Thursday 29 August 2013

ఎక్కడ షూటింగ్ చేస్తున్నామన్నది కాదు ముఖ్యం!

ఇప్పుడు నేను చేస్తున్న ఒక మైక్రో బడ్జెట్ సినిమా షూటింగ్ లొకేషన్ల ఎన్నిక కోసం గత వారంలోనే నేను వైజాగ్ వెళ్లాల్సింది. కానీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నా ప్రోగ్రామ్‌ని మార్చుకునేలా చేశాయి. 

ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే ఇంకా కొనసాగితే, కథలో బ్యాక్‌డ్రాప్‌నే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది!
ఇప్పుడు నేను చేస్తున్న ఒక మైక్రో బడ్జెట్ సినిమా షూటింగ్ లొకేషన్ల ఎన్నిక కోసం గత వారంలోనే నేను నేను వైజాగ్ వెళ్లాల్సింది. కానీ - ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నా ప్రోగ్రామ్‌ని మార్చుకునేలా చేశాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే, అసలు కథలో బ్యాక్‌డ్రాప్‌నే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది! 

కట్ టూ మన పాయింట్ -

మైక్రో బడ్జెట్ సినిమాలకు ఫండ్స్ విషయంలో చాలా పరిమితులుంటాయి. అతి తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి సినిమా తీయాల్సి ఉంటుంది. ఇది చెప్పినంత సులభం కాదు. కానీ - సినిమారంగం పైన నిజమైన ప్రేమ ఉన్నవాళ్లతో కూడిన టీమ్ ఉన్నప్పుడు మాత్రం ఏదయినా సాధించవచ్చు. మంచి ప్యాషనేట్ టీమ్ అనేది ఈ మైక్రో బడ్జెట్ సినిమాలకు చాలా ముఖ్యం.  

ఈ తరహా కమర్షియల్ సినిమాలకు స్క్రిప్ట్ రాసుకొనేటప్పుడే - బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని రాసుకోవాల్సి ఉంటుంది. భారీ ఫైట్స్, భారీ చేజ్‌లు లాంటివి ఇలాంటి సినిమాల్లో చాలా కష్టం. అసలు కుదరదు. హంగుల కోసం కమర్షియాలిటీ అని కాకుండా - కమర్షియల్ సక్సెస్ కోసం కమర్షియాలిటీ ఉంటే బావుంటుంది.

అప్పుడు మళ్లీ కథే నిజమైన హీరో అవుతుంది. కథ బాగున్నపుడు, స్క్రీన్‌ప్లేలో దాని ప్రజెంటేషన్ బాగున్నప్పుడు - షూటింగ్ హైదరాబాద్‌లోనే చేయాలన్న రూలేమీ ఉండదు. వైజాగ్‌లో చేసినా ఒక్కటే, వరంగల్లో చేసినా ఒక్కటే. ఎప్పుడూ హైదరాబాద్‌లో తీసే రొటీన్ లొకేషన్స్ కాకుండా ఉంటే, విజువల్‌గా కూడా సినిమాలో కొత్త అందం కనిపిస్తుంది.

అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. హైద్రాబాద్‌లో అయితే, మనం షూటింగ్ చేసుకొనే ప్రతి చిన్న లొకేషన్‌కూ వేలకు వేలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. హైద్రాబాద్ కాకుండా, బయట ఎక్కడ తీసినా ఈ ఖర్చంతా బడ్జెట్‌లో మిగిలిపోతుంది. అలా మిగల్చటం అవసరం కూడా. ఆ డబ్బంతా సినిమాలో మంచి క్వాలిటీ కోసం మరెన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ప్రమోషన్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. 

షూటింగ్ కోసం ఇలా అవుట్ డోర్ వెళ్లినప్పుడు - టీమ్ అంతా ఉండటానికి, ఇతర ఖర్చులకు బడ్జెట్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ ఇప్పుడా బాధ లేదు. అవన్నీ స్పాన్సర్ చేసే వ్యక్తులు, కంపెనీలు, ఇతర సోర్సెస్ ఎన్నో ఉంటాయి. ప్రయత్నం చేయాలి, లేదా ఆయా ఫీల్డుల్లోని స్పెషలిస్టులకు ఈ పనిని అప్పగించాలి.
సో, మైక్రో బడ్జెట్ సినిమాలను హైద్రాబాద్‌లో మాత్రమే షూట్ చేయాల్సిన పనిలేదు. ఇందాకే అనుకున్నట్టు - వరంగల్లో కూడా చేయొచ్చు, వైజాగ్‌లో కూడా చేయొచ్చు. కథను బట్టి మన రాష్ట్రంలో ఎక్కడయినా ప్లాన్ చేసుకోవచ్చు. 

ఇంకా చెప్పాలంటే -  డైరెక్టర్‌తో పాటు, ప్రొడ్యూసర్స్, కోప్రొడ్యూసర్స్ వారి వారి ఊళ్లల్లో కూడా సాధ్యమైనంత ఎక్కువ సీన్ల షూటింగ్‌ని ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎన్నో ఖర్చులు తగ్గిపోతాయి. సొంత ఊరిలో షూటింగ్ చేసిన ఆనందం కూడా సొంతమవుతుంది. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఒకటి మర్చిపోవద్దు. 

మంచి కథ కోసమే షూటింగ్ కానీ, షూటింగ్‌లో ఖర్చులు తగ్గించటం కోసం మాత్రమే కథ కాకూడదు. 

Wednesday 28 August 2013

లేటెస్ట్ హాట్ ఫేవరేట్ ఇక శృతి హాసన్!

బహుశా ఒక మూడేళ్ల క్రితం అనుకుంటాను. "ఈనాడు" సినిమా పేజ్‌లో శృతి హాసన్ మినీ ఇంటర్వ్యూ ఒకటి చదివాను. అందులో నాకు బాగా గుర్తున్న అంశం ఒక్కటే.

తను "దేవుడిని నమ్మను" అని చాలా సింపుల్‌గా, ఓపెన్‌గా  చెప్పింది శృతి! అయితే - శృతి నాన్న కమల హాసన్ కూడా నాస్తికుడే అన్న విషయం మనందరికీ తెలిసిందే. అది వేరే విషయం.

హిందీలో ఇటీవలే తన బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు "రామయ్యా  వస్తావయ్యా", "డి-డే" చిత్రాల రిలీజ్ శృతిని హిందీలో కూడా మరింత బిజీ చేయబోతున్నాయి. అనీస్ బజ్మీ తన "వెల్‌కమ్" కు సీక్వెల్‌గా ఇప్పుడు "వెల్‌కమ్ బ్యాక్" తీస్తున్నాడు. అందులో ముందుగా ఆసిన్‌ను అనుకున్నారు. కానీ, వాళ్ల మనసు మారింది.

కట్ చేస్తే - ఆసిన్ స్థానంలోకి ఇప్పుడు శృతి వచ్చింది! అమితాబ్ బచ్చన్, నానా పాటేకర్, అనిల్ కపూర్ వంటి సీనియర్లు కూడా నటిస్తున్న ఈ చిత్రంలో - జాన్ అబ్రహాం సరసన నటిస్తోంది శృతి.

కట్ టూ తెలుగు -

శృతి నటించిన "గబ్బర్ సింగ్", "బలుపు" సినిమాల హిట్స్ తర్వాత - శృతికి నిజంగానే తెలుగులో కూడా డిమాండ్ బాగా పెరిగింది.

రామ్‌చరణ్ సరసన తను నటించిన "ఎవడు" ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే - శ్రీను వైట్ల, మహేష్ బాబుల "ఆగడు" లో కూడా శృతినే సెలెక్ట్ కాబోతోందని ఫిలిం నగర్ వర్గాలు చెపున్నాయి. ఇంకొక్క హిట్ ఇస్తే చాలు. ఓవర్‌నైట్‌లో శృతి స్టేటస్ మారిపోతుంది. టాలీవుడ్‌లో టాప్ వన్, టూ స్లాట్‌లకు గట్టి పోటీ ఇస్తుంది శృతి హాసన్.  అందులో డవుట్ లేదు.

ఇంగ్లిష్‌లో "మాక్జిమ్" పత్రికకు అంత బోల్డ్‌గా ఫోజులిచ్చిన శృతిలో ఆ స్టఫ్ కావల్సినంత ఉంది!  

Tuesday 27 August 2013

"చెన్నై ఎక్స్‌ప్రెస్" చెత్త సినిమానా?

షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే నటించిన రోహిత్ షెట్టి సినిమా "చెన్నై ఎక్స్‌ప్రెస్" మొన్న ఆగస్ట్ 9 నాడు రిలీజయింది. కేవలం 18 రోజుల్లో 200 కోట్ల వసూళ్లని క్రాస్ చేసి, కలెక్షన్ల రికార్డుల్ని బద్దలుకొడుతోంది!

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాని 5 సార్లు చూసి, ఓ 10 ట్వీట్లు పెట్టాడు. ఒకప్పటి అమితాబ్-మన్మోహన్ దేశాయ్ జోడీని ఇప్పుడు మళ్లీ షారుఖ్-రోహిత్ షెట్టిల జోడీతో పోల్చాడు. రోహిత్ షెట్టిని తెగ పొగిడేశాడు. ఎందుకు?

ఒక కమర్షియల్ సినిమా తీసి హిట్టు కొట్టడానికి అందరూ నానా తంటాలు పడుతుంటారు. అంత అవసరం లేదు అని రోహిత్ షెట్టి ప్రూవ్ చేశాడన్నది ఆయన అభిప్రాయం.

ఏ సగటు ప్రేక్షకుడినయితే దృష్టిలో పెట్టుకొని రోహిత్ షెట్టి ఆ సినిమా తీశాడో, ఆ సగటు ప్రేక్షకుడు దాన్ని బాగా ఇష్టపడ్డాడు. లక్ష్యం నెరవేరింది. ఇంకేం కావాలి?

చాలా మంది విమర్శకులు (ది గ్రేట్ రివ్యూయర్స్!) ఈ "చెన్నై ఎక్స్‌ప్రెస్" సినిమాను ఒక చెత్త సినిమా కింద జమకడుతూ తమ విలువైన రివ్యూలు పత్రికల్లో, వెబ్‌సైట్స్‌లో రాశారు. ఏది చెత్త అనేది మరోసారి ప్రూవయింది.

ఒక పాపులర్-లేదా-కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాను ఆ కోణంలోనే చూడాలి. వాటిమీద రాసే సమీక్షలు కూడా ఆ కోణంలోనే బేరీజు వేసి రాయాలి.

పాపులర్ సినిమా గొప్పతనాన్ని ప్రేక్షకులు దానికి అందించే "సక్సెస్"ను బట్టి నిర్ధారిస్తారు. ఆ సక్సెస్ కోసమే, ఆ కలెక్షన్ల కోసమే కమర్షియల్ సినిమాలను తీస్తారు. అంతే తప్ప, కేవలం నీతులు చెప్పడానికో, సందేశాలివ్వడానికో కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవ్వరూ తీయరు.

మనం వేసుకున్న మైండ్‌సెట్ మాస్కుని, మన హిపోక్రసీని ఒక్క క్షణం పక్కన పెడితే ఈ నిజం మనకు అర్థమవుతుంది.

కట్ టూ "తూనికలు, కొలతలు" -

సగటు ప్రేక్షకుని వినోదం కోసం తీసేవి కమర్షియల్ సినిమాలు. సగటు ప్రేక్షకునితో సంబంధం లేకుండా, లాభనష్టాలతో సంబంధం లేకుండా ఇంటలెక్చువల్‌గానో, సందేశాత్మకంగానో తీసేవి ఆర్ట్ సినిమాలు-లేదా- నాన్-కమర్షియల్ సినిమాలు.

దేని దృక్కోణం దానిదే. దేని తూనిక రాళ్లు దానివే.

ఒక ఫక్తు కమర్షియల్ సినిమాని సోకాల్డ్ ఇంటలెక్చువల్ సమీక్షకులు తూకం వేస్తే ఇలాగే ఉంటుంది. "చెన్నై ఎక్స్‌ప్రెస్ పరమ చెత్త సినిమా" అనే రివ్యూనే మన ముందుకొస్తుంది.  

ఒక కమర్షియల్ సినిమా మంచి చెడులను నిర్ధారించేది కేవలం నలుగురయిదుగురు రివ్యూయర్లు కాదు. లక్షలాదిమంది ప్రేక్షకులు!    

Sunday 25 August 2013

రివ్యూలు చదివి సినిమాలకు వెళ్తారా?

చాలా ఏళ్ల క్రితం, బహుశా 99 లో అనుకుంటాను. "సమరసిం హారెడ్డి" సినిమా మీద రివ్యూ ఒకటి చదివాను. "పరమ చెత్త.. రక్తపాతం.. అదీ.. ఇదీ.." అని ఈకలు, తోకలు పీకుతూ ఏదేదో రాశారు. ఆ సినిమాలో ఉన్న 101 తప్పుల్ని ఎత్తి రాశారు. నిజంగా ఆ రివ్యూ చదివితే, ఎవరూ ఆ సినిమా చూడ్డానికి వెళ్లరు!

కానీ వెళ్లారు. ఆ సినిమా బాక్సాఫీసు బద్దలు కొట్టింది.

వెళ్లిన ప్రేక్షకులంతా రివ్యూలు చదివి వెళ్లలేదు. రివ్యూలు మాత్రమే చదివి వెళ్లే వాళ్లతో కలెక్షన్ల వర్షం కురవదు.

నిన్న ఒక వెబ్‌సైట్లో "టాలీవుడ్ 10 బాక్సాఫీస్" లిస్టు చూశాను. అందులో మగధీర నుంచి గబ్బర్ సింగ్, దూకుడు, బాద్‌షా, సీతమ్మ వాకిట్లో.., నాయక్, మిర్చి, రచ్చ్చ, ఈగ, జులాయి వరకు - మొత్తం 10 సినిమాలున్నాయి. వాటిల్లో - మగధీర, గబ్బర్ సింగ్, నాయక్, