Thursday 28 February 2013

రోజుకి 30 గంటలు!


"ఈ ఫేస్‌బుక్ యుగంలో రోజుకి 24 గంటలు ఎక్కడ సరిపోతుంది? ఇంపాజిబుల్!"

నిన్న సాయంత్రం యాత్రి నివాస్‌లో కాఫీ తాగుతూ కూర్చున్నపుడు నా ప్రొఫెషనల్ మిత్రుడి నోటి వెంట ఈ మాట విన్నాను. తనకి కనీసం ఒక 30 గంటలయినా కావాలిట!

ఇప్పుడు మనలో చాలా మందికి రోజుకి 24 గంటలు నిజంగానే సరిపోవటం లేదు. అతిశయోక్తి అనిపించినా నిజం మాత్రం ఇదే.

ఈ నిజంలోనే ఇంకో పచ్చి నిజం ఏంటంటే - ఒక రోజులోని 24 గంటల్లో కనీసం ఓ 6 గంటలు న్యూస్‌పేపర్ చదవటానికి, టీవీలో వచ్చే ప్రతి చెత్తా చూడ్డానికి, మొబైల్ ఫోన్లో మాట్లాడ్డానికి, ఎస్ ఎం ఎస్ లు చేసుకోడానికి, ఫేస్‌బుక్‌లో కొటేషన్లు పెట్టడానికే  సరిపోతోంది. ఇంక మిగిలిన 18 గంటల్లో - 8 గంటలు ఉద్యోగం/వృత్తి కోసం, కాగా, కనీసం ఓ 2 గంటలు ట్రాఫిక్‌లో ఇంటికీ, ఆఫీసుకీ ప్రయాణం. ఇక మిగిలింది మరో 8 గంటలు. ఈ 8 గంటల్లోనే స్నాన పానాదులు, తిండి, నిద్ర లకు సరిపుచ్చుకోవాలి!

ఇంత బిజీ షెడ్యూల్లో మన కోసం, మన వాళ్ల కోసం - ఏకాంతంగా, ఎలాంటి డిస్టర్బెన్సులు లేకుండా, కనీసం ఒక్కటంటే ఒక్క గంట కెటాయించలేకపోతున్నాం. మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నాం. కుటుంబ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మానవ సంబంధాల్లో కొత్తగా ఏర్పడిన ఈ "వాక్యూం" సమాజంలో ఎన్నో విపరీత ధోరణులకు కారణమౌతోంది.

యాత్రి నివాస్‌లో నా ప్రొఫెషనల్ ఫ్రెండ్ అడిగింది రోజుకి కేవలం 30 గంటలే. కానీ, పైన నేను చెప్పిన లెక్కంతా చూస్తే కనీసం 36 గంటలు అడిగేవాడేమో! నిజానికి మనం చేస్తున్న పనుల్లో ప్రాధాన్యతలను గుర్తించగలిగితే చాలు. మనకు ఉన్న 24 గంటల్లో కొన్ని గంటల్ని మిగుల్చుకోవచ్చు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఒక కొత్త జీవితం సృష్టించుకోవచ్చు.

ఒకసారి కోల్పోతే తిరిగి తెచ్చుకోలేని ఆస్తి "సమయం" మాత్రమే. దాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నది కేవలం మన చేతుల్లోనే ఉంది.    

