Thursday 31 October 2013

ఏం రాస్తున్నానన్నది కాదు నాకు ముఖ్యం!

ఇవాళ ఉదయమే ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూశాను. రతన్ టాటా కొటేషన్ అది. "జీవితం అన్నాక ఛాలెంజెస్ తప్పవు. ఆ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ లేని జీవితాన్ని జీవించడంలో అసలు మజా ఏముంటుంది?" అందుకే ఆయన "రతన్ టాటా" అయ్యారు.

సినిమా నా ప్రధాన వ్యాపకం కాదు.

నా మొదటి చిత్రం "కల" తర్వాత, సంఖ్యాపరంగా, ఇప్పటికే ఎన్నో సినిమాలు చేయగల అవకాశం ఉన్నా - నా వ్యక్తిగత సమస్యలు, పరిమితుల కారణంగా ఆ పని చేయలేకపోయాను. ఇప్పుడు కూడా నేను మళ్లీ సినిమాలు చేయాలనుకొంటోంది (నా ప్లానింగులు, అవసరాల దృష్ట్యా)  కేవలం కొన్నాళ్ల కోసమే.

అది 2014 చివరి వరకు అని ఇటీవలే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ లోపే అయితే అంతకంటే ఆనందం లేదు! ఇది నేను సినిమాల మీద ఇష్టం లేకనో, ఇక్కడ ఉండే ఇన్‌సెక్యూరిటీకి భయపడో కాదు చెప్తోంది. సినిమాను మించిన ప్రెఫరెన్సెస్ నాకున్నాయి. వాటికి తొందర కూడా ఉంది.

ఈ బ్లాగ్‌ను ముందు ప్రారంభించింది ఒక ఉద్దేశ్యంతో. అనుకోకుండా జరిగిందది. ఆ తర్వాత దీన్ని కేవలం సినిమాల టిట్‌బిట్స్‌కే పరిమితం చేయాలనుకున్నాను. ఆ తర్వాత, ఇందులో మళ్లీ నాకు తోచిన ప్రతి చెత్తా రాయాలనుకున్నాను. మళ్లీ ఈ మధ్యే - నేను సినిమాల్లో పనిచేసినంత కాలం నగ్నచిత్రంలో కేవలం సినిమా కబుర్లే రాయాలనుకొని "టోటల్ సినిమా!" అంటూ సబ్ టైటిల్ కూడా మార్చాను. ఇప్పుడు మళ్లీ ..

ఎంతసేపూ.. అయితే సినిమా, లేదంటే మనిషి జీవితంలోని నాకు నచ్చిన ఇతర విషయాలు. ఇలా ఊగిసలాడాను. ఏదో రాశాను. రాస్తున్నాను.

ఇలా పదే పదే ఊగిసలాడ్డం నా నిలకడలేనితనం కాదు. అది నా అంతస్సంఘర్షణ.

అయితే - ఈ సంఘర్షణ ఏదో ఓ రూపంలో ఎప్పుడూ ఉండేదే. రతన్ టాటా చెప్పినట్టు.. జీవితం అంటేనే ఛాలెంజెస్.

సంఘర్షణలు, ఛాలెంజెస్ అనేవి మనిషి జీవితంలో ఒక విడదీయరాని భాగం. వాటినుంచి ఆదరా బాదరా బయటపడాలన్న అవివేకంతో నాకెంతో ఇష్టమయిన పనుల్ని, హాబీల్ని కూడా ఇలా నా ఇష్టానికి వ్యతిరేకంగా చేయడం .. నాకు అస్సలు నచ్చడం లేదు.  ఇది నేను చేస్తున్న మరో తాజా తప్పులా అనిపిస్తోంది.

ఆ తప్పు చేయాల్సిన అవసరం నాకు ఏ మాత్రం లేదు.

సో, ఇకనుంచీ "నగ్నచిత్రం" కేవలం సినిమాకే పరిమితం కాదు. సినిమా పోస్టులు 'కూడా' ఉంటాయి. నా ఇష్టాన్నే ఫాలో అవుతూ కూడా ఈ బ్లాగ్ విజిట్స్ అంకెను ఎంతయినా పెంచుకోవచ్చు. ఇతర లక్ష్యాల్ని కూడా చేరుకోవచ్చు.

మీరేమంటారు?

ఏం రాస్తున్నానన్నది కాదు నాకు ముఖ్యం. నేను మళ్ళీ రాయడం ప్రారంభించాను. అదే నాకు ముఖ్యం. ఇప్పుడు -  ఏం రాసినా కూడా.. అది నా ఇష్టంతోనే రాయాలనుకుంటున్నాను. 

Monday 28 October 2013

మొత్తానికి పట్టేశాడు!

పాకిస్తానీ సినిమా "వార్" మీద రెండు రోజుల క్రితం నేనో బ్లాగ్ రాశాను. రామ్‌గోపాల్‌వర్మ ఆ సినిమా చూసి (పైరేటెడ్ సీడీలో!) ఎంతగా ఇంప్రెస్ అయిపోయిందీ రాశాను.

కట్ టూ ఒక 40 గంటల తర్వాత -

"Just had a long telephonic chat with Bilal Lashari ..am as impressed with his humbleness as much as I was with his film Waar."
గంట క్రితం వర్మ చేసిన ట్వీట్ అది. దట్ ఈజ్ రామ్‌గోపాల్‌వర్మ! జస్ట్ సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయి ఇంక ఆ విషయం మర్చిపోలేదు. పాకిస్తాన్‌లో ఉన్న "వార్" చిత్ర దర్శకుణ్ణి పట్టేశాడు. మాట్లాడేశాడు. మామూలుగా ఇదంత గొప్ప విషయంగా కనిపించకపోవచ్చు. నా ఉద్దేశ్యంలో మాత్రం ఖచ్చితంగా ఇది గొప్ప విషయమే. పనికిరాని హిపోక్రసీలు, ఈగోలు పక్కనపెట్టి - తనను ఇంప్రెస్ చేసిన ఒక డెబ్యూ దర్శకుడు పాకిస్తాన్‌లో ఉన్నా, ట్రేస్ చేసి పట్టుకుని మాట్లాడాకా ఆయన వదల్లేదు. అదీ ప్యాషన్. సినిమా మీద తనకు అంత మమకారం ఉంది కాబట్టే ఆయన ఆ రేంజ్‌కి వెళ్లగలిగాడు. ముంబైలో జెండా పాతి, హిట్లయినా ఫట్లయినా తను అనుకున్న చిత్రాలనే తీస్తూ, తనకంటూ ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసుకోగలిగాడు. కొన్నేళ్ల క్రితం ఒక ఇంగ్లిష్ ఆర్టికిల్లో ఎవరో రాసినట్టు - హిందీలో "ప్యారలల్ ఇండస్ట్రీ"ని నడిపిస్తున్నాడు.
ఇంక బ్యాక్ టూ మన వాళ్లు - పక్క దేశం మాట అలా ఉంచండి. పక్కనే ఉన్న ఇంకో దర్శకుని సినిమాను అప్రిషియేట్ చేయటానికి కూడా మనవాళ్లు ఓ తెగ ఫీలయిపోతారు. ఇదంతా నేనేదో ఆయన వీరాభిమానిగా రాయటం లేదు. అతని మీద జెలసీతో రాస్తున్నాను. ఎలాంటి హిపోక్రసీ లేని అతనిలోని క్రియేటివిటీకి ఇంప్రెస్ అయి రాస్తున్నాను. వర్మ సినిమా ఒక్కటే కావాలనుకున్నాడు. సినిమానే ప్రేమిస్తున్నాడు. సినిమా కోసమే బ్రతుకుతున్నాడు. రేపు సినిమా కోసమే చావొచ్చు కూడా! ఆ ఫ్రీడమ్.. అందరూ క్రియేట్ చేసుకోలేరు. దానికి ఎంతో దమ్ముండాలి.
అవ్వా బువ్వా రెండూ కావాలనుకుంటే కుదరదు. అయితే అట్టర్ ఫ్లాప్ అయినా అవుతారు. లేదంటే ఒక రొటీన్‌లోపడి అలా కొట్టుకుపోతుంటారు. అందుకు నేను మినహాయింపేమీ కాదు..

Saturday 26 October 2013

పాకిస్తానీ సినిమా "వార్" దేనిపైన?

మొన్నటి ఈద్ రోజు పాకిస్తాన్‌లో ఒక భారీ బడ్జెట్ సినిమా రిలీజయింది. దాని పేరు "వార్". ఇది ఇంగ్లిష్ వార్ కాదు. ఉర్దూ వార్. The Strike.

ఇంగ్లిష్‌లో తీసిన ఈ యాక్షన్ సినిమా దర్శకుని పేరు బిలాల్ లషరి. లషరీకి ఇది మొదటి సినిమా. దీని రచయిత, నిర్మాత - హసన్ వకాస్ రానా. ఈ సినిమా నిర్మాణం పూర్తికావడానికి మూడేళ్లు పట్టింది.

పేరుకే హసన్ నిర్మాత కానీ, వెనకనుంచి బడ్జెట్ అంతా సమకూర్చింది పాకిస్తాన్ ఆర్మీ మీడియా వింగ్ అయిన "ఇంటర్ సర్విసెస్ పబ్లిక్ రిలేషన్స్" అని చాలాచోట్ల, చాలా రివ్యూల్లో చదివాను.

కొన్ని రివ్యూల్ని చదివాక యెలాగయినా ఈ సినిమాను చూడాలనిపించింది. కొన్ని రివ్యూల్లో మాత్రం "ఇది ఉట్టి సాదా సీదా పాకిస్తానీ న్యూవేవ్" సినిమా అని రాశారు.

"రివ్యూలు చదివి సినిమాలకెళ్తారా?" అని బ్లాగ్ నేనే రాసి, నేనే ఇలా రివ్యూలమీద ఆధారపడటం ఏంటని నాకే అనిపించింది. కానీ తప్పదు. ఇది ఇక్కడి సినిమా కాదు. పాకిస్తానీ సినిమా! విషయం కొంచెమయినా తెలుసుకోవాలంటే రివ్యూలే ఆధారం.

పాకిస్తాన్‌లో రిలీజ్ రోజు మన "చెన్నై ఎక్స్‌ప్రెస్" 90 లక్షలు (పాకిస్తానీ రూపాయలు) వసూలు చేస్తే, "వార్" 1 కోటి 14 లక్షలు వసూలు చేసింది. అయితే, మొదటి మూడు రోజుల్లోనే మన "చెన్నై ఎక్స్‌ప్రెస్" 4.26 కోట్లు వసూలు చేయగా, "వార్" మాత్రం మొత్తం ఒక పూర్తివారంలో 9.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

వసూళ్ల సంగతి అలా వదిలేద్దాం. ఇంతకీ ఈ పాకిస్తానీ సినిమా "వార్" దేనిపైన?

ఇక్కడ మనవాళ్లు యాంటీ పాకిస్తానీ/యాంటీ టెర్రరిస్టు సినిమాలు ఎలా తీస్తారో, సేమ్ టు సేమ్ అక్కడ వాళ్లు తీసిన ఈ యాక్షన్ సినిమా "యాంటీ ఇండియా" సినిమా!

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

కొన్ని నిమిషాల క్రితమే మన ఆర్జీవీ ఒకటి ట్వీటాడు. ఏంటంటే, ఈ సినిమా చూశాక వర్మకి దర్శకత్వం వదిలేసెయ్యాలన్నంతగా మతిపోయిందిట. పాకిస్తాన్ వెళ్లి అక్కడ బిలాల్ లషరికి అసిస్టెంట్‌గా పనిచేయాలనిపిస్తోందిట!

ఓ ఈ సినిమాని తెగ పొగుడుతూ, మన డైరెక్టర్స్‌ని వెళ్లి పాకిస్తానీ సినిమాలు చూడండి అంటూ మరిన్ని ట్వీట్లు పెట్టాడు వర్మ. అంతేకాదు. డైరెక్ట్‌గా లషరికి, ఆయన క్రాఫ్ట్‌కి కంగ్రాట్స్‌తో పాటు "సెల్యూట్" కూడా ట్వీట్ చేశాడు వర్మ! లషరీని తెలిసిన ఎవరయినా పాకిస్తాన్‌వాళ్లుంటే లషరీకి తన కంగ్రాట్స్, రిగార్డ్స్ చెప్పమన్నాడు.

ఇప్పుడు సహజంగానే మనకు ఆ సినిమా చూడాలనిపిస్తుంది. కదూ? 

Thursday 24 October 2013

ఫిలిమ్ చాన్స్ కావాలా?

కొత్త హీరోహీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, స్క్రిప్టు రచయితలు, పాటల రచయితలు, గాయనీ గాయకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇంకా.. ఫిలిమ్ మేకింగ్‌లోని వివిధ డిపార్ట్‌మెంట్లకు చెందిన కొత్త టెక్నీషియన్ల టాలెంట్ సెర్చ్‌లో భాగంగా - ఒక చిన్న ప్రయత్నంగా - ఇవాళ ఉదయమే ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌ని క్రియేట్ చేశాను.  

గ్రూప్ డైరెక్ట్ లింక్: https://www.facebook.com/groups/filmchancemeetups/

సినీ ఫీల్డుపట్ల ఇష్టం ఉండి, ఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎవరైనా ఈ గ్రూపులో చేరవచ్చు.

సాధారణంగా కొత్తవాళ్లకోసం మేము న్యూస్ పేపర్స్, మేగజైన్స్‌లో యాడ్స్ ఇస్తాము. ఈ మధ్యనే - ఆన్‌లైన్‌లో క్విక్కర్ లాంటి కొన్ని వెబ్‌సైట్స్‌లో యాడ్స్ పోస్ట్ చేయడం, టీవీ చానెల్స్‌లో స్క్రోలింగ్ ఇవ్వటం కూడా ఎక్కువగా చేస్తున్నాము.

వీటన్నిటి రెస్పాన్స్ ద్వారా వచ్చే ఎంతోమంది కొత్తవారిలో, మా సినిమాకు/సినిమాలకు అవసరమయ్యే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లను సెలక్టు చేసుకోవటం జరుగుతుంది. కొంతమందిని నేరుగా మా ఆర్టిస్టు కో-ఆర్డినేటర్లే తీసుకు వస్తారు. ఇదంతా కూడా ఇప్పుడు పాతచింతకాయ పచ్చడి అయిందని నా ఉద్దేశ్యం.

ఫిలిమ్ మేకింగ్‌లో సాంకేతికంగా ఎన్నో ఊహించని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కనీసం కోటి రూపాయలు లేకుండా కొత్తవారితో కూడా సినిమా చెయ్యడం అనేది ఊహించని పరిస్థితి. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కొన్ని లక్షల్లోనే ఒక మంచి సినిమా తీయవచ్చు.

ఈ నేపథ్యంలో, కొంతమంది లైక్-మైండెడ్ మిత్రులతో కలిసి నేను చేస్తున్న మైక్రోబడ్జెట్ చిత్రాల సీరీస్ కోసం - చాలా మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్ల అవసరం ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, నాకంటూ ఒక చిన్న "న్యూ టాలెంట్" గ్రూప్‌ని క్రియేట్ చేసుకోవటం బావుంటుందనిపించింది.

ఈ గ్రూప్‌లోని మెంబర్స్‌ను కేవలం నేను పరిచయం చెయ్యటమే కాకుండా, బయటివారి సినిమాల్లో కూడా అవకాశాలు పొందేలా అవసరమైన గైడెన్స్‌ను నేను ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది.  

ఈ ఫేస్‌బుక్ గ్రూప్‌లో, ఉట్టి రొటీన్ పోస్టింగులు కాకుండా - ఒక గోల్‌తో, అవసరమైన విషయాలను మాత్రమే చర్చించడం ముఖ్యం.

నా చిత్రాల్లో, నా టీమ్‌లో సూటవుతారు అనుకున్నవాళ్లను బాగా దగ్గరగా స్టడీ చేసి తీసుకోవడానికి ఈ గ్రూప్ బాగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. ఆడిషన్, ఇంటర్వ్యూలు ఎలాగూ ఉంటాయి. కానీ, మామూలు ఆడిషన్ పధ్ధతికంటే ఇది కొంచెం అడ్వాన్స్‌డ్ అనుకోవచ్చు.

ఇదే వైస్-వెర్సాగా కూడా అనుకోవచ్చు. అంటే.. అసలు నేనెవరు, నాతో కలిసి పని చేయవచ్చా లేదా కూడా అవతలి ఔత్సాహికులకి తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్లకు ఇష్టమయితేనే  నాతో కలిసి సినిమాలో పని చేయవచ్చు. లేదా, పూర్తిగా గ్రూప్ నుంచే తప్పుకోవచ్చు.  

కట్ టూ మీటప్స్ -

మీటప్ డాట్ కామ్ లాగా, గ్రూప్‌లోని వాళ్లు తరచూ వ్యక్తిగతంగా కూడా కలుస్తూ ఉండటం అనేది కూడా ప్లాన్ చేస్తున్నాను. దీనివల్ల ప్రొఫెషనల్ "బ్రెయిన్ స్టార్మింగ్" సాధ్యమౌతుంది. మెంబర్స్‌కి నెట్‌వర్క్ పెరుగుతుంది. పరిచయాలు, అవకాశాలు కూడా పెరుగుతాయి.

కేవలం టైమ్‌పాస్ కోసం కాకుండా - నిజంగా సినీ ఫీల్డులోకి ఎంటర్ అవాలనుకొనే లైక్-మైండెడ్, ప్యాషనేట్ "న్యూ టాలెంట్" కోసమే ఈ గ్రూప్. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నా నమ్మకం.

ఈ ఫిలిమ్ చాన్స్ గ్రూప్ లింక్‌ని, ఇప్పుడు మీరు చదువుతున్నఈ బ్లాగ్ పోస్ట్ లింక్‌నీ - మీ ఫేస్‌బుక్‌లోనో, బ్లాగుల్లోనో లింక్ చేయడం/ప్రస్తావిచడం ద్వారా మీరు నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మరింత విజయవంతం చేయవచ్చు.

థాంక్స్ ఇన్ అడ్వాన్స్..  

Tuesday 22 October 2013

టోటల్ సినిమా!

తాడిచెట్టు క్రిందకి వెళ్లినప్పుడు అక్కడ తాగాల్సింది కల్లు మాత్రమే.

అలా కాకుండా - తాడిచెట్టు క్రింద కూర్చుని, "నాకు కల్లు అలవాటు లేదు.. పాలు తాగుతాను" అని చెప్పి, అక్కడ నువ్వు స్టీలు గ్లాసులో పాలు తాగినా, ఎవడూ నువ్వు తాగుతోంది పాలు అనుకోడు.

తాజాగా మాంచి తాటి కల్లు తాగుతున్నావనే అనుకుంటాడు. కాకపోతే - గ్లాసులో!

"కాదురా బాబూ! నేను నిజంగా పాలే తాగుతున్నాను!" అని ఎంత నెత్తీ నోరూ కొట్టుకున్నా ఎవడూ వినడు. వినాల్సిన అవసరం వాళ్లకి లేదు.

వాళ్లు గుర్తించేది ఒక్కటే. అనుకునేది ఒక్కటే. నువ్వు తాడిచెట్టు కింద కూర్చుని ఉన్నావు. అక్కడ నువ్వు తాగుతున్నది ఖచ్చితంగా కల్లు మాత్రమే! ఒకవేళ నువ్వు నిజంగా అక్కడ కల్లు తాగడం లేదు.. పాలే తాగుతున్నావు అంటే.. సింపుల్‌గా నిన్నొక "ఇడియట్" అనుకుంటారు తప్ప ఎవరూ మెచ్చుకోరు.

కట్ టూ సినిమా -

నేనిక్కడ వర్‌ల్డ్ సినిమా గురించి, ఇండిపెండెంట్ సినిమా గురించి, లేదా ఇంటలెక్చువల్ సినిమా గురించి  మాట్లాడ్డం లేదు. నేను మాట్లాడుతోంది 100% కమర్షియల్ సినిమా గురించి. అందులోనూ, ప్రస్తుతం నేను చేస్తున్న తెలుగు సినిమా గురించి. సినీ రంగం గురించి.

మన తెలుగు సినిమా ఒక తాడి చెట్టులాంటిది. దీనికో లెక్కుంది. కావల్సినంత తిక్క కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే - అసలు సినిమా అంటేనే ఒక మేనిప్యులేషన్.

ఈ లెక్కలు, తిక్కలు, మేనిప్యులేషన్స్ నేనసలు పట్టించుకోను. అవి నాకు సరిపడవు. నేను ముక్కు సూటిగానే వెళ్తాను.. అనుకోవడం పూర్తిగా ఒక ఫూలిష్‌నెస్. తాడిచెట్టు కింద కూర్చుని పాలుతాగటం అంటే ఇదే.

ముందే అనుకున్నట్టు సినిమా అంటేనే ఒక మేనిప్యులేషన్. ఒక తాడిచెట్టు. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. మన సొంత పైత్యం పక్కన పెట్టి, ఇక్కడ ఏం చేయాలో అదే చెయ్యాలి.

మొదటిసారిగా, ఇప్పుడు నేను తాడిచెట్టు కిందకి నేరుగా వచ్చాను. ఇక "టోటల్ సినిమా!" (ఎట్‌లీస్ట్.. నా పర్సనల్ ఎజెండాలూ, కమిట్‌మెంట్లూ, లెక్కలూ క్లియర్ చేసుకొనేవరకూ!)

ఇప్పుడు నేను ఇండస్ట్రీ తాడిచెట్టుకింద తీరిగ్గా, రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాను. ఇక్కడ నేనింక పాలు త్రాగను. మాంచి కల్లు ఆర్డర్ చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది "కల్లు కుండ" టు కమ్...  

Monday 21 October 2013

టాలీవుడ్ టాప్ చెయిర్స్ ఇప్పుడు ఎవరివి?

తెలుగులో ఆల్ టైమ్ గ్రాసర్ రామ్‌చరణ్‌తేజ్ "మగధీర" రికార్డుని, ఆయన బాబాయ్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ "అత్తారింటికి దారేది" సినిమా బీట్ చేసేసింది.

ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇప్పటివరకు ఈ చిత్రం 56 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంక దేశవ్యాప్తంగా, ప్లస్ .. అబ్రాడ్ .. మొత్తం కలిపి సుమారు 73 కోట్లు కలెక్ట్ చేసిందని ఇప్పుడే చదివాను. దీంతో, ఇప్పటివరకూ టాలీవుడ్లో ఉన్న "మగధీర" 72 కోట్ల టాప్ గ్రాసర్ రికార్డును త్రివిక్రమ్ "అత్తారింటికి దారేది" సంపూర్ణంగా బీట్ చేసేసినట్టయింది.

ఈ అంకె 100 కోట్లను కూడా తాకే అవకాశం ఉందని నిర్మాతే స్వయంగా చెప్పారు. అలా కానీ జరిగితే, అది మరో రికార్డ్ అవుతుంది. టాలీవుడ్‌లో తొలి 100 కోట్ల సినిమాగా చరిత్రలో "అత్తారింటికి దారేది" ఎన్నటికీ నిల్చిపోతుంది!

సీమాంధ్రలో గొడవలు, రిలీజుకి ముందే ఆ సినిమా పైరసీకి గురికావడం.. ఇవన్నీ ఆ చిత్రం అద్భుత విజయాన్ని ఆపలేకపోయాయి.

దీంతో, టాలీవుడ్లో "ఆల్ టైమ్ గ్రాసర్" రికార్డుతో టాప్ చెయిర్ మీద ఇప్పుడు పవన్ కల్యాణ్ కూర్చున్నట్టయింది.

ఇలావుంటే, మరోవైపు, "అత్తారింటికి దారేది" రికార్డ్ కలెక్షన్లతో మగధీరను కూడా బీట్ చేయడం అనేది హీరోయిన్ సమంతను నంబర్ వన్ స్థానంలోకి చేర్చింది. ఇప్పటివరకూ ఆ స్థానంలో ఉన్నది కాజల్ అన్న విషయం మనందరికీ తెలిసిందే! 

Sunday 20 October 2013

యూటీవీ ప్రతిష్టాత్మక తొలి తెలుగు చిత్రం మహేష్ బాబుతో!

"మిర్చి" దర్శకుడు కొరటాల శివ పంట పండింది. తంతే గారెల బుట్టలో పడ్డాడు. మహేష్ బాబుతో సినిమా. అదీ దేశంలోనే అతి పెద్దదయిన కార్పొరేట్ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్‌లో!

"1 : నేనొక్కడినే", "ఆగడు" చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తున్న మహేష్ బాబు తర్వాతి సినిమా కార్పొరేట్ స్టయిల్లో మరింత భారీగా ఉండబోతోంది.

దేశంలోనే అతి పెద్దదైన కార్పొరేట్ ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ "యూటీవీ", మహేష్ బాబు హీరోగా, ఆయన సోదరికి చెందిన ఇందిరా ప్రొడక్షన్స్‌తో కలిసి భారీగా తన తొలి తెలుగు సినిమాను నిర్మిస్తోంది. వచ్చే జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు న్యూస్.

డిస్నీ యూటీవీ సౌత్ బిజినెస్ చీఫ్ ధనుంజయన్‌తో పాటు, మహేష్ బాబు కూడా ఈ వార్తని ధృవీకరించారు.

ఇక దర్శకుడు కొరటాల శివ విషయానికొస్తే ఈ అవకాశం ఆయనను వరించిన అదృష్టం కాదు. ఆయన ఎదుర్కోబోతున్న పెద్ద చాలెంజ్!

కార్పొరేట్ బ్యానర్ కాబట్టి బడ్జెట్ విషయంలోనూ, నిర్మాణ విలువల విషయంలోనూ ఎలాంటి కొరత ఉండదు. రాజీ ఉండదు. ఎలాంటి పరిమితులు ఉండవు.

ఇప్పటికే మహేష్ చేస్తున్న "1", "ఆగడు" చిత్రాలకు భారీ అంచనాలున్నాయి. వాటిని మించినదేదో కొరటాల ఇవ్వగలగాలి. అదంత చిన్న విషయం కాదు. యూటీవీ, మహేష్ బాబు శివని సెలెక్టు చేసుకున్నారంటే ఆ సత్తా ఏదో వాళ్లు ఆయనలో గుర్తించినట్టే అనుకోవచ్చు. ఇక దాన్ని ప్రాక్టికల్‌గా సాధించటమొక్కటే ఆయన చేయాల్సింది.

లెట్స్ ఆల్ విష్ కొరటాల శివ బెస్టాఫ్ లక్!    

Saturday 19 October 2013

"పవనిజమ్"లో నిజమెంత?

ఈ మధ్య ట్విట్టర్లో రాంగోపాల్‌వర్మ ఓ అదే పనిగా ఒక విషయం గురించి ఊదరగొడుతున్నాడు. అది - పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి. పర్సనల్‌గా పవన్ కల్యాణ్ బ్రాండ్ ఇమేజ్ గురించి.

అంతవరకే అయితే ఫరవాలేదు. పవన్ అన్న చిరంజీవితో కంపేర్ చేస్తూ, చిరంజీవికన్నా పవర్ స్టార్‌కే పవర్ ఎక్కువగా ఉంది అని ఇన్‌డైరెక్టుగా చెప్పడం ఆ క్యాంపులో కొంచెం ఇబ్బందికరంగానే అనిపించి ఉంటుంది.

అంతటితో ఆగలేదు ఆర్‌జీవీ. ఇంత పవర్ ఉన్న ఇట్లాంటి సమయంలో - పవన్ కల్యాణ్ ఇమ్మీడియెట్‌గా ఒక పార్టీ పెట్టకపోతే అతనొక "ఇడియట్" కిందే లెక్క అని కూడా ట్వీట్ చేశాడు రామూజీ.

నాకు తెలిసి, రాంగోపాల్‌వర్మకు ఒకరిని పొగిడి డేట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిని ఆయన ఎప్పుడో దాటేశాడు. కానీ, తన మైండ్‌లో ఏదో ఒకటి తప్పక స్పార్క్ అయ్యే ఉంటుంది. అందుకే ఈ హంగామా క్రియేట్ చేశాడని నేననుకుంటున్నాను. అదేంటన్నది ఆయనకే తెలియాలి.

ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లో ఉండాలిగా!

కట్ చేస్తే -

మొన్నటి "థాంక్యూ మీట్"లో పవన్ కల్యాణ్ భారీ ఎమోషనల్ స్పీచ్..

దాన్ని కూడా రామూజీ వదల్లేదు. మొన్నటి "అత్తారింటికి దారేది" పైరసీకి మూలకారణమైన ఆ వ్యక్తులెవరోగానీ వాళ్లని వితవుట్ వార్నింగ్ ఏదో చేసేలాగున్నాడని కామెంట్ చేశాడు వర్మ. పవన్ స్పీచ్‌ని తెగ మెచ్చుకున్నాడు.

నా ఉద్దేశ్యంలో - రామ్‌గోపాల్ వర్మ ఒక హీరోని మరీ ఇంత ఆకాశానికి ఎత్తెయ్యడం అనేది ఆయన స్టయిల్ కాదు. ఎక్కడో ఏదో తంతోంది..

కట్ చేస్తే -

పైరసీ అనేది ఒక్క హీరోకి సంబంధించిన విషయం కాదు. మొత్తం ఇండస్ట్రీకి సంబంధించింది. తనదగ్గర ఏదయినా సమాచారం ఉన్నప్పుడు దాన్ని బయటపెట్టడం, చట్టప్రకారం వారిపై చర్యతీసుకునేలా ఇండస్ట్రీకి, చట్టానికి సహకరించడం తప్పనిసరి. అదే కరెక్టు "ఇజమ్".

అలా కాకుండా, కేవలం వ్యక్తిగతంగా "తాటతీస్తా" నంటూ చెప్పిన ఆ ఒక్క పదం, తిలక్ కవిత్వాన్ని కోట్ చేస్తూ అద్భుతంగా ముగించిన ఆనాటి పవన్ కల్యాణ్ మొత్తం స్పీచ్‌కి ఒక మరకలా, మచ్చలా నిల్చిపోయింది.

"అత్తారింటికి దారేది" పైరసీని ప్రొత్సహించిన ఆ ఈఇండస్ట్రీలోని వ్యక్తులు ఎవరో, పవన్‌కు మాత్రమే తెలిసిన ఆ నిజం ఏంటో ఎప్పటికయినా బయటికి రావాల్సిందే.

అదే సిసలైన పవనిజమ్.   

Thursday 17 October 2013

కలెక్షన్లకు దారేది?

రిలీజ్ విషయంలో - నానా ట్విస్టులతో, ఆగీ ఆగీ రిలీజై రికార్డులు బద్దలు కొట్టిన సినిమా "ఆత్తారింటికి దారేది".

రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఒక ట్విస్టు. పూర్తయి రెడీగా ఉన్న సినిమాను రిలీజ్ చేయకుండా అలా వెయిట్ చేస్తూ ఆపి ఉంచాల్సివచ్చింది. ఇదే పెద్ద టెన్షన్ అనుకుంటే, ఆ సినిమాలో ఓ 90 నిమిషాల భాగం పైరసీ చేయబడి ఇంటర్‌నెట్లోకి ఎక్కేయడం ఇంకో పెద్ద ట్విస్టు.

విధిలేని పరిస్థితుల్లో ఆ సినిమాను కేవలం 4 రోజులముందు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. కొత్తగా పెద్ద పబ్లిసిటీలేమీ లేకుండా, అన్ని రోజులు ఆపి ఉంచిన ఆ సినిమాను అప్పటికప్పుడు, నాలుగంటే నాలుగు రోజుల్లో రిలీజ్ చేసేసారు! (రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అప్పటికి ఇంకా అలాగే ఉన్నాయి అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి!)

సినిమా సూపర్ డూపర్ హిట్!

ఎంత హిట్టంటే, ఆ సినిమా నడుస్తున్న పోకడలను, అది క్రియేట్ చేస్తున్న కలెక్షన్ల రికార్డులను ఎప్పటికప్పుడు బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్ కూడా మానిటర్ చేసింది!

కేవలం 4 రోజులముందు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి రిలీజ్ చేసిన "అత్తారింటికి దారేది" సినిమా, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు సాధించిన 3వ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. (మొదటిది "చెన్నై ఎక్స్‌ప్రెస్స్", రెండోది "యే జవానీ హై దీవానీ").

అంతే కాదు. కేవలం 17 రోజుల్లో 64 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, "బ్లాక్‌బస్టర్ ఆఫ్ ది ఇయర్"గా కనక వర్షం కురిపించింది ఈ సినిమా.

కట్ టూ ప్రీతిష్ నంది -

కవి, చిత్రకారుడు, జర్నలిస్టు, పొలిటీషియన్, ప్రొడ్యూసర్ కూడా అయిన ప్రీతిష్ నంది గురించి ఎక్కువగా చెప్పబోవటంలేదు నేను. ఈ సినిమా విషయంలో ఆయన లేవనెత్తిన రెండు పాయింట్ల గురించి మాత్రం ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

1. "పైరసీని మనం భూతద్దంలో చూస్తున్నాము."
నిజమే. అంతగా లేని భయాన్ని పైరసీ పట్ల మనం పెంచుకుంటున్నాము. సినిమాలో దమ్మున్నప్పుడు దానికంత సీన్ ఉండదు. ప్రతివాడూ థియేటర్‌కే చచ్చినట్టు వెళ్లి మరీ సినిమా చూస్తాడు.

2. "ప్రచారానికి కోట్లకొద్దీ ఖర్చు పెట్టడం తప్పనిసరి ఏమీకాదు."
100% నిజం ఇది కూడా. ఎలాంటి భారీ పబ్లిసిటీ లేకుండా, ఒక రకమయిన స్మశానవైరాగ్య స్థితిలో, కేవలం 4 రోజులముందే రిలీజ్ డేట్ ప్రకటించి విడుదల చేసిన ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది!

ఎలా కాదంటాం?

అయితే ఇది కేవలం పవన్ కల్యాణ్ మీద ప్రేమతోనో, ప్రొడ్యూసర్ ప్రసాద్ మీద జాలితోనో ప్రేక్షకులు చేసిన హిట్టు కాదు. సినిమాలో విషయం ఉంది. ఇంకా చెప్పాలంటే - పవన్ ఇమేజ్‌ని కేంద్రంగా చేసుకొని, మనం మర్చిపోతున్న మానవ సంబంధాలను ముడిసరుకుగా హైలైట్ చేస్తూ, కమర్షియల్‌గా ఆ సినిమాను అంత బాగా రూపొందించిన దర్శకుడు త్రివిక్రమ్‌దే ఈ విజయం. 

Sunday 13 October 2013

మిలియన్ డాలర్ కొశ్చన్! [2]

కొంతమందికి తాము ఏం చేయాలి అన్న విషయం మీద ఉండాల్సినంత స్పష్టత ఉండదు. "నేనేదో క్లరికల్ జాబ్ చేశాను.. అంతకు మించి నాకేం రాదు.. చేయలేను" అన్న పధ్ధతిలో వీరి ఆలోచన ఉంటుంది. కానీ, అది నిజం కాదు.

ఆలోచిస్తే ప్రతి ఒక్కరికీ ఎన్నెన్నో జీవిత లక్ష్యాలుంటాయి. వీటికి ఆర్థిక స్థోమత అనేదే ఎప్పుడూ అడ్డు కాదు. కాకపోతే - ఆ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకోవడం దగ్గరే చాలామంది ఫెయిల్ అవుతారు. కొంతమందికి ఆ స్పష్టత ఉన్నా - ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి డీలా పడిపోతారు.

నిజంగా ఏంచేయాలో తట్టనివారు ఒక్కసారి వారి వారి చిన్నతనపు జ్ఞాపకాల్లోకి వెళితే సమాధానం దొరుకుతుంది. మనం పెద్దయ్యాక ఏం కావాలని అనుకున్నామో ఎన్నటికీ మర్చిపోలేము. ఆ మెమొరీ బాక్స్‌ని ఒకసారి తెరిస్తే చాలు. మీరు ఏం చేయాలన్నది మీకే తెలుస్తుంది.

ఇక వాస్తవ జగత్‌లోకి వద్దాం..

"ఊహలు సరే .. ఏ రేంజ్‌లో నయినా ఊహిస్తాం. కానీ, అసలు డబ్బే లేకుండా ఎలా?" అని చాలా మంది ప్రశ్నిస్తారు.  మన మిలియన్ డాలర్ కొశ్చన్‌కు అసలు సమాధానం ఇక్కడే ఉంది.

