Tuesday 17 September 2013

మనీలోనే ఉంది మజా!

"ధనమేరా అన్నిటికీ మూలం" అన్నాడో ప్రఖ్యాత సినీ కవి. "మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే" అన్నాడు మరో ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ సిధ్ధాంతకర్త. ఈ రెండింటి అర్థం ఇంచుమించు ఒక్కటే.

డబ్బుకి చాలా వాల్యూ ఉంది!

ఇది నిజం కాదు అని ఎవరైనా అన్నారంటే - వారింకా పాత చింతకాయ పచ్చడి ఆలోచనా విధానంలోనే ఉన్నారనుకోవచ్చు. లేదంటే పచ్చి హిపోక్రసీ. అంతే. కాకపోతే - ఈ నగ్నసత్యాన్ని హిపోక్రాట్లు అంత సులభంగా ఒప్పుకోరు. చాలామంది హిపోక్రాట్లు అసలు ఒప్పుకోరు. ఆత్మ వంచన చేసుకుంటూ నానా వితండవాదాలు చేస్తారు. ఇలాంటి వాళ్లంతా చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉంటుంది.

అసలు డబ్బు సంపాదనలో ఉన్న మజానే వేరు. పోగొట్టుకున్నప్పటి మజా కూడా అంత తక్కువేం కాదు. ఈ రెంటి మజా ఆయా విపరీత విపత్కర స్థితులను ఆస్వాదించినవారికే తెలుస్తుంది. వ్యక్తిగతంగా నాకూ కొంత తెలుసు అని చెప్పడానికి నేనేం సిగ్గుపడటం లేదు. ఫీల్ కావటం లేదు.

"డబ్బెవరికి చేదు" అని కూడా అంటారు. ఈ టైటిల్‌తో ఒక తెలుగు సినిమా కూడా వచ్చింది. నిజానికి ఈ ప్రశ్నలోనే ఓ పెద్ద తిరకాసు, లేదా వైరుధ్యం ఉంది. మామూలుగా మనం అనుకునేదేంటంటే - "డబ్బు ఎవరికీ చేదు కాదు. అందరికీ కావాలనే ఉంటుంది" అని. కానీ అది ఉట్టి మాటలవరకే పరిమితం. ఏమాత్రం అవగాహన లేని మాట అది. నిజం వేరు. అది మరోలా ఉంటుంది.

ప్రతి వందమందిలో కేవలం ఒక అయిదుగురికి మాత్రమే డబ్బుపట్ల స్పష్టమయిన అవగాహన ఉంటుంది. సంపాదన అనేది వారి జీవన శైలిలో ఒక విడదీయరాని భాగమై ఉంటుంది. వీరికి మాత్రమే లిటరల్‌గా డబ్బు అనేది ఒక "అజ్మీర్ కలాకంద్"లా తీపిగా ఉంటుంది. వీరే మిలియనేర్లు, బిలియనేర్లు, సంపన్నులవుతారు.

మిగిలిన 95 శాతం మందికి డబ్బుపట్ల ఎంత మమకారం పైపైన ఉన్నా, వారు అనుకున్న గమ్యాన్ని ఎన్నటికీ చేరుకోలేరు. డబ్బు సంపాదనకు సంబంధించి, వారి అంతరాంతరాల్లో ఉండే ఎన్నో భయాలు, అపోహలు, వ్యతిరేక భావనలే ఇందుకు కారణం.

ఇవే, సమాజంలో 95 శాతం మంది సంపన్నులు కాకుండా అడ్డు గోడలుగా నిలుస్తాయి. అవేంటో తర్వాతి బ్లాగ్ పోస్టుల్లో చర్చిద్దాం. అందాకా, మీరూ ఆలోచించండి...        

No comments:

Post a Comment