లు రీప్రింట్ మళ్లీ వేయండి అని ఎన్నోసార్లు చెప్పినా వినలేని బద్దకం!

లేటెస్ట్ డెవెలప్‌మెంట్స్‌ని, నా అనుభవాల్నీ పొందుపరుస్తూ ఈ పుస్తకాల్నిరివైజ్ చేసి పబ్లిష్ చేయాలని నా ఉద్దేశ్యం. కాని ఆ పని ఒక దశాబ్దం గడిచినా నేను చేయలేకపోయాను!

సంవత్సరం క్రితం ఓ పబ్లిషర్ మిత్రుడు నన్ను వేధిస్తోంటే ఇక పడలేక - వారం పాటు అదే పనిమీద కూర్చుని  ఒక పుస్తకం రివైజ్ చేసి రాసిచ్చాను. ఆ పబ్లిషర్ మిత్రుడు ఇస్తానన్న డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదు. పుస్తకాన్నీ పబ్లిష్ చేయలేదు. ఇదొక రకం బద్దకం.

ఈ మధ్య నా అవసరం కోసం మళ్లీ  సినిమాల బిజీలో పడిపోయి ఈ బ్లాగ్‌ని కూడా మర్చిపోయాను.

రైటింగ్ అనేది ఒక థెరపీ.

రాయటం అలవాటు ఉన్నవాళ్లు దాన్ని మర్చిపోతే బ్రతకలేరు. తేడా తెలుస్తుంది. జీవితం ఉట్టి బ్రతుకైపోతుంది.

జీన్ వుల్ఫ్ నుంచి జె కె రౌలింగ్ దాకా - ప్రపంచస్థాయి రచయితలందరూ నానా కష్టాలుపడుతూనే రాశారు. జీవితాన్ని జీవించారు. గౌరవించారు.

రకరకాల కారణాలు నాకు నేనే చెప్పుకొంటూ, రోజుకు కనీసం ఒక్క పేజీ కూడా నేను రాయలేకపోతున్నానంటే నిజంగా ఇప్పుడు నాకే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది.

జీన్, యు ఆర్ రియల్లీ గ్రేట్!  

Wednesday 29 October 2014

మనీ.. 3 సూత్రాలు!

ఇప్పుడు నేను చేస్తున్న రొమాంటిక్ హారర్ సినిమా స్క్రిప్టును యుకేలో ఉన్న మా ప్రొడ్యూసర్‌కి పంపించి ఒక ట్వీట్ పెడదామని ట్విట్టర్‌లోకెళ్లాను. ఇది కనిపించింది:

"Research shows that the more a boy misbehaves in school, the more likely he is to earn a lot of money as an adult!"

నా దృష్టిలో ఇదేదో ఉత్తుత్తి స్టేట్‌మెంట్ కాదు. నా అనుభవంలో నేను కూడా చూసిన ఒక సత్యం. దీనికి అనుబంధంగా మరికొన్ని నిజాలు కూడా నేను చెప్పగలను. ఎలాంటి హిపోక్రసీ లేకుండా!

> రోడ్డుమీద వెళ్తూ కనిపించిన ప్రతి రాయికీ, రప్పకూ విచిత్రంగా అలా దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. వీరి వ్యవహారశైలిగానీ, భాషగానీ అవతలివారికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ కేటగిరీకి చెందిన చాలామంది నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. వీళ్లల్లో చాలామందికి కాగితం పైన పెన్నుపెట్టి రాయటం రాదు. కానీ వీరందరి దగ్గర డబ్బు పిచ్చిగా ఉంటుంది. పిచ్చిపిచ్చిగా సంపాదిస్తారు!

> అంతర్జాతీయంగా వివిధరంగాల్లో అత్యుత్తమ స్థాయి విజయాల్ని సాధించి బిలియనేర్లు అయినవారంతా చదువులో గుండు సున్నాలే. లేదా స్కూల్, కాలేజ్ స్థాయిలో "డ్రాప్ అవుట్"లే!    

> సినీ ఫీల్డులో కూడా అంతే. అత్యున్నతస్థాయి విజయాలు సాధించి కోట్లు సంపాదించుకున్న ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ అంతా చదువుకు పంగనామాలు పెట్టినవాళ్లే!

కట్ టూ నీతి -        

1. చదువుకోనివాడి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. మొండిగా ఆ ఒక్కదాని గురించే కష్టపడి సాధిస్తాడు.

2. చదువుకున్నవాడికి పది లక్ష్యాలుంటాయి. పది పడవలమీద కాళ్లు పెడతాడు. ఏ ఒక్కటీ సాధించలేడు.

3. చదువుకు, సంపాదనకు అస్సలు సంబంధం లేదు. "నేనెంత సంపాదించాలి? దానికోసం నేనేం చేయాలి?" అన్న వెరీ సింపుల్ 'ఫినాన్షియల్ ఇంటలిజెన్స్' చాలు.

4. పైన 1, 2, 3 లను చాలా ఆలస్యంగా రియలైజ్ కావడమంత దురదృష్టం ఇంకొకటి లేదు. 

Thursday 9 October 2014

మన హీరోయిన్స్ కూడా మంచి ఫిలిమ్‌మేకర్స్ కాగలరు!

ఈ విషయాన్ని గతంలో అంజలీదేవి, విజయనిర్మల వంటివాళ్లు ఎప్పుడో ప్రూవ్ చేసేశారు. ఇటీవలి కాలంలో మాత్రం ఇది చాలా అరుదయిన విషయమైపోయింది. ముఖ్యంగా తెలుగులో.  

సుమారు ఓ రెండువారాలక్రితం అనుకుంటాను. ఒక పాపులర్ హీరోయిన్ నా ఫేస్‌బుక్ కి యాడ్ రిక్వెస్ట్ పంపించింది. హీరోయిన్ కదా.. సహంజంగానే యాడ్ చేసేసుకున్నాను.

రెండు మూడు ఊహించని ప్రశ్నలతో ప్రారంభమై, కొంచెం తడబడి, తర్వాత స్పీడందుకొని, చివరకు మా ఇద్దరి దినచర్యలో ఒక రొటీనయిపోయింది మా కమ్యూనికేషన్.    

అంతకు ముందు ఈ హీరోయిన్ కొన్ని తెలుగు సినిమాలుచేసింది. ఇప్పుడు ఎక్కువగా తమిళం, మళయాళం లలో చేస్తున్నట్టుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ మళయాళంలో ఓ మంచి బోల్డ్ వుమెన్-సెంట్రిక్  ఫిలిం చేస్తోంది.

కట్ టూ పాయింట్ - 

సాధారణంగా హీరోయిన్స్‌లో అత్యధిక శాతం మంది ఫిలిం మేకింగ్, ఫైనాన్స్, బిజినెస్, మార్కెటింగ్ వంటి వ్యవహారాలవైపు అసలు ఆసక్తి చూపించరు. వాళ్ల రెమ్యూనరేషన్, రోల్, బ్యానర్, డైరెక్టర్, హీరో, డేట్స్ .. అంతే.
ఏ హీరోయినయినా ఈ అయిదారు అంశాలు తప్ప దాదాపు మరోవిషయం పట్టించుకోదు.

అలాంటి నేపథ్యంలో, అనుకోకుండా .. ఈ హీరోయిన్‌తో, ఫిలిం మేకింగ్ లో వచ్చిన ఇటీవలి సరికొత్త పరిణామాలగురించి మా మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.

నేనసలు ఎదుటివారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను. నాకంటే కనీసం పది రెట్లు గొప్పవారిగా భావిస్తూ మాట్లాడతాను. ప్రవర్తిస్తాను. అయితే - కొంచెం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆమెకు ఇవన్నీ మరీ లోతుగా తెలిసే అవకాశం లేదు అనుకొని.. ఆ టాపిక్‌ని అలా మీద మీద టచ్ చేసి వదిలిపెట్టాను.

కానీ, ప్రపంచవ్యాప్తంగా టెక్నికల్‌గా, మార్కెటింగ్‌పరంగా ఫిలిం మేకింగ్‌లో వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్‌ని గురించి, కేవలం క్షణాల్లో, ఈ హీరోయిన్ నాకు అందించిన సమాచారంతో నేను నిజంగానే "వావ్" అనుకున్నాను. ఫిలిం మేకింగ్ కి సంబంధించి ఈ హీరోయిన్‌కు ఉన్న పరిజ్ఞానంలో కనీసం పదిశాతం అయినా మన ప్రొడ్యూసర్స్‌కు ఉంటే బాగుండును అనిపించింది.

ఈ విషయంలో అనుకోకుండా ఓ టాపిక్ మీద చర్చ వచ్చింది కాబట్టి ఇదంతా నాకు తెలిసింది. ఆ టాపిక్కే రాకపోతే మిగిలిన అందరు హీరోయిన్లలానే తననూ అనుకునేవాన్నేమో!

ఇలా బయటికి అసలు ఎక్స్‌పోజ్ కాకుండా ఇంకెంతమంది హీరోయిన్లు.. ఫిలిం మేకింగ్, బిజినెస్‌లోని లేటెస్ట్ ట్రెండ్స్ పట్ల లోపల్లోపలే ఎంత ఆసక్తితో, ఎంత స్టడీ చేస్తున్నారో ఎవరికి తెలుసు?

నా ఈ కొత్త (పాపులర్ హీరోయిన్) ఫేస్‌బుక్ ఫ్రెండ్ ద్వారా "హీరోయిన్స్ కూడా మంచి ఫిలిం మేకర్స్ అవుతారు" అన్నది నేను తెలుసుకొన్న ఓ కొత్త నిజం. 

Monday 29 September 2014

సక్సెసే నిజం.. మిగిలిందంతా అబధ్ధం!

"మనం" సినిమాకు అద్భుతమైన సంగీతం అందించిన అనూప్ రూబెన్‌తో నేనొక రెండు సార్లు మాట్లాడాను. అప్పుడు అనూప్‌ని నాకు పరిచయం చేసింది, నేను పరిచయం చేసిన నా ఇంకో మిత్రుడు, కోరియోగ్రాఫర్ నిక్సన్.

ఇది దాదాపు ఓ పదేళ్లక్రితం నాటి విషయం.

అప్పుడు అనూప్ మాట్లాడిన మాటల్లోని ఆ స్వచ్చత, నెమ్మదితనం, అణకువ నాకిప్పటికీ గుర్తున్నాయి. నేనూ, నిక్సన్ ఆరోజే అనుకున్నాం. అనూప్ ఒక రేంజ్ కి ఎదుగుతాడని!

ఇదేదో ఇప్పుడు అనూప్ టాప్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక చెప్తున్న మాటకాదు. అప్పుడు అతను చేస్తున్న మ్యూజిక్ మాకు తెలుసు. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర అతను ఎలా పనిచేసిందీ మాకు తెలుసు. మొత్తంగా మ్యూజిక్ పట్ల అతనికి ఉన్న ప్యాషన్ మాకు తెలుసు. అతని గురించి పరిచయం ఉన్న అందరికీ తెలుసు.

కట్ టూ ప్రదీప్‌చంద్ర - 

ఇవాళ నేను కొత్తగా పరిచయం చేస్తున్న మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌ని చూస్తోంటే, అతనితో మాట్లాడుతోంటే.. నాకెందుకో పదేళ్లక్రితం నాటి అనూప్ గుర్తొచ్చాడు.

ఎమ్‌టెక్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివిన ప్రదీప్‌కు ఉద్యోగం చెయ్యటం కన్నా మ్యూజిక్ మీదే ప్రాణం. ప్యాషన్.
ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్.

అయితే.. నాకయినా, ప్రదీప్‌కయినా, ఎవరికయినా.. లక్ష్యం ఒక్కటే ఉండాలి. పదిపడవలమీద కాళ్లు పెట్టినవారు ఎవ్వరూ సక్సెస్ సాధించలేరు. అన్నీ కలిసిరావాలి. కలిసివచ్చేలా చేసుకోవాలి. అప్పటిదాకా కష్టపడాలి. పడుతూనే ఉండాలి.

ఏ ఫీల్డులోనయినా, ఎవరయినా విజయం సాధించేది ఇలాగే. ఇదేం రహస్యం కాదు. రాకెట్ సైన్స్ కాదు. నిజం.    

Wednesday 24 September 2014

కొత్త తెలుగు హీరోయిన్ అన్వేషణ!

ఇప్పుడు నేను చేస్తున్న కొత్త సినిమాలో ఇద్దరు కొత్త హీరోయిన్లకు అవకాశం ఉంది. 18-23 సంవత్సరాలమధ్య ఉంటే చాలు. ఇతర కామన్ క్వాలిఫికేషన్లు మామూలే. వాటితోపాటు - సినిమాలమీద, నటన మీద ఆసక్తి, హీరోయిన్ అవ్వాలన్న ప్యాషన్ చాలా అవసరం. మీరు హైదరాబాద్‌లో ఉంటే మరీ మంచిది.

ఇదొక కామెడీ రొమాంటిక్ హారర్ చిత్రం. పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా.

దీన్నిబట్టి, నిజంగా అంత స్థాయి ఆసక్తి, అర్హత ఉన్న ఔత్సాహిక కొత్త హీరోయిన్లు మీ మొబైల్ నంబర్ ఇస్తూ, ఫోటోలని ఈమెయిల్ చెయ్యండి. పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. "మా పేరెంట్స్ అనుమతితోనే నేను ఈ మెయిల్ పంపిస్తున్నాను" అని స్పష్టంగా మీ మెయిల్లో ఉండాలి.

ఉంటే .. మీ ఫేస్‌బుక్, యూట్యూబ్ వీడియో క్లిప్స్ లింక్స్ కూడా పంపించండి.

ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ చివరి వారం నుంచి ఒకే షెడ్యూల్లోపూర్తవుతుంది.  

ఇది పూర్తిగా ఫిలిమ్‌మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి తీస్తున్న సినిమా. యునిట్, యూనియన్ రూల్స్, కాల్‌షీట్ టైమింగ్స్, బేటాలు, డబుల్ బేటాలు వంటి ట్రెడిషనల్ మేకింగ్ పధ్ధతులేవీ ఇక్కడ ఉండవు. మేకింగ్‌లో, ప్రమోషన్‌లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఒక టీమ్‌గా అందరం సినిమా కోసం, దాని సక్సెస్ కోసం పనిచేయడమే ముఖ్యం. అదొక్కటే గోల్.

ఆసక్తి, అర్హత ఉన్న తెలుగు అమ్మాయిలు  పైన చెప్పిన వివరాలతో మీ ఈమెయిల్ పంపించాల్సిన అడ్రస్ ఇది:
mfamax2015@gmail.com 

Monday 22 September 2014

ఇగ ఫాక్టరీ షురూ!

"సినిమా తీయాలన్న కమిట్‌మెంట్ ఉంటే చాలు. డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు."

ఈ మాటలన్నది ఎవరో కాదు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే!

ఎలా కాదనగలం?

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది. ఆ సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు.

విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్‌మెంట్ తో చేయగలగటం.

అసలు సినిమాలా ఇంకొకటా అన్నది కూడా సమస్య కాదు. చేయాలనుకున్నపని మీద ఒక క్లారిటీ, ఒక కమిట్‌మెంట్ ఉండటం. ఏది ఎలా ఉన్నా, దానిమీదే దృష్టిపెట్టి ఆ పనిని పూర్తి చేసెయ్యటం.

కట్ టూ మన ఫాక్టరీ - 

సినిమా తీయాలనుకుంటే ఇప్పుడు డబ్బు సమస్య కాదు. అంత తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు ఎవరయినా సినిమా తీయొచ్చు. అంతా కొత్తవాళ్లతో, నేచురల్ లొకేషన్లలో సినిమా తీస్తే - దాదాపు అది "నో బడ్జెట్" సినిమానే! కొంచెం పేరున్న హీరో హీరోయిన్లయినా సరే, ఫిలిమ్‌మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు అంత సౌకర్యం కల్పిస్తోంది.

ఇటీవలి కాలంలో వచ్చిన ఎన్నో యూత్ ఫుల్ కమర్షియల్ సినిమాలు, థ్రిల్లర్‌లు ఈ విషయాన్ని నిరూపించాయి. పుష్కలంగా డబ్బుల వర్షం కురిపించాయి.

కేవలం బడ్జెట్ దృష్టితో చూస్తే, వీటిని కమర్షియల్ ఆర్ట్ సినిమాలనవచ్చేమో! లేటెస్ట్ ఆన్‌లైన్ ప్రమోషన్ టెక్నిక్స్‌తో ఒక ఆట ఆడుకోవచ్చు. కావల్సినంత హల్‌చల్ క్రియేట్ చేయొచ్చు. ఏ కొంచెం హిట్ టాక్ వచ్చినా, వీటి కలెక్షన్ ఇంచుమించు పెద్ద సినిమాలకు పోటీగా ఉంటుంది. ఈ రేంజ్ బడ్జెట్ లో అసలు రిస్క్ అనేదే ఉండదు. ఇంకేం కావాలి?

ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న తాజా సినిమా ఇలాంటిదే.

యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్!

నాలుగయిదు రోజుల్లో పూర్తి వివరాలు ప్రెస్‌లో రానున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో హీరోయిన్లే లీడ్ పాత్రలు వేస్తున్నారు. ఒక పక్కా  కమర్షియల్ సినిమా. కౌంట్‌డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్టోబర్ చివరినుంచి సింగిల్ షెడ్యూల్ షూటింగ్.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండగానే మరో సినిమా. ఆ ఏర్పాట్లు కూడా మరోవైపు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.

సో, ఇగ మన ఫాక్టరీ షురూ అన్నమాట ..   

Saturday 13 September 2014

ప్రెస్ నిజంగా ఎంత గొప్పది?

లేకపోతే.. మొత్తం మీడియా నోటికే టేప్ అంటించిన ఆ "మగ సెక్స్ క్లయింట్" గొప్పవాడా? ..

సినిమాలో "హాఫ్‌వే ఓపెనింగ్"లా ఇలా నేరుగా పాయింట్‌లోకే వెళ్లి ఈ బ్లాగ్ పోస్ట్ రాయడానికి కారణం చాలా బాధాకరమైంది. సిగ్గుతో తల దించుకోవాల్సింది.

మొన్న సెప్టెంబర్ 2 నాడు హైద్రాబాద్‌లోని ఒక స్టార్ హోటల్లో ఒక హీరోయిన్ వ్యభిచారం చేస్తూ "రెడ్ హాండెడ్"గా పోలీసులకు పట్టుబడిన బ్రేకింగ్ న్యూస్‌లు మనం చూశాం.. చదివాం.. విన్నాం.

నిన్న రాత్రి ఒక వర్ధమాన దర్శకురాలి నుంచి నాకో ఆన్‌లైన్ పిటిషన్ లింక్ ఫేస్‌బుక్ మెసేజ్ ద్వారా అందింది. ipetitions లోని ఆ పిటిషన్ పూర్తిగా చదివాను. సంఘీభావంగా నేనూ ఆన్‌లైన్ సిగ్నేచర్ చేశాను.

ఎంత నికృష్టమైన వ్యవస్థలో మనం ఉన్నామో ఆ పిటిషన్ చదివాక తలెత్తే ఈ ప్రశ్నలు చూస్తే మీకే అర్థమవుతుంది:

> వ్యభిచారం చేస్తూ "రెడ్ హాండెడ్"గా హీరోయిన్ పోలీసులకి దొరికిపోయిందన్నారు. అంటే అక్కడ ఆమెతోపాటు గడిపిన ఆ మగ "సెక్స్ క్లయింట్" కూడా ఉన్నట్టేగా?  అలాంటప్పుడు అతని పేరు ఎందుకని బయట పెట్టలేదు? కేవలం ఆ హీరోయిన్ పేరునే ఎందుకు బయటపెట్టి పదే పదే "బ్రేకింగ్ న్యూస్"లతో ఊదరగొట్టారు?  

> దీన్నే ఇలా కూడా అడగొచ్చు:
పోలీసులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నపుడు ఈ సెక్స్ రాకెట్ నడిపిన బ్రోకర్ కూడా దొరికాడు. హీరోయినూ దొరికింది. కానీ, ఆ హీరోయిన్‌తో పాటు ఉన్న ఆ మగ సెక్స్ క్లయింట్ ఎందుకు దొరకలేదు? దొరికితే అతనెవరు? దొరక్కపోతే అది "రెడ్ హాండెడ్" ఎలా అవుతుంది?

> రేప్‌లు, ఇలాంటి విషయాల్లో స్త్రీలు/అమ్మాయిల పేర్లు బయటపెట్టకూడదన్న సెన్సిటివిటీని అటు పోలీసులు గానీ, ఇటు ప్రెస్ మీడియాగానీ ఎందుకు పాటించలేదు? ఇది యాంటీ వుమెన్ ధోరణి కాదా?    

> "ఒక స్టార్ హోటల్లో" రెడ్ హాండెడ్‌గా ఈ గొప్ప రాకెట్‌ని కనుగొన్న మన పోలీసులు ఆ స్టార్ హోటల్ పేరెందుకు దాయటం? కారణం ఏంటి?

> ఆ హీరోయిన్ను ఏ చట్టాలకిందనయితే బుక్ చేసి అరెస్ట్ చేశారో, అదే నేరంలో భాగస్తుడయిన ఆ మగ సెక్స్ క్లయింట్‌ను కూడా అదే చట్టాల ప్రకారం బుక్ చేసి అరెస్ట్ చేయాలి కదా? అలా ఎందుకని చేయలేదు? కనీసం అతని పేరయినా బయటికి రాలేదెందుకు?  

> స్టార్ హోటల్స్‌లో, ఇంకా ఎన్నో గెస్ట్ హౌజ్‌ల్లో, ఫామ్ హౌజ్‌ల్లో, ఇంకా ఎక్కడెక్కడో ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఒక్క సినిమావాళ్లు మాత్రమే "బ్రేకింగ్ న్యూస్"లకు పనికొస్తారు! ఎందుకంటే "సినిమా" పదానికున్న గ్లామర్. ఆ గ్లామరస్ న్యూస్ ద్వారా వచ్చే సెన్సేషన్. టి ఆర్ పి రేటింగులు. ఇది నిజం కాదా?

> కేవలం ఆ హీరోయిన్ పేరుతోనే టి ఆర్ పి రేటింగులు పెంచుకొనే ప్రయత్నంలో పోటీపడటం తప్ప - ఆ మగ క్లయింట్ ఎవరో కూడా కనుక్కొని బయటపెట్టాల్సిన బాధ్యత ప్రెస్ మీడియాకు లేదా?

> నిజంగా ఆ క్లయింట్ అంత పెద్ద మనిషే అయితే.. అతని పేరు బయటపెట్టడానికి ఏవయినా "ప్రెషర్స్" ఉన్నట్టయితే.. అతనితోపాటు ఆ హీరోయిన్‌ను కూడా హెచ్చరించి వదిలివేయాల్సింది! ఎందుకు తను ఒక్కదాన్నే అరెస్ట్ చేసి, ప్రెస్‌లో స్టేట్‌మెంట్లు ఇప్పించి.. ఏదో అమెరికా కనుక్కున్నట్టు గొప్పలు చెప్పుకోవడం?

> పైదంతా ఒక కోణం. కాగా, అంతకు ముందు తనకు "ఒప్పుకోలేదు" అన్న పగతోనో, ఈగోతోనో ఆ హీరోయిన్‌ను కావాలనే ఇలా ఇరికించారన్నది ఈ మొత్తం బ్రేకింగ్ న్యూస్ లోని ఇంకో యాంగిల్! ఇదే నిజం కావొచ్చని చాలామంది అనుకొంటున్నారు. నమ్ముతున్నారు. ఒకవేళ నిజం కానట్టయితే - ఆ మగ సెక్స్ క్లయింట్ ఇప్పటికే అరెస్టయి ఉండాలి. అతను, అతని పేరు, హోదా కూడా ఆ హీరోయిన్ పేరుతో సమానంగా బ్రేకింగ్ న్యూస్‌లో వచ్చి తీరాలి. అలా ఎందుకని జరగలేదు? జరగలేదంటే ఈ అనుమానమే నిజం కావొచ్చుగా?  ..

ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా వందలాదిమంది కళాకారులు, రచయితలు, సినీ ఇండస్ట్రీ, విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్, ఎన్ జీ వో లు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబులు ఎవరిస్తారు?

ఆ హీరోయిన్‌ను రెడ్ హాండెడ్‌గా పట్టుకొని సెక్స్ రాకెట్‌ను "ఛేదించిన" పోలీసులా? అంతా "కవర్" చేసేసి ఒక్క హీరోయిన్‌ను మాత్రమే బలిపశువును చేసిన మీడియానా?

మిలియన్ డాలర్ కొశ్చన్..  

Monday 8 September 2014

సోషల్ మీడియా ఉద్యమం!

2004 లో, సరిగ్గా పదేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ను రూపొందిస్తున్నప్పుడు, మార్క్ జకెర్‌బర్గ్ దాని సక్సెస్‌ను బహుశా ఈ రేంజ్‌లో ఊహించి ఉండడు.

ఆ తర్వాత కేవలం మూడంటే మూడేళ్లలో, 2007 లో, జకెర్‌బర్గ్‌ను ఒక బిలియనేర్‌ను చేసింది ఫేస్‌బుక్ సక్సెస్. అప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు!

ఒక మిలియన్ యుఎస్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు సుమారు 6 కోట్లు. అలాంటి మిలియన్లు 1000 సంపాదించినవాడు బిలియనేర్‌. ఇక లెక్క మీరే వేసుకోండి ..

డబ్బు విషయం అలా వదిలేద్దాం.

కట్ టూ మన ఉద్యమం - 

ఫేస్‌బుక్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు - నిజంగా అది ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లోకి, వారి జీవితాల్లోకి చొచ్చుకుపోగలిగి, ఎలాంటి అద్భుత ఫలితాలు రావడానికి కారణమవుతుందో కూడా ఆనాడు ఊహించి ఉండడు జకెర్‌బర్గ్.

దీనికి ది బెస్ట్ ఉదాహరణ తెలంగాణ ఉద్యమమే!

బహుశా, ఫేస్‌బుక్ వెలుగులోకి వచ్చిన 2004 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ, ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ ఉద్యమమూ దాన్ని ఈ స్థాయిలో ఉపయోగించుకొని ఉండదు.

ఫోటోలు, కొటేషన్లు, ఉత్తుత్తి లైక్‌లు, కామెంట్‌లకే కాదు.. న్యాయపరమైన హక్కులకోసం పోరాడే ఉద్యమ విజయాలకు కూడా ఫేస్‌బుక్ ఉపయోగపడగలదన్నదానికి తెలంగాణ ఉద్యమమే ఓ పెద్ద ఉదాహరణ.

ఈ ఒక్క టాపిక్ మీదే, అప్పుడే .. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ వంటి సబ్జెక్టుల్లో ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీ స్థాయిలో పరిశోధనలు ప్రారంభమయ్యాయంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.    

లక్షలాదిమంది తెలంగాణ ఫేస్‌బుక్ యూజర్‌లు ఉద్యమం కోసం పోస్ట్ చెయ్యని రోజు లేదు! ఎవరి టైమ్‌లైన్ చూసినా తెలంగాణకు సంబంధించిన పోస్టులు, షేరింగ్‌లే! ఎవరు రోజుకు ఎన్ని లైక్‌లు చేసినా .. అందులో కనీసం ఒక్కటయినా తెలంగాణకు, ఉద్యమానికి సంబంధించిందే!

అంతేనా?!

ఎన్ని వందల ఫేస్‌బుక్ పేజ్‌లు .. ఎన్ని వందల ఫేస్‌బుక్ గ్రూప్‌లు .. అన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రమోట్ చేసేవే!

ఇవన్నీ చేయడానికి ఏ రాజకీయ పార్టీనో, ఏ రాజకీయ నాయకుడో, ఏ తెలంగాణ ధనవంతుడో, ఏ దాతనో .. లక్షలు, కోట్లు కుమ్మరించలేదు. ఎవరూ ఇలాచేయండని "ఫేస్‌బుక్ మార్కెటింగ్" టెక్నిక్స్ వారికి చెప్పలేదు. అన్నీ తెలంగాణ ప్రజలు ఎవరికివారే స్వచ్చందంగా చేశారు. అన్ని మెలకువలూ వాటికవే వచ్చాయి.

దీనంతటి ప్రభావం తెలంగాణ ఉద్యమం పైన, ఇటీవలి ఎన్నికల పైనా చాలా ఉంది.

మార్క్ జకెర్‌బర్గే స్వయంగా ఆశ్చర్యపోయే స్థాయిలో .. అసలు ఇంత సహజంగా, ఇదంతా ఎలా సాధ్యమైంది?

దీనికి సమాధానం - ఒక్కటే పదం.

తెలంగాణ!

తెలంగాణ కోసం ఉద్యమించిన వందలాది నాయకులు, వేలాది సంఘాలు, కోట్లాది ప్రజలు ..

వీళ్లందరిలో అగ్గి రగిల్చి, దాన్ని ఆరిపోకుండా జ్వలింపజేసి, తన జీవితాన్నే ఫణంగా పెట్టి .. ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ఒక వ్యక్తి కూడా ఉన్నారు.

ఆ వ్యక్తి, ఉద్యమ శక్తి ..

కెసీఅర్!

ఓకే. తెలంగాణ వచ్చింది. కె సి ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతటితో ఫేస్‌బుక్ పని అయిపోయినట్టేనా? సోషల్ మీడియా పని అయిపోయినట్టేనా?

కానే కాదు. అసలు ఉద్యమం ముందుంది.

అది .. ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకొంటున్న, కె సి ఆర్ కలగన్న 'బంగారు తెలంగాణ' సాధన.

దీనికోసం కూడా కోట్లాది తెలంగాణ ఫేస్‌బుక్ యూజర్‌లు, ట్విట్టర్ యూజర్‌లు, బ్లాగర్‌లు, వందలాది ఎఫ్ బి పేజ్‌లు, గ్రూప్‌లు .. ఎవరి స్థాయిలో వాళ్లు రెట్టించిన ఉత్సాహంతో కృషి చేస్తున్నారు.

అంతకుముందు ఎన్నడూ లేనివిధంగా - మంత్రులు, ఎమ్మెలేలు, ఎంపిలు, కార్యకర్తలు, వారు వీరు అనిలేకుండా .. అంతా కూడా .. ఇప్పుడు సోషల్ మీడియా దుమ్ముదులిపేస్తున్నారు.

జకెర్‌బర్గ్ ఊహించని సోషల్ మీడియాని అతనికి చూపిస్తున్నారు.

ఎం పి కల్వకుంట్ల కవిత, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, ఐ టి మినిస్టర్ కె టి ఆర్ ల యాక్టివ్ ట్వీట్స్ గురించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరముంది. ప్రభుత్వం చేస్తున్న పనులగురించి, తీసుకొంటున్న నిర్ణయాల గురించి, ఇతర ఎన్నో యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు ట్వీట్స్ రూపంలో వీరు పెడుతున్న అప్‌డేట్స్, ఫోటోలు ప్రధానంగా యువతను, మొత్తంగా తెలంగాణ నెటిజెన్స్‌ను బాగా ఉత్సాహపరుస్తున్నాయి.

అలాగే -  డిప్యూటి సి ఎం, హెల్త్ మినిస్టర్ రాజయ్య, హోమ్ మినిస్టర్ నాయిని నరసిం హరెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజెందర్, వరంగల్ ఎమ్మెల్లే కొండా సురేఖ.. దాదాపు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫేస్‌బుక్ ను, ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్నారంటే సోషల్ మీడియా పవర్‌ని అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవలే ఈ వైపు కూడా ఎంటరయి .. సి ఎం ఓ, పోలీస్ శాఖ లతో ప్రారంభించి, దాదాపు అన్ని శాఖల సమాచారంతో సోషల్ మీడియాలో పిచ్చి స్పీడ్‌తో ముందుకు దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే, ఈ బ్లాగ్ రాస్తున్న సమయానికి - తెలంగాణ సి ఎం ఓ పేజ్‌కి 70,460 లైక్స్, సి ఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కె సి ఆర్) పేజ్‌కి 90,222 లైక్స్ ఉన్నాయి. ఈ అంకె త్వరలోనే లక్ష దాటుతుంది. మిలియన్‌ను కూడా చేరుకుంటుంది. కోటిని తాకినా ఆశ్చర్యం లేదు.

సోషల్ మీడియా అంటే ఏదో టైమ్‌పాస్‌కు పోస్ట్ చేసే ఉత్తుత్తి ఫోటోలు, కొటేషన్లు, లైక్‌లు, కామెంట్లు మాత్రమే కాదు. ఉపయోగిస్తే అదొక ఉద్యమం కూడా!  

Friday 5 September 2014

ఇది కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్ ట్రెండ్!

మొన్నటి "Iceక్రీమ్" సినిమాతో మరో పెద్ద ట్రెండ్‌కి తెరతీశాడు వర్మ. దాని పేరు "కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్".

పాతవాళ్లయినా, కొత్తవాళ్లయినా - ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ విషయం! దీనికి ఒప్పుకున్నవాళ్లే సినిమాలో పనిచేస్తారు.

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది. ఈ వ్యాపారానికి సంబంధించి ఇదే కరెక్టు. ముఖ్యంగా మైక్రో బడ్జెట్ / నో బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

కొత్తవాళ్లతో చేసే సినిమాలకు "టాక్" వచ్చేదాకా మంచి ఓపెనింగ్స్ ఉండవు కాబట్టి ప్రమోషన్ పరంగా ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. అయినా హిట్టో, ఫట్టో ముందే ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ప్రొడ్యూసర్‌ను కొంతయినా బ్రతికించుకోవాలంటే ఇదే మంచి పధ్ధతి.

ఇదిలా ఉంటే - ఈ సినిమా షూట్ చేయడానికి ఉపయోగించిన కెమెరాలు బ్లాక్ మ్యాజిక్, గోప్రో. కొంటే ఒక లక్షలోపే ఈ రెండూ వస్తాయి. మిగిలిందంతా మన చేతుల్లో పని..

టీమ్ వర్క్. కంటెంట్. ప్రమోషన్. ఈ తరహా సినిమాలు తీయాలంటే ఈ మూడే చాలా ముఖ్యమైనవి.

కంటెంట్ పరంగా  "Iceక్రీమ్" హిట్టా ఫట్టా అనేది పక్కనపెడితే - బిజినెస్ పరంగా అది పెద్ద హిట్టు అనే నా ఉద్దేశ్యం. ఈ సినిమా హల్‌చల్ పుణ్యమా అని వర్మ ఇంకో 3 సినిమాలు మొదలెట్టాడు మరి!

Iceక్రీమ్2, XES, కోరిక ..

వీటిల్లో ఒక సినిమా షూటింగ్ అయిపోయింది కూడా!

కట్ టూ చిమ్మని మనోహర్ - 

ఫిలిం ప్రొడక్షన్‌కు సంబంధించి దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో అతి త్వరలో నేను కొన్ని యూత్ ఎంటర్‌టైనర్‌లు, థ్రిల్లర్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ఆసక్తి ఉన్న పాత/కొత్త హీరోలు, హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పక్కనున్న ఈమెయిల్ ద్వారా నన్ను నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు.

జస్ట్ కౌంటింగ్ డౌన్ డేస్ ..
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 ..   

Friday 29 August 2014

హాఫ్ గాళ్‌ఫ్రెండ్!

ఇండియాలో పదిలక్షల కాపీలు అమ్మిన మొట్టమొదటి ఇంగ్లిష్ పుస్తకం "ఫైవ్ పాయింట్ సమ్ వన్". 2004 లో పబ్లిష్ అయిన ఈ నవలే 2009 లో "త్రీ ఇడియట్స్" బ్లాక్‌బస్టర్ సినిమాగా హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  

"ఫైవ్ పాయింట్ సమ్ వన్" నవల రాయడానికి ఆ రచయితకు సుమారు మూడు నాలుగు ఏళ్లు పట్టింది. హాంకాంగ్‌లోని తన ఆఫీసులో కూర్చుని కొంత, ఇంటికొచ్చాక ఫ్రీటైమ్‌లో కొంత.. వీలున్నప్పుడల్లా, రాయాలనిపించినప్పుడల్లా.. చాలా.. ఆరామ్‌గా.. రాసిన నవల అది.

అది అతని తొలి నవల. ఎలాంటి డెడ్‌లైన్స్ లేవు అప్పుడు.

కట్ చేస్తే - 

ఒకే ఒక్క సంవత్సరం తర్వాత, 2005 లోనే, తన తన రెండో నవల "వన్ నైట్ @ కాల్ సెంటర్" రాశాడా రచయిత.

మళ్లీ ఎందుకో ఓ మూడేళ్ల గ్యాప్. బహుశా ఉద్యోగమా, రచనా అన్న సంఘర్షణ అయ్యుంటుంది.

2008 లో "ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్", 2009 లో "2 స్టేట్స్", 2011 లో "రెవల్యూషన్ 2020", 2012 లో "వాట్ యంఘ్ ఇండియా వాంట్స్" (ఇది నాన్ ఫిక్షన్) చక చకా రాసేయాల్సిన డిమాండ్ ఆ రచయితకు క్రియేట్ అయింది.

ఇప్పుడు, వచ్చే అక్టోబర్ 1 న, ఇదే రచయిత సరికొత్త నవల "హాఫ్ గాళ్‌ఫ్రెండ్" రిలీజ్ అవబోతోంది. కనీసం ఓ
5 మిలియన్ల కాపీలయినా ఈ పుస్తకం సేల్స్ ఉంటాయని "రూపా" పబ్లిషర్స్ అంచనా.

మరోవైపు, అక్టోబర్ 1 నాటికి, దేశవ్యాప్తంగా ఈ పుస్తకాన్ని ఆయా గమ్యాలకు చేర్చడం కోసం "ఫ్లిప్‌కార్ట్" అప్పుడే వేలాది కార్టన్ బాక్సులు, ట్రక్కుల లెక్కల్లో యమ బిజీగా ఉంది.

కట్ టూ సినిమా కిక్ - 

తన తొలి నవల ఫైవ్ పాయింట్ సమ్ వన్ (త్రీ ఇడియట్స్) ఒక్కటే కాదు.. ఆ తర్వాత కూడా ఇదే రచయిత రాసిన వన్ నైట్ @ కాల్ సెంటర్ "హలో" గానూ, ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ "కాయ్ పొ చే" గానూ, "2 స్టేట్స్" అదే పేరుతోనూ హిందీలో సినిమాలుగా రూపొందటం నిజంగా గొప్ప విషయం.        

ఇలా ఉంటే - ఇటీవలి సాల్మన్ ఖాన్ "కిక్" సినిమాకి స్క్రీన్‌ప్లేని కూడా అందించిన ఈ రచయిత .. ఎప్పుడైనా లైఫ్‌లో కిక్ కావాలనిపించినప్పుడు ఫిలిం డైరెక్షన్ కూడా చేస్తానంటున్నాడు.

టైమ్ మేగజైన్ "వరల్‌డ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లుఎన్షియల్ పీపుల్ 2010" లిస్టులోకి కూడా ఎక్కిన ఈ రచయిత పంజాబ్ లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, డిల్లీ లో పెరిగాడు. ఐ ఐ టి లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాక, ఐ ఐ ఎం లో మేనేజ్‌మెంట్ కూడా చదివాడు. (అక్కడే తన క్లాస్‌మేట్, తమిళ అమ్మాయి, అనూషని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీ రచయిత. ఆ కథని కూడా ఓ నవలగా రాయొచ్చు. అది వేరే విషయం.)

ఆ తర్వాతే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా హాంగ్‌కాంగ్ లో పనిచేశాడు. ఆ సమయంలోనే అప్పుడప్పుడూ ఏదో రాస్తూ, చివరికి రాయడమే సీరియస్‌గా తీసుకుని 30 ఏళ్లకే బెస్ట్‌సెల్లర్ రచయితయ్యాడు.

క్యాండీ క్రష్, వాట్సాప్ లాంటివి తప్ప నాకు మరే రచయితా కాంపిటీషన్ అని నేను ఫీలవడంలేదు అని చాలా సింపుల్‌గా చెప్పే ఈ 40 ఏళ్ల రచయిత ఎవరో మీకు తెలుసు.

ఇక ఫ్లిప్‌కార్ట్ ద్వారా, ఓ నెలతర్వాత, నా చేతుల్లో వాలబోతున్న ఈ రచయిత "హాఫ్ గాళ్‌ఫ్రెండ్" ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.

ఇదంతా ఎలా ఉన్నా .. సక్సెస్ సైన్స్‌కు సంబంధించిన ఒకే ఒక్క అంశం ఈ సాయంత్రం నేనీ బ్లాగ్ పోస్ట్ రాయడానికి కారణమైంది.  అదేంటంటే.. సరిగ్గా 9 ఏళ్లక్రితం ఎలాగయినా ఇండియా టుడే కవర్ పేజీకి ఎక్కాలని ఈ రచయిత కలగన్నాడు. ఇప్పుడు ఎక్కేశాడు.

దటీజ్ చేతన్ భగత్.     

Tuesday 26 August 2014

అసలేందీ సింగపూర్, కె సి ఆర్?

"ప్రపంచంలోని 193 దేశాల్లో ఈ సింగపూర్ ఒక్కటే దొరికిందా వీళ్లిద్దరికీ?" అనుకుంటూ నా లిస్ట్ లోంచి సింగపూర్‌ని కొట్టేశాను. ఇంచుమించు ఇదే అర్థంలో సరదాగా ఓ ట్వీట్ కూడా పెట్టాను ఈ ఉదయమే.

కానీ, ఇప్పుడు ఈ బ్లాగ్‌లో రాస్తున్నది మాత్రం సరదాగా కాదు.

సుమారు రెండు దశాబ్దాలనుంచీ ఈ సింగపూర్ జపం వింటూనే ఉన్నాం మనం. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని వివిధకోణాల్లో సింగపూరూ, ఆయన పేరూ దాదాపు పర్యాయపదాలయిపోయాయి.

రాష్ట్రాన్ని సింగపూర్‌లా చేస్తానని పదే పదే అనడం ఒక కోణం కాగా, ఆయనకు సింగపూర్లో ఓ పెద్ద హోటల్, బోల్డన్ని ఆస్తులున్నాయని ఆరోపణలుండటం ఇంకో కోణం. నిజానిజాల విషయం పక్కనపెడితే - ఇవన్నీ వినీ వినీ సింగపూర్ అంటేనే ఒక రకమైన విరక్తి ఏర్పడింది. నా ఒక్కడికే కాదు .. చాలా మందికి!


కట్ టూ కె సి ఆర్ సింగపూర్ విజిట్ -  

ఇంతకు ముందెన్నడూ విదేశీయానం చేయని కె సి ఆర్ కు, సి ఎం గా తొలి విదేశీ పర్యటన సింగపూర్ కావటం కేవలం యాదృచ్చికం. సింగపూర్‌లోని ఐ ఐ ఎం "అలుమ్ని" నుంచి అలా ఆహ్వానం రావడం, ఇలా ఓకే అని వెళ్లడం చకచకా జరిగిపోయాయి.

పనిలో పనిగా పక్కనే ఉన్న మలేషియా కూడా ఒక రౌండ్ వేసి వచ్చారు కె సి ఆర్.

అయితే, అందరూ అనుకుంటున్నట్టుగా - ఏదో సింగపూర్ అనగానే చంకలు గుద్దుకుంటూ ఫ్లైట్ ఎక్కలేదు కె సి ఆర్.

సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ రాసిన "సింగపూర్ ఫ్రమ్ థర్డ్ వర్‌ల్డ్ టూ ఫస్ట్" పుస్తకాన్ని సుమారు 20 ఏళ్లక్రితమే చదివారు కె సి ఆర్. మామూలు నిరుపేద మూడో ప్రపంచదేశం స్థాయి నుంచి, ప్రపంచంలో ప్రథమశ్రేణి దేశంగా ఆ దేశం ఎలా ఎదిగిందో ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఆయనకు. ఈ నేపథ్యంలోనే, బహుశా, సింగపూర్ విజిట్‌కు వెంటనే ఓకే చెప్పి చెప్పుంటారు కె సి ఆర్.  

అది 1993 అనుకుంటాను. అప్పుడు నేను ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నాను ..

18 ఏళ్ల ఒక అమెరికన్ టీనేజర్ స్టూడెంట్ సింగపూర్‌లో చేసిన ఓ చిన్న నేరానికి అతన్ని జైల్లో పెట్టారు. ఆ కుర్రాడు చేసిన నేరం ఏంటంటే - దొంగతనంగా ఓ నాలుగయిదు కార్లకి రెడ్‌కలర్ పెయింట్‌ను స్ప్రే చేయడం!  

ఆ అమెరికన్ కుర్రాడి పేరు పీటర్ ఫే.

పీటర్ చేసిన నేరానికి సింగపూర్ ప్రభుత్వం ఆ దేశ చట్టాల ప్రకారం 4 నెలల జైలు, సుమారు 2 వేల డాలర్ల జరిమానా, ఓ 6 బెత్తం దెబ్బల శిక్ష విధించింది.

1993-94 ల్లో ప్రపంచమంతా ఈ సంఘటనపైనే కొన్ని రోజులపాటు హెడ్‌లైన్సూ, బ్రేకింగ్ న్యూస్‌లు! అమెరికా ఈగో తట్టుకోలేకపోయింది. "ఇది చాలా అతి" గా అభివర్ణించింది అమెరికా.

చివరికి అప్పటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సింగపూర్ గవర్నమెంటుకు ఒక లేఖ రాస్తూ, ఆ బెత్తం దెబ్బలయినా మినహాలించాలని కోరాడు. క్లింటన్ కోరికను మన్నించి, సింగపూర్ ప్రభుత్వం పీటర్ ఫే శిక్షను 6 బెత్తం దెబ్బల నుంచి 4 బెత్తం దెబ్బలకు తగ్గించింది! జైలు శిక్ష, జరిమానా మాత్రం యథాతథం!!

దటీజ్ సింగపూర్!

అమెరికా అయినా, అంగోలా అయినా సింగపూర్‌కు ఒక్కటే. వారి చట్టాలు మారవు. అవి ఎవరికీ చుట్టం కావు. అంత క్రమశిక్షణ, చిత్తశుధ్ధి ఉన్నాయి కాబట్టే .. వైశాల్యంలో ఎంతో చిన్న దేశమయినా 'పర్ క్యాపిటా'లో ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని కూడా చేరుకోగలిగింది.

తన తొలి విదేశీ పర్యటనలోనే సింగపూర్‌ని అధ్యయనం చేసే అవకాశం కె సి ఆర్ కు రావడం కాకతాళీయమే అయినా ఒక రకంగా సందర్భోచితం. తెలంగాణ తొలి సి ఎం గా, తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్న ఈ దశలో సింగపూర్‌ను ఒక మోడల్‌గా తీసుకొని, ప్రణాలికల్ని వేసుకొని పనిచేయడం, చేయించడం కె సి ఆర్ కు తప్పక ఉపయోగపడుతుంది.

కనీసం త్రాగు నీరు కూడా దొరకని సింగపూర్‌లో, మిగిలిన వనరుల లభ్యత కూడా అతి స్వల్పం. ఒక్కోదానికి ప్రపంచంలోని ఒక్కో దేశంపైన ఆధారపడిన దేశం సింగపూర్. కేవలం 276 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దేశ జనాభా 54 లక్షలు మాత్రమే. అయినా - ఒక స్పష్టమైన విజన్‌తో, డెడ్‌లైన్‌లతో కూడిన లక్ష్యాలతో ఎంతో వేగంగా అభివృధ్ధి చెందింది సింగపూర్.

మరి వైశాల్యంలోనూ, జనాభాలోనూ, వనరుల్లోనూ ఎన్నోరెట్లు అధికంగా ఉన్న మన దేశంలో ఈ అభివృధ్ధి ఎందుకు సాధ్యం కాలేదు?

కనీసం ఇప్పుడు మన తెలంగాణలో ఈ అభివృధ్ధి ఎందుకు సాధ్యం కాదు?

చేస్తే అవుతుంది. అయితీరుతుంది.

మనకంటే 18 ఏళ్లు ఆలస్యంగా, 1965 లో స్వాతంత్ర్యం సంపాదించుకున్న సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ చేసిన కృషికి ఫలితం, ప్రతిరూపం ఇప్పటి సింగపూర్.

తెలంగాణ తొలి సిఎం కె సి ఆర్ ఇప్పుడలాంటి బాధ్యతను, ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సిధ్ధమయ్యారు. సాక్షాత్తూ ఇప్పటి ప్రధాని లీ సీన్ లూంగ్ తోనే తన మంత్రులకు, ఎమ్మెల్లేలకు, ఎమ్‌పీలకు, అధికారులకు శిక్షణ ఇప్పించడానికి పూనుకున్నారు కె సి ఆర్.

సింగపూర్ ఐ ఐ ఎం అలుమ్ని కార్యక్రమంలో సిఎం కె సి ఆర్ చేసిన ఒకే ఒక్క ప్రసంగంతో, అప్పటికప్పుడు 3 అంతర్జాతీయ కంపెనీలు తమ మెగా ప్రాజెక్టులతో ముందుకు వచ్చాయి. వందలాది ఇతర కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయి. వాటిల్లో కనీసం 10 శాతం సక్సెస్ అయినా అది కె సి ఆర్ కు గొప్ప విజయమే!

ఉద్యమం అయిపోయింది .. తెలంగాణ వచ్చింది.. అని ఊరుకోకుండా, అదే ఉద్యమ స్పూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం విషయంలోనూ తెలంగాణ ప్రజలంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

ఊరికే విజన్ అంటూ దశాబ్దాలు మాటలతోనే వృధా చేయకుండా - అవసరమయితే తెలంగాణ పునర్నిర్మాణాన్ని కూడా ఒక ఉద్యమంలా మలచగల శక్తియుక్తులు దళపతి కె సి ఆర్ కున్నాయి. ఆయన అలా తప్పక చేస్తారని ఆశిద్దాం.

చేస్తారు కూడా! 

Sunday 24 August 2014

"శిలా శాసనం" మరొక్కసారి!

మొన్న దిలీప్ మరణం తర్వాత ..
ఎందుకో దీన్ని మళ్లీ ఒకసారి పోస్ట్ చేయాలనిపించింది.


***

సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా.. ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు.

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం.. ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలకి వేలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది.

ఈ విషయంలో కేవలం ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు! అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. అది వేరే విషయం.

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి.

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. లేదంటే మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి.

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా.. తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

సో, బి కేర్‌ఫుల్ ..

***

దిలీప్, వి మిస్ యూ.. 

Tuesday 19 August 2014

క్యా సర్వే హై సర్ జీ!

దశాబ్దాల నా హైదరాబాద్ జీవితంలో మొట్టమొదటిసారిగా పండుగకాని ఓ పెద్ద పండుగ వాతావరణాన్ని చూశాను. ఏ సంక్రాంతి, దసరాలకు కూడా ఇలాంటి సందడి, ఇంత చర్చ నేను చూళ్లేదు.

మా సాదిక్ భాయ్ దీన్ని "సర్వే పండుగ" అన్నాడు అందుకేనేమో!

రోడ్లు పూర్తిగా ఖాళీ. ఆఫీసులు, షాపులు, హోటళ్లు, పాన్ షాపులు, మందు షాపులు.. అన్నీ బంద్!

ప్రతి ఇంటిదగ్గరా పండుగ సందడి. ఎన్నడూ లేనివిధంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే సమయంలో ఇంత ఫ్రీగా ఉండటం, ఎవరో ఓ ముఖ్యమైన అతిథి కోసం ఎదురుచూస్తున్నట్టుగా కూర్చోవడం, ఇరుగూ పొరుగూ మనసువిప్పి మాట్లాడుకోవటం..  

ఇదే సీన్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఉందని నేను మాట్లాడిన కొన్ని ఫోన్లు, బ్రౌజ్ చేసిన సోషల్ మీడియా చెప్పకనే చెప్పాయి.

కట్ టూ నెగెటివిటీ - 

కె సి ఆర్ దగ్గినా, తుమ్మినా అందులో తప్పే కనిపిస్తుంది. మాటనే కాదు.. ఆయన తీసుకొనే ప్రతి నిర్ణయాన్నీ, వేసే ప్రతి అడుగునీ పనిగట్టుకొని విమర్శించాలి.

కొందరికి అదొక ఆనందం. కొందరికి అదొక అవసరం. కొందరికి వొట్టి అపనమ్మకం.

"ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అర్హులకే అందేలా చూసే క్రమంలో భాగంగానే ఈ సర్వే జరుపుతున్నట్టు" ప్రభుత్వ వర్గాలు ముందే ప్రకటించాయి.

అదేం కాదు, "ఈ సర్వే ద్వారా సీమాంధ్రులను ఏరివేస్తారని" కొంతమంది అపోహ విన్నాను. నిజంగా అదే చేయాలనుకొంటే కె సి ఆర్ కి ఈ సర్వే అవసరమా? సింపుల్ లాజిక్..

నిజానికి ఈ అపోహకి సంబంధించిన ప్రశ్న ఈ సర్వేలో నాకు ఒక్కటీ కనిపించలేదు. పది నిమిషాలలోపే మా ఇంట్లో సర్వే పూర్తయిపోయింది. కనీసం నా జన్మస్థలం విజయవాడా, వరంగలా అని కూడా అడగలేదు. ఇంక ఈ సర్వే ద్వారా సీమాంధ్రుల ఏరివేత ఎలానో.. నాకైతే అర్థం కాలేదు.

ఏది ఎలాఉన్నా.. కె సి ఆర్ ఒక సర్వే చేయాలనుకున్నారు. యావత్ దేశం ఆశ్చర్యపోయేట్టుగా అది అత్యంత విజయవంతంగా పూర్తయింది.

విజయశాంతి, పవన్ కల్యాణ్ వంటి సెలెబ్రిటీలు సర్వేకు అంగీకరించలేదని విన్నాను. జూనియర్ ఎన్ టి ఆర్ సంపూర్ణంగా సహకరించాడనీ విన్నాను. ఆలోచనలు, అపనమ్మకాలు, నిర్ణయాలు వ్యక్తిగతం.

సిస్టమ్ ఏ ఒక్కరికోసం కాదు. ఒక వర్గం కోసం కాదు. అది ఎవ్వరికోసం ఆగదు.

కె సి ఆర్ ఏ ప్రతిఫలాన్ని ఆశించి ఈ సర్వేని ప్లాన్ చేశారో అది తప్పక నిజమవుతుంది. నో డౌట్.

ఇది నా గుడ్డి నమ్మకం కాదు. ప్రాక్టికల్ రియాలిటీ. అది ఆయన బ్రాండ్!

ఆయన రుజువు చేసుకున్నారు. చేసుకుంటున్నారు. చేసుకుంటూనే ఉంటారు.

వాట్ నెక్‌స్ట్ సర్ జీ?   

Saturday 16 August 2014

దీపం ఉండగానే .. హీరోయిన్!

కత్రినా కైఫ్, దీపికా పడుకొనేల పారితోషికం అక్షరాలా 15 కోట్లు! నమ్మగలరా?

నమ్మితీరాలి.

కత్రినా, దీపిక నిజంగా ఒక సినిమాకి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు!

నిజానికి ఈ స్థాయి రెమ్యూనరేషన్ బాలీవుడ్‌లో కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఏ ముగ్గురో నలుగురో టాప్ హీరోలకు తప్ప మరెవ్వరికీ లేదు.

ఇప్పుడే చదివాను ..

ఈ మధ్య ఓ హిట్ థ్రిల్లర్ బ్యాగులో వేసుకున్న ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ - మాంచి ఊపులో దాని సీక్వెల్ కూడా తీయాలని డిసైడ్ అయిపోయాడు.  డబ్బుకూడా బాగానే వచ్చిందిగా అని - ఏకంగా అయితే కత్రినా, లేదంటే దీపికను బుక్ చేసేద్దామనుకున్నాడు.

తీరా వాళ్లని కాంటాక్ట్ చేస్తే తెల్సిన విషయం ఆ ప్రొడ్యూసర్‌ను షాక్‌కు గురి చేసింది.

ఆ సీక్వెల్లో హీరోయిన్‌గా చెయ్యడానికి 15 కోట్ల పారితోషికం అడిగారిద్దరూ.

కట్ చేస్తే - 

మరుక్షణం ఓ కొత్త నిర్ణయం తీసేసుకున్నాడు మన ప్రొడ్యూసర్. తను అత్యుత్సాహంతో అనుకున్న ఇద్దరు
హై ప్రొఫైల్ హీరోయిన్లు ఇచ్చిన షాక్‌తో శ్రధ్ధాకపూర్, అలియాభట్ రేంజ్ చాలనుకున్నాడు.

ప్రాబ్లం సాల్వ్‌డ్.

సో, ఇప్పుడు ఆ సీక్వెల్లో .. అయితే శ్రధ్ధాకపూర్, లేదంటే అలియాభట్ కానీ ఓకే అవొచ్చునన్నమాట! అయితే - ఇంకో హిట్టు ఖాతాలో పడితే చాలు. ఈ ఇద్దరు కూడా హై ప్రొఫైల్లోకి వెళ్లికూర్చుంటారన్నది అత్యంత సహజమైన విషయం.

డిమాండ్ ఉన్నప్పుడే అన్నీ చక్కదిద్దుకుంటారు ఎవరైనా. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు ఓ స్టెప్ ముందున్నారనుకోవచ్చా? 

Thursday 14 August 2014

సారే జహాసె అఛ్ఛా ..

రాష్ట్రం రెండు ముక్కలు కావడం, గోల్కొండపైన పంద్రాగస్టు .. తెలుగువారికి సంబంధించి ఈ రెండూ ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవానికి ఓ కొత్త ఊపునిస్తున్నాయి.

కట్ టూ ఆనాటి పంద్రాగస్టు -

నా చిన్నతనంలో పంద్రాగస్టు అంటే నిజంగా ఒక పండగే. కనీసం ఒక మూడు రోజులు వరంగల్‌లోని మా ఇంటిచుట్టూ పెద్ద సందడి. చెప్పలేనంత హడావిడి.

జెండాగద్దె సరిగ్గా మా ఇంటిముందే!

సలేందర్, ప్రతాప్, స్వామి, శంకర్, భిక్షపతి .. ఇంకో పదిమంది యువతరం ఒక గ్రూప్. వయసులో వీళ్లకంటే కొంచెం చిన్నవాడయినా.. మా అన్న దయానంద్ కూడా ఇదే గ్రూపు.

ఈ గ్రూపంతా కలిసి వారం ముందునుంచే చందాలు వసూలుచేసేవాళ్లు. రాత్రి పొద్దుపోయేవరకూ మా ఇంటిముందున్న అరుగులపైన కూర్చుని - కనీసం వారం ముందునుంచే "ఈసారి జెండావందనం కొత్తగా ఎలా చేయాలి" అన్నదానిమీద ఈ గ్రూపంతా చర్చలు జరిపేవాళ్లు. నేనూ, నా చిన్న గ్రూపు కూడా అక్కడే వాళ్ల చుట్టూ నిల్చుని అవన్నీ ఆసక్తిగా వింటూవుండేవాళ్లం.

మా వీధి మొత్తంలో అప్పుడు మా ఇల్లే చాలా పెద్దది. జెండాను ఎగురవేసే గద్దె కూడా సరిగ్గా మా ఇంటిముందే ఉండటంతో దానికి సంబంధించిన ప్రతి పనీ, ప్రతి సడీ మాకూ తెలిసేది. జెండావందనం కోసం కొనుక్కొనివచ్చిన రంగురంగుల జెండా కాగితాలు, ఇతర వస్తువులన్నీ తెచ్చి మా ఇంట్లోనే పెట్టేవాళ్లు. కొబ్బరికాయలు, పండ్లు, చాక్లెట్లతోసహా!  

వీధి ఈ చివరినుంచి ఆ చివరిదాకా - ఎన్నో వరుసలు సుతిలితాడు కట్టి, మైదాపిండితో చేసిన "లై"తో, చిన్నపిల్లలం మేము అందిస్తుంటే, ఈ పెద్దవాళ్లు జెండాలు అతికించేవాళ్లు. తర్వాత ఈ జెండాల్నే వీధంతా తోరణాలుగా కట్టేవాళ్లు.

జెండావందనం రోజు నిజంగా పెద్ద పండగే. ముందురోజు రాత్రే ఫ్రెష్‌గా తెచ్చిన మట్టితో అప్పటికప్పుడు మూడు అంచెల్లో గద్దె తయారయ్యేది. ఎర్రమట్టితో దానికి కోటింగ్ కూడా!

తెల్లవారకముందునుంచే మైకులో గ్రామఫోన్ రికార్డ్ పాటలు. దేశభక్తి పాటలు, భగవద్గీత.

గ్రూపులో ఒక్కో సంవత్సరం ఒక్కోరు జెండా ఎగురవేసేవారు. తర్వాత స్వీట్లు, కొబ్బరి, చాక్లెట్లు అక్కడున్న మా అందరికేకాదు..ఇంటింటికి వెళ్లి మరీ పంచేవాళ్లు.

కట్ టూ ప్రెజెంట్ - 

అప్పటి ఆ యువతరం గ్రూపులో కొందరు ఇప్పుడు లేరు. ఉన్నవాళ్లు ముసలివాళ్లయిపోయారు. ఆనాటి ఆ మట్టి జెండాగద్దె ప్లేస్‌లో ఇప్పుడు ఒక పర్మనెంట్ సిమెంట్ గద్దె ఉంది. ఎలా చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియదు. ఆనాటి సీరియస్‌నెస్ మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా లేదని మాత్రం చెప్పగలను.

అప్పటి దేశభక్తి వేరు. అప్పటి స్వఛ్ఛత వేరు. అప్పటి ఆసక్తులు, ఇష్టాలు, ప్రాధాన్యతలు.. అన్నీనిజంగా వేరే.

ఎన్నో ఏళ్లతర్వాత, ఈరోజు, ఇలా .. పంద్రాగస్టు గురించి నెమరేసుకుంటున్నానంటే .. నిశ్చయంగా క్రెడిట్ గోస్ టూ
కె సి ఆర్.

కాకతీయులు కట్టిన గోల్కొండ కోటపైన తొలిసారిగా జెండావందనం అంటూ ఒక అలజడికి తెరలేపారు కె సి ఆర్. అయితే అది కొందరు అనుకుంటున్నట్టు అర్థంలేకుండా కాదు. అర్థవంతంగా.

ఆ అర్థం - ఒక మార్పు. ఒక ఉనికి. ఒక నాస్తాల్జియాకి స్పూర్తి.  

Wednesday 13 August 2014

మైక్రోబడ్జెట్ టూ స్టీవెన్ స్పీల్‌బర్గ్!

ప్రపంచస్థాయి ఫిలిమ్‌మేకర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ మొదటిసారి ఒక సినిమా చూసి భయపడ్దాడు. మధ్యలోనే చూడ్డం ఆపేసి డివీడి ని ప్యాక్ చేశాడు. తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని - ఇంటికెళ్లి తన బెడ్‌రూమ్ తలుపుకు ఉన్న లాక్‌ని పర్‌ఫెక్ట్‌గా సెట్ చేయించడం!

ఆ సినిమా పేరు -
పారానార్మల్ యాక్టివిటీ (2007).

అంతవరకూ ఉన్న హారర్ చిత్రాల మూసను ఛేదించిన ఓ కొత్త తరహా హారర్ చిత్రం.

రిలీజ్ కోసం కష్టాలుపడుతున్న సమయంలో అనుకోకుండా స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఈ చిత్రాన్ని చూడ్డం జరిగింది. ఆ తర్వాత స్పీల్‌బర్గ్ చొరవతో పారానార్మల్ యాక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది.

ఒక్క అమెరికాలోనే విడుదలకాని 100 సెంటర్ల నుంచి "మా ఏరియాలో కూడా వెంటనే రిలీజ్ చేయండి" అని ప్రేక్షకులనుంచి డిమాండ్ తెప్పించుకుంది ఈ సినిమా.

మికా, కేటి లు లీడ్ పెయిర్ గా నటించిన ఈ హారర్ చిత్రానికి  రచయిత, దర్శకుడు, నిర్మాత, కెమెరామాన్ అన్నీ ఒక్కడే - ఒరెన్ పేలి. విచిత్రమేంటంటే - తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోడానికి కొన్నాళ్ళపాటు "డెమనాలజీ" చదివాడు పేలి. ఆ తర్వాత అతనికి వచ్చిన ఆలోచనే ప్రపంచాన్ని భయపెట్టిన ఈ వెరైటీ హారర్ చిత్రం!

కేవలం రెండే రెండు ప్రధానపాత్రలతో ఈ చిత్రం క్రియేట్ చేసిన థ్రిల్ లేదా ఛిల్ .. ఈ చిత్రానికి 560,000 రెట్లు లాభాల్ని  అందించింది. ఇది ఇప్పటికీ రికార్డే!

అప్పటినుంచీ - పారానార్మల్ యాక్టివిటీ చిత్రం ప్రభావంతో, ఇన్స్‌పిరేషన్‌తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో "రెండే రెండు ప్రధాన పాత్రలు"గా హారర్ సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇటీవలే విడుదలైన రామ్‌గోపాల్‌వర్మ "ఐస్‌క్రీమ్" కూడా అలాంటిదే.    

పారానార్మల్ యాక్టివిటీ సీరీస్‌లో .. తర్వాత మరో 3 సినిమాలు వచ్చాయి. పారానార్మల్ యాక్టివిటీ-5 ఇంకో రెండేళ్ల తర్వాత 2016 లో రాబోతోంది.

కట్ టూ అర్థం లేని "పెద్ద కెమెరా మైండ్ సెట్" - 

పారానార్మల్ యాక్టివిటీ చిత్రాన్ని కేవలం 5 లక్షల లోపు బడ్జెట్‌లో (2007 లో 11,000 డాలర్లు!), చేత్తోపట్టుకుని తీసే అతి తక్కువ ధర "కామ్‌కార్డర్"తో .. జస్ట్ 7 రోజుల్లో షూట్ చేసి రూపొందించారు అన్నది ఇక్కడ అందరూ గమనించాల్సిన నిజం. ముఖ్యంగా - మన తెలుగు పరిశ్రమలో "5D తో తీసిన చిత్రాల"ను చిన్నచూపు చూసే మన సోకాల్డ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, శాటిలైట్ రైట్స్ మీడియేటర్లు, అలాంటి మైండ్ సెట్టే ఉన్న మరికొంత మంది సినీ మేధావులు, అలా అనుకొనే ఇతర జీవులూ .. 

Wednesday 6 August 2014

జీవితం సప్తసాగర మథనం!

ప్రతి మనిషి జీవితంలో ఒక అత్యంత క్లిష్టమైన సమయం వస్తుంది. ఏ పనీ జరగదు. జరిగినట్టే అనిపించినా.. మనం కలలో కూడా ఊహించని విధంగా అన్నీ ఎదురుకొడుతుంటాయి. దెబ్బ మీద దెబ్బ ఏదో ఒక రూపంలో పడుతూనే ఉంటుంది.

ఊపిరి తీసుకోలేం. ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పలేం. మనకి మనం కూడా ఒప్పుకోలేం.

ఇలాంటి సమయాలు నీ అనాలోచిత పాత నిర్ణయాల పరిణామాలేకావొచ్చు. నువ్వు కొత్తగా తీసుకొన్న మంచి నిర్ణయాల చెడు ఫలితాలు కూడా కావొచ్చు.

ఇలాంటి క్లిష్ట సమయాలు కేవలం నిన్ను పరీక్షించడానికే వచ్చాయనుకోవద్దు. ఈ స్థాయి పరీక్షలను తట్టుకొనే శక్తి నీకుందని నిరూపించడానికి కూడా వస్తాయి.

"నో.. ఇంక నావల్లకాదు" అనుకుంటున్నావా?

అవసరంలేదు.

నీమీద నాకు నమ్మకముంది. నీగురించి నువ్వు ఆలోచిస్తున్నదానికంటే శక్తివంతమైనవాడివని.

నీమీద నాకు నమ్మకముంది. నీ కలల్ని నువ్వు తప్పక నిజం చేసుకుంటావని.

నీమీద నాకు నమ్మకముంది. నువ్వు చేరాల్సిన గమ్యం చేరుకుంటావని.

నీమీద నాకు నమ్మకముంది. నువ్వు కూడా నీమీద నమ్మకం పెంచుకోగలవని. 

Sunday 3 August 2014

కొటేషన్లకో నమస్కారం!

ఎందుకో ఈ మధ్య నాకు అలా అనిపించింది.

ఫేస్‌బుక్ నిండా ఈ కోటేషన్లు చూసీ చూసీ, నాకు నచ్చిన ప్రతి చెత్తా పోస్ట్ చేసీ చేసీ బహుశా ఇలా విరక్తి వచ్చిందేమో అనుకున్నాను.

కానీ కారణం అది కాదు.  ఇంకేదో ఉంది అనిపించింది.

ఆ ఇంకేదో గురించి నేనలా అనుకుంటున్న ఈ పదిరోజుల్లో సహజంగానే ఫేస్‌బుక్‌లో నా యాక్టివిటీ కూడా బాగా తగ్గిపోయింది.

మొన్నొకరోజు అనుకోకుండా ఓ రచయిత ట్వీట్ చూశాను. ఇంగ్లిష్‌లో ఉన్న ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే - మనం చదివేవి గానీ, పోస్ట్ చేసేవిగానీ కొటేషన్లు దాదాపు అన్నీ మనకు ఏదో విధంగా కనెక్ట్ అవుతాయి. కానీ, అవన్నీ మన మైండ్‌సెట్ కు కానీ.. మనదేశపు నేపథ్యానికి కానీ కుదరనివి..అని!  

చాలావరకు నిజం అది.

కట్ టూ మనదైన కొటేషన్ల గని -  

ప్రపంచంలోని ఏ ఒక్క కొటేషనూ మన భగవద్గీతను దాటిపోలేదు. అందులో లేనిది లేదు. దాన్ని మించిన సక్సెస్ సైన్స్ కూడా మరొకటి ఉండబోదు.

ఆ ఒక్క భగవద్గీత చాలదా?

భగవద్గీతను టేబుల్ మీద పెట్తుకుంటే చాలు. మనకు తోచినప్పుడు ఏ పేజీ తిప్పినా మనకు, మన జీవితానికీ ఏదోవిధంగా అన్వయించేదే కనిపిస్తుంది. అదే విచిత్రం. అదే జీవితం.

నువ్విప్పుడు ఏ దశలో ఉన్నా, నువ్వు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నా.. ఈ క్షణం నుంచి, ఇక్కడినించే ఆ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఆ గమ్యం చేరుకోవచ్చు.

అంతా నీ చేతుల్లోనే ఉంది.   

Saturday 2 August 2014

ఇప్పుడు ఏ బడ్జెట్‌లోనయినా సినిమా తీయవచ్చు!

మొన్న "దొంగల ముఠా"తో, నిన్న "ఐస్‌క్రీమ్" తో ఈ వాస్తవాన్ని రుజువు చేశాడు వర్మ. కంటెంట్ విషయం ఎలా ఉన్నా, ప్రొడక్షన్ విషయంలో ఇదివరకటి భారీతనాలూ, అనవసరపు హంగులూ అవసరం లేకుండానే ఏం చేయవచ్చో (ఏం చేయకూడదో కూడా) ఈ సినిమాల ద్వారా తెలిసిపోయింది.

అయితే, వర్మ కంటే చాలా ముందే.. హాలీవుడ్‌లో ఇలాంటి ప్రయత్నాలూ, ప్రయోగాలూ కమర్షియల్ సినిమాలోనే చాలా జరిగాయి.  వాటిలో కొన్ని లో-బడ్జెట్. కొన్ని నో-బడ్జెట్! అవన్నీ బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టి కనకవర్షం కురిపించాయి.

వాటిల్లో కనీసం ఓ రెండు మూడు సినిమాల గురించయినా నేను మళ్లీ విడిగా పోస్టులు రాస్తాను.

కట్ టూ మన టాపిక్ - 

కేవలం కొన్ని లక్షలు ఉంటే చాలు. ఇప్పటివరకే మారిన, మారుతున్న లేటెస్ట్ ఫిలిం మేకింగ్ టెక్నాలజీని ఉపయోగించి అంతా కొత్త వాళ్లతో ఒక మాదిరి సినిమా తీసి రిలీజ్ చేయవచ్చు. 30 నుంచి 50 లక్షలవరకయితే - సినిమా నిర్మాణంలోని ఏ దశలోనూ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా - ఒక మంచి యూత్ ఎంటర్‌టైనరో, థ్రిల్లరో చాలా బాగా తీయవచ్చు. కనీసం ఓ 40 థియేటర్లలో రిలీజ్ కూడా చేయొచ్చు. ఈ రేంజ్ బడ్జెట్లో అయితే నిర్మాత పెట్టిన డబ్బుకి రిస్క్ చాలా చాలా తక్కువ. అసలు ఉండదు అనే చెప్పొచ్చు.

టెక్నాలజీ, బిజినెస్ మోడల్స్ అంతగా మారిపోయాయి. ఇంకా ఎన్నో మార్పులు రానున్నాయి. అదీ ఇప్పటి సినిమా! 

Thursday 31 July 2014

ఈ నిశ్శబ్దం వెనక నిజంగా ఏదో ఉంది ..

సెక్రటేరియట్ రెండు ముక్కలైంది.

అసెంబ్లీ రెండు భాగాలైంది.

ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లోనూ ఈ విభజన నిట్టనిలువుగా ఓ గీత గీసినట్టుగా జరిగింది.

తెలంగాణా ఏర్పాటు తర్వాత - దాదాపు అన్ని విషయాల్లో, అన్ని విభాగాల్లో మైక్రో లెవెల్లో పంపకాలన్ని చకచకా జరిగిపోయాయి.

ఒక్క సినీ ఫీల్డు విషయంలో తప్ప!

ఈ ఒక్క ఫీల్డుని మాత్రం టి ఆర్ ఎస్ ప్రభుత్వం కానీ, కే సి ఆర్ గానీ ఇంతవరకూ ఎందుకని టచ్ చేయలేదు?

సో, అగెయిన్ కట్ టూ మన టాపిక్ - 

డౌట్ లేదు. నిజంగా ఎదో ఉంది..

ఎందుకంటే - ఇక్కడ జరిగినన్ని అవకతవకలు, అణచివేత, దోపిడీ, దురాక్రమణలు, మోసం.. మరెక్కడా జరగలేదని సాక్షాత్తూ ఫీల్డువాళ్ళే చెబుతారు. ఇంకా చెప్పాలంటే, 'ఆ' వర్గం వాళ్ళే ఎక్కువగా చెబుతారు!

పైపైన ఎవరో ఆ నలుగురు అయిదుగురు తప్ప, అటువైపువాళ్ళు కూడా ఎవరైనా అసలు ఏం బాపుకున్నారని?! మా ప్రాంతం వాళ్ళు అనీ, మా కులం వాళ్లనీ గుడ్డిగా వారికి వత్తాసు పలకడం తప్ప!

ఇదిలా ఉంటే - మన తెలంగాణా సినీ జీవులు మాత్రం ఎవరికీ వారే యమునాతీరేలా .. ఒక్కోరు ఒక్కో చిన్న గ్రూప్ తో వెళ్లి అటు కే సి ఆర్ నో, ఇటు ఇంకెవరినో కలిసి ఓ మెమొరాండం ఇచ్చి వస్తున్నారు. లేదంటే - తలా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఎవరికీ తోచింది వాళ్ళు చెబుతున్నారు.

మనవాళ్ళలో ఉన్న ఈ అజ్ఞానపు ఎడాలిసెంట్  అనైక్యతను క్యాష్ చేసుకోవడం వాళ్లకు అంత కష్టమా?!

వాళ్ళ సామ్రాజ్యం ఇలాగే ఇంకా కొనసాగించుకోడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి వారికి? మనవాళ్ళు ఇంకెప్పుడు తెలుసుకుంటారు?

ఇదంతా ఎలా ఉన్నా - తారీఖులు, దస్తావేజులు, లెక్కలు అన్నీ తయారవుతున్నాయి. ఏ ప్రాంతంవాళ్ళు ఎంతమంది? ప్రభుత్వం నుంచి ఎవరు ఏం తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? చివరికి చేసిందేమిటి? ఫక్తు దురాక్రమణలెన్ని? .. అసలు ఇప్పుడు లోపల్లోపల ఏం జరుగుతోంది?

ఈ అధ్యయనం అంతా చాలా సూక్ష్మస్థాయిలో జరుగుతోందని తెలిసింది. ఏదో ఓ రోజు కె సి ఆర్ నుంచి ఓ మంచి హాట్ హాట్ శుభవార్త వింటాము.

అందులో ఒకటి.. రెండు వేల ఎకరాల్లో హైదరాబాద్ లో హాలీవుడ్ స్థాయిలో భారీ "సినిమా సిటీ".

కె సి ఆర్ సినిమా సిటీ ఆలోచన వెనక నాకు మాత్రం ఓ పెద్ద స్ట్రాటజీ లీలగా కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో సినీపరిశ్రమ అభివృధ్ధి ద్వారా మరింత ఆదాయం పెంచుకోవడం. రెండోది ఎక్కడో సుదూరంగా లేవకుండా ఒక మీడియా సామ్రాజ్యాన్ని దెబ్బకొట్టడం. వన్ షాట్ .. టూ బర్డ్స్ అన్నమాట!

ఏది ఏమయినా - చివరికి ఫిలిం నగర్ సామ్రాజ్యం కూడా నిట్టనిలువునా రెండు ముక్కలు కాక తప్పదు! ఇప్పటిదాకా ఏలిన ఆ సామ్రాజ్యాధినేతలు ఆ తర్వాత ఇక్కన్నుంచి నెమ్మదిగా తోక ముడవకా తప్పదు. 

Wednesday 30 July 2014

ల్యాప్‌టాప్ లైఫ్‌స్టయిల్!

నోట్‌బుక్కులు, ట్యాబ్‌లెట్లూ, లేటెస్ట్ మొబైల్ ఫోన్లు ఎన్ని వచ్చినా - నా దృష్టిలో మాత్రం 'మోస్ట్ సెక్సీ అండ్ వెరీ కంఫర్టబుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్' ల్యాప్‌టాప్ ఒక్కటే!

ఇప్పుడు నేను ఎక్కువగా వాడుతోంది నా శామ్‌సంగ్ ఎన్ 148 ప్లస్ నోట్‌బుక్ అయినా .. నాకు ల్యాప్‌టాప్ అంటేనే పిచ్చి ప్రేమ. మమకారం. ఎందుకలా అంటే ఓ వంద కారణాలు చెప్పగలను. కానీ, దాన్నలా వదిలేద్దాం.

కట్ టూ మన ల్యాపీ లైఫ్‌స్టయిల్ -  

ప్రపంచంలోని ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికయినా రొటీన్‌కు భిన్నంగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి నెట్ తో కనెక్ట్ అయిన ఒక్క ల్యాప్‌టాప్ చాలు!

మనకు అవసరమైన మన డాక్యుమెంట్లు, ఫైల్స్, పుస్తకాలు, ఫోటోలు, వీడియోలు ఏవైనా సరే.. ఏదయినా సరే.. ప్రతి ఒక్కటీ మన ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకొంటే చాలు. ఆ తర్వాత - ప్రతిదానికీ ఇంటికో, ఆఫీసుకో వెళ్లి ర్యాక్‌లు, షెల్ఫ్‌లు, బీరువాలు వెదకనక్కర్లేదు.

అంతా మన ఎదురుగా, మనం వొళ్లో ఉన్న ల్యాప్‌టాప్‌లోనే ఉంటుంది. ఎవర్ రెడీగా!

అప్పుడు నువ్వు హైదరాబాద్‌లో ఉన్నా ఒకటే. అమెరికాలో ఉన్నా ఒకటే. అది నెక్లెస్‌రోడ్ కావొచ్చు. గండిపేట కావొచ్చు. గోల్కొండ ఫోర్ట్ కావొచ్చు. మియామీ బీచ్ కావొచ్చు. హవాయి దీవులూ కావొచ్చు. ఎక్కడినుంచయినా నీ పని చేసుకోవచ్చు. నెట్ కనెక్షన్ ఉంటే చాలు.

థాంక్స్ టూ టిమ్ ఫెర్రిస్. తన సెన్సేషనల్ పుస్తకం "ది 4 అవర్ వర్క్‌వీక్" లో టిమ్ చెప్పిన లైఫ్‌స్టయిల్ డిజైన్ ఇదే.

ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎందరో రైటర్స్, ఫిలిం డైరెక్టర్‌ల నుంచి రిచర్డ్ బ్రాన్సన్ స్థాయి బిలియనేర్ బిజినెస్ మ్యాగ్నెట్స్ దాకా.. ఎంతోమంది.. ఇప్పుడు ఈ లైఫ్‌స్టయిల్‌నే ఎంజాయ్ చేస్తున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ నిజం.

నాకయితే ఏ గోవా, పాండిచ్చేరి బీచుల్లోనో గడపడం ఇష్టం. నా సెక్సీ ల్యాపీతో పనిచేసుకుంటూ. కావల్సినంత సంపాదించుకుంటూ.  అది సినిమాలు, పుస్తకాలు, స్పిరిచువాలిటీ .. ఏదయినా కావొచ్చు.

సీక్రెట్ ఏంటంటే - ఇప్పుడు నేనేం కష్టపడుతున్నా ఆ ఫ్రీడమ్ కోసమే!

మరి మీ సంగతేంటి? 

Sunday 27 July 2014

ఒక సెన్సేషన్ .. 3 కొత్త సినిమాలు!

ఇందాకే వర్మ "ఐస్ క్రీమ్" చూసాను.

వర్మ మాటల్లో.. "చీకట్లో అరిచే ఆ కుక్క" ఎందుకు 0/5 రేటింగ్ ఇచ్చిందో గాని .. ఇండస్ట్రీలో ఒక చిన్న సంచలనానికి మాత్రం కారణమైంది. పిచ్చి ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట!  ఆ విషయాన్ని అలా వదిలేద్దాం.

కట్ టూ నా ఫీలింగ్స్ - 

> వర్మ ఓ పెద్ద ప్రయోగశీలి అయిన ఫిలిం మేకర్.
> ఒక సినిమా క్రియేషన్ విషయంలో ఆయన అనుకున్నది ఏదయినా సరే చేసేస్తాడు.
> రిజల్టు గురించి ఆయనకు పెద్ద పట్టింపు లేదు.
> ఆయన తీసే ఒక్కో సినిమాకు లక్ష్యం ఒక్కోరకంగా ఉంటుంది. ఈ సినిమా లక్ష్యాన్ని ఒక సత్య, సర్కార్ వంటి సినిమాల లక్ష్యంతో పోల్చటం సరైనది కాదు.
> ఫ్లోకేమ్ మేకింగ్ బాగుంది. అసలు దాన్ని స్టడీ చేయడం కోసమే నేనీ సినిమాకు వెళ్ళా!
> ఫ్లోకేమ్ మేకింగ్ ఫాలో అయితే ఎక్కువ షాట్స్ తీసే అవసరం ఉండదు. క్రేన్లు, ట్రాక్, ట్రాలీ.. ఇతర లారీ లోడ్ ఎక్విప్మెంట్ అసలు అవసరమే రాదు.
> సరిగ్గా ప్లాన్ చేసుకుంటే .. కథనుబట్టి.. టీం ఓపికనుబట్టి .. ఒక సినిమాను 24 గంటల్లో కూడా తీయవచ్చు.
> ఇలాంటి సినిమాలకు కంటెంట్ చాలా బాగుంటే నిర్మాతకు కనకవర్షమే! మేకింగ్ లో దాదాపు అసలు ఖర్చేమీ ఉండదు కాబట్టి!
> కంటెంట్ అందరికీ నచ్చే అవకాశం లేనప్పుడు - ట్రైలర్స్, పోస్టర్స్, ప్రమోషన్ బాగుండాలి. వీటన్నిటికి తోడు, మీడియాలో రకరకాల అల్లకల్లోలం సృష్టిస్తూ చాలా నైస్ గా మేనిపులేషన్ చేయగలగాలి. ఈ సినిమా విషయంలో - ఈ యాంగిల్లో వర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు.
> అసలు సినిమా అంటేనే ఒక మేనిపులేషన్ అన్నారెవరో! ఈ విషయంలో ఆర్ జి వి ఓ పెద్ద ఎక్స్ పర్ట్  అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఏ రివ్యూయర్, ఏ చానెల్ ఏం మొత్తుకున్నా - ఆ "క్రియేటివ్ గందరగోళాత్మక క్రైసిస్" ని కూడా తన సినిమాకు అనుకూలంగా బాగా వర్కవుట్ చేసుకోగలిగాడు వర్మ.

కట్ టూ దిమ్మతిరిగే రిజల్ట్ - 

> మంచి ఓపెనింగ్స్. మంచి కలెక్షన్స్. పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభం!
> మొత్తంగా సినిమా కమర్షియల్ గా సక్సెస్. అదేగా కావాల్సింది!
> కొత్తగా వచ్చే ఔత్సాహిక ఫిలిం మేకర్స్ కు "కో ఆపరేటివ్ ఫిలిం మేకింగ్" గురించి లెక్కలు బాగా చెప్పాడు. ఇది ఇంకో సెన్సేషన్.
> ఈ "చీకట్లో అరిచే కుక్క" తెలియక క్రియేట్ చేసిన గందరగోళం వర్మ మరో మూడు కొత్త సినిమాల ఎనౌన్సుమెంట్ కు కారణమైంది: "ఐస్ క్రీమ్ 2", "XES", "కోరిక" .. ఒకే దెబ్బకి మూడు పిట్టలన్నమాట!
> కథ, నటీనటుల ఎంపిక అసలు అయిందో లేదో గాని  - నా అంచనా  ప్రకారం పై మూడు కొత్త సినిమాల ప్రమోషనల్ ప్లానింగ్, రిలీజ్ ఏర్పాట్లు, బిజినెస్ మాత్రం దాదాపుగా ఇప్పటికి అయిపోయే ఉంటాయి! ఇంకేం కావాలి?

సో, పక్కా పాజిటివ్ కోణంలో అప్రిసియేట్ చేస్తున్నాను ..

దటీజ్ వర్మ! 

ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల యుగం ఇది!

మొన్నొక ఈగోసెంట్రిక్ జీవి తన మొబైల్‌లో ఉన్న వాట్సాప్, వైబర్, విచాట్, స్కైప్ లాంటి నానా చెత్తంతా చూపిస్తూ చాలా గొప్పగా ఫీలయిపోయాడు. నిజంగా జాలిపడ్డాను అతని మీద.

సమయం విలువ తెలిసినవాడెవ్వడూ ఇలా వెబ్‌లో దొరుకుతున్న ప్రతిదాన్నీ సిస్టమ్‌లోకి, మొబైల్‌లోకీ ఎక్కించుకోడు. తనకి వాటిలో నిజంగా ఏది అవసరమో దాన్నే తీసుకుంటాడు. ఉపయోగిస్తాడు.

కట్ టూ నాణేనికి మరోవైపు -  

ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను మొన్నటిదాకా అందరూ ఏదో టైమ్‌పాస్ అనుకొనేవారు. ఇప్పటికీ చాలా మంది అనుకొనేది అదే. కానీ ఇప్పుడీ రెండింటి వాడకంలో పరిస్థితి చాలా మారింది.  

వీటి విలువ తెలుసుకున్న వాళ్లు.. కుర్రాళ్ల నుంచి ముసలాళ్ల దాకా.. దాదాపు చాలామంది, వీటిని ఏదో ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కూడా వాడటం అలవాటు చేసుకుంటున్నారు.

ఇది నిజంగా ఓ గొప్ప పాజిటివ్ మార్పు.

ఆ ప్రయోజనం మానసిక ప్రశాంతత కావొచ్చు. ఒంటరితనం పోగొట్టుకోవడం కావొచ్చు. బిజినెస్ డెవలప్‌మెంట్ కావొచ్చు. పొలిటికల్ ప్రమోషన్ కావొచ్చు. ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కావొచ్చు. మరేదయినా బాధ్యతాయుతమైన కమ్యూనికేషన్ కోసం కావొచ్చు. అది లవ్, రొమాన్స్ అయినా సరే .. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల వాడకంలో ఒక పరిణతి చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

తాజా ట్రెండ్ ఏంటంటే - ఢిల్లీ నుంచి గల్లీ దాకా, దాదాపు ప్రతి చిన్నా పెద్దా పొలిటీషియన్లు కూడా ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు వాడటం ప్రారంభించారు!

లేటెస్టుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ సి ఎం ఓ కూడా అఫీషియల్‌గా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల వాడకం ప్రారంభించింది.

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - డైరెక్టుగా మన ఐ టి మిస్టర్‌కి ఒకే ఒక్క ట్వీట్ ఇవ్వటం ద్వారా సైనా నెహ్వాల్ ఏళ్లతరబడిగా గవర్నమెంట్ దగ్గర నానుతున్న తన ఫైల్‌కు కదలిక తెచ్చుకోగలిగింది!

సోషల్ మీడియా ఎంత అద్భుతం!

అయితే.. సైనా సెహ్వాల్ ఒక సెలబ్రిటీ ప్లేయర్. వెంటనే పని జరిగింది. పెండింగ్‌లో ఉన్న ఒక 70 ఏళ్ల వృధ్ధురాలి పెన్షన్ ఫైల్ గురించి ట్వీట్ చేసినా ఇదే వేగం ఉండితీరాలి. అలాంటి సిస్టమ్ రూపకల్పన కూడా జరగాలి.

ఆ దిశలో కూడా పని ప్రారంభమైందని తెలిసింది.

జయహో ఫేస్‌బుక్, ట్విట్టర్!   

Tuesday 22 July 2014

ఫేస్‌బుక్‌తో ఏదయినా సాధ్యమే!

అమ్మాయిలు ఈజీ గా అబ్బాయిల్ని పడేయొచ్చు. అబ్బాయిలు అమ్మాయిల్ని పడేయొచ్చు.

అయితే ఒక వార్నింగ్:
అమ్మాయిలు అనుకొని, ఎవరో తుంటరి అబ్బాయిలు క్రియేట్ చేసిన "లేని అమ్మాయిల ప్రొఫైల్స్" నే ప్రేమిస్తూ కొందరు అబ్బాయిలు జీవితాలనే వృధా చేసుకోవచ్చు. ముగించేసుకోవచ్చు.

అంతేనా? ఇంకా చాలా ఉంది..

హాయిగా ఉన్న కుటుంబ జీవితాన్ని, కుటుంబ సభ్యులమధ్య ఉన్న సంబంధాల్నీ అతలాకుతలం చేసుకోవచ్చు. ఒక్క ఇంట్లోనే అసలు ఒకరికొకరు మాట్లాడుకోకుండా అంతా అతి సులభంగా మరమనుషులయిపోవచ్చు.

అంతేనా? ఇంకా చాలా చాలా ఉంది..

జీవిత భాగస్వామిపట్ల, జీవనశైలిపట్ల అసంతృప్తి ఉన్న స్త్రీలు రెచ్చిపోయి తమ విశ్వరూపం చూపించొచ్చు. పర్వర్షన్‌లో తాము ఏ స్థాయికి చేరుకున్నారో నిరూపించుకోడానికి ఫేస్‌బుక్‌ని ఓ గొప్ప ప్లాట్‌ఫామ్‌గా కూడా చేసుకోవచ్చు.

సేమ్ టూ సేమ్ .. ఇది మగాళ్లకూ 100% వర్తిస్తుంది.

ఎన్నో ఉదాహరణల్ని, వ్యక్తిగతంగా తెలిసిన ఎందరో వ్యక్తుల్నీ FB పైన చాలా దగ్గరగా అధ్యయనం చేశాకే పై పది వాక్యాల్ని నేను రాయగలిగాను. రాశాను.

కట్ టు ది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఫేస్‌బుక్ - 

> దశాబ్దాల క్రితం సంబంధాలు తెగిపోయిన మిత్రుల్ని, బంధువుల్నీ ఫేస్‌బుక్ ద్వారా నిమిషాల్లో కలుసుకోవచ్చు.

> నిత్యజీవితంలోని ఎన్నో టెన్షన్లను తట్టుకోడానికి, గాడితప్పిన జీవితాన్ని ఒక పాజిటివ్ కోణంలో బాగుపర్చుకోడానికి.. ఒక ప్రయోగశాలగా, ఒక మెడిటషన్ సెంటర్‌గా కూడా ఫేస్‌బుక్‌ని ఉపయోగించుకోవచ్చు.

> FBలో ఫ్లోట్ అవుతున్న ఎందరో వ్యక్తులు, ఎంతో సమాచారం, ఎన్నో ఇన్‌స్పయిరింగ్ కొటేషన్లలో - కేవలం ఒకే ఒక్క వ్యక్తితో పరిచయం, లేదా ఓ చిన్న సమాచారం, ఓ చిన్న కొటేషన్ మీ జీవితాన్నే పూర్తిగా మార్చివేయవచ్చు. మీ జీవిత గమ్యాలవైపు మిమ్మల్ని అవలీలగా నడిపించవచ్చు.  

> FB ని బాగా ఉపయోగించుకొని ఉద్యమనాయకులు కావొచ్చు. దేశ ప్రధానులూ కావొచ్చు.

> ఒకే ఒక్క FB పేజి తో ఆన్ లైన్ లో మిలియన్ల వ్యాపారం చేయొచ్చు ..

ఇంత గొప్ప అవకాశాల్న్ని, సౌకర్యాల్ని, ఇంత సింపుల్‌గా FB రూపంలో ఓ గొప్ప అద్భుతంగా మనకోసం రూపొందించిన మార్క్ జకెర్‌బర్గ్‌కి మనం థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలం?  

ఇంతకీ ఫేస్‌బుక్‌లో మనం ఎటు వెళ్తున్నట్టు? పాజిటివ్ దిశలోనా.. నెగెటివ్ దిశలోనా?

ఆలోచించాల్సిన అసలు పాయింట్ అదీ!  

Monday 21 July 2014

ఇప్పుడంతా 20-20 నే !

సినిమాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

అయిదు రోజుల ఆటయినా .. ఇంతకు ముందు టెస్ట్ క్రికెట్ అంటే అదో క్రేజ్. తర్వాత కొంతకాలం వన్ డే లు రాజ్యమేలాయి. అటో ఇటో ఒక్క రోజులోనే ఫైసలా అన్నమాట.

ఇప్పుడు ఉన్నట్టుండి 20-20 ఎంటరయ్యింది. అసలు ఆటే మారిపోయింది!

ఒక్క క్రికెట్ లోనే కాదు. ఈ వేగం దాదాపు ప్రతి ఫీల్డు లోనూ వచ్చింది. మనిషి జీవితం లోనూ వచ్చింది. అలా వచ్చేలా చేసింది ఇప్పటి మన ఆధునిక జీవనశైలి.

అసలు ఇప్పుడు ఎవరయినా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? మొబైల్స్ కూడా దాదాపు అందరూ టచ్ స్క్రీన్ లనే ఇష్టపడుతున్నారు. ఎందుకు?

టైం లేదు. వేగం. ఇంకేదో కొత్తది కావాలన్న తపన.

కట్ టూ 20-20 సినిమా - 

ఒకప్పుడు సినిమా తీయడం అంటే అదొక మహా యజ్ఞం. షూటింగ్ చూడటం ఓ గొప్ప విషయం. సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు కనిపించినా అదో సంచలనం.

ఇప్పుడవన్నీ మటాష్!

రాజమౌళి లాంటి కొందరు జక్కన్నలను వదిలేయండి. ఆర్ట్ సినిమాల రూపశిల్పులనూ వదిలేయండి. వీరి సంఖ్య కూడా చాలా చాలా తగ్గిపోయింది. అది మరో టాపిక్. ఇప్పటికి అలా వదిలేద్దాం.

మళ్ళీ మన 20-20 పాయింట్ కు వద్దాం.

ఫిలిం మేకింగ్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ప్రతినెలా, ప్రతి వారం ఏదో ఓ కొత్త సంచలనం ప్రపంచంలో ఏదో ఓ మూల చూస్తున్నాం. స్క్రిప్ట్, డబ్బు రెడీ గా ఉంటే చాలు. కేవలం నెల రోజుల్లో సినిమాని పూర్తిచేసి, రిలీజ్ చేయగల సౌకర్యాలు వచ్చాయి. అలా చేస్తున్నాం కూడా.

సినిమాని అనౌన్స్ చేసిన రోజే దాని రిలీజ్ తేదీ కూడా చెప్పేస్తున్నారు. ఉత్తి టైటిల్, పోస్టర్ తోనే ప్రమోషన్, మార్కెటింగ్, బిజినెస్ .. అన్నీ చేసేస్తున్నారు.

కొన్ని లక్షలు ఉంటే చాలు. ఇప్పుడు ఎవరయినా సినిమా తీయొచ్చు.

ఇదొక క్రియేటివ్ బిజినెస్. ఇంతకూ ముందులాగా ఇదేం "హెవీ గాంబ్లింగ్" కాదు. ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు ఎక్కడికీ పోవు.

"100 డేస్" రోజులు పోయాయి. మొదటివారం నిలబడి రెండోవారంలోకి ఒక సినిమా ఎంటర్ అయిందంటే చాలు. నిర్మాత ఇంకో పెద్ద సినిమాకి హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు హిట్టా, ఫట్టా అన్నది కూడా కాదు ముఖ్యం. ఆట ముఖ్యం. ఆటలో ఉండటం ముఖ్యం. ఆటలో మజా ముఖ్యం. డబ్బు రకరకాల రూపాల్లో అదే మనల్ని ఫాలో అవుతుంది. ఎవరికీ నష్టం ఉండదు. ఇదే ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫిలింమేకింగ్!

మా ప్రొడక్షన్ కంపెనీ మనుటైం ఫిలిం అకాడమీ కూడా ఒక సిరీస్ అఫ్ మైక్రో బడ్జెట్ ఫిలిమ్స్ తో ఈ ట్వంటీ ట్వంటీ కి సిద్ధమవుతోంది. అతి త్వరలో .. 

Friday 18 July 2014

RGV క్షమాపణలు!

మొన్నటి "ఐస్ క్రీం" సక్సెస్‌మీట్‌లో, అంతకుముందు ఒక టీవీ చానెల్ ప్రోగ్రామ్‌లో, తన ఫేస్‌బుక్ పేజ్‌లో .. వర్మ తనకంటూ తను క్రియేట్ చేసుకున్న ఒక బ్రాండెడ్ వ్యక్తిత్వానికి ఏ మాత్రం సరిపడని ఒక పని చేశారు.

అది .. జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పడం!

అదే సక్సెస్ మీట్‌లో గురువుగారు దాసరి RGV గురించి ఓ మాటన్నారు. "వర్మని గత నాలుగయిదేళ్లుగా గమనిస్తున్నాను. ఫిలిం మేకర్‌గా అతనేం మారలేదు. కానీ, వ్యక్తిగా సెంటిమెంటల్‌గా మాత్రం కొంచెం మార్పు చెందినట్టు నాకనిపిస్తోంది!" అని.

ఇది 100% నిజం. లేకపోతే, "రౌడీ" సినిమా ఫంక్షన్లో ఆ సన్మానాలు,శాలువాలు .. అదంతా ఏంటి? అసలు ఒరిజినల్ వర్మ ఏంటి?  

ఇదంతా తప్పు అని నేననడంలేదు. నెగెటివ్ కోణంలో చెప్పడం లేదు.

సమాజాన్నీ, సంస్కృతినీ, జీవనవిధానాల్నీ, జీవితాదర్శాల్నీ తన రచనలతో చీల్చి చెండాడిన నాటి రచయిత చలం లాంటివాడే చివరికి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయాడు! ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు కారణాలుండవు. వెదక్కూడదు కూడా.  

కట్ టూ క్షమాపణలు ఎపిసోడ్  - 

నా వ్యక్తిగత ఉద్దేశ్యంలో RGV క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు దానికంటే ముందు ఆ రివ్యూయర్ పైన అంతపెద్ద లకోటా రాయాల్సిన అవసరం అస్సలు లేదు. శుధ్ధ టైమ్ దండగ.

అయితే - తన పూర్తిపేరు సైతం బయటపెట్తకుండా రివ్యూ పేరుతో ఏదో చెత్త రాసిన ఆ వ్యక్తిని, ఆ రకం వ్యక్తులను "చీకట్లో కుక్క"ల్లాంటివారిగా వర్మ భావించడం తప్పని నేననుకోను. మామూలుగా అయితే వర్మ దానికంత రియాక్టవకూడదు. కానీ, అయ్యాడు చాలా విచిత్రంగా. అంతటితో ఆగిపోయినా అయిపోయుండేది. కానీ మళ్లీ దానికి ఒక రిజాయిండర్ ఇచ్చాడు.

తన "కుక్క" పదం వాడకం, లేదా మొత్తంగా ఆ కుక్క మీద తను రాసిన లకోటా మిగిలిన అందరు జర్నలిస్టులను కూడా బాధించిందని తనకు అర్థమయిందని.. అందుకు జర్నలిస్టు మిత్రులందరికీ క్షమాపణలు చెప్పాడు RGV.

అలా అందరు జర్నలిస్టులకు ఆయన క్షమాపణలు చెప్పాల్సినంత నేరం ఏమీ చేయలేదని నా ఉద్దేశ్యం.

నిజంగా RGV క్షమాపణలు అంటూ చెప్పాలనుకుంటే - KCR కి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ మధ్య ఒకసారి KCR మీద రకరకాల అర్థం పర్థం లేని ట్వీట్లు పెట్టినందుకు!

అలాంటి క్షమాపణలకు అర్థం ఉంటుంది. ఆ క్షమాపణలు ఆయన స్థాయిని మరింతగా పెంచుతాయి.

అంతేగాని.. ఇవేం క్షమాపణలు?!  చీకట్లో అరిచే కుక్కల్ని కుక్కలు అన్నందుకు ఇంకెవరికో క్షమాపణలు చెప్పడం అంత అవసరమా?!