డబ్బు మన దగ్గర లేదు. అదే మనకి ప్రధాన అడ్డంకి అనుకున్న మానసిక అభద్రతాస్థితిలో ఏ ఒక్కరూ తాము చేయగలిగిన ఏన్నో పనుల గురించి కనీసం అలోచించడానికే భయపడతారు. అలా కాకుండా - మన దగ్గర ఓ కోటి రూపాయలున్నాయి.. ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు లేవు అనుకున్నపుడు ఉండే మానసిక స్థైర్యం వేరు.

ఇలాంటి స్థితిలోనే మనిషిలోని సంపూర్ణ సామర్థ్యం బయటికి వస్తుంది. అనుకున్న ఏ పనిని అయినా వేగంగా, విజయవంతంగా చేయగలుగుతారు. నిజానికి ఈ స్థితే మనలో సహజంగా ఉన్న అనేక శక్తిసామర్థ్యాలను బయటకు తెస్తుంది.

కట్ టూ నాణేనికి మరో వైపు -

"డబ్బు వచ్చాకే ఏదయినా చేద్దాం" అనుకునేవాళ్లంతా ఏదీ సాధించలేరు. ఎన్నటికీ. డబ్బు చేతినిండా అందినప్పుడు కూడా. ఇది నిరూపణ అయిన నిజం.

ఏదయినా లక్ష్యం పెట్టుకొని సాధించాలనుకొనేవారు తమలో సహజంగా ఉన్న సామర్థ్యాలను బయటకు తెచ్చుకొని కృషిచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో - మీలో ఉన్న సహజ సామర్థ్యాలను గుర్తించడానికి ఈ మిలియన్ డాలర్ కొశ్చన్ ఎక్సర్‌సైజు బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా ఒక ప్రణాలిక ప్రకారం మీరు కృషి చేస్తారు.

అది మీకు ఎంతో ఇష్టమైన పని, మీరు చేయగలనని నమ్మిన పని కాబట్టి.. సక్సెస్ సహజంగానే మిమ్మల్ని వరిస్తుంది.

సో, ఇప్పుడు మళ్లీ ఒక్కసారి మీరు రాసుకొన్న సమాధానాల్ని చూడండి. తర్వాత మీరేం చేయాలో మీకు ఎవరూ చెప్పనక్కర్లేదు!      

Saturday 12 October 2013

మిలియన్ డాలర్ కొశ్చన్! [1]

ఓకే... ఏదో ఓ సోర్స్ నుంచి మీకు ఓ కోటి రూపాయలు వచ్చాయనుకుందాం. ఆ సోర్స్ లాటరీ కావొచ్చు. ఎవరో ఒక దూరపు చుట్టం ఠపీమని పోవడం ద్వారా కావొచ్చు. ఓ పెద్ద ధనవంతుని ఏకైక కూతుర్ని ఊహించని పరిస్థితుల్లో పెళ్లిచేసుకోవడం ద్వారా కావొచ్చు. లేదంటే "గ్రాఫిక్ ఎఫెక్టు"లో ఆకాశం నుంచి డైరెక్టుగా మీ బెడ్‌రూంలో పడిపోవడం ద్వారా కావొచ్చు.

మొత్తానికి ఓ కోటి రూపాయలు మీ సొంతమయ్యాయి. వాట్ నెక్‌స్ట్? సరదాగా ఓ ఇమాజినేషన్ గేమ్‌లా ఆలోచించి చూడండి. ఏం చేస్తారు?

ముందు ఏవయినా చిన్న చిన్న అప్పులూ, అడ్జెస్టుమెంట్లూ ఉంటే తీర్చేస్తారు. ఓ చిన్న ఫ్లాట్, ఓ చిన్న కారు కొనుక్కోవచ్చు. ఇంట్లో మీ పిల్లలకు ఇష్టమైన హోం థియేటర్ సిస్టమ్, ఫర్నిచర్, మీ జీవిత భాగస్వామికి ఆమె/అతడు ఊహించని ఓ రేంజ్ గిఫ్టులు వగైరా కొనవచ్చు. ఇంకా ఏం చేస్తారు?

మీరొక్కరో, కుటుంబసభ్య్లతోనో, స్నేహితులతోనో మీకు అత్యంత ఇష్టమైన టూరిస్టు స్పాట్స్‌కు వెళ్లి, ఓ నాలుగు రోజులు ఫుల్‌గా ఎంజాయ్ చేసి రావొచ్చు.

మీకు పిల్లలుంటే వాళ్లకి ఇష్టమైన లేటెస్ట్ ఎలెక్ట్రానిక్ గాడ్గెట్స్ కొన్ని కొనివ్వవచ్చు. ముందు జాగ్రత్తగా (అసలదంటూ ఉంటే మీలో!), కొంత డబ్బుని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. మీలో ఏ మూలో ఉన్న సేవాగుణం బయటికి వచ్చి, ఏదో ఓ చారిటీ సంస్థకు కొంత దానం చేయించవచ్చు. ప్రతిరోజూ మీ స్నేహితులతో పార్టీలు కూడా చేసుకోవచ్చు.

ఇలా, మీరు ఏం చేసినా ఒక నెలరోజులవరకే చేయగలరు. ఆ తర్వాత ప్రతీదీ మొహం మొత్తుతుంది. ఇదంతా ఉట్టి బోర్ అవుతుంది. ఆ తర్వాతేంటి?

ఇదే మిలియన్ డాలర్ కొశ్చన్.

మీకు ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. ఏదీ అడ్డుకాదు. ఎలాంటి పరిమితులు కూడా లేవు. ఇలాంటి మానసిక స్థితిలో మీరు చేపట్టబోయే మొట్టమొదటి అర్థవంతమైన పని ఏంటి?

"ఈ పని చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాను" అని మీరు కాన్‌ఫిడెంటుగా అనుకొనే ఆ పని ఏంటి? ఏ ఆర్థిక ఇబ్బందులు లేని స్థితిలో మీ సమయాన్ని ఎలా గడుపుతారు? ఏం సాధించాలనుకొంటారు? ఏ రికార్డులు క్రియేట్ చేయాలనుకొంటారు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాల్ని ఒక తెల్ల కాగితంపైన చాలా స్పష్టంగా రాసుకోండి.

ఈ సమాధానాలన్నింటి సారాంశమే రేపటి మీ లక్ష్యం ..   

Tuesday 8 October 2013

నిజమైన ట్రెండ్ సెట్టర్ ఎవరు?

నా చిన్నతనంలో చిరంజీవి, కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో వరుసగా సినిమాలు వచ్చేవి. ఇళయరాజా సంగీతం, వేటూరి పాటలు. బాలు, చిత్ర గానం. యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్ వంటి దిగ్గజాల స్క్రిప్టు. రాధ, విజయశాంతి, మాధవి, సుహాసిని వంటి టాప్ రేంజ్ హీరోయిన్లు. ఒక సిల్క్ స్మిత. ఇంకేం కావాలి?

ఆ కాంబినేషన్, ఆ సెటప్‌తోనే సినిమాకు ఒక భారీతనం వచ్చేది. సినిమా ఇంకా పూర్తవకముందే, కేవలం ఆ సెటప్‌తోనే ప్రాజెక్టుకు ఒక "సక్సెస్" ఫీల్ వచ్చేది. సినిమాలో ఏ కొంచెం స్టఫ్ ఉన్నా అది బాగా ఆడేది.

కట్ టూ ఇంకో సెటప్ -

ఇప్పుడు ఏ బ్రాండెడ్ హీరో సినిమా అయినా, సగటున 30 నుంచి 50 కోట్ల వరకు బడ్జెట్ ఉంటోంది. లేటెస్టుగా ఇది 100 కోట్లకు కూడా చేరబోతోంది!

ఆల్రెడీ మార్కెట్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్. భారీ హీరో. భారీ నిర్మాత. మరింత భారీ బడ్జెట్. టాప్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్, టాప్ రేంజ్ హీరోయిన్లు. కనీసం రెండు మూడు దేశాల్లో షూటింగ్.

అప్పటికీ ఇప్పటికీ చిన్న తేడా ఏంటంటే - ఎవరో ఒకరిద్దరు దర్శకుల్ని మినహాయిస్తే, ఇప్పుడు, సుమారు 80 శాతం సినిమాలకి రచయితలంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండటం లేదు. "కథ-స్క్రీన్‌ప్లే-మాటలు" దర్శకులే రాసుకుంటున్నారు!

ఇలాంటి సెటప్‌లో సినిమా చేయటం కూడా అంత గొప్ప విషయం కాదు. ఇన్ని రిసోర్సెస్ పెట్టుకున్న తర్వాత, ఆ చిత్ర దర్శకుని టాలెంట్ జస్ట్ ఒక ట్రంప్ కార్డులా పనిచేస్తే చాలు. సినిమా సక్సెస్ అదే అవుతుంది. అలా అవలేదంటే మాత్రం లోపం ఆ దర్శకునిదయినా కావాలి. లేదంటే, ఆ దర్శకుని టాలెంటునీ, ఫ్రీడమ్‌నీ ప్రభావితం చేసిన సదరు బ్యానర్/నిర్మాత/సోకాల్డ్ హీరో ఇమేజ్ అయినా కావాలి.  

చెప్పొచ్చేదేంటంటే - పైన చెప్పుకున్న రెండు రకాల సెటప్స్‌లోనూ సక్సెస్ ఇవ్వడం అంత గొప్ప విషయం కాదు.

కానీ ..

ఏ మాత్రం ఇమేజ్ లేని కొత్త ఆర్టిస్టులతో ఒక "స్వర్గం నరకం" తీసి భారీ సక్సెస్ చేయటం గొప్ప విషయం. ఏ మాత్రం ఇమేజ్ లేని కొత్త పాత నటీనటులతో ఒక "మరో చరిత్ర" తీసి సక్సెస్ చేయటం గొప్ప విషయం.

కట్ టూ మారుతి -  

పైన చెప్పుకున్న పెద్ద సెటప్ సినిమాల కథా చర్చల ఖర్చులకు కూడా ఏ మాత్రం సరిపోని బడ్జెట్‌తో, అంతా కొత్తవాళ్లతో, కొత్త డిజిటల్ టెక్నాలజీతో "ఈ రోజుల్లో" సినిమా తీసి సక్సెస్ సాధించిన దర్శకుడు మారుతి నా దృష్టిలో సిసలైన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. నిజమైన ట్రెండ్ సెట్టర్.

తర్వాత కూడా అదే కొత్త టెక్నాలజీని ఫాలో అవుతూ - "బస్టాప్", "పేమ కథా చిత్రమ్" సినిమాలను కూడా తీసి సక్సెస్ సాధించాడు మారుతి. ఈ రెండు సినిమాల్లో కూడా దాదాపు అంతా కొత్తవాళ్లే. లేదా.. ఇమేజ్ లేని నటీనటులే.

కాలంతోపాటు మనిషి జీవనశైలి మారింది. యువత విషయంలో ఈ మార్పు మరింత ఫాస్ట్‌గా ఉంది. ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందటిలాగే మనం జీవిస్తున్నామా? మన జీవనశైలి అలాగే ఉందా? రియలిస్టిక్‌గా పెట్టిన కొన్ని ఆడల్ట్ కామెడీ డైలాగులను/సీన్లను మాత్రమే పట్టేసుకొని, మారుతిని "బూతు బ్రహ్మ", "బూతు చిత్రాల దర్శకుడు" అని ముద్ర వేయడం ఆత్మ వంచన. అత్యంత దారుణమైన హిపోక్రసీ.

ఆ మాటకొస్తే - సుమారు 30 ఏళ్లక్రితం నాటి సినిమాల్లో కూడా డైరెక్ట్ బూతు డైలాగులున్నాయి. అప్పుడంతా కేవలం బూతు కోసమే బూతు చొప్పించటం. ఇప్పుడలా కాదు. వేగంగా మారుతున్న కాలం. మారిన యువతరం జీవనశైలి.

చెన్నైలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ వాష్ రూముల్లోని పైప్స్ నిండా కండోమ్‌స్ నిండిఫోయి, ఆ కంపెనీ బిల్డింగుకే భారీ రిపేర్లు చేయాల్సి వచ్చిన వార్తని మనం చదవలేదా? ఇలాంటి ఇంకెన్నో వార్తలు మనం నిత్యం టీవీలో చూడ్డం లేదా?    
హిందీలో అమీర్ ఖాన్ "డెల్లీ బెల్లీ" నుంచి, నిన్నటి "ప్యార్ కా పంచ్‌నామా" సినిమాల్లోని డైలాగులు/సీన్ల విషయమేంటి? అసలు ఆస్కార్, కేన్స్ అవార్డులు పొందిన ఎన్నో సినిమాల్లోని సీన్లు, డైలాగులు మనవాళ్లకి ఏమయినా తెలుసా?

మనిషి నిజ జీవితం, జీవనశైలి, జీవితంలోని సంఘటనలు తప్పకుండా సినిమా స్క్రిప్టుల్లోనూ ఉండి తీరతాయి. అలాగని, మారుతి అన్ని సినిమాల్లోనూ ఆడల్ట్ కామెడీనే ప్రధానంగా లేదు. అతని రచన, నిర్మాణంలో వచ్చిన "ప్రేమ కథా చిత్రమ్" పూర్తిగా భిన్నమయిన సినిమా.  

అసలిదంతా సోకాల్డ్ క్రిటిక్స్ సృష్టి. వారు చేయగలిగింది, వారి క్రియేటివిటీ ఇంతవరకే పరిమితం. ఆ బాక్స్ దాటి మనవాళ్లు ఎన్నటికీ బయటికి రాలేరు.

కట్ టూ మన అసలు పాయింట్ -

సింపుల్‌గా చెప్పాలంటే - 40 కోట్ల బడ్జెట్‌తో 20 కోట్లు సంపాదించడం గొప్ప విషయం కాదు. 40 లక్షల బడ్జెట్‌తో 20 కోట్లు సంపాదించడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విషయమే.

భారీ హంగులతో, బ్రాండెడ్ హీరో హీరోయిన్లతో సినిమా తీసి సక్సెస్ చేయడం గొప్ప విషయం కాదు. అంతా కొత్తవాళ్లతో, కొన్ని లక్షల్లోనే సినిమా తీసి సక్సెస్ చేయడమనేది ఖచ్చితంగా గొప్ప విషయమే.

ఆ టాలెంట్ మారుతిలో ఉంది. నిర్మాతగా కూడా ఆయన స్వంత బేనర్ నుంచి 7 సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు!   

Monday 7 October 2013

మీ పిల్లల "ఆర్ట్" ఇక పదిలం!

ఓయూ లో నేను చదివిన నాలుగేళ్లలో, నేను నిజంగా బాగా ఎంజాయ్ చేస్తూ చదివిన చదువు - నా మూడేళ్ల రష్యన్ డిప్లొమా. పార్ట్ టైమ్ కోర్సు.

రష్యన్ డిప్లొమాలో నన్నూ నా వ్యక్తిత్వాన్నీ అమితంగా ప్రభావితం చేసిన ప్రొఫెసర్ మురుంకర్ ఇంటికి నేను క్యాంపస్‌లో ఉన్నప్పుడు కనీసం ఓ రెండుసార్లు వెళ్లాను. వాళ్ల అబ్బాయి అమిత్‌ని నేను చూసింది కూడా అప్పుడే.

ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో టెక్నాలజికల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అమిత్ చిన్నప్పుడు బాగా బొమ్మలు వేసేవాడు. ఎన్నో కాంపిటీషన్స్‌లో ఎన్నో ప్రైజులను కూడా గెల్చుకొనేవాడు. అయితే చిన్నప్పటి తన ఆర్ట్ అంతా ఇప్పుడు చూసుకొందామంటే.. అవేవీ ఇప్పుడు లేవు.

అవన్నీ దాచుకోలేకపోయాననే బాధ అతనిలోని సృజనాత్మకతని తట్టిలేపింది. అంతే.

ఐఫోన్ కోసం ఒక యాప్‌ని క్రియేట్ చేసి, ఐట్యూన్స్‌లోకి అప్‌లోడ్ చేశాడు. అక్కడనుంచి ఎవరయినా దాన్ని తమ ఐఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అమిత్ క్రియేట్ చేసిన ఆ యాప్ పేరు - కాన్వాస్‌లీ (Canvsly).

కాన్వాస్‌లీ యాప్‌తో ఈనాటి తల్లిదండ్రులు తమ చిన్నారుల సృజనాత్మకతని ఐఫోన్‌తో ఫోటోలు తీయవచ్చు. అలా తీసిన ఫోటోలని ఒక క్రమ పధ్ధతిలో ఆర్గనైజ్ చేయవచ్చు. షేర్ చేయవచ్చు.   

అన్నిటికంటే ముఖ్యంగా - తమ పిల్లల చిన్నతనం నాటి సృజనాత్మక జ్ఞాపకాలని భద్రంగా దాచిపెట్టుకోవచ్చు. వారు పెద్దయ్యాక, వాటన్నిటినీ చూపించి వాళ్లని సర్‌ప్రైజ్ కూడా చేయవచ్చు.

ఇంచుమించు ఇదే ప్రయోజనంతో రూపొందిన "ఆర్ట్‌కీవ్" (Artkive) వంటి యాప్‌లు ఇదివరకే కొన్ని వచ్చి ఉన్నాయి. అయినా, అమిత్ రూపొందించిన కాన్వాస్‌లీకి ఉండే ప్రత్యేకతలు దానికున్నాయి.

అన్నట్టు, మన హైదరాబాదీ అమిత్ మురుంకర్ రూపొందించిన ఈ కాన్వాస్‌లీ యాప్ 2013 సంవత్సరానికి "కీప్" (Kiip) అవార్డును కూడా సాధించడం విశేషం. అంతేకాదు. కాన్వాస్‌లీ - ఈ రంగంలో ఎప్పుడూ శిఖరాగ్రంలో ఉండే  జపాన్ వారి మన్ననలని కూడా పొందడం మరింత విశేషం!

కంగ్రాట్స్, అమిత్! నీనుంచి భవిష్యత్తులో ఒక భారీ సంచలనాత్మక ప్రొడక్టుని ఊహిస్తున్నాను.

ఇంక రెచ్చిపో..  

Sunday 6 October 2013

ఆ ఒక్క గంట సమయం మీకుందా?

ఏదయినా చేయండి. మీ నిద్రని కొంత తగ్గించుకోండి. మీ జీవిత భాగస్వామికీ, మీ పిల్లలకూ లంచాలూ, తాయిలాలివ్వండి. రోజూ ఆ సమయంలో రొటీన్‌గా చేసే ప్రతి చెత్త పనినీ కాసేపు మర్చిపోండి. అవసరం ఉన్నా లేకపోయినా ఆ పనిని చేసెయ్యాలన్న దురదని కూడా .. ఆ కొద్దిసేపు మర్చిపోండి.  

ఇంకా ఏ త్యాగమయినా సరే.. ఫరవాలేదు. చేసెయ్యండి. కానీ -

మీ దినచర్యలో మొదటి అరవై నిమిషాల సమయాన్ని మాత్రం మీ కోసం రిజర్వ్ చేసుకోండి. సంపూర్ణంగా.

ఈ ఒక్క గంట చాలు. మనకున్న 24 గంటల్లో - మనకోసం మనం కెటాయించుకొనే ఈ ఒక్క గంటకు మన జీవితగమనాన్నే మార్చివేసే శక్తి ఉంది. సరిగ్గా ఉపయోగించుకోగలిగితే.

ఈ ఒక్క గంటనే, టొనీ రాబిన్స్ వంటి "పీక్ పెర్ఫామెన్స్" స్పెషలిస్టులు, "అవర్ ఆఫ్ పవర్" గా చెప్తారు.

ముందుగా - ఈ ఒక్క గంటలో మనం ఏం చేయకూడదో చూద్దాం: 

> ఫేస్‌బుక్ జోలికి వెళ్లకండి. అలాగే ట్విట్టర్, ఇతర సోషల్ మీడియానీ మర్చిపోండి.

> నో ఈమెయిల్స్ ప్లీజ్!

> న్యూస్‌పేపర్ చదవొద్దుగాక చదవొద్దు. కనీసం ఆ ఒక్క గంట. మేగజైన్లు కూడా స్ట్రిక్ట్‌లీ నో. టీవీ ప్లగ్ పీకేసేయండి.

మరేం చేయాలి?

> అలవాటుంటే డైరీ రాయండి. లేదా బ్లాగ్ చేయండి. ఏదయినా రాయండి.

> నాలుగు గోడలు దాటి బయట ఒంటరిగా జాగింగ్‌కి వెళ్లండి. వాక్ చేయండి.

> అలా నడుచుకుంటూ వెళ్లి మీకిష్టమైన బండిపైనో, బంకు దగ్గరో టీ త్రాగండి.

> మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఏదయినా పుస్తకంలోని ఒక చాప్టర్ చదవండి.

> మీ అంతరంగాన్ని దర్శించుకోండి. మెడిటేషన్ చేయండి.

> మీ జీవనశైలి గురించి, మీ జీవిత లక్ష్యాల గురించి ఆలోచించండి.

> మీరెక్కడున్నారో తెలుసుకోండి. ఇంకా ఎంత దూరం వెళ్లాలో, ఏమేం చేయాల్సి ఉందో గుర్తించండి.

ఇదంతా ఏదో చిట్కాల బ్లాగ్ పోస్ట్ కాదు. సక్సెస్ సైన్స్! ఆధునిక జీవనశైలికి అలవాటుపడిపోయి, మనం మర్చిపోతున్న ఒక కళ. 

మీ దినచర్యలో మీకోసం మీరు కెటాయించుకోనే ఈ అరవై నిమిషాలకి నిజంగా చాలా శక్తి ఉంది. దీన్నొక అలవాటుగా చేసుకోండి. కేవలం ఒక్క నెల తర్వాత మీలో, మీ ఆలోచనల్లో, మీ జీవనశైలిలో ఎంతో మార్పు ఉంటుంది.

అది మీకిష్టమైన మార్పు. మీరు కోరుకున్న గమ్యానికి మిమ్మల్ని సులభంగా చేర్చే మార్పు.

ఆ మార్పు మీకవసరం. నాకవసరం. మనందరికీ అవసరం.