Sunday 29 September 2013

తమిళంలో గుభాలించిన మన "సిరిమల్లె" పరిమళం!

ఈ మధ్యకాలంలో అంత సింపుల్ అందాన్ని తెరపైన చూడలేదు. ఫోటోల్లో కూడా.

ఆ అందం పేరు శ్రీదివ్య.

సుమారు మూడేళ్ల వయస్సులోనే బాలనటిగా తెరంగేట్రం చేసిన శ్రీదివ్య పుట్టింది హైదరాబాద్‌లోనే. తను కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్ అని కూడా ఇందాకే తెలుసుకున్నాను. అన్నట్టు, శ్రీదివ్య సోదరి శ్రీరమ్య కూడా తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

బాలనటిగా శ్రీదివ్య నటించిన తొలిచిత్రం 2000లో వచ్చిన "హనుమాన్ జంక్షన్". హీరోయిన్‌గా శ్రీదివ్య నటించిన తొలి చిత్రం "బస్టాప్" అనుకున్నాను. కాదు. హీరోయిన్‌గా శ్రీదివ్య నటించిన మొదటి సినిమా రవిబాబు దర్శకత్వం వహించిన  "మనసారా".

"మనసారా" నేను చూడలేదు. మారుతి "బస్టాప్"లో మాత్రం శ్రీదివ్య లుక్ సోసోగానే అనిపించింది. శ్రీదివ్యలోని యాక్టింగ్ స్కిల్స్‌తో పాటు, తనలోని నేచురల్ బ్యూటీని కాటన్ చీరల్లోనే అద్భుతంగా చూపించిన క్రెడిట్ ఒక్కరికే చెందుతుంది. అతను రామరాజు. "మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు" దర్శకుడు.

"మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు" చిత్రం కమర్షియల్‌గా ఎంత విజయవంతమయిందో నాకు తెలియదు. దర్శకుడు రామరాజుకి ఎంత పేరు తెచ్చిందో కూడా నాకు తెలియదు. శ్రీదివ్యకి మాత్రం చాలా గుర్తింపు వచ్చింది.

కట్ టూ అసలు పాయింట్ -

"బస్టాప్" సినిమా కమర్షియల్‌గా మంచి హిట్. ఆ తర్వాతే వచ్చిన "మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు" చిత్రం కూడా శ్రీదివ్యకి మంచి పాపులారిటీ తెచ్చింది. అయినా - టాలీవుడ్ నుంచి శ్రీదివ్యకి ఏమంతగా ఆఫర్లు వచ్చినట్టులేవు. అదే ఆశ్చర్యం!

మన పక్కనున్న తమిళ ఇండస్ట్రీ మాత్రం ఈ కాటన్ చీరెల కనువిందుని ఠక్కున పట్టేసింది. శ్రీదివ్య హీరోయిన్‌గా నటించిన (శివకార్తికేయన్ హీరో) తమిళ చిత్రం "వరుతపడాద వాలిబర్ సంఘం" అక్కడ మంచి బాక్సాఫీస్ హిట్ కొట్టింది. ఇంకో రెండు తమిళ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి!

తమిళ ఇండస్ట్రీకి నచ్చిన శ్రీదివ్య మనవాళ్లకి అంతగా ఆనకపోవడంలో ఆశ్చర్యంలేదు. కథ, కాకరకాయ ఎలా ఉన్నా, అందాలన్నీ ఆరబోస్తేనే తెలుగులో కుదురుతుంది. నిండా కప్పేస్తే ఇంక సినిమా ఎందుకు? బహుశా, మనవాళ్ల పాయింటాఫ్ వ్యూ అదే అయ్యుంటుంది ..  

Thursday 26 September 2013

"టెర్మినేటర్" స్క్రిప్టును 1 డాలర్‌కే అమ్ముకున్న డైరెక్టర్!

టైటానిక్, అవతార్ వంటి బ్లాక్‌బస్టర్ లను తీసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్‌స్ కెమెరాన్ గురించి తెలియని వారుండరు. కానీ -

1981 లో కెమెరాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. "పిరానా 2" అనే ఓ లో బడ్జెట్ హారర్ సినిమా తీసిన దర్శకుడిగా తప్ప, అతనికి ఎలాంటి గుర్తింపులేదు. హాలీవుడ్‌లో అతను దాదాపు ఎవరికీ తెలియదు.

నిజానికి ఈ  పిరానా 2 సినిమాను  ఇటలీలో షూట్ చేస్తున్న సమయంలోనే నానా సినిమా కష్టాలు పడ్దాడు కెమెరాన్. తను తీస్తున్న హారర్ సినిమా కంటే హారిబుల్‌గా ఉండేవి ఆయన పడే ఇబ్బందులు. నిద్ర అసలు పట్టేది కాదు. అస్వస్థత పాలయ్యాడు కూడా.

ఇటలీలోనే, అలాంటి ఒక నిద్ర పట్టని రాత్రి, కెమెరాన్‌కు ఒక నైట్‌మేర్ లాంటి కల వచ్చింది. కిచ్చెన్ లోని రకరకాల కత్తులను చేతిలో పట్టుకొన్న ఒక మెకానికల్ స్కెలిటన్ మంటల్లోంచి, పేలుళ్లలోంచి తనని తను ఈడ్చుకుంటూ వెళ్తూ కనిపించింది.

కలలో వచ్చిన ఆ "ఇమేజ్" కెమెరాన్ మైండ్‌లో అలా స్థిరపడిపోయింది. అదే తర్వాత అలా అలా డెవెలప్ అయి, మనిషి బాడీలోపల ఉండే ఒక రోబోటిక్ స్కెలిటన్‌గా అవతారం ఎత్తి, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మిక్స్ చేసిన  "టెర్మినేటర్" స్క్రిప్టుగా కెమెరాన్ చేతుల్లో రూపుదిద్దుకొంది.

ఈ స్క్రిప్టు పనంతా కెమెరాన్ ఎప్పుడు చేశాడనుకున్నారు?

తను తీసిన పిరానా 2  అంతగా నడవలేదు. మరిన్ని ఇబ్బందుల్లో పడిపోయాడు కెమెరాన్. ఉండటానికి ఇల్లు కూడా లేక ఫ్రెండ్స్ రూముల్లో షెల్టర్ తీసుకొని "టెర్మినేటర్" స్క్రిప్ట్ పూర్తి చేశాడు కెమెరాన్.

కట్ టూ వన్ డాలర్ - 

కెమెరాన్ రాసిన టెర్మినేటర్ స్క్రిప్ట్ చదివి, అతని హాలీవుడ్ ఏజెంట్  నిర్మొహమాటంగా "నో" చెప్పాడు. అసలు కెమెరాన్ అలాంటి స్క్రిప్ట్ రాసినందుకు చిరాకుపడ్దాడు.

అయితే కెమెరాన్ నిరాశ పడలేదు. తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఎవరూ ఆ స్క్రిప్టుని ఓకే చేయలేదు.

చివరికి, గేల్ యాన్ హర్డ్ అనే నిర్మాతకు ఆ స్క్రిప్టులో సంథింగ్ ఏదో ఉందనిపించింది. ఆమె అంతకు ముందు రోజర్ కార్మన్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసింది. అలాగే న్యూ వరల్డ్ పిక్చర్స్ బ్యానర్లో కూడా పనిచేసిన అనుభవం ఉందామెకు. డీల్ కుదిరింది.

ఒకే ఒక్క డాలర్‌కు ఆ స్క్రిప్టును గేల్ హర్డ్‌కు అమ్మేశాడు కెమెరాన్. కాకపోతే ఒక కండిషన్‌తో. డైరెక్షన్ చాన్స్ మాత్రం కెమెరాన్‌కే ఇవ్వాలి! అలాగే అని ప్రామిస్ చేసింది గేల్.

తర్వాతంతా చరిత్రే.

టెర్మినేటర్ చిత్రం కెమెరాన్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో మిలియన్ల వర్షం కురిపించింది. తర్వాత దానికి ఎన్నో సీక్వెల్స్ కూడా వచ్చాయి.

కొసమెరుపు -

టెర్మినేటర్ చిత్రంలో నటించినంత కాలం అర్నాల్డ్ ష్వార్జ్‌నిగ్గర్ "ఆ.. ఏదో తలతిక్క సినిమా.. చేస్తున్నాను" అని చాలా తక్కువచేసి చెప్పేవాడట. తర్వాత, ఆ తలతిక్క సినిమాతోనే అర్నాల్డ్ కూడా టాప్ రేంజ్‌కెళ్లాడన్న విషయం అందరికీ తెలిసిందే.

సో, ఒక "బ్రేక్" అంటూ వచ్చేదాకా సినిమా కష్టాలు కెమెరాన్‌కు కూడా తప్పలేదన్నమాట! 

Tuesday 24 September 2013

దేనికి 'మూడ్' లేదు?

రచయితలు, కవుల నోటివెంట తరచూ ఒక మాట వింటుంటాం.

"మూడ్ లేదు!"

ఈ మూడ్ మరిదేనికో కాదు. రాయడం కోసం! దీన్నే ఇంగ్లిష్‌లో "రైటర్స్ బ్లాక్" అంటారు. నిజానికి అసలు ఈ రైటర్స్ బ్లాక్ అనేది లేనే లేదు. ఒక భ్రమ. ఆ ప్రత్యేక సమయంలోని ఒక నెగెటివ్ మైండ్ సెట్. అంతే.

ఏదో మూడ్.. ఎక్కడ్నించో రావాలని ఎదురు చూస్తూ కూర్చుంటే రాదు. దేనికోసమైతే మనకు మూడ్ అవసరమో, నేరుగా విషయంలోకి దిగితే మూడ్ దానంతట అదే వస్తుంది. అంతేగాని, మూడ్ అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. ముఖ్యంగా ప్రొఫెషల్ రైటర్స్, ఇతర క్రియేటివ్ పీపుల్ విషయంలోనయితే సింపుల్‌గా ఇదొక సాకు. అంతే.

ప్రఖ్యాత అమెరికన్ రచయిత, జర్నలిస్టు, నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్వే ఈ విషయంలో ఒక చిన్న చిట్కా చెప్పాడు. అదేంటంటే -

"నీకు తెలిసిన ఏదయినా ఒక వాస్తవం గురించి ముందుగా ఒక వాక్యం రాయి. తర్వాత ఇంకో వాక్యం. ఆ తర్వాత ఇంకో వాక్యం. తర్వాత ఇంకోటి. ఆ తర్వాత ఆ "ఫ్లో" దానికదే అలా ముందుకు సాగిపోతుంది. నువ్వు రాయాలనుకున్నది రాస్తావు. బాగా రాస్తావు. అంతే కాదు, చాలా ఈజీగా కూడా రాయగలుగుతావు!"

అవును. నిజాలు రాయడానికి ఆలోచించే అవసరం ఉండదు. ఆ ఫ్లో అలా దానికదే వెళ్లిపోతుంది. ఒక ప్రవాహంలా.

ఈ హెమింగ్వే టెక్నిక్‌ను కేవలం రాయడం కోసమే కాదు. ఇంక దేనికయినా కూడా అప్లై చేయవచ్చు.

ఒక నిర్ణయం. ఒక భయం. ఒక సందిగ్ధం. ఏదయినా కావొచ్చు. "మనం ఆగిపోతున్నాం.. లేదా, ఎక్కడో ఏదో బ్రేక్ పడుతోంది" అనుకున్న సందర్భాల్లో, మనకి మనం, మనకు సంబంధించిన ఒక్క నిజం చెప్పుకోవాలి. లేదా, గుర్తు చేసుకోవాలి. తర్వాత ఇంకో నిజం. తర్వాత దానికే సంబంధించిన ఇంకో నిజం. ఇంకొకటి...

మబ్బులు చెదిరిపోతాయి. ఒక స్పష్టత వచ్చేస్తుంది. మనం ఎదుర్కొంటున్న సందిగ్ధత తొలగిపోతుంది. మనం దేని గురించయితే భయపడుతున్నామో అందులో అంత సీన్ లేదని తెల్సిపోతుంది. మనల్ని తెగ ఊగిసలాడిస్తున్న ఆ నిర్ణయం ఏదో ఠక్కున తీసేసుకుంటాం.

చివరగా ఒక నిజం -

ఇప్పటిదాకా మీరు చదివిన ఈ బ్లాగ్ పోస్ట్ హెమింగ్వే టెక్నిక్‌ని ఉపయోగించి రాసిందే! 

Saturday 21 September 2013

ఒక యాక్సిడెంట్ జీవితాన్నే మార్చివేసింది!

స్టాచుటరీ వార్నింగ్: "నేను చాలా పాజిటివ్ దృక్కోణంలో రాస్తున్న బ్లాగ్ ఇది. ఎవరినయినా బాధిస్తే క్షమార్హుణ్ణి."

అసలీ టాపిక్ మీద బ్లాగ్ రాయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ 'రాయాల్సిన అవసరం ఉంది' అని నాకనిపించింది.

నేను చేసిన పొరపాటును మరొకరు చేయకుండా ఉంటారు కనీసం.

కట్ టూ .. 4 జనవరి 2012, ఉదయం 11 గంటలు -

న్యూ బోయిన్‌పల్లిలో ఒక ఫార్మా ఆఫీసు ..

నాకు అత్యంత దగ్గరి బంధువుకి సంబంధించి నాకున్న ఆర్థిక లావాదేవీల విషయంలో - తన సంతృప్తికోసం - ఆ ఆఫీసులో ఉన్న ఆయన తరపు వ్యక్తి ఒకరు నిర్మొహమాటంగా నాకు వినిపించిన మాటలన్నీ విని, ఆయన అడిగినన్ని చెక్కులు రాసిచ్చి, ఆ ఆఫీసు నుంచి బయట పడ్డాను.

నేను చెక్కులు ఎవరికయితే రాసిచ్చానో - ఆ బంధువు నాకు చాలా దగ్గరి బంధువు. ఎంత దగ్గరి బంధువు అంటే... మా మామగారు చనిపోవడం వల్ల, సతీ సమేతంగా నా పెళ్లిలో నాకు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్యంత ఆత్మీయ బంధువు ఆయన!

అత్యంత ఇబ్బందికరమైన ఆ సంఘటన తాలూకు వేదన నన్నింకా వెంటాడుతూనే ఉంది. అయినా, ఎలాగో శ్రీనగర్ కాలనీకి దగ్గర్లో ఉన్న మా ఆఫీసుకి వెళ్లి నా పనిలో నేను మునిగిపోవడానికి ఎంతో ప్రయత్నించాను.

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ .. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలు -    

నా ఇంకో అతి దగ్గరివాడయిన ఆత్మీయ బంధువు, హైటెక్ సిటీలో ఉన్న తన ఆఫీసుకి వెళుతూ దారిలో నన్ను కలవడానికి వస్తున్నట్టు ఫోన్ చేశాడు. రమ్మన్నాను. శ్రీనగర్ కాలనీకి వచ్చాడు నా ఆత్మీయ బంధువు.

సుమారు 45 నిముషాల పాటు మాట్లాడుకున్నాము. నిజానికి అవి మాటలు కావు. వ్యక్తిగతంగా నేను అనుభవించిన మానసిక ఘోష.

ఒక ప్రశ్నకు నిజమైన జవాబు ఒకటే ఉంటుంది సాధారణంగా. ఎన్ని గంటలు ఎంత వేధించినా రెండో జవాబు ఉండదు. అదీ పచ్చి అబధ్ధమయితే తప్ప! కానీ అంత టాలెంట్ నాకు లేదు. సుగర్ కోటింగ్ ఇచ్చి పచ్చి అబధ్ధాలు చెప్పడం, మరేదో కల్పించి చెప్పడం నావల్ల అస్సలు కాదు. అందుకే ఉన్నది ఉన్నట్లుగా అప్పటి నా పరిస్థితి చెప్పాను.

నిజమే చెప్పాను.    

45 నిమిషాల ఆ ఘోష సరిపోలేదు. రాత్రికి ఆఫీస్ అయిపోయాక వెళ్లేటప్పుడు మళ్లీ వచ్చి కలుస్తాను. మళ్లీ మాట్లాడుకుందాం అన్నాడు నా ఆత్మీయ బంధువు.

"సరే" అన్నాను. ఇంకేమనగలను?

ఒక రిక్వెస్ట్ మాత్రం చేశాను. మానసికంగా, శారీరకంగా ఆ రోజు ఉదయం నుంచీ నా పరిస్థితి బాగా లేదు. నేను రోడ్ క్రాస్ చేసి అవతలివైపు రాలేను. "కొంచెం నువ్వే ఈ వైపుకి రా!" అన్నాను. తలవూపి వెళ్లిపోయాడు నా ఆత్మీయ బంధువు.

పనిలో మునిగిపోతేనే బాగుంటుందని మళ్లీ వెనక్కి వెళ్లి ఆఫీసులో దూరిపోయాను. పనిలో పడిపోతే అన్నీ మర్చిపోవచ్చని నా నమ్మకం.

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ రాత్రి 11 గంటలు -

ఆఫీసులో నా పని ముగించుకొని - బంజారాహిల్స్‌లోని పిజ్జా కార్నర్ వెనకున్న మా గెస్ట్ హౌజ్‌కి చేరుకున్నాను. పొద్దుటి జ్ఞాపకాలు వెంటాడుతోంటే - ఇంక ఆ రోజు లంచ్ చేయలేకపోయాను. రాత్రి భోజనం కూడా చేయాలనిపించలేదు.

నా బంధువు నుంచి కాల్ రానే వచ్చింది. "వస్తున్నాను. నువ్వలా కొంచెం రోడ్డుకి ఇటువైపు రా!" అని ఫోన్లోనే మరోసారి చెప్పేసి, స్లిప్పర్స్ వేసుకొని గెస్ట్ హౌజ్ నుంచి బయటపడ్డాను ఆ రాత్రి.

ఆ క్షణం నాకు తెలియదు. కాసేపట్లో నా జీవితం ఛిద్రమైపోతోందని.

పిజ్జా కార్నర్ దగ్గరికి వెళ్లాను. రోడ్డుకి అవతలివైపు బైక్ పార్క్ చేసుకొని, దాని మీద కూర్చుని వున్నాడు నా బంధువు. కనీసం వయసులో తనకంటే ఒక 12 ఏళ్లు పెద్దవాడినయిన నా వయసుకి, ఆనాటి నా మానసిక శారీరకస్థితికి, నా అభ్యర్థనకి ఎలాంటి విలువ ఇవ్వలేదు.

ఏం చేయగలను?

చాలా జాగ్రత్తగా అటూ ఇటూ చూసి, నన్ను నేను కంట్రోల్ చేసుకొంటూ రోడ్ డివైడర్ క్రాస్ చేసి, ఆవైపుకెళ్లాను.

కనీసం మరో గంటన్నర అక్కడ నా ఆత్మీయ బంధువు ఎదురుగా నిల్చున్నాన్నేను. ఒక దోషిగా .. అదేరోజు రెండోసారి!

మానిప్యులేషన్స్ చేసి నా జవాబులు మార్చలేను. మాస్కులు వేసి పచ్చి అబద్ధాలూ చెప్పలేను. మధ్యాహ్నం చెప్పిన మాటే చెప్పాను.

చాలా అసహనంగా - తను నాకు వినిపించాలనుకున్న మాటలు, నన్ను అనాలనుకున్న మాటలు, అనాల్సిన మాటలు అన్నీ అనేసి - బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడనుంచి వెళ్లిపోయాడు నా ఆత్మీయ బంధువు.

అప్పుడు అర్థరాత్రి 12.30 దాటింది. రోడ్డుకి రెండువైపులా జాగ్రత్తగా చూసాను. ఏ వెహికిల్ రావటం లేదు. నెమ్మదిగా రోడ్డు దాటడం మొదలెట్టాను.

ఆ తర్వాతేం జరిగిందో నాకు తెలియదు!
(ఓ పల్సర్ బైక్ వాడు నన్ను కొట్టేశాడని తర్వాత తెల్సింది. ఆ కేసు ఇంకా నడుస్తోంది..)

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ తెల్లవారుఝామున 2 గంటలు - 

అంబులెన్సులో కళ్లు తెరిచాను. నాకేం జరిగిందో నాకు తెలియదు. నా బాడీ నా అధీనంలో లేదు. తలలోంచి రక్తం, ఛాతీనిండా దెబ్బలు, చేతులకు దెబ్బలు, మోకాలిదగ్గర 17 ముక్కలుగా విరిగిపోయిన కాలు ..

ప్యారడైజ్ దగ్గర "సన్‌షైన్" హాస్పిటల్లోని ట్రౌమాలో నన్ను వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు నా బంధువు.

నా స్ట్రెచర్ పక్కగా నిల్చుని "నేనెవరు..నేనెవరు?" అంటూ ఏడుస్తూనే  నా భార్య సుజాత నన్ను పదే పదే అడుగుతోంది. బహుశా, తలకి తగిలిన దెబ్బతో నేను ఎక్కడ నా మతిస్థిమితం కోల్పోతాననో, ఏ కోమాలోకో వెళ్తాననో ఆమె భయం. నేను మగతలోకి వెళ్లకుండా శతవిధాలా ప్రయత్నిస్తోంది సుజాత.

నా తలనుంచి, ఇతర గాయాలనుంచి వస్తున్న రక్తం సుజాతలో ఇంక "జరగరానిదేదో" జరగబోతోందేమో నన్న భయాన్ని కలిగిస్తున్నాయనుకుంటాను. నేను వద్దు అంటున్నా కూడా వినకుండా, వరంగల్లో ఉన్న మా అమ్మకి ఫోన్ చేసింది సుజాత.

మరోవైపు - హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఒకరు "ఆపరేషన్ కోసం అడ్మిట్ చేస్తున్నారా.. లేదంటే పేషంట్‌ని ఇక్కనించి తీసుకెళ్తారా?" అనటం నాకు చాలా స్పష్టంగా వినిపిస్తోంది.

ఆ తర్వాతేం జరిగిందో నాకు తెలియదు.

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ మర్నాడు మధ్యాహ్నం - 

స్ట్రెచర్ మీద నన్ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తున్నారు. అంతా సీరియస్‌గా చూస్తున్నట్టు లీలగా తెలుస్తోంది నాకు. నన్ను ఆపరేషన్ కోసం లోపలికి తీసుకెళ్తోంటే  - సుజాత చెల్లెలు శారద మాత్రం ఒక్కసారిగా బావురుమంటూ ఏడవటం నాకు చాలా స్పష్టంగా వినిపించింది.  "అలా ఏడ్చొద్దు!" అని ఆమె భర్త రమేష్ అంటూండటం కూడా ఇప్పటికీ నాకు గుర్తుంది.

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ 20 నెలల తర్వాత - 

నేనిప్పుడు బాగున్నాను. యాక్సిడెంట్ కావడానికి ముందు నేను ఎంతో కష్టపడి సంపాదించుకొని, సైన్ చేసిన మూడు సినిమాల అవకాశాలు పోయాయి. అందులో ఒకటి నాకెంతో ఇష్టమయిన మళయాళం ప్రాజెక్టు. ఆ మూడు అవకాశాల మొత్తం విలువ కనీసం ఓ 30 లక్షలు. (ప్రాఫిట్స్‌లో షేర్ కాకుండా!)

నేనిప్పుడు బాగున్నాను. మోకాలి దగ్గర 17 ముక్కలుగా విరిగిపోయిన నా ఎడమ కాలు మాత్రం పూర్తిగా బెండ్ అవదు. ఇంక ఎన్నటికీ అవదు. సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కడం, దిగడం కుదరదు. మరొకరి సహాయం లేకుండా చిన్న గల్లీలో కూడా రోడ్డు దాటలేను.

సుమారు 9 నెలల బెడ్‌రెస్ట్ తర్వాత  .. నేనిప్పుడు బాగున్నాను.

బట్ - ఫిజికల్లీ చాలెన్‌జ్డ్!

నా కాలికి మళ్లీ ఇంకో ఆపరేషన్ అవసరం అన్నారు డాక్టర్లు. అదింకా పెండింగ్‌లోనే ఉంది. ఎప్పుడు చేయించుకుంటానో తెలియదు.

దాదాపు ఏడాదిపాటు నడవకుండా ఉండటం వల్ల - బెడ్ మీదే ఒరిగి కూర్చుని నా ల్యాప్‌టాప్‌లోనో, పుస్తకాలతోనో పని చేసుకోవడం వల్ల.. నా చెస్ట్ మీద కొన్ని వీన్స్ డైలేట్ అయ్యాయి. కొత్తగా ఇప్పుడు మరో సీరియస్ కంప్లయింటుకు కూడా టెస్టులు జరుగుతున్నాయి.

అయినాసరే, మళ్లీ నా ఆత్మీయ బంధువులిద్దరినుంచీ అదే ప్రెషర్, అవే మాటలు, అదే చెక్కుల గొడవ. అన్నీ మళ్లీ ఊపందుకొన్నాయి .. కళ్లముందు కనిపిస్తున్న నా పరిస్థితి చూస్తూ!

ఎందుకంటే, నేనింకా బ్రతికే ఉన్నాను కదా..

అయినా సరే. నేనిప్పుడు బాగానే ఉన్నాను. ఆ యాక్సిడెంట్ రోజు ప్రాణాలుపోకుండా ఇంకా బ్రతికే ఉన్నాను. ఇది నా పునర్జన్మ. ఈ కొత్త జన్మకి ఒక కనీస స్థాయి విలువని ఇవ్వటం ఇప్పుడు నాకు అవసరం.

నేను కోల్పోయిన నా క్రియేటివ్ ఫ్రీడమ్‌ని మళ్లీ వెనక్కి తెచ్చుకోవడం కూడా వ్యక్తిగతంగా నాకు చాలా అవసరం.    

కట్ టూ రియాలిటీ - 

ఒక వ్యక్తిగా, ఒక బంధువుగా కొన్నాళ్లక్రితం వరకూ నన్నెంతో గౌరవించి, ఎంతో బాగా చూసుకున్న ఆ ఇద్దరు ఆత్మీయ బంధువులు .. ఆ రోజు నన్ను అంత తీవ్రమయిన సంఘర్షణకి ఎందుకని గురిచేసారు? ఈ రోజు నన్నిలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?

వయసులో పెద్దవాడినయినా - నా అభ్యర్థనని మన్నించి, ఆ రాత్రి, నా ఇంకో బంధువు రోడ్డుదాటి ఈ వైపు వస్తే - ఈ రోజు ఇలా నేను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్ వ్యక్తిని అయ్యే పరిస్థితి ఉండేది కాదుగా? మరి ఆ నా ఆత్మీయ బంధువు ఎందుకని నా అభ్యర్థనని మన్నించలేకపోయాడు ఆ రాత్రి?

వాళ్లకి సంబంధించిన ఇతర విషయాలు నాకు తెలియవు. కానీ, నిజానికి నా ఆత్మీయ బంధువులిద్దరూ చాలా మంచివాళ్లు. అయితే, ఏ మనిషిలోనయినా - వారిలోని మంచితనానికి, మానవత్వానికి మాస్క్ వేసి, వాళ్లని శాడిస్టుల్ని, రాక్షసుల్ని చేయగల సత్తా ఈ ప్రపంచంలో ఒకే ఒక్క శక్తికుంది. అంతా దానివల్లే జరిగింది.

అదే ముఖ్యం మనకు. మన మనుషులు, మన కళ్లముందు కనిపిస్తున్న నిజాలు కాదు. అదే ముఖ్యం.
ఆ ఒక్కటే ముఖ్యం. అది లేకపోతే జీవితం లేదు. అదేంటో మీకు తెలుసు.

డబ్బు ..   

Wednesday 18 September 2013

మనం విధిగా చదవాల్సిన ఒక సబ్జెక్టు ఏంటో మీకు తెలుసా?

ఈ మధ్యే "ఐఫోన్5ఎస్" రిలీజయిందట! దాని ఖరీదు సుమారు 60 వేలు, అది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి!!

అర్థరాత్రివరకూ ఆ ప్రోగ్రాం చూశాడు మా పెద్దబ్బాయి ప్రణయ్. అది రిలీజ్ అవకముందు ఓ నెలక్రితమే నాకది కావాలంటూ ప్రణయ్ ఓ ఇండెంట్ నా ముందు పెట్టేశాడెప్పుడో! సరే, నవంబర్ చివర్లో కొనిస్తానన్నాను. ఎలా కొనిస్తానో తెలీదు కానీ, కొనిస్తానని మాత్రం నాకు తెలుసు. ప్రణయ్‌కు కూడా తెలుసు.

మన నిత్యజీవితంలో - మన ప్రతి చిన్న అవసరం, ఆలోచన, అడుగు.. ఏదయినా సరే - ప్రత్యక్షంగానో పరోక్షంగానో డబ్బుతో ముడిపడిఉంటుంది. ఈ నిజాన్ని ఒప్పుకోడానికి మనలో చాలామంది మనసు ఒప్పుకోదు.

అందుకే మనం అక్కడే ఉంటాం. కొందరుమాత్రం ఎక్కడికో వెళ్లిపోతారు. అలా వెళ్లిపోయేవాళ్లకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ పైనే వాళ్ల లేజర్ ఫోకస్ ఉంటుంది. ఆ విజన్‌ను వాళ్లు నిజం చేసుకుంటారు. అలాగని వాళ్లేదో బాగా డిగ్రీలకు డిగ్రీలు చదివినవాళ్లేం అయ్యుండరు. చదువుకీ సంస్కారానికీ ఎలాగయితే సంబంధం లేదో, చదువుకీ సంపాదనా సామర్ధ్యానికి కూడా ఎలాంటి సంబంధం లేదు.

ఇలాంటి ఉదాహరణలను మనలో కొందరు "అదృష్టం" అంటారు. అలా అనుకోవటం నిజంగా మన (అలా అనుకుని సంతృప్తిపడేవాళ్ల) "దురదృష్టం."

ప్రపంచంలో ఏ మూలనైనా, ఏ దేశంలోనైనా - కేవలం 5 శాతం లోపు వ్యక్తులే డబ్బు సంపాదిస్తారు. మిగిలిన 95 శాతం మంది వాళ్లు సంపాదించుకోడానికి ఉపయోగపడుతుంటారు. ఇది 100 శాతం నిజం. ఎవ్వరూ కాదనలేని నిజం. ఈ నిజం వెనక ఉన్న "సీక్రెట్" గురించి తెలుసుకొనేముందు - మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. అది - మన చదువులు.

చిన్నపటి నుంచీ మనం అందరం ఒక గొర్రెల మంద వ్యవస్థను అనుసరించే ముందుకు సాగిపోతున్నాం. ఏ విషయంలోనైనా. మన విద్యా వ్యవస్థ అందుకు మినహాయింపు కాదు.

మన మాతృభాష చదుతున్నాం. లెక్కలు, సైన్స్, సాంఘిక శాస్త్రం, అదీ ఇదీ చదివి చివరికి పదో తరగతి పాసవుతున్నాం. తర్వాత - అయితే బైపీసీ, లేదంటే ఎంపీసీ. ఈ రెండు తప్ప ఇంక చదువులు లేనట్టే! ఆ తర్వాత కూడా అయితే డాక్టర్, లేదంటే ఇంజినీర్. (ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.) మిగిలిన ప్రొఫెషన్స్ అసలు ప్రొఫెషన్స్ కావు!

వీటన్నిటితోపాటు - మనం తప్పనిసరిగా - కనీసం 7 వ తరగతి నుంచే నేర్పించాల్సిన సబ్జెక్ట్ ఒకటుంది. అదే - "ఫినాన్షియల్ ఇంటలిజెన్స్!"

కట్ టూ ఒక కఠోర సత్యం -

ఫర్ యువర్ కైండ్ ఇన్‌ఫర్మేషన్... మన "ఎకనామిక్స్", "ఎమ్‌బీయే"  లకూ దీనికీ ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి బాధపడుతున్నాను. కేవలం వారం క్రితం మా ఆఫీసులో రెసెప్షనిష్ట్ ఉద్యోగం కోసం (చాలా తక్కువ జీతం) చాలా మంది బీటెక్కులతో పాటు ఒక ఎంబీయే, ఒక పీజీ ఎకనమిక్స్ కూడా వచ్చారు! సో, మనం అనుకుంటున్న ఫినాన్షియల్ ఇంటలిజెన్స్ వేరే అన్నమాట.

బ్యాక్ టూ మన సబ్జెక్టు -

మనం చర్చిస్తున్న ఫినాన్షియల్ ఇంటలిజెన్స్‌ను తెలుగులో ఆర్థిక పరిజ్ఞానం అనవచ్చేమో తెలియదు. ఇప్పటికయితే అలా అనుకుందాం.  ఈ సబ్జెక్టులో సాధారణ పరిజ్ఞానం లేకుండా ఎన్ని సబ్జెక్టులు చదివినా వృధా.

కేవలం కొంతమందికి మాత్రమే ఈ సబ్జెక్టులో ప్రవేశం ఉంటుంది. అది కొందరికి వారసత్వంగా రావొచ్చు. సహజంగా రావొచ్చు. వారు ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల రావొచ్చు. వారి భవిష్యత్తు పట్ల వారుతీసుకొన్న ఒక స్థిరమైన నిర్ణయం ఇచ్చే కిక్ వల్ల రావొచ్చు. ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొని, "ఇంక చాలు ఈ డ్రామా" అనుకున్న ఆ ఒక్క పవర్‌ఫుల్ క్షణం వల్ల కావొచ్చు.

మొత్తానికి - కేవలం కొంతమందికి మాత్రమే ఈ ఫినాన్షియల్ ఇంటలిజెన్స్ అనేది ఉంటుంది. వాళ్లే ముందు మనం చెప్పుకున్న ఆ అయిదు శాతం మంది సంపాదనాపరులు. లేదా ధనవంతులు. డబ్బు విలువ వీరికి తెలిసినంతగా మిగిలిన 95 శాతం మందికి తెలియదు. కొంతమంది మాత్రం చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. కొంతమంది జీవిత చరమాంకంలో కూడా వారి భ్రమల్లో వారు బ్రతుకుతూ జీవితం ముగిస్తారు.

ఈ సత్యం తెలుసుకోడానికి నాకు పట్టిన సమయం - ఒక పూర్తి దశాబ్దం. చెప్పాలంటే, ఇంకా ఎక్కువే! అది నా జీవితంలో అత్యంత కీలకమైన దశ కావడమే నన్ను బాధిస్తుంది. కానీ, నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. కనీసం ఈ విషయంలో ఇప్పటికయినా జ్ఞానోదయం అయింది!

ఈ రోజు నుంచి కొత్తగా జీవితం ప్రారంభించినా చాలు. మనం ఏదయినా సాధించవచ్చు. మనకు కావల్సినంత డబ్బు సంపాదించవచ్చు. మనం అనుకున్న జీవనశైలిని ఎంజాయ్ చేయవచ్చు. ఇంకేదయినా చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే - గత 12 ఏళ్లలో సాధించలేనిదీ సంపాదించలేనిదీ, కేవలం వచ్చే 12 నెలల్లో సాధించవచ్చు. సంపాదించవచ్చు.  ఫినాన్షియల్ ఇటలిజెన్స్ పవర్ అలాంటిది.     

Tuesday 17 September 2013

మనీలోనే ఉంది మజా!

"ధనమేరా అన్నిటికీ మూలం" అన్నాడో ప్రఖ్యాత సినీ కవి. "మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే" అన్నాడు మరో ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ సిధ్ధాంతకర్త. ఈ రెండింటి అర్థం ఇంచుమించు ఒక్కటే.

డబ్బుకి చాలా వాల్యూ ఉంది!

ఇది నిజం కాదు అని ఎవరైనా అన్నారంటే - వారింకా పాత చింతకాయ పచ్చడి ఆలోచనా విధానంలోనే ఉన్నారనుకోవచ్చు. లేదంటే పచ్చి హిపోక్రసీ. అంతే. కాకపోతే - ఈ నగ్నసత్యాన్ని హిపోక్రాట్లు అంత సులభంగా ఒప్పుకోరు. చాలామంది హిపోక్రాట్లు అసలు ఒప్పుకోరు. ఆత్మ వంచన చేసుకుంటూ నానా వితండవాదాలు చేస్తారు. ఇలాంటి వాళ్లంతా చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉంటుంది.

అసలు డబ్బు సంపాదనలో ఉన్న మజానే వేరు. పోగొట్టుకున్నప్పటి మజా కూడా అంత తక్కువేం కాదు. ఈ రెంటి మజా ఆయా విపరీత విపత్కర స్థితులను ఆస్వాదించినవారికే తెలుస్తుంది. వ్యక్తిగతంగా నాకూ కొంత తెలుసు అని చెప్పడానికి నేనేం సిగ్గుపడటం లేదు. ఫీల్ కావటం లేదు.

"డబ్బెవరికి చేదు" అని కూడా అంటారు. ఈ టైటిల్‌తో ఒక తెలుగు సినిమా కూడా వచ్చింది. నిజానికి ఈ ప్రశ్నలోనే ఓ పెద్ద తిరకాసు, లేదా వైరుధ్యం ఉంది. మామూలుగా మనం అనుకునేదేంటంటే - "డబ్బు ఎవరికీ చేదు కాదు. అందరికీ కావాలనే ఉంటుంది" అని. కానీ అది ఉట్టి మాటలవరకే పరిమితం. ఏమాత్రం అవగాహన లేని మాట అది. నిజం వేరు. అది మరోలా ఉంటుంది.

ప్రతి వందమందిలో కేవలం ఒక అయిదుగురికి మాత్రమే డబ్బుపట్ల స్పష్టమయిన అవగాహన ఉంటుంది. సంపాదన అనేది వారి జీవన శైలిలో ఒక విడదీయరాని భాగమై ఉంటుంది. వీరికి మాత్రమే లిటరల్‌గా డబ్బు అనేది ఒక "అజ్మీర్ కలాకంద్"లా తీపిగా ఉంటుంది. వీరే మిలియనేర్లు, బిలియనేర్లు, సంపన్నులవుతారు.

మిగిలిన 95 శాతం మందికి డబ్బుపట్ల ఎంత మమకారం పైపైన ఉన్నా, వారు అనుకున్న గమ్యాన్ని ఎన్నటికీ చేరుకోలేరు. డబ్బు సంపాదనకు సంబంధించి, వారి అంతరాంతరాల్లో ఉండే ఎన్నో భయాలు, అపోహలు, వ్యతిరేక భావనలే ఇందుకు కారణం.

ఇవే, సమాజంలో 95 శాతం మంది సంపన్నులు కాకుండా అడ్డు గోడలుగా నిలుస్తాయి. అవేంటో తర్వాతి బ్లాగ్ పోస్టుల్లో చర్చిద్దాం. అందాకా, మీరూ ఆలోచించండి...        

Saturday 14 September 2013

హాట్ హాట్‌గా రెడీ అవుతున్న షకీలా ఆత్మకథ!

అసలు షకీలా కథే వేరు.

ఈ ఒక్క వాక్యం చాలు అనుకుంటాను తను ఎంత బోల్డో చెప్పడానికి!

నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చిన షకీలా కూడా, సిల్క్ స్మిత లాగే, "ఏదో ఒక పని చేసుకుందాం, బ్రతుకుదాం" అన్న ఉద్దేశ్యంతోనే ముందుగా సినిమాల్లోకి ఎంటరయ్యింది. తర్వాత షరా మామూలే.

సినీ ఫీల్డులోని అన్ని ఆకర్షణలు, గ్లామర్ బాగా నచ్చాయి. అంత సులభంగా ఎక్కడా రానంత డబ్బూ కనిపించింది. అంతే, ఫిక్స్ అయిపోయింది. ఇక సినీ ఫీల్డే తన ఫీల్డనుకుంది.

తమిళంలో "ప్లేగర్ల్స్" అనే 'సాఫ్ట్‌కోర్' మూవీతో తన సినీ ప్రయాణం మొదలెట్టింది షకీలా. ఈ సినిమాలో సిల్క్ స్మిత మెయిన్ హీరోయిన్ కావడం విశేషం. తర్వాత "కిన్నెర తుంబికర్" అనే ఓ మళయాళం మూవీతో మొదటిసారిగా పాప్యులర్ అయింది. ఇంక అంతే.

తర్వాతంతా షకీలా చరిత్రే!

ఇప్పటివరకు సుమారు 110 సినిమాల్లో నటించిన షకీలా - ఎక్కువగా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ హిందీ సినిమాల్లో నటించింది. షకీలా నటించిన ఈ సినిమాలన్నీ దాదాపు "బి" గ్రేడ్ 'సాఫ్ట్‌కోర్' సినిమాలుగానే చెప్తారు. ఒక టైమ్‌లో - "షకీలా సినిమా" అన్న పదాన్ని "సాఫ్ట్ పోర్న్" సినిమాకు పర్యాయపదంగా వాడేవారు!

షకీలా సినిమాల పాప్యులారిటీ ఒక దశలో మన ఇరుగుపొరుగు విదేశీ భాషల్లోకి కూడా విస్తరించింది. షకీలా సాఫ్ట్‌కోర్ సినిమాలన్నీ నేపాలీ, చైనీస్, సిం హళ భాషల్లోకి కూడా డబ్ చేసి మార్కెట్ చేయబడ్డాయి!  

కట్ టూ రియల్ షకీలా -

సినిమాలో షకీలా వేరు. బయట వేరు. చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతుంది. చాలా చక్కటి గౌరవమర్యాదల్ని పాటిస్తుంది.

నేను తనని మొదటిసారిగా అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో షూటింగ్ జరుగుతుండగా ఒకసారి, పద్మాలయా స్టూడియోలో పాట షూటింగ్ జరుగుతుండగా మరొకసారి కలిశాను. అలా కలిసినప్పుడు, షాట్ గ్యాప్‌లో బాగానే సిగరెట్లు కాలుస్తూ కనిపించింది షకీలా.

షూటింగ్‌లో తాను ధరించే కాస్ట్యూమ్‌లన్నీ కాస్త ఎక్స్‌పోజింగ్‌గానే ఉంటాయి కాబట్టి - షాట్ గ్యాప్‌లో, పైన ఒక నైటీలాంటి దాన్ని కిందనుంచి మీది వరకూ వేసేది షకీలా. సిగరెట్ మామూలే.

ఆ షూటింగ్‌లోనే, షాట్ గ్యాప్‌లో నేను తనతో మాట్లాడుతూ ఉండగా, చేతిలో క్లాప్‌బోర్డుతో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి "మేడం! షాట్ రెడీ!!" అన్నాడు ఉత్సాహంగా.

"ఏంటి షాట్?" అడిగింది షకీలా.

"పెద్ద షాటేం కాదు మేడమ్.. చిన్న బిట్టే!" అన్నాడా అసిస్టెంట్.

"లేదమ్మా.. ఇప్పుడు నేను "బిట్‌" లు చేయటంలేదు." అంది షకీలా.

ఇక్కడ "బిట్" అంటే అర్థం ఏదో ఎక్స్‌పోజింగ్ సీనో, ఎక్స్‌పోజింగ్ షాటో అన్నమాట! అప్పటికి నిజంగానే తన 'మార్కు' సాఫ్ట్‌కోర్ సినిమాల్ని మానేసి - కేవలం తెలుగు, తమిళ భాషల్లో మామూలు కేరెక్టర్ రోల్స్ చేస్తోంది షకీలా.  అది బహుశా 2003.

అసలు 'తన మార్కు' షకీలా సినిమాలని షకీలా ఉన్నట్టుండి ఎందుకు మానేసినట్టు? మళయాళంలో ఎందుకు దాదాపుగా నటించడం తగ్గించినట్టు?

ఈ ప్రశ్నల వెనక పెద్ద కథే ఉంది.

షకీలా సినిమా రిలీజ్ రోజున, మరే భారీ హీరో సినిమా రిలీజయినా సరే, అటువైపు ఒక్కరూ కన్నెత్తి చూసేవారుకాదు! షకీలా సినిమా హౌజ్ ఫుల్స్. భారీ హీరోల సినిమాలు నిల్స్!

షకీలా స్టఫ్‌కి ఉన్న క్రేజ్ అదీ.

పేర్లు రాయటం లేదు కానీ, పెద్ద పెద్ద మళయాళం హీరోలు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూ ఇచ్చిన మెమోరాండం మీద సంతకాలు చేసినట్టు సమాచారం. అన్ని పేపర్లలో ఈ న్యూస్ వచ్చింది కూడా.

చివరికి ప్రభుత్వం మళయాళంలో "బి గ్రేడ్" (!?) సినిమాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షకీలా ఇంక అక్కడి నుంచి జెండా ఎత్తెయ్యక తప్పలేదు. అలా 2003 నుంచీ షకీలా మామూలు కేరెక్టర్ రోల్సే వేస్తోంది.

నా మొదటి చిత్రం "కల"లో వేణుమాధవ్, అల్లరి సుభాషిణి కాంబినేషన్లో షకీలా ఒక కామెడీ ఎపిసోడ్‌లో అద్భుతంగా నటించింది. షకీలా మంచి డిసిప్లిన్ ఉన్న నటి. యాక్టింగ్‌లో దాదాపు అన్నీ సింగిల్ టేక్ లోనే అలవోగ్గా చేసేస్తుంది.

కట్ టూ షకీలా లేటెస్ట్ -

ఉన్నట్టుండి ఇప్పుడు మళ్లీ మళయాళంలో బిజీ అయింది షకీలా. ఈ సారి డైరెక్టర్ అవతారమెత్తింది. ఆ చిత్రంలో తనే హీరోయిన్ కూడా! గ్రేటే కదా?

ఇదిలా ఉంటే - ప్రస్తుతం షకీలా తన ఆటోబయోగ్రఫీ రాస్తున్నట్టు ఇటీవల చెప్పింది. సినీ ఫీల్డులో తన అనుభవాలు, జ్ఞాపకాలతో పాటు - తనకు ఇండస్ట్రీలోనూ, బయటా ఎవరెవరితో ఎలాంటి పరిచయాలూ, అనుభవాలున్నాయో పాఠకులతో అందులో పంచుకోబోతున్నట్టు కూడా చెప్పింది. ఇంకేం కావాలి? ఈ వార్త షకీలా ఫేన్స్ అందరికీ పండగే.

ఒక వ్యాంప్, సాఫ్ట్‌కార్న్ హీరోయిన్‌గా ఒక ఇండస్ట్రీనే గడగడలాడించింది. తన సినిమాల రిలీజ్‌తో బడా బడా హీరోలను కూడా మళయాళంలో హడలెత్తించింది. చివరికి ఇండస్ట్రీ యావత్తూ గవర్నమెంటుకి మొరపెట్టుకొనేలా చేసింది. తెలుగులో ఎన్నో టౌన్స్‌లో, తన సినిమాలతో థియేటర్లను హౌజ్ ఫుల్స్ చేస్తూ, నష్టాల్లో ఉన్న ఎందరో థియేటర్ యజమానుల పాలిట దేవత అయింది. ఇప్పుడు డైరెక్టర్ కూడా అయింది. తన ఆటోబయోగ్రఫీ కూడా రాస్తోంది.

షకీలా ఏం సాధించలేదు?  

Friday 13 September 2013

సిల్క్ స్మిత ఏం సాధించింది?

జీవితంలోని అన్ని పార్శ్వాలు అనుభవించినవారికే తెలుస్తుంది జీవితం ఏమిటో. ఆ అనుభవాల అంతులేని ఆనందమో, మరణ మృదంగపు కాఠిన్యమో .. అదంతా ముఖాముఖి ఎదుర్కొన్నవాళ్లకే తెలుస్తుంది.

ఆ తర్వాత - వారి జీవితాలే చాలామందికి పాఠాలవుతాయి. ఏం చేయకూడదో చెప్తాయి. సిల్క్ స్మిత జీవితం అలాంటిదే.

ఏలూరులో ఒక అతి బీద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మి ముందు బ్రతుకుదెరువు కోసమే సినిమారంగాన్ని ఆశ్రయించింది. తర్వాత ఆ రంగంలోని తళుకుబెళుకులకు పడిపోయింది.

దాదాపు సినిమా రంగంలోని ప్రతి చీకటి కోణాన్ని చూసింది. "సిల్క్ స్మిత"గా తనే ఊహించని స్థాయికి ఎదిగింది. తను అస్సలు ఊహించని స్థితిలో బలవంతంగా తనువు చాలించింది.

అదీ సిల్క్ స్మిత జీవితం.

తను ఫీల్డులో ఉన్న 17 సంవత్సరాల్లో సుమారు 450 సినిమాల్లో నటించింది స్మిత.

ఒక దశలో - అసలు సిల్క్ స్మిత పాట లేకుండా సినిమాను ప్లాన్ చేయడానికి దాదాపు ఏ నిర్మాతా, దర్శకుడూ సాహసించలేకపోయారంటే అతిశయోక్తికాదు. మణిరత్నం 'గీతాంజలి' కూడా అందుకు మినహాయింపు కాదు!

అంతే కాదు. "కోట్లు కుమ్మరించి - వివిధ కారణాలవల్ల ల్యాబ్‌ల్లో పడి మూల్గుతున్న ఎన్నో సినిమాల కేన్‌లకు - ఒకే ఒక్క సిల్క్ స్మిత పాటని జోడించడం ద్వారా బయటికి తెచ్చి, హాట్ కేకులుగా అమ్ముకున్న సందర్భాలు అనేకం" అని ప్రముఖ తమిళ సినిమా చరిత్రకారుడు రాండార్ గై అన్నారంటే, దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు - ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో సిల్క్ స్మిత సొంతం చేసుకున్న పాప్యులారిటీ రేంజ్ ఏ శిఖరాగ్రం చేరుకుందో!  

సినీ రంగంలో కొంతమంది హీరోయిన్లు, ఇతర నటీమణుల వ్యక్తిగత జీవితాల్లో కొంత అలజడి ఉంటుంది. క్రమంగా అది అభద్రతకి దారి తీస్తుంది.

బలహీన మనస్కులు, ఇంకొకరిని బాధపెట్టొద్దు అనుకొనే సున్నిత హృదయులు, తమ జీవితంలోని బాధకు కారణమైనవారిని లేశమాత్రంగానైనా బాధపేట్టడానికి ఇష్టపడరు. పరిస్థితులు మారడానికి చేతనయినంత ప్రయత్నిస్తారు. చేతకాకపోతే తమ జీవితాన్నే అంతం చేసుకుంటారు. సిల్క్ స్మిత చేసిన పని కూడా అదే.

1996 లో తన జీవితాన్ని బలవంతంగా తనే అంతం చేసుకుంది.

ఈ పరిస్థితి, ఇలాంటి అనుభవాలు.. ఒక్క సినీ నేపథ్యం ఉన్న అమ్మాయిలు, స్త్రీల విషయంలోనే కాదు - ఇతర అన్ని రంగాల్లో ఉన్న అమ్మాయిలు, స్త్రీల విషయంలో కూడా ఉంటాయి. గ్లామర్ ఫీల్డు కాబట్టి - సినీ ఫీల్డులోని వారి విషయాలు "బ్రేకింగ్ న్యూస్"లవుతాయి. ఇతర రంగాల్లోని వారివి అంతగా బయటకు రావు. అంతే తేడా.

కట్ టూ "ది దర్టీ పిక్చర్" -

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా నిర్మించిన హిందీ సినిమా "ది డర్టీ పిక్చర్" మొదటి వారంలోనే 52 కోట్లు సంపాదించింది. ఆ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను ప్రముఖ హిందీ హీరోయిన్ విద్యా బాలన్ అద్భుతంగా పోషించింది.

అంతకు ముందు విద్యా బాలన్ "పరిణీత", "లగే రహో మున్నాభాయ్", "పా", "నో వన్ కిల్డ్ జెస్సికా" వంటి చిత్రాల్లో ఎంతో బాగా నటించింది. ఎన్నో అవార్డులు సాధించింది. కానీ, వాటన్నింటి ద్వారా రాని గుర్తింపు, పేరు, క్రేజ్.. విద్యా బాలన్‌కు కేవలం ఒకే ఒక్క "డర్టీ పిక్చర్" సినిమాతో వచ్చింది. అంతే ..

ఒక్కసారిగా టాప్ రేంజ్‌కు వెళ్లిపోయింది విద్యా బాలన్.

విద్యా బాలన్ ఈ చిత్రం తర్వాత ఎంత శిఖరాగ్రం చేరుకోగలిగిందంటే, ఏకంగా 66 వ కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు జ్యూరీ మెంబర్‌గా కూడా ఎన్నికయింది!

చివరికి, దేశంలోనే అత్యున్నతమయిన యూటీవీ మోషన్ పిక్చర్స్ 'సీ ఈ వో' సిధ్ధార్థ రాయ్ కపూర్ హృదయాన్ని కొల్లగొట్టి, ఆయన్ని పెళ్లికూడా చేసుకుంది విద్యా బాలన్.

దటీజ్ డర్టీ పిక్చర్! దటీజ్ సిల్క్ స్మిత!!

స్మిత వ్యక్తిగత జీవితంలోని మంచీ చెడులు మనకు పూర్తిగా తెలియవు. తెలియని వాటి గురించి జడ్జ్‌మెంట్లు ఇచ్చే హక్కు మనకు లేదు. ఒక  పాజిటివ్ కోణంలో అలోచిస్తే మాత్రం - తను  మరణించి కూడా సినీ ఫీల్డులోనూ, బయటా చాలా మంది హీరోయిన్లు, ఇతర నటీమణులకు ఒక మార్గదర్శి అయింది సిల్క్ స్మిత.

హిపోక్రాట్లు ఈ నిజాన్ని ఒప్పుకోవటం కష్టం. అది వేరే విషయం.

ఇప్పటి తారలెవరూ తమ జీవితాల్లో ఎలాంటి జటిల సమస్యలొచ్చినా భయపడటంలేదు. ఎంత సున్నిత మనస్కులైనా దేనికీ బెదరటంలేదు. అభద్రత అనే పదాన్ని వారి డిక్షనరీల్లోంచి తీసి అవతల పడేశారు.

వ్యక్తిగత జీవితంలో, ఒక మజిలీ నుంచి ఇంకో మజిలీకి చాలా ఈజీగా మూవ్ అవుతూ ముందుకెళ్తున్నారు. ఆత్మహత్యలు మాత్రం చేసుకోవడం లేదు. అసలు అలా చేసుకోవాల్సిన అవసరం లేదన్న నిజాన్ని అర్థం చేసుకున్నారు. అవసరమయితే తమ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్న ప్రియుడో, భర్తో, బంధువులో, ఆఖరికి అమ్మానాన్నలో.. ఎవరైనా సరే.. ఒక ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా బయటపడుతున్నారు తప్ప, తమ జీవితాల్ని అంతం చేసుకొనే పిరికి ఆలోచన మాత్రం ఇప్పటి సినీ తారలెవ్వరూ చేయటం లేదు. (ఇటీవలి కాలంలో జియాఖాన్ ఉదంతం ఒక్కటే ఇందుకు మినహాయింపు.)  

ఇది కేవలం కాలంతోపాటు వచ్చిన మార్పు మాత్రమే కాదు. సిల్క్ స్మిత లాంటివాళ్ల జీవితాలను చదివిన నేర్పుతో వచ్చిన మార్పు కూడా.

సిల్క్ స్మిత సాధించింది అదీ .. 

Tuesday 10 September 2013

సిల్క్ స్మిత, షకీలాలు కేవలం ఎక్స్‌పోజింగ్ ఐకాన్స్ మాత్రమే కాదు!

అవును. సిల్క్ స్మిత, షకీలాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం ఎక్స్‌పోజింగ్ ఐకాన్స్ మాత్రమే కాదు! చాలా ఉంది కథ. ఇక్కడో చిన్న బ్రేక్ తీసుకుందాం.

"పేరుకే నీ బ్లాగ్ 'నగ్న చిత్రం.' కనీసం ఒక్కసారయినా ఏ సిల్క్ స్మిత గురించో, షకీలా గురించో రాశావా?" అని నిన్న ఓ మేధావి మిత్రుడు నా దగ్గర సెటైరేశాడు.

ఎలాంటి హిపోక్రసీ, మాస్కులు లేకుండా రియలిస్టిక్‌గా నేను రాయగలిగింది రాయడమే - నగ్నచిత్రం ఉద్దేశ్యం. ఏదయినా సరే. సినిమాలు కావొచ్చు. రచనలు కావొచ్చు. వృత్తి వ్యాపారాలు కావొచ్చు. సంపాదన కావొచ్చు. మానవ సంబంధాలు కావొచ్చు. ఆఖరికి రాజకీయాలు కూడా కావచ్చు.

దురదృష్టవశాత్తూ రాజకీయాలొక్కటే ఈ ప్రపంచంలో నేను బాగా అసహ్యించుకొనే సబ్జెక్టు! కాబట్టి - సాధ్యమైనంతవరకు ఈ బ్లాగ్‌లో పాలిటిక్స్ టచ్ చేయను. చేసి రిస్క్ తీసుకోను. అయినా, ఒకటి రెండుసార్లు ఆ పొరపాటు జరిగింది. బహుశా, మళ్లీ ఆ పొరపాటు చేయననే అనుకుంటున్నాను.

రాజకీయాల మీద నాకు ఇంత అసహ్యం ఏర్పడటానికి ప్రధాణ కారణం - మళ్లీ మన ఇండియన్ పాలిటిక్సే! స్వతంత్రం వచ్చినపుడూ మన దేశం "అభివృధ్ధి చెందుతున్న దేశం." 66 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు కూడా - మన దేశం ఇంకా "అభివృధ్ధి చెందుతున్న దేశమే" కావడం మనం సిగ్గుపడాల్సిన విషయం.

మన దేశంలో వనరులు లేక కాదు. అపరిమితంగా ఉన్నాయి. వాటితోపాటే రాజకీయాలూ ఉన్నాయి. అంతులేని కరప్షన్ మన వాళ్ల జన్మ హక్కు.

మన దేశంలో రాజకీయ నాయకులే అభివృధ్ధి చెందుతారు. వారితోపాటు - వారికి కొమ్ముకాసే కొందరు కుహనా ఇండస్ట్రియలిస్టులు, మరికొందరు వారి చెంచాలు కూడా ఊహించని రేంజ్‌లో అభివృధ్ధిచెందుతారు. దేశం, దేశంలోని సామాన్య ప్రజానీకం విషయంలో మాత్రం ఎలాంటి అభివృధ్ధి ఉండదు.

ఏదో మిరాకిల్ జరిగి - ఒక లేయర్ కొట్టుకుపోతే తప్ప, ఇంకో 100 ఏళ్లయినా అంతే. ఇంకా "అభివృధ్ధి చెందుతున్న" దేశంగానే ఉంటాం మనం.

కట్ టూ మన సిల్క్ స్మితా, షకీలా -

సిల్క్ స్మిత, షకీలాల గురించి నగ్నచిత్రంలో ఏదయినా రాయాలని నా మేధావి మిత్రుడు అనడం సమంజసమే. "ఎక్స్‌పోజింగ్ ఐకాన్స్" గా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్లిద్దరికీ అంత పేరుంది! కానీ, వాళ్లేదో 'నగ్నం' అన్న పదానికి సంబంధించిన "చీప్ సింబల్స్" గా భావిస్తూ చెప్పడమే నాకు నచ్చలేదు.

ఇదే పాయింటాఫ్ వ్యూలో, వాళ్లిద్దరి గురించీ విడిగా రెండు బ్లాగ్ పోస్టులు రాస్తున్నాను. ఏ అర్ధరాత్రో పోస్ట్ చేస్తాను. ఎంజాయ్, మై డియర్ ఫ్రెండ్స్!   

Sunday 8 September 2013

కత్రినా, దీపిక అంటే నాకెందుకంత ఇష్టం?

జిందగీ నా మిలేగీ దోబారా (2011), యే జవానీ హై దీవానీ (2013) - రెండూ మంచి 'ట్రెండీ' సినిమాలు. వీటిలో మొదటిది ట్రెండీ రొమాంటిక్ డ్రామా రోడ్ స్టోరీ. రెండోది ట్రెండీ సెన్సిటివ్ రొమాంటిక్ స్టోరీ. జోయా అక్తర్, అయన్ ముఖర్జీ ఈ చిత్రాల దర్శకులు.

వీటి స్టార్‌కాస్టింగ్, బడ్జెట్లు అత్యంత భారీవి. రెండూ బాక్సాఫీసుల రికార్డుల్ని బ్రేక్ చేశాయి. విచిత్రంగా, ఈ రెండు సినిమాలూ హార్డ్‌కోర్ క్రిటిక్స్ చేత కూడా మంచి రివ్యూల్ని రాయించుకోగలిగాయి!

నిజానికి పైవేవీ నేనీ బ్లాగ్ పోస్ట్ రాయడానికి కారణం కాదు. ఈ రెండు చిత్రాల్లో అద్భుతంగా, అత్యంత సహజంగా చిత్రీకరించిన నేటితరం యువత జీవనశైలి, కొన్ని మర్చిపోలేని పాత్రల సృష్టి - ఇవీ నేనీ బ్లాగ్ పోస్ట్ రాయడానికి అసలు కారణం.

ప్రతి పాత్రకు ఒక వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ ఉండటం ఈ రెండు చిత్రాల స్క్రీన్‌ప్లేల గొప్పదనం.

జిందగీ నా మిలేగీ.. చిత్రంలో కత్రినా కైఫ్ నటించిన లైలా పాత్ర, యే జవానీ హై.. చిత్రంలో దీపికా పడుకొనే నటించిన నైనా పాత్రలు ఈ మధ్యకాలంలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన పాత్రలు. ఎందుకో - ఈ రెండు సినిమాలు చూస్తే అర్థమవుతుంది.

జీవితాన్నీ, జీవితంలోని అనేక సున్నితత్వాల్ని ఇష్టపడేవారికీ, వాటికోసమే జీవించేవారికీ ఈ పాత్రలు బాగా గుర్తుండిపోతాయి.

"రేపు నువ్వు బ్రతికుంటావని నమ్మకం ఏంటి? ఇప్పుడు నీ కళ్లముందున్న ఉన్న ఈ క్షణాన్ని జీవించు, మై ఫ్రెండ్!" అని చెప్తుంది లైలా పాత్ర.

తను ప్రేమించినంత మాత్రాన, ఎదుటివ్యక్తి తన సృజనాత్మక జీవనశైలిని కోల్పోనవసరం లేదని చెప్పే "హద్దులు పెట్టని" ప్రేమకి నిజమైన నిర్వచనం ఇస్తుంది నైనా పాత్ర.

అద్భుతమైన ఈ రెండు పాత్రల్ని సృష్టించిన దర్శకులు జోయా, అయన్ లను ఎలా మర్చిపోగలను? నా ఆలోచనల్ని అమితంగా డిస్టర్బ్ చేసిన ఈ రెండు పాత్రల్లో అలవోకగా జీవించిన కత్రినా, దీపికలను ఎలా ఇష్టపడకుండా ఉండగలను? 

Tuesday 3 September 2013

ఆలోచనలు అన్‌లిమిటెడ్!

Manipulating Money, Creativity and Life ...
Manohar Chimmani Unmasked! 


ఇదీ "నగ్నచిత్రం" బ్లాగ్ కి కొత్తగా నేను అనుకున్న డిస్క్రిప్షన్ లేదా ట్యాగ్‌లైన్. ఈ పోస్ట్ రాయటం పూర్తయ్యాక బ్లాగ్ హెడర్ మీద ఈ మార్పు ఎడిట్ చేస్తాను.

బహుశా ఇప్పటికి చాలాసార్లు నా వ్యక్తిగతమైన ఒక ఫీలింగ్‌ని, ఈ బ్లాగ్ ద్వారా మీతో చాలాసార్లు పంచుకున్నాను. ఏంటంటే - ఈ బ్లాగూ, ఫేస్‌బుక్కూ నాకత్యంత ప్రియమైన నేస్తాలు అని. వంద శాతం నిజం. ఎలాంటి హిపోక్రసీ లేని వాస్తవం.

ఈ బ్లాగ్ మీద, ఫేస్‌బుక్ మీద ఎన్ని ప్రయోగాలు చేశానో లెక్కలేదు. ఈ ఇద్దరు నేస్తాలతో గడిపిన నా సమయం చాలా తక్కువే కావొచ్చు. కానీ ఆ సమయమే నాకెంతో విలువైన సమయం. అది - నాతో నేను సంభాషించుకున్న సమయం. నన్ను నేను విశ్లేషించుకున్న సమయం. నా జీవిత వాస్తవాల్ని నిర్వచించుకున్న సమయం.

ఇంక చాలు. ప్రయోగాలు, ఫలితాలు అన్నీ చేశాను. చూశాను. ఇక మీదట ఈ బ్లాగ్‌లో ఒక్క సినిమాలే కాదు. నాకు  తోచిన ప్రతి టాపిక్‌నీ, రాయాలనిపించిన ప్రతి అంశాన్నీ రాస్తాను.

సక్సెస్ సైన్స్, సినిమాలు, మనీ, రైటింగ్, ఆర్ట్, క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ .. నాకిష్టమైన ఈ సబ్జెక్టులన్నిటిమీదా రాయాలనుకుంటున్నాను. రాస్తాను.

పాలిటిక్స్ ఒక్కటే నాకు ఏమాత్రం ఇష్టం లేని సబ్జెక్టు. బై మిస్టేక్ దాన్ని కూడా అప్పుడప్పుడూ బ్లాగ్‌లో టచ్ చేయాల్సి రావొచ్చు.

ఇక - ప్రస్తుతం నేను చేస్తున్న ఎన్నో పనుల్లో సినిమాలు ఒకటి. సినిమాలే జీవితం మాత్రం కాదు.

నిజం చెప్పాలంటే - నా జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిందీ, ఎన్నో అద్భుత అనుభవాల్ని ఆస్వాదించిందీ ఫీల్డుకి బయటే. అలాగని ఫీల్డుని నేను తక్కువగా చేసి చెప్పటం లేదు. చూడటం లేదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే సినీ ఫీల్డులో లేనిది లేదు!

సమస్యల్లా ఒక్కటే. ఈ రంగంలోకి దిగితే బయటికి రావటం మాత్రం సాధారణ మానవమాత్రులవల్ల మాత్రం కాదు. ప్రస్తుతం నా పరిస్థితీ అదే! 

Sunday 1 September 2013

"రిలీజ్ రైట్స్" కూడా వచ్చేస్తున్నాయి!

ఒక సినిమా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వచ్చే ఆదాయం శాటిలైట్ రైట్స్. ఈ హక్కుల్ని కొనుక్కునేది టీవీ చానెల్స్ వాళ్లు. చానెల్స్ వాళ్లకి తమ చానెల్లో ఆ సినిమా వేసిన ప్రతిసారీ బోలెడంత అడ్వర్టైజింగ్ ఫీజు, స్పాన్సర్స్ డబ్బు దొరుకుతుంది.  ఈ అదాయం కోసమే టీవీ చానెల్స్ వాళ్లు సినిమాల హక్కుల్ని కొంటారు. అదే శాటిలైట్ రైట్స్.

పెద్ద బడ్జెట్ సినిమాలకంటే, మైక్రో బడ్జెట్ సినిమాలకే ఈ రైట్స్ ద్వారా వచ్చే డబ్బు బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

అసలు మనవాళ్లు చేయాల్సినంత "మిస్ యూజ్" చేసేశారు. లేదంటే - ఈ శాటిలైట్ రైట్స్ ఒక్కదాని ద్వారా వచ్చే డబ్బుతోనే దాదాపు పూర్తి సినిమాను రూపొందించే ఆధునిక డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. ఈ కోణంలో  చూసినప్పుడు శాటిలైట్ రైట్స్ అనేది చిన్న సినిమాలకు ఒక వరం లాంటిది.

ఒక సినిమాకు శాటిలైట్ రైట్స్ ఎంత వస్తుందనేది ఆ సినిమాకు మార్కెట్లో మనం ఇస్తున్న ప్రొజెక్షన్‌ను బట్టి, అందులో నటిస్తున్న ఆర్టిస్టులనుబట్టి, డైరెక్టర్ ఎవరు, టెక్నీషియన్ ఎవరు, బ్యానర్‌కు మార్కెట్లో ముందే ఏమయినా పేరుందా.. వంటి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. దీనంతటి మీద ఆధారపడే శాటిలైట్ రైట్స్ రేట్ ఫిక్స్ చేయబడుతుంది.

సాధారణంగా సినిమా రిలీజ్‌కి ముందు రోజు నాటికే అగ్రీమెంట్ చేసుకున్న ఈ మొత్తం డబ్బు ప్రొడ్యూసర్ ఎకౌంట్లోకి వచ్చి పడిపోతుంది. ఇందులో ఎలాంటి చీటింగులు, స్పెక్యులేషన్లు, రెండోమాటలు ఉండవు.

దీనికి కారణం ఒక్కటే. చాలా సింపుల్. ఈ రైట్స్‌ని నిర్మాతలనుంచి కొనుక్కొనే థర్డ్ పార్టీలకు చానెల్స్ నుంచి కనీసం రెండు రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది! కేవలం ఒక రెండు మూడు నెలల్లో, ఎలాంటి రిస్కు లేకుండా అంత ఆదాయం!! అందుకే ఈ థర్డ్ పార్టీలన్నీ ఇంటర్నల్‌గా సిండికేట్ అయి ఉంటాయి. ప్రొడ్యూసర్లు డైరెక్టుగా చానెల్స్‌తో అగ్రీమెంట్ చేసుకొనే అవకాశం లేని పరిస్థితుల్ని చానెల్స్‌లో కూడా క్రియేట్ చేయగల సామర్థ్యం వీరికుంటుంది.

కట్ టూ రిలీజ్ రైట్స్ -

శాటిలైట్ రైట్స్ పధ్ధతిలోనే, "ఫిలిం రిలీజ్ రైట్స్" కూడా అతి త్వరలో వచ్చే రోజులు ముందున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, వచ్చేశాయి కూడా! (అలాంటి ఖచ్చితమైన ఏర్పాట్లతోనే నేనిప్పుడు చేస్తున్న మైక్రో బడ్జెట్ సినిమాల నిర్మాణం జరుగుతోంది. హిందీలోకి కూడా ఎంటర్ అవుతున్నాం. అది వేరే విషయం.) సినీ రంగంలోకి కార్పొరేట్ల ఎంట్రీ దీనికి మార్గం సుగమం చేస్తోంది. ఇది కూడా చిన్న సినిమాల విషయంలోనే చాలా ప్రయోజనకరం అని వేరే చెప్పనవసరం లేదు అనుకుంటాను.

శాటిలైట్ రైట్స్ పధ్ధతిలో లాగే, ప్రతి సినిమాకు ఒక ధరను ఫిక్స్ చేసి అవుట్‌రైట్ పధ్ధతిలో కొనేయడమే "రిలీజ్ రైట్స్". ఈ రైట్స్ కొనుక్కున్నవాళ్లకే ఆ సినిమాని థియేటర్లలో ప్రదర్శించుకొనే అవకాశం ఉంటుంది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఇంక ప్రొడ్యూసర్లకు ఆ సినిమా ఆదాయంతో సంబంధం ఉండదు.

అయితే - ఈ రెండు రకాల రైట్స్‌తో, నిర్మాత అప్పటివరకు పెట్టిన పెట్టుబడి మొత్తం (కొంత లాభంతో) వచ్చేస్తుంది.  

ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా మార్కెట్ స్టామినాని గుర్తించిన రిలయన్స్, యూటీవీ, ఈరోస్ వంటి కార్పొరేట్లు ఇటువైపు కూడా ఒక కన్నేశారు. అవుట్‌రైట్‌గా సినిమాలను కొనే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. యధాప్రకారం, వీటికి కూడా థర్డ్ పాటీవాళ్లు పుట్టుకొచ్చారప్పుడే!    

మనం ఎప్పుడూ వినే విషయం ఒకటుంది. కేవలం ఒక అయిదారుగురి చేతిలో రాష్త్రంలోని థియేటర్లన్నీ ఉన్నాయని. వాళ్లూ ఈ పనిని ఇంకా సులభంగా చేయవచ్చు. రిలీజ్ రైట్స్ ద్వారా ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. కానీ చేయరు. కారణాలు అనేకం. అదింకో బ్లాగ్ పోస్టు అవుతుంది.

మరి మనకేంటి లాభం?

మంచి హిట్ ఇవ్వగల కంటెంట్ నిజంగా సినిమాలో ఉంటే - ఆ సినిమా తప్పక ఆడుతుంది. హిట్ అవుతుంది. ఆ సినిమా తీసిన దర్శక నిర్మాతలకు, నటించిన ఆర్టిస్టులకు, పని చేసిన టెక్నీషియన్లకు అది చాలు. ఆ సక్సెస్ బ్రాండ్‌తో వాళ్లు ఆ తర్వాత ఇంకెన్నో సినిమాలను చేయగలుగుతారు. చాలా ఈజీగా!

అప్పుడు వారికి మార్కెట్లో క్రియేటయ్యే డిమాండ్ ప్రకారం వారి రెమ్యూనరేషన్ల రేంజ్ ఉంటుంది. ఓవర్‌నైట్‌లో ఎంతో ఫేమ్ కూడా వస్తుంది. సినిమా ఫీల్డుకు సంబంధించి అంతటితో వారి లక్ష్యం దాదాపు నెరవేరినట్టే.

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

శాటిలైట్ రైట్స్‌కి తోడుగా ఈ "రిలీజ్ రైట్స్" కూడా ఎలాంటి స్పెక్యులేషన్ లేకుండా ష్యూర్‌గా స్థిరపడిందనుకోండి. ఇంక చిన్న నిర్మాతలకు నష్టం అనేదే ఉండదు. సినిమా నిర్మాణం అప్పుడు గ్యాంబ్లింగ్ ఏ మాత్రం కాదు. అప్పుడు సినిమాలోని కంటెంట్, కథే నిజమైన హీరోలవుతాయి. వెరైటీ కథలొస్తాయి.

అప్పుడు ఓడిపోకుండా ఉండాలన్న కాలిక్యులేషన్స్‌తో సినిమాలు తీయరు. గెలవాలన్న లక్ష్యంతో సినిమాలు తీస్తారు. ఈ రెండు దృక్కోణాల్లో ఎంత తేడా ఉంటుందో మీకూ తెలుసు.