Sunday 24 February 2013

మతం మానవ సృష్టి

> టెర్రరిస్టులు ఇంక వెల్లిపోయారు అనుకుంటున్న సమయంలోనే మళ్లీ దాడి చేశారు. హైదరాబాద్ సీరియల్ బ్లాస్టుల గురించి విని షాక్ అయ్యాను.
> కసబ్స్‌నీ, అఫ్జల్స్‌నీ వురి తీసినందుకు ఇది ప్రతీకార చర్య అని టీవీ9 సజెస్ట్ చేస్తోంది.
> ఇలాంటి వాటికి కారకులయినవారిని ఈ మధ్యే వురితీసినా ఇవి ఆగటం లేదే అన్న నిస్సహాయ స్థితిని నేను ఫీల్ అవుతున్నాను.
> తీవ్రవాదం లోని అత్యంత భయంకరమైన భాగం ఏంటంటే - అది ఏమీ తెలియని అమాయకుల్ని టార్గెట్ చేస్తుంది.
> "బాంబు పేలుడు ఖండిస్తున్నాము" అన్న సీ ఎం గారి డైలాగ్ 1965 బ్లాక్ అండ్ వైట్ సినిమాలనుంచి వింటున్నాను. అరగదీసిన పరాకాష్ట డైలాగ్ ఇది. 
> తక్షణమే పట్టుకుంటామని అంటున్నారు. అలా చెయ్యగలిగే కెపాసిటీ వుంటే, ముందే యెందుకు పట్టుకోలేదని నేనడుగుతున్నాను. 
> "ఢిల్లీ నుంచి స్పెషల్ టీమ్‌స్ రప్పిస్తున్నాం" అనే మాటకి అర్థం  లోకల్ టీమ్‌స్ వెధవలనా?     
> పొలిటీషియన్లు బాంబ్ బ్లాస్టు బాధితులకి ప్రగాఢ సానుభూతిని బర్త్‌డే గిఫ్ట్ ని ఇచ్చినట్టు ఇస్తున్నారు.   
> పీ ఎం గారు దిగ్భ్రాంతి వ్యక్తం చెయ్యకుండా సంతోషం వ్యక్తం చేస్తారని అనుకున్నామా మనం? పొలిటీషియన్లకి కోన వెంకట్ లాంటి మంచి రైటర్స్ అవసరం.  
> "పేలుళ్లపై విచారణ జరిపిస్తాం" అన్న షిండే గారి డైలాగ్ ఈ దశాబ్దానికే అత్యంత ఒరిజినల్ హైలైట్ డైలాగ్.. వాహ్!  
> "కఠిన చర్యలు తీసుకుంటా" డైలాగ్ చిన్నప్పట్నించీ వింటున్నా. కానీ, ఆ మాటల్ని మనలాంటి వెధవ ప్రజలు తప్ప వినాల్సిన వాళ్లు వినరు. 
> ఎందుకంటే, ఆ వినాల్సినవాళ్లు బాంబులు పేల్చే ప్రిపరేషన్లో బిజీగా వుంటారు.

***
ఇదంతా నేను రాసింది కాదు. మొన్నటి దిల్‌షుఖ్ నగర్ పేలుళ్లపైన ట్విట్టర్‌లో రాంగోపాల్ వర్మ రియాక్షన్. పైకి సెటైర్‌గా అనిపించినా, ఈ ట్వీట్ల వెనకున్న సీరియస్‌నెస్ ఎవరైనా గుర్తించవచ్చు.

నిస్సహాయతని తెలిపే ఈ ఫీలింగ్, ఈ బాధ వర్మ ఒక్కడిదే కాదు. ప్రతి భారతీయుడిది.

వ్యక్తిగతంగా చాలా విషయాల్లో నేను అమెరికాను ఇష్టపడతాను. ఈ టెర్రరిజం విషయంలో అయితే అమెరికాకు నేనొక డై హార్డ్ అభిమానిని. 2001 లో, 9/11 అటాక్స్ తర్వాత, "ఇకముందు ఇలాంటివి ఈ దేశంలో జరగవు" అని అమెరికా చెప్పింది. చేసి చూపించింది.  

అంతే కాదు. పాకిస్తాన్ లో దాక్కున్న అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ని, ఆ దేశానికే తెలియకుండా, ఆ దేశపు అనుమతి లేకుండా, నేరుగా అతను దాక్కున్న చోటికే వెళ్లి హతమార్చటం జరిగింది. అమెరికా ఇతర అంతర్జాతీయ పాలసీల గురించి నేనిక్కడ మాట్లాడ్డం లేదు. తన దేశ పౌరుల ప్రాణాలకు అమెరికా ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో చెప్పటమే ఇక్కడ నా ఉద్దేశ్యం. ఈ గట్స్ మన దేశ రాజకీయ వ్యవస్థకు, దాన్ని నడుపుతున్న మన పొలిటీషియన్స్ కు ఉన్నాయా?

Monday 18 February 2013

సెల్ ఫోన్ ధ్వనిలా నవ్వేదానా!


సరిగ్గా డైనింగ్ దగ్గర కూర్చుంటుండగా ఫోన్ .. వాష్ రూం కి వెల్తుండగా ఫోన్ ..సీరియస్ గా ఏదయినా రాసుకుంటుంటే ఫోన్ .. చదువుకుంటుంటే ఫోన్ .. టైం కి డబ్బుల అడ్జస్ట్ మెంట్ సరిగా అవక టెన్షన్ తో చస్తుంటే ఫోన్ ..

ఇదీ అదీ అని ఏదీ లేదు. "ఇప్పుడు ఏ ఫోన్ రాకపోతే బాగుండు" అనుకుంటున్న సమయం లోనే ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, వచ్చి తీరుతుంది! కొంతమంది మరీ మినిమమ్ మేనర్స్ లేకుండా, "ఏంటీ, మీరు ఫోనెత్తరేంటీ?" అని నిలదీస్తారు. వాళ్ల ఫోన్ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు 'ఎత్తాలా' అని ఎదురుచూస్తూ కూర్చోవాలన్న మాట!

ఆధునిక టెక్నాలజీ మనిషి జీవితానికి మరింత ఆనందం అందించాలి. ఆ శక్తి దానికి ఉంది. కానీ, మనమే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. చివరికి - సొల్లు కబుర్లకీ, టైం పాస్ (టైం కిల్లింగ్) కి మాత్రమే మొబైల్ అన్నట్టుగా తయారయింది పరిస్థితి.

నిజానికి - ఎంతో అత్యవసరమయితే తప్ప, కమ్యూనికేషన్ కి మరొక అవకాశం లేకపోతే తప్ప, మొబైల్ ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ మెయిల్ చేయవచ్చు. మరీ కావాలనుకుంటే మెసేజ్ (ఎస్ ఎం ఎస్) చేయవచ్చు. నిజంగా అంత అవసరమయితే, దాన్ని చదువుకొని అవతలి వాళ్లే ఫోన్ చేస్తారు.

పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందంటే - రోడ్డు మీద ఓ పది మంది వెల్తున్నారంటే - కనీసం ఒక 6 గురి చెవి దగ్గర సెల్ ఫోన్ ఉంటోంది! చెవికీ మెడకీ మధ్య ఫోన్ పెట్టుకొని సర్కస్ చేస్తూ డ్రయివింగులు .. ముందు కూర్చుని డ్రయివింగ్ చేస్తున్న వాడి చెవి దగ్గర వెనక కూర్చున్న వాడు ఫోన్ పెట్టడం .. ఆఖరికి, గోడకి "వన్ ఫింగర్" చేస్తూ కూడా ఫోన్ లో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి!

అయితే ఇదంతా సగటు ప్రజానీకం, సగటు మనిషి మనస్తత్వానికీ, జీవన విధానానికీ సంబంధించింది.

కట్ చేస్తే -

జీవితం లో అత్యున్నత స్థాయి విజయాల్నీ (కొన్ని సార్లు అపజయాల్నీ) సాధించిన వారికి అసలు మొబైల్ ఫోన్ పట్ల అంత ఆసక్తి ఉండదు. మీరు గమనించండి .. వీరిలో అత్యధిక శాతం మంది చేతుల్లో అసలు మొబైల్ ఉండదు! ఇంకా చెప్పాలంటే - వీరిలో  చాలా మందికి అసలు మొబైల్ ఉపయోగించడమనేది చాలా అరుదయిన విషయం. మరి వీరంతా జీవితంలో ఎన్నెన్నో సాధిస్తున్నారు ..

ఆశ్చర్యానికి గురి చేసే ఒక వాస్తవం ఏంటంటే - మొబైల్ ని వీరిలో కొందరు అద్భుతంగా ఉపయోగిస్తారు: మొబైల్ నే కంప్యూటర్ లా చేసుకొని, ఇంటర్నెట్ ద్వారా ఈ మెయిల్స్, ఇతర ఆఫీస్ కరస్పాండెన్స్ చక చకా చేసేస్తుంటారు. అంతేనా .. కేవలం "ఎస్ ఎమ్ ఎస్" లతో  పెద్ద పెద్ద కంపెనీల బిజినెస్ లను నడిపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే - కేవలం ఎస్ ఎమ్ ఎస్ లతో ఏకంగా పుస్తకాల్నే రాసేసి పబ్లిష్ చేస్తారు.  

ప్రముఖ మేనేజ్‌మెంట్ గురు, "ఐ ఐ పి ఎమ్" డైరెక్టర్ ఆరిందం చౌధురి తన "డిస్కవర్ ది డైమండ్ ఇన్ యు" పుస్తకాన్ని ఇలాగే ఎస్ ఎమ్ ఎస్ లతో రాసి పూర్తి చేశాడు, పబ్లిష్ చేశాడు. దాన్ని "బెస్ట్ సెల్లర్" కూడా చేశాడు. ఆయన బిజినెస్ కమ్యూనికేషన్ అంతా కూడా ఎస్ ఎమ్ ఎస్ ల ద్వారానే నడుస్తుందంటే నమ్మగలరా? నిజంగా అది నిజం కాబట్టి నమ్మి తీరాలి ..

ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటం అందరివల్లా కాదు. అలా ఉపయోగించుకున్న వాళ్లు మాత్రం ఎక్కడో ఉన్నత శిఖరాల్లో ఉంటారు. కనీసం ఆ దారిలో ప్రయాణం చేస్తుంటారు. కేవలం ఆభరణాల్లా "షో" చేసే వారు మాత్రం ఎప్పుడూ అడుగునే ఉంటారు. ఉన్నచోటే ఉంటారు.

Saturday 16 February 2013

నా ఫేస్ బుక్ పేజ్


బ్లాగ్ లో ఈ మధ్య అసలు ఏమీ రాయలేదు. దాదాపు రెండు వారాలయింది. ఇకనుంచీ రెగ్యులర్ గా రాయాలనుకుంటున్నాను.

ఈ బ్లాగ్, ఫేస్ బుక్.. నా అంతరంగిక మిత్రులు.

ఎలాంటి హిపోక్రసీ లేకుండా నన్ను నేను పలకరించుకోడానికి, విశ్లేషించుకోడానికి, నా సృజనాత్మక ఆలోచనల్ని నాతో నేను పంచుకోడానికి ఒక "పర్సనల్ అవుట్‌లెట్" గా ఇవే నాకు బాగా ఉపయోగపడ్తున్నాయి.

ఇదే విషయం ఇంతకుముందు కూడా "నా మినీ లేబొరేటరీ" పేరుతో ఇదే బ్లాగ్ లో ఒక సారి రాశాను.

ఇప్పుడున్న నా ఫేస్ బుక్ పర్సనల్ ఎకౌంట్ ని కొద్దిరోజుల్లో పేజ్ గా మార్చబోతున్నాను. పోస్టర్లు, ఫ్లెక్సీలకంటే - ఆన్ లైన్ ప్రమోషన్ కి ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో ఫేస్ బుక్ పేజ్ నాకు బాగా ఉపయోగపడుతుందన్నది నా ఉద్దేశ్యం.

నా మొత్తం క్రియేటివ్ యాక్టివిటీస్‌లో సినిమా అనేది జస్ట్ ఒక పది శాతం మాత్రమే.

అందులోనూ, ఒక స్పెషల్ అపియరెన్స్‌లా తప్ప, ఎప్పుడూ పూర్తిగా దిగని ఈ ఫీల్డులో నేను అలా అలా కంటిన్యూ కావటం కూడా కొన్నాళ్లే. అంతవరకూ ఈ పేజ్‌లోనూ,  బ్లాగ్‌లోనూ మీకీ సినిమా టిట్‌బిట్స్, స్టఫ్, సుత్తీ తప్పవు.

సినిమా ఫీల్డును ఏ క్షణమైనా నేను వదిలేయవచ్చు. ఆ లోకం వేరు. ఆ లౌక్యం వేరు. ఆ మేనిప్యులేషన్స్ వేరు. అందులో ఇమిడిపోయే సాహసం నాకొద్దు.

కొన్నిసార్లు ఇరుక్కుపోయాను. కొన్నిసార్లు దారుణంగా ఇరికించబడ్డాను. అందులో నేను ఎన్నడూ పూర్తిగా లేను. ఉన్నన్ని రోజులు కూడా మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించాను.

నిజం చెప్పాలంటే, ఈ నేపథ్యంలోనే .. ఇప్పటికే నేను మానసికంగా ఈ ఫీల్డులోంచి బయటపడ్డాను. కేవలం దాని తాలూకు కొన్ని కమిట్‌మెంట్‌లున్నాయి. ఆ కమిట్‌మెంట్‌ల కోసమే కష్టపడుతున్నాను. ఆ కష్టంలోనే సినిమాలోని మజా కూడా అనుభవిస్తున్నాను.

కనీసం 2018 వరకు ఫీల్డుని ఎంజాయ్ చేస్తూనే ఉంటాను.  

ఫీల్డు మీద నాకెలాంటి కంప్లెయింట్స్ లేవు. నేను నమ్మిన వ్యక్తులు, నేను తీసుకొన్న నిర్ణయాలపైనే నా బాధంతా.

నా ఉద్దేశ్యంలో .. ఈ రంగాన్ని మించిన ఫేసినేటింగ్ క్రియేటివ్ సామ్రాజ్యాలు ఇంకెన్నో ఉన్నాయి! నాకెంతో ఇష్టమయిన అలాంటి ఒక సామ్రాజ్యంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ఫ్రీడం కోసమే ఎదురుచూస్తున్నాను.

బ్యాక్ టూ ఫేస్‌బుక్ - 

మీకూ తెలుసు. ఫేస్ బుక్ పేజ్ లో వ్యాపారపరమైన యాక్టివిటీకి సంబంధించినది ఏదయినా పోస్ట్ చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం పర్సనల్ అకౌంట్ కు ఉండదు.

మైక్రో బడ్జెట్ లో చేయడానికి నేను ప్రారంభించబోతున్న ట్రెండీ యూత్ సినిమా/ల కోసం - నేను ప్లాన్ చేస్తున్న ఆన్ లైన్ ప్రమోషన్ కు నా "పేజ్" బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే, చిన్న సమస్య ఏంటంటే - ఎకౌంట్ నుంచి పేజ్ కి కన్వర్ట్ చేసినప్పుడు, ఇప్పుడు నా ఎకౌంట్ లో ఉన్న మిత్రులందరూ పేజ్ లో ఉండరు. మళ్లీ నా ఫేస్ బుక్ మిత్రులంతా నా పేజ్ ను "లైక్" చేసినప్పుడే నాతో కనెక్ట్ అయిఉంటారు!

ఇంకొకటి - నా ఫేస్‌బుక్ పేజ్ నుంచి నేను నా ఫేస్‌బుక్ మిత్రులకు డైరెక్ట్‌గా మెసేజ్ పంపించటం కుదర్దు. కానీ, నా ఫేస్‌బుక్ మిత్రులు నాకు మెసేజ్ చేస్తే మాత్రం నేను రిప్లై ఇవ్వడానికి వీలుంటుంది. అదలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది నా మిత్రులు గమనించాలని మనవి.
^^^

(ఎడిట్ /19 అక్టోబర్ 2013: ఫేస్‌బుక్ పర్సనల్ ప్రొఫైల్‌ని "పేజ్"గా కన్‌వర్ట్ చేసుకోవడం వల్ల చాలా నష్టాలున్నాయి. ఇది అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఫేస్‌బుక్‌తో పోరాడి, చివరికి మళ్ళీ నా పర్సనల్ ప్రొఫైల్‌ని ఈమధ్యే వెనక్కి తెచ్చుకోగలిగాను. ప్రొఫైల్ నుంచి కన్వర్ట్ చేసినప్పటి నా ఫేస్‌బుక్ పేజ్ ని కూడా అలాగే ఉంచేశారు! కొన్నాళ్లు కష్టపెట్టినా, చివరికి నాకిలా డబుల్ ధమాకా ఇచ్చిన ఫేస్‌బుక్‌కి థాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను?)
^^^   

ఏది ఏమయినా .. కొద్ది నెలల్లోనే, నా పేజ్ ని బాగా పాప్యులర్ చేయగలనని నమ్మకం. ఈ పాప్యులారిటీ నా భవిష్యత్ "నాన్-సినిమా" సృజనాత్మక ఆలోచనలను కార్యరూపంలోకి దించడానికి తర్వాత నాకు బాగా ఉపయోగపడుతుంది.

నా ఈ  బ్లాగ్, ఫేస్‌బుక్ పేజ్ .. వీటిల్లో దేనిలోనయినా, నేను రాసే రాతలు గానీ, పోస్ట్ చేసే ఫోటోలు గానీ.. ఏవి నచ్చినా తప్పక లైక్ చేయండి. కామెంట్ చేయండి. లింక్ షేర్ చేయండి. అలా అనిపిస్తేనే చేయండి. నో హిపోక్రసీ ప్లీజ్!

థాంక్స్ ఇన్ అడ్వాన్స్ !! :)
***
My Facebook Page:
https://www.facebook.com/onemano 
My Twitter:
https://twitter.com/MChimmani 

Saturday 2 February 2013

"బ్యాన్" తెర వెనుక


చివరికి "ఎలాగో" విశ్వరూపం తమిళనాడులో విడుదల కాబోతోంది...

అసలు కారణం ఇప్పుడు మరింత క్లారిటీతో బయటకు అదే వచ్చింది. అందరికీ బాగా అర్థమైంది. దేశం గర్వించదగ్గ ఒక గొప్ప కళాకారున్ని వేధించి వేటాడే వ్యవస్థకు చేతులెత్తి ఒక నమస్కారం పెట్టడం తప్ప మరేం చెయ్యలేని దశలో ఉన్నందుకు చింతించాలో, సిగ్గుపడాలో అర్థం కావటం లేదు.

ఈ మొత్తం ఎపిసోడ్ మీద... సాక్షాత్తూ కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డ్ చైర్ పర్సన్, లీలా శాంసన్ ఇలా అన్నారు: " మేం కొన్ని వందల వేల సినిమాలకు సర్టిఫికేట్లిస్తున్నాం. విశ్వరూపం సినిమాలో అభ్యంతరకరమయినవి ఏమున్నాయో అర్థం కావటం లేదు. ఇది ఒక రకంగా కళాకారుడ్ని వేటాడటమే. వేధించటమే. పరిస్థితి ఇలా వుంటే, ఇంక భావ ప్రకటన స్వేఛ్ఛకు అర్థమేముంది?" ... ఇంతకన్నా ఏం కావాలి?    

కట్ చేస్తే -

దేశం, ప్రపంచం ఇంత పెద్ద ఎత్తున స్పందిస్తున్న ఈ విషయం పైన మన టాలీవుడ్ హీరోలనుంచి కనీస స్పందన లేకపోవటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది! రేపు ఇలాంటి పరిస్థితి మన వాళ్లకూ రాదని గ్యారంటీ ఉందా? ఒక ఫేస్‌బుక్ మిత్రుడు "తెలుగు హీరోలు లేవరా?!" అనే క్యాప్షన్ తో ఇదే విషయం లేవనెత్తాడు. మరి మన హీరోలు ఎందుకు లేవరో/లేవలేదో వాళ్లకే తెలియాలి.