Saturday 27 April 2013

ముంబై వర్సెస్ హైద్రాబాద్!


ఒక డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల క్రెడిబిలిటీని ఎవ్వరూ సందేహించనక్కర్లేదు. "హ్యాప్పీడేస్" కోసం, ఆయన సుమారు సంవత్సరం పాటు కొత్త తెలుగు నటీనటులకోసం ఎంతో అన్వేషించాడు. దీనికోసం టీవీ చానెల్స్తో కూడా టైఅప్ అయి మరీ.. ఎంతో సమయం వెచ్చించాడు. అబ్బాయిలయితే దొరికారు గానీ, మెయిన్ హీరోయిన్‌గా మాత్రం మళ్లీ ముంభై తమన్నానే తీసుకోవాల్సివచ్చింది. అదీ సిచువేషన్! ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా ఇవ్వగలను..

కట్ చేస్తే -

మొన్న నేనొక బ్లాగ్‌లో తెలుగు హీరోయిన్ల విషయంలో కొరత గురించి రాశాను. నేను రాసిన ఆ నాలుగు వాక్యాలు ఇవీ:

"కొత్త వారితో సినిమాలకు ఇదివరకటిలా ముంబై హీరోయిన్లకోసం వెళ్లటం లేదు ఎవ్వరూ. అందరూ తెలుగు అమ్మాయిలే కావాలంటున్నారు! ఒకరకంగా ఇది మంచి పరిణామం. కానీ, మనవాళ్లు ముంబై అమ్మాయిల రేంజ్‌ను మించి రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రాబ్లెం అంతా అక్కడే వస్తోంది. విసుగొచ్చిందా, మళ్లీ అందరూ "చలో ముంబై" అంటారు. తప్పదు. అలా జరగదనే ఆశిద్దాం."  

ఈ నాలుగు వాక్యాల మీద కొన్ని కామెంట్స్ బ్లాగ్‌లోనూ, ఎన్నో కామెంట్లు బయట డైరెక్టుగానూ వచ్చాయి. చాలా సహజమయిన, న్యాయమైన ఆ సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నామీద ఉంది. కామెంట్స్‌లో ఎక్కువగా రాయటం కన్నా, ఇలా ఇంకొక బ్లాగ్ పోస్టు రూపంలో వివరంగా రాస్తేనే బాగుంటుందని నాకనిపించింది.

కట్ టూ టాపిక్ -

నిజానికి ముంబై హీరోయిన్స్ అందరూ ముంబై వాళ్లు కానే కారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి మోడలింగ్‌ చేసుకుంటున్నవాళ్లు వాళ్లంతా. వాళ్లల్లో కొందరు సినిమాలకూ ట్రై చేస్తుంటారు హీరోయిన్ అయిపోవాలని. సో, మనం ముంబై నుంచి దిగుమతి చేసుకున్న, చేసుకుంటున్న ముంబై హీరోయిన్లలో దాదాపు అన్ని రాష్ట్రాలవాళ్లూ ఉన్నారు. మన సొంత తెలుగువాళ్లతో సహా!

ఫ్యాషన్‌కూ, మోడలింగ్‌కూ, యాడ్ మేకింగ్‌కూ ముంబై ప్రధాన కేంద్రం కాబట్టి, అవకాశాలు అక్కడే ఎక్కువ కాబట్టి వీళ్లంతా ముందు అక్కడ ల్యాండ్ అయిపోతారు. ఆ తర్వాతే నెమ్మదిగా సినిమా ప్రయత్నాలూ చేస్తుంటారు.

ఇక్కడ ముంబైని ఒక ప్రాంతంగా నేను చూడటం లేదు. ఒక అడ్వాన్స్‌డ్ మీడియా కేంద్రంగా చూస్తున్నాను. అక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. ముఖ్యంగా మోడలింగ్, ఫిలిం యాక్టింగ్‌లకు సంబంధించినతవరకూ. ఇక, హీరోయిన్ల విషయానికొస్తే, వాళ్ల శరీర సౌష్టవం పట్ల వాళ్లకు ఒక పర్‌ఫెక్ట్ అయిడియా ఉంటుంది. సీరియస్‌నెస్ ఉంటుంది. అది మన లోకల్ అమ్మాయిల్లో తక్కువ. చాలా మంది విషయంలో అసలు ఆ బాడీ సెన్స్ ఉండదు.

ఆడిషన్స్‌కు వచ్చే ముంబై అమ్మాయిల్లో నూటికి నూరు శాతం మంది అన్ని విధాలుగా ప్రొఫెషనల్స్ అంటే అతిశయోక్తికాదు. నటన, డాన్సు, సినీ ఫీల్డు పట్ల ఒక ప్యాషన్, అవగాహన అన్నీ ఉంటాయి. హీరోయిన్‌గా తాను సెలక్టు కావాలనీ, అయితే చాలనీ.. ముందు ఆ విషయం మీదే వాళ్ల ఫోకస్ ఉంటుంది. అంత అద్భుతంగా ఆడిషన్స్‌లో తమ ఉనికిని చాటుతారు. మన వాళ్లు మాట్లాడే మొట్టమొదటి విషయం "రెమ్యూనరేషన్ ఎంతిస్తారు?" అని. ఇంకా వాళ్ల ఆడిషన్ కూడా కాకుండానే!

ఇక్కడ నా పాయింటు అమ్మాయిలు ఎక్కడి వాళ్లు అన్నది కానే కాదు. వాళ్లు ఎంత ప్రొఫెషనల్స్ అన్నదే నాకు అవసరం. ముంబై అన్న మాట రావటానికి కారణం .. అక్కడ కేంద్రీకృతమై ఉన్న అమ్మాయిలంతా పక్కా ప్రొఫెషనల్స్ కావటమే.

నిజానికి, అలాంటి ప్రొఫెషనలిజం ఉన్నవాళ్లే సినిమాకు పనికి వస్తారు.. సినీ ఫీల్డులో నిలదొక్కుగోగలుగుతారు.

ఇటీవల విడుదలయి అద్భుత విజయం సాధించిన ఒక నాలుగయిదు "యూత్" చిత్రాల్లోని హీరోయిన్లు తెలుగు వాళ్లే కావటం వల్ల ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ రేంజ్ చిత్రాల్లో అందరూ తెలుగు అమ్మాయిలే కావాలని కోరుకుంటున్నారు. నిజంగా ఇదొక మంచి పరిణామం. దీన్ని మన తెలుగు అమ్మాయిలు బాగా క్యాష్ చేసుకోవచ్చు. అది కేవలం రెమ్యూనరేషన్ మీద మాత్రమే దృష్టి కాకుండా ఉంటే బావుంటుంది. నటనతో, ప్రొఫెషనలిజంతో ముందు హీరోయిన్ కావటం కోసం ప్రయత్నించాలి.

ఆ తర్వాత జస్ట్ ఒక్క సక్సెస్ చాలు.. రెమ్యూనరేషన్ కోరుకున్నంత అదే వస్తుంది. ఇంకా చెప్పాలంటే, సినిమా ఫట్ అయినా, "ఆ కొత్త హీరోయిన్ బాగుంది.. బాగా చేసింది" అనిపించుకుంటే చాలు. మరో  నాలుగు సినిమాల్లో ఈజీగా బుక్కయిపోతారు. బోలెడంత డబ్బూ వస్తుంది.

ముంబై వాళ్లకే ఎక్కువ డబ్బు ఇస్తారు, ఇక్కడి అమ్మాయిలకు అంత రేంజ్‌లో ఇవ్వరు అనేది కూడా కేవలం ఒక అపోహే. సక్సెస్, టాలెంట్ ఎక్కడుంటే అక్కడ డబ్బు అదే వెంటపడుతుంది. వాళ్లు ముంబై నుంచి వచ్చారా, హైద్రాబాద్ వాళ్లా అనేది ఎవ్వరూ చూడరు.

మన జయప్రద, శ్రీదేవిలు ముంబై వెళ్లి జెండా ఎగురవేశారు. అక్కడి హీరోయిన్లకు కనీసం ఒక దశాబ్దం పాటు నిద్రలేకుండా చేశారు. కళాకారులకు ప్రాంత భేదాలు ఉండవు. ఉండకూడదు కూడా. ప్రొఫెషనలిజం ముఖ్యం. ప్రాంతం కాదు.

చివరగా.. కట్ టూ ప్రొఫెషనలిజం -

సినిమాలో ఒక లిప్ లాక్ లేదా ముద్దు సీన్ ఉందనుకోండి. మనవాళ్లు అస్సలు ఒప్పుకోరు. అలాగే, ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా చిన్న చిన్న టాప్స్, టైట్స్, లెగ్గీస్, షార్ట్స్, మిడ్డీస్, మినీస్.. వేయడానికి మనవాళ్లల్లో 90 శాతం మంది ఒప్పుకోరు. ఇక స్విమ్ సూట్, తడిబట్టలు అన్నమా.. అంతే.

నేనిక్కడ థర్డ్ గ్రేడ్ సినిమాల గురించి మాట్లడ్డం లేదు. ఇవన్నీ ఉన్నాయని.. రాజ్ కపూర్, విశ్వనాథ్, మణిరత్నం, గౌతం మీనన్ లాంటి వాళ్లు తీసిన చిత్రాల్ని చెత్త సినిమాలనలేం.

ఇదంతా ఒక ఎత్తయితే, మన హీరోయిన్ల పేరెంట్స్ కొందరు చాలా డిమాండింగ్ గా అడిగేదొకటుంది. " మీ సినిమాలో మా అమ్మాయి వేసే డ్రెస్సులన్నీ మాకు ముందే చూపించండి. అవి చూశాకే మేం ఓకే చెప్తాం" అని!

సినీ ఫీల్డు పట్ల, నటన పట్ల అవగాహనా రాహిత్యం, ప్రొఫెషనలిజం లేకపోవటం ఇలాంటి ఇబ్బందులకు కారణాలు. అనవసరంగా ఎందుకొచ్చిన కష్టాలు.. 'అంత అవసరమా' అని ఏ డైరెక్టరయినా అనుకోవటంలో తప్పులేదు.  తప్పు కాదు. 

Wednesday 24 April 2013

కనుమరుగవుతున్న కళ

టైటిలయితే రాశాను. కానీ, నేను దేనిగురించయితే రాయాలని అనుకున్నానో.. దాన్ని, నేను అనుకున్న విధంగా రాయగలనో లేదో చూడాలి.

అరవై నాలుగు కళలు అనీ, లలిత కళలు అనీ కళల గురించి మనం ఎంతో కొంత, ఎక్కడో అక్కడ చదివాం.. విన్నాం.. తెలుసుకున్నాం. ఇప్పుడు నేను ఈ బ్లాగ్ పోస్టులో చర్చించబోతున్న కళ.. పైన చెప్పిన ఏ కళల లిస్టులోనూ ఉండే అవకాశం లేదు. కానీ, ఇది లేకుండా ఏ కళారూపం ఊపిరిపోసుకోదు. ఇది లేకుండా నిజానికి ఏ కళ లేదు. దురదృష్టవశాత్తూ, ఒక స్థిరమయిన గమ్యం తెలియని మన ఆధునిక జీవనశైలిలో, ఈ కళ నిజంగానే కనుమరుగైపోతోంది.

నేను మాట్లాడుతోంది, చెప్పాలనుకుంటున్నది.. 'ఏకాంతం' గురించి.

వ్యక్తిగతంగా, నా దృష్టిలో ఏకాంతాన్ని మించిన సహచరి లేదు!

అలాగని నన్ను తప్పుగా అనుకోకండి. నాకత్యంత ప్రియమైన నా ఫ్రెండ్స్ తో గడపడం నాకెంతో ఇష్టం. నా పిల్లలతో కలిసి ఆటలాడ్డం, వాళ్ల వయస్సుకి దిగిపోయి పోట్లాడ్డం నాకిష్టం. అరుదుగానయినా, నా భార్యతో కలిసి వేడి వేడి కాఫీ తాగడం నాకిష్టం. ఫ్రెంచి ఆర్టిస్టులతో కలిసి పాండిచ్చేరి బీచుల్లో గంటలకొద్దీ నడుస్తూ స్పిరిచ్యువాలిటీ గురించి మాట్లాడ్డం నాకిష్టం. ఇలాంటి ఇష్టాలు కనీసం వంద ఉన్నాయి నాకు.

కానీ.. వీటన్నింటిని మించి నాకత్యంత ఇష్టమైంది నా ఏకాంతం. అందుకే అన్నాను.. ఏకాంతాన్ని మించిన సహచరి లేదు నాకు అని.  

ఏకాంతాన్ని సృష్టించుకోడానికి ఎవరూ అన్నీ వొదులుకొని మునిపుంగవులు కానక్కర లేదు. ఇరవై నాలుగ్గంటల్లో ఇరవై గంటలూ ఈ ఏకాంతం కోసమే కెటాయించనక్కర్లేదు.

కేవలం ఒక్క అరగంట! వీలయితే ఇంకో పది నిమిషాలు..

మనతో మనం, మన అంతరంగంతో మనం, మన ఆలోచనలతో మనం, మన ఆత్మతో మనం, మన మనసుతో మనం.. ప్రశాంతంగా రోజుకి కనీసం ఒక్క అరగంట కెటయించుకోగలిగితే చాలు. ఆ ఆనందం వేరు. ఆ ఎనర్జీ వేరు.

ఏకాంతంలో ఉన్నప్పుడే మనల్ని మనం పలకరించుకోగలుగుతాం.సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అందాన్ని ఆనందించగలుగుతాం. ప్రపంచంలో ఏఅత్యుత్తమ కళ అయినా పుట్టేది ఇలాంటి ఏకాంతంలోంచేనంటే అతిశయోక్తి కాదు. ఏకాంతంలోనే ఏ సృజనాత్మకత అయినా వెల్లివిరిసేది. 

సముద్రాన్ని చూస్తూ కూర్చున్నప్పుడు, బాల్కనీలో నిల్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు, ఏకాగ్రతతో ఏదయినా రాస్తున్నప్పుడు.. మనం అనుభవించేది ఏకాంతమే. ఏ కళాకారుడయినా తనలోని క్రియేటివిటీని ఆవిష్కరించేది ముందు ఏకాంతంలోనే. అదొక రూపం సంతరించుకొని భౌతిక ప్రపంచానికి పరిచయమయ్యేది ఆ తర్వాతే!

ఏకాంతం లేకుండా ఏ సృజనాత్మకత  లేదు. ఏ కళ లేదు. దాన్ని మనం విస్మరిస్తున్నాం. నిజానికి, ఈ ఆధునిక జీవితంలో ఏకాంతాన్ని విస్మరించి మనం సాధిస్తున్నది కూడా ఏదీ లేదు. కోల్పోతున్నదే ఎక్కువ.

ఒక్కసారి ఆలోచించండి. మీకే తెలుస్తుంది. కానీ, అలా ఆలోచించాలన్నా మీకు ఏకాంతం కావాలి!

కట్ టూ సమ్ యాక్షన్ -

ఓ పని చేయొచ్చు. మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటినీ 'ఆఫ్' చేసేసి, మీ ఇంట్లోనే మీకిష్టమయిన గదిలోనో, మీకిష్టమయిన ఏదో ఒక మూలనో కేవలం ఒక్క అరగంట ఒంటరిగా కూర్చుని చూడండి. లేదంటే ఏ తెల్లవారుజామునో, సాయంత్రమో.. మొబైల్ జేబులో పెట్టుకోకుండా, ట్రాఫిక్ లేని చోట ఒక అరగంట మీరొక్కరే వాకింగ్ కు వెళ్లండి.

ఏకాంతం ఎంత అందంగా, ఆనందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మీరేం కోల్పోతున్నారో తెలుస్తుంది. అందుకోసం, ఇకనుంచయినా మీరేం చేయాలో మీకు తెలుస్తుంది.

అన్నట్టు.. ఈ బ్లాగ్ పోస్టు పుట్టింది కూడా 'ఏకాంతం' లోంచే!

Sunday 21 April 2013

"వెల్‌కమ్" దేనికి?


అప్పుడప్పుడూ కొన్ని టాపిక్స్ రిపీట్ అవుతుంటాయి అనుకోకుండా. బహుశా ఇదీ అలాంటిదే కావొచ్చు.

ఆ మధ్య నేనొక సినిమా ప్రారంభించాను. ప్రొడ్యూసర్ వేరే అయినా, ఇక్కడ నేనే ప్రారంభించాను అన్నదానికి చాలా అర్ధం ఉంది. అంటే, నన్ను చూసి, ఇంకా చెప్పాలంటే నా కోసం, ఓ ఇద్దరు కో-ప్రొడ్యూసర్లు సుమారు సగం బడ్జెట్ ఇన్వెస్ట్ చేశారు. ఆ సగంతోనే మా పిక్చర్ పూర్తయింది. అది వేరే విషయం!

పైగా, ఆ పిక్చర్ ఫస్ట్ కాపీ రాకముందే, భారీగా దానికి శాటిలైట్ రైట్స్ కూడా వచ్చాయి. ప్రొడ్యూసర్ కు ఖచ్చితంగా ఆ సినిమా రిలీజ్ కు ముందే లాభం. కానీ, ఎన్నో తలతిక్క కారణాల వల్ల అంతా మెస్ చేసుకున్నాడు. నేను మొదట్లోనే చెప్పిన అతి చిన్న విషయం వినకుండా, చాలా సమయం వేస్ట్ చేసి, చివరికి ఇప్పుడు అదే పని చేస్తున్నాడు నా ప్రొడ్యూసర్ మిత్రుడు. ఈ ఈగో ప్రాబ్లమ్ వల్ల, నాతోపాటు కనీసం ఇంకో పదిమంది చాలా నష్టపోయారు. డబ్బూ, టైమ్ రెండూ.

ఇప్పుడా పిక్చర్, ఒక రకంగా, ఒక నామమాత్రపు రిలీజుకి సిధ్ధమౌతోంది. ఆ వార్త ఈ రోజు ఒక దినపత్రికలో చూశాను.

తప్పనిసరి అయిన ఒక వ్యక్తిగత కారణం చేత (ఇది ఆల్రెడీ చాలా బ్లాగుల్లో రాశాను. అందుకే మళ్లీ రాయట్లేదు.) నేను ఆ పిక్చర్‌కి డైరెక్టర్ గా పని చేయలేదు. కథ కూడా నాది కాదు నిజం చెప్పాలంటే. శాటిలైట్ రైట్స్ అమ్మకం జరిపింది మాత్రం నా పేరుతోనే! ఇప్పుడు సినిమా పబ్లిసిటీ అవుతోందీ, రేపు తెరమీద కనిపించేదీ నా పేరే. నిజానికి నేను నా ప్రొడ్యూసర్ మిత్రునికి చేప్పాను. నేను లేకుండా అంతా కష్టపడి, "ఒంటి చేత్తో" సినిమా పూర్తిచేసింది నువ్వు. నీ పేరే డైరెక్టర్ గా కూడా వేసుకో అని. కానీ విన్లేదు అతను - "మీరు లేకుండా సినిమా ఎక్కడిది" అంటూ.

కట్ టూ -

ఎవరినో ప్రొడ్యూసర్ చేయటానికి నేను దాదాపు సగం బడ్జెట్ మోబిలైజ్ చేయగలిగాను. ఒక్క సారి కాదు ఇలా, ఎన్నో సార్లు. కానీ, ఇప్పుడు నేనుగా... నా కోసం... ఒక చిన్న సినిమా చేసుకోడానికి మాత్రం... నేను ఊహించని ఎన్నో చాలెంజెస్ నాకు ఎదురౌతున్నాయి.

ఇండస్ట్రీలో దాదాపు ప్రతి చిన్నా, పెద్దా సమస్యకు కారణం ఏమిటో ఇప్పుడు నాకు ఇంకా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదే... ఈగో. ఈ జ్ఞానోదయం బ్యాక్‌గ్రౌండ్‌లో తయారౌతున్నదే ఇప్పుడు నేను ప్రారంభిస్తున్న "యురేకా సకమిక!"

ఇప్పుడు ఫిలిం మేకింగ్ నాకు పెద్ద టెన్షన్ వ్యవహారంలా అనిపించటంలేదు. ఒక గేమ్. ఒక ఫన్. అంతే...

Friday 19 April 2013

100,000 విజిటర్స్ అంత కష్టం కాదు!


నేను గత ఆగస్టులో ఈ బ్లాగ్ ప్రారంభించాను. తర్వాత, బహుశా డిసెంబర్లో అనుకుంటాను... దీనికి బ్లాగ్ విజిటర్స్ మీటర్ ఒకటి తగిలించాను చూద్దామని.

సుమారు నాలుగు నెలల్లో 33,000 దాటింది. నాట్ బ్యాడ్! :)

100,000 విజిటర్స్ ను ఈ బ్లాగ్ కు  రప్పించటం అంత కష్టం ఏమీకాదు. అయితే అది అనుకున్నంత సులభం కూడా కాదు. రెగ్యులర్ గా రాయటం అనేది అప్పుడు తప్పనిసరి అవుతుంది. రాయాల్సిన టాపిక్‌లు కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఏది ఏమయినా, ఈ "నగ్న చిత్రం" చాలా సులభంగా లక్ష విజిటర్స్ మైలు రాయిని అతి త్వరలోనే దాటుతుందని నాకు అనిపిస్తోంది. నాకు తెలిసి ఒక్క బ్లాగ్ పోస్ట్ తో ఆ అంకెను దాటవచ్చు. కానీ, లక్షమందిని అట్రాక్ట్ చేసే ఆ టాపిక్ ఏంటి అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న!

ఇప్పుడున్న సినిమా బిజీలోనూ ఈ బ్లాగ్‌లో ఏదో ఒకటి రాసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇది చాలదు. నా ఆలోచనలను పంచుకోటానికీ, వాటిని అమలు చేయటానికీ ఈ బ్లాగే నా ప్లాట్‌ఫాం. ఈజీగా ఎలా తీసుకుంటాను?!

కట్ చేస్తే -

ఆదివారం ఆఫీసులో పూజ. "యురేకా సకమిక" కాస్టింగులో ఊహించనంత ఆలస్యం జరుగుతోంది. అదే పెండింగ్ లేకపోతే - ఆదివారం అన్నపూర్ణలో సినిమా ఓపెనింగ్ ఉండేది!

కొత్త వారితో సినిమాలకు ఇదివరకటిలా ముంబై హీరోయిన్లకోసం వెళ్లటం లేదు ఎవ్వరూ. అందరూ తెలుగు అమ్మాయిలే కావాలంటున్నారు! ఒకరకంగా ఇది మంచి పరిణామం. కానీ, మనవాళ్లు ముంబై అమ్మాయిల రేంజ్‌ను మించి రెమ్యూనరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రాబ్లెం అంతా అక్కడే వస్తోంది.

విసుగొచ్చిందా, మళ్లీ అందరూ "చలో ముంబై" అంటారు. తప్పదు. అలా జరగదనే ఆశిద్దాం.

Wednesday 17 April 2013

స్పెషల్ మార్నింగ్ షో!

నేను హైస్కూల్లో ఉన్నప్పుడు రోజూ 5 ఆటలు ఉండేవి. అంటే, ఇప్పుడు ఉన్న 4 షోలకు తోడు, అదనంగా, ఒక స్పెషల్ మార్నింగ్ షో ఉండేది. అది సుమారు ఉదయం 8.30 కి ఉండేది. ఇప్పుడు దీన్ని ఉదయం 9 గంటలకు పెడితే సరిపోతుంది.

చిన్న సినిమాలు పడుతున్న బాధలు - మళ్లీ ఈ స్పెషల్ మార్నింగ్ షో ని మొదలెడితే పోతాయని ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అప్పుడప్పుడూ అంటుండగా విన్నాను. చదివాను. చాలా వరకు కాకపోయినా, ఈ మార్పు, కనీసం కొంతవరకైనా పరిస్థితిని తప్పక మార్చుతుంది అని నాక్కూడా అనిపిస్తోంది.

పెద్ద సినిమాలు, భారీ హీరోల సినిమాలు ఎలాగూ వందలాది థియేటర్లలో రిలీజవుతాయి. వాటికి బాధ లేదు. కష్టాలన్నీ చిన్న సినిమాలకే. కాబట్టి, ఇదేదో తొందరగా చేసేస్తే బాగుంటుంది.

స్పెషల్ మార్నింగ్ షో అనేది ప్రత్యేకంగా - ఒక్క చిన్న సినిమాలకు మాత్రమే కెటాయించబడాలి. అప్పుడు ఏ చిన్న సినిమా విడుదలకూ సమస్య ఉండదు. కావల్సినన్ని థియేటర్లుంటాయి. బాగా నడిస్తే కంటిన్యూ అవుతుంది. లేదంటే ఇంకో చిన్న సినిమా వస్తుంది.

ఈ పధ్ధతిలో విడుదలయిన చిన్న సినిమా ఏదయినా "హిట్" టాక్ తెచ్చుకుందంటే మాత్రం - అప్పుడు వద్దు మొర్రో అన్నా, దాన్ని ఎలాగోలా కొనేసుకుని/లాక్కుని మైన్‌స్ట్రీమ్  థియేటర్స్లో ఎలాగూ వేయాల్సిన వాళ్లే వేస్తారు. దాని బిజినెస్ దానికి వస్తుంది. అది వేరే విషయం.  బాగా నడిచే చిన్న సినిమాకు ఏ పెద్ద సినిమా గానీ, దాని విడుదలగానీ పోటీ కాదు.

నాకింకా గుర్తుంది. వరంగల్ కాకతీయ థియేటర్లో "మా భూమి" సినిమా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆడింది. కేవలం స్పెషల్ మార్నింగ్ షో!

రిలీజ్ కు సంబంధించి - బాగున్న చిన్న సినిమాలు, ఆర్ట్ సినిమాలకు ఇదొక మంచి ఆధారం అవుతుంది.  తొందర్లోనే ఈ ప్రపోజల్ కార్యరూపం దాలుస్తుందని నాకెందుకో అనిపిస్తోంది.

కాకపోతే, సమస్యల్లా ఒక్కటే. ముందు చిన్న సినిమాల కోసమే అని గవర్నమెంటు దగ్గర చెప్పి ఒప్పించుకుని, తర్వాత షరా మామూలే అన్నట్టు, పెద్ద సినిమాల రిలీజప్పుడు, ఈ స్పెషల్ మార్నింగ్ షోలని కూడా కలిపేసుకునే ప్రమాదం మాత్రం ఉండకూడదు.  

21 ఏప్రిల్, పూజ !


'యురేకా సకమిక' స్క్రిప్ట్ బాగా వచ్చింది. ముందు, ఇప్పుడున్న ట్రెండ్ లో, (కాస్తంత బూతు కూడా కలిపి) ఓ యూత్ కామెడీని తీసిపారెయ్యాలనుకున్నాం. తర్వాత, కథ దగ్గరే ఎన్నో ట్విస్టులు జరిగాయి. (టూ మెనీ కుక్స్...లాగా అన్నమాట!)

ప్రొఫేనిటీ ఏమీ లేకుండా, ఇప్పుడొస్తున్న హాట్ హాట్ యూత్ చిత్రాల మధ్య. ఓ సమ్మర్ షవర్లా, హాయి అయిన ఫీలింగ్ ను ఇచ్చే ఓ లైటర్ వీన్ యూత్ కామెడీని రూపొందించాలని దాదాపు డిసైడయిపోయాం. మళ్లీ ట్విస్టు!

"లేదు లేదు.. ట్రెండుతోపాటు మనమూ పోవాల్సిందే! మీ టేస్టు, మా టేస్టూ పక్కనపెట్టి, ముందు కమర్షియల్ హిట్టు కోసమే సినిమా చేయండి. తర్వాత మీ టేస్టుతో ఓ మణిరత్నం/భన్సాలి సినిమా తీద్దురుగాని!" అని నిర్మొహమాటంగా ఆర్డర్ పాస్ చేశారు నా ఇన్వెస్టర్ మిత్రులు. రేపు నా చిత్రం రిలీజ్ బాధ్యత తీసుకున్న వాళ్లు కూడా ఈ మిత్రుల్లోనే ఉన్నారు! ఇంక నేను చర్చించి, ఒప్పించడానికి స్కోప్ ఎక్కడ?

సో, 'యురేకా సకమిక' కథ మళ్లీ మారిపోయింది. ముచ్చటగా మూడోసారి! ఫలితంగా, కాస్టింగులో మార్పులు చేర్పులు తప్పనిసరి అయిపోయింది.

నిజానికి, ఫలానా డేట్ కే ఓపెనింగ్ చెయ్యాలన్న డెడ్ లైన్ ఏదీ మాకు లేదు. ఏప్రిల్ 21 అనేది, ఒక ట్రెడిషనల్ "ముహూర్తం" గా, మేము ఫిక్స్ చేసుకున్న ఒక డేట్. ఇప్పుడు అదే తేదీకి బయట అన్నపూర్ణలో ఓపెనింగ్ చేయడానికి బదులు, ఆఫీసులో పూజ చేస్తున్నాము. ఆ తర్వాత, మా రెగ్యులర్ ప్లానింగ్ ప్రకారమే, కొత్త ఆర్టిస్టులతో కనీసం 2, 3 వారాల వర్క్ షాప్ ఉంటుంది. ఆ తర్వాత సింగిల్ షెడ్యూల్లో టాకీ, సాంగ్స్ పూర్తి చేయటం జరుగుతుంది.  ఇందులో ఎలాంటి మార్పు లేదు.

ఏది ఏమయినా, "యురేకా సకమిక" షూటింగ్ అతి త్వరలోనే ఉంటుంది. మేం మొదటగా అనుకున్న షెడ్యూలు ప్రకారమే ఉంటుంది. బయట 'బిల్డప్' కోసం ప్లాన్ చేసిన 'ఓపెనింగ్' ఒక్కటే కొద్దిరోజులు వాయిదా పడింది. అంతే...

ఇంకో నిజం చెప్పాలంటే - కథలో స్వల్పమైన మార్పులు చేర్పులు అన్నది రాత్రికి రాత్రి చేసుకోవచ్చు. కొంతవరకు, సెట్స్ పైన కూడా చేసుకోవచ్చు. కానీ, ముగ్గురు తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడమనేదే ఇప్పుడు మాకు అన్నింటికంటే చాలా కష్టమైన పని అయి కూర్చుంది! ఊహించని విధంగా, ఒక్కసారిగా ట్రెండు మారిపోయింది ఈ విషయంలో ...

Thursday 11 April 2013

గుర్తుకొస్తున్నాయి ...


ఉగాదికి ఒక రోజుముందు నుంచే, ఈ సారి వేప పువ్వు ఎవరింట్లోని వేపచెట్టు నుంచి తీసుకురావాలా అని ఆలోచించేవాళ్లం. తెల్లటి చేతి సంచీ తీసుకుని, పండక్కి అవసరమైన సరుకుల కోసం మా అమ్మ కిరాణం దుకాణానికి బయల్దేరేది. మేమూ వెంటవెళ్లేవాళ్లం.

సుమారు ఒక అర కిలోమీటర్ దూరంలో ఉండే ఆ కిరాణా షాపు అంగుళం అంగుళం, నన్ను ఇప్పుడు అడిగినా ఒక మంచి బొమ్మ గీసి చూపించగలను. మా ప్రాంతంలోని ఏకైక "పెద్ద దుకాణం" గా మేమందరం భావించే ఆ కిరాణం షాపు పేరు మర్చిపోవటం అంత సులభం కాదు.  అది.. తోట రామచంద్రం దుకాణం!

ఇంకా పదేళ్లు కూడా నిండని వయస్సులో మా అమ్మ వెంట మేము బొడ్రాయిలో ఉన్న ఆ దుకాణానికి వెళ్లిన ప్రతిసారీ, ఏది జరిగినా జరక్కపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగేది. మా అమ్మ అన్ని వస్తువులూ కొనుక్కుని, డబ్బులు చెల్లించి బయటికి వచ్చేటప్పుడు, మేం అడిగినా అడక్కపోయినా - చెక్కెర గానీ, బెల్లం కానీ పిల్లలకు చేతినిండా పెట్టేవాళ్లు ఆ దుకాణంలోని గుమస్తాలు.

ఈ ఫినిషింగ్ టచ్ తాయిలం కోసం - మా అమ్మతోపాటు ఎంతసేపయినా ఆ దుకాణంలోనే గడిపేవాళ్లం మేము. అప్పటిదాకా, ఆ దుకాణంలో ఎవరెవరు ఏం కొంటున్నారు, ఎక్కడెక్కడ ఏయే వస్తువులున్నాయి, తూకం ఎలా వేస్తున్నారు, పొట్లాలు ఎలా కడుతున్నారు... ఇవన్నీ ఎంతో ఆసక్తిగా చూసేవాళ్లం.

బహుశా అందుకేనేమో, ఆ రోజుల్లో మాకు చక్కెర, బెల్లం చేతినిండా పెట్టిన ఆ గుమాస్తాలందరి ముఖాలూ, పేర్లూ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.

మరో జ్ఞాపకం ఏంటంటే, ఆ దుకాణం యజమానుల్లో ఒకరి అబ్బాయి నాకు స్కూల్లో క్లాస్‌మేట్! వాడిపేరు శివయ్య. "అరే, శివయ్యా! నిన్న మేం మీ దుకాణానికొచ్చాం. నువ్వు లేవేంటి?" అని మర్నాడు వాడ్ని అడగటం మాకొక రొటీన్. శివయ్య ముక్కు ఎప్పుడూ కారుతూ ఉండేది. మేమంతా వాడిని "చీమిడి ముక్కు శివయ్య" అని ఏడిపించేవాళ్లం. అప్పటి మా క్లాస్‌మేట్ శివయ్య ఇప్పుడు మా ప్రాంతంలోనే ఒక పెద్ద రైస్ మిల్లర్ అనీ, బిజినెస్ మ్యాగ్నెట్ అనీ ఈ మధ్యే విన్నాను!

ఉగాదికి - ఎప్పుడూ కొత్త కుండలో పచ్చడి, శనగపప్పు బెల్లంతో భక్ష్యాలు చేసేది మా అమ్మ.  (సుమారు 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్లో ఉన్న మా అమ్మ - తన డెభ్భై ఏళ్ల వయస్సులో, ఈ రోజు కూడా, ఆ రొటీన్ బ్రేక్ చేయలేదు!) ఆ భక్ష్యాలు చేసేటప్పుడు వాటి చుట్టూరా  వంకలు వంకలుగా రావటం కోసం, చివర్లో చక్రం ఉన్న ఒక ఇత్తడి చెంచాని వాడేది మా అమ్మ. చక్రం ఉన్న ఆ చెంచాతో భక్ష్యాన్ని డిజైన్లు డిజైన్లుగా కట్ చేయటం కోసం మా అన్న, నేను తెగ పోటీపడేవాళ్లం. ఓ పదేళ్ల క్రితం కూడా నేను వరంగల్ వెళ్లినప్పుడు ఆ చెంచాని మా ఇంట్లో చూశాను.

మా చిన్నప్పటి జ్ఞాపకాల్ని మా అమ్మ అంత సులభంగా చెరిగిపోనీయదు. మా ఇంట్లోని ప్రతి వస్తువూ, ఆ వస్తువుతో మా అనుబంధం.. బహుశా మా అమ్మకు కూడా ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. వరంగల్లోని మా ఇల్లు శిథిలమౌతున్నా - మా బాల్యం నాటి జ్ఞాపకాల్ని శిథిలం కానివ్వటం ఇష్టం లేని మా అమ్మ గుర్తుకొస్తేనే నా కళ్లల్లో నీళ్లు వస్తాయి. ఎప్పుడూ.

కట్ టూ ప్రజెంట్ -

నా భార్య, సిటీలోనే మరో మూలనున్న వాళ్ల చెల్లెలు ఇంటికి వెళ్లే తొందర్లో ఉంది. నేను ఓ గంట క్రితమే రెండు చపాతీలు తిన్నాను. నా డ్రైవర్ అంజి రావటం ఇంకా లేట్ అవుతుందని ఇలా బ్లాగ్ రాస్తూ కూర్చున్నాను. ఒక ఇంపార్టెంట్ కాల్ గురించి కూడా ఎదురుచూస్తున్నాను. ఆ మీటింగ్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను.

మా పెద్దబ్బాయి ప్రణయ్ హంగామా చానెల్లో డోరెమాన్ చూస్తున్నాడు. మా చిన్నబ్బాయి ప్రియతమ్ "యాష్" గేమింగ్ జోన్ కు వెళ్లి ఆడుకోడానికి రెడీగా ఉన్నాడు. వాడూ నా డ్రైవర్ ఎప్పుడొస్తాడా అని ఒక వైపు ఎదురు చూస్తూనే, మరోవైపు వాడి డెల్ స్మార్ట్ ఫోన్లో ఏదో గేమ్ ఆడుతున్నాడు!

ఇప్పుడు సమయం ఉదయం 11.55. మేమెవ్వరం ఇంకా ఉగాది పచ్చడి, భక్ష్యాలు తినలేదు. తింటామన్న గ్యారంటీ లేదు. దీనికి నేను ఎవ్వర్నీ తప్పు పట్టడం లేదు. ఆధునిక నగర జీవన శైలి అలా అయిపోయింది. అలా చేసుకుంటున్నాము. చేసుకున్నాము.

కట్ టూ.. నా ఫీలింగ్స్ -

నేను అనుభవించిన అద్భుతమైన బాల్యాన్ని నా పిల్లలకు ఇవ్వలేక పోతున్నందుకు మాత్రం చాలా గిల్టీగా ఫీలవుతున్నాను. అవక తప్పదు. నెమ్మదిగా, నా సహజ జీవన శైలికి మళ్లుతున్న ఆ సమయంలో ఇదంతా గుర్తుకి తెచ్చుకోవటం, నన్ను నేను పలకరించుకోవటం.. ఇలా ప్రశ్నించుకోవటం.. నాకు కొంచెం బాధగానే ఉన్నా, మరోవైపు సంతోషంగా కూడా ఉంది. ఎందుకో మీకు తెలుసు.

Sunday 7 April 2013

నా మొదటి మైక్రోబడ్జెట్ సినిమా


ఒక చిన్న సినిమా ప్లానింగ్ స్టేజి నుంచి రిలీజ్ వరకు, ఎక్కువలో ఎక్కువ, ఆరు నెలల్లో అయిపోవాలి. నా తాజా చిత్రం "యురేకా సకమిక" ప్లానింగ్ కోసమే సుమారు నాలుగు నెలలు తీసుకున్నాను.

కథ కోసం కేవలం నాలుగు రోజులు కూడా ఏకధాటిగా కూర్చునే వీలు చిక్కలేదు. అది వేరే విషయం. ఎలాగో, ఇన్ని వత్తిళ్లలోనూ, ఒక మంచి స్క్రిప్టు పూర్తిచేసుకోగలిగాను.

ప్లానింగ్ కోసం ఇంత సమయం పట్టడం మామూలుగా ప్రతి సినిమాకూ సహజమే. కానీ, ఇప్పటి పరిస్థితుల్లో అలా జరగటానికి వీలులేదు. అయినా అంత సమయం పట్టింది. కారణం ఒక్కటే - నేను ఈ ఒక్క సినిమాతోనే ఫుల్‌స్టాప్ పెట్టెయ్యబోవటం లేదు. దీని తర్వాత, మరొక రెండు మైక్రో బడ్జెట్ సినిమాలను వెంట వెంటనే చేయబోతున్నాను! అందుకే ఈ ఆలస్యం. నత్తనడక. లేదా, ఒక వ్యూహాత్మక ప్రణాళిక.

మైక్రో బడ్జెట్ అనేది ఏ స్థాయిలో ఉన్నా, ఖర్చు చేస్తున్న ఆ మొత్తానికి నూటికి నూరు శాతం ఎలాంటి రిస్కు ఉండకూడదు. ఈ చిత్రాన్ని నేను ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఇది సాధించటమే గొప్ప విషయం. ఇక సినిమా హిట్టా, ఫట్టా అన్నది నాకు ప్రధానం కాదు. నేను అనుకున్నది, అనుకున్న సమయంలో, అనుకున్నట్టుగా చేయగలగటం ముఖ్యం!

నిజానికి, "యురేకా సకమిక" షూటింగ్ ప్రారంభించిన తర్వాతే నా అసలు కౌంట్ డౌన్ ప్రారంభమౌతుంది. ఆ రోజు నుంచి సరిగ్గా 9 నెలల్లో ఇంకో రెండు మైక్రో బడ్జెట్ సినిమాలు నేను పూర్తి చేయాలి.  చేస్తాను. ఈ 3 సినిమాల్లో కనీసం ఒక్కటి కమర్షియల్ హిట్ అవక తప్పదు. ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం ఇదే ...

కట్ చేస్తే -

పైన చెప్పుకున్నదంతా ఒక ఎత్తు. కాగా - నేను ప్లాన్ చేస్తున్న అగ్రెసివ్  ఫిలిం ప్రమోషన్ కోసం, బిజినెస్ కోసం, మనీ రొటేషన్ కోసం, తర్వాతి ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్ వేసుకోవటం కోసం .. అంతర్లీనంగా ఈ సినిమా నాకు ఒక పెద్ద ప్లాట్‌ఫామ్‌లా పనిచేస్తుందన్నది మీతో మాత్రమే పంచుకొనే (చెప్పకూడని) ఒక ట్రేడ్ సీక్రెట్! ఈ ప్లాట్‌ఫాం లాంచింగ్ త్వరలోనే .. కొద్దిరోజుల్లోనే ఉంది. విష్ మీ బెస్టాఫ్ లక్!

కట్ టూ క్రియేటివిటీ -

ఇప్పుడొస్తున్న ఎన్నో యూత్ చిత్రాల మధ్య ఒక "సమ్మర్ షవర్" లా హాయినిచ్చే చిత్రంలా ఉండాలని ప్లాన్ చేసి రూపొందిస్తున్న చిత్రం "యురేకా సకమిక". యు విల్ రియల్లీ లవిట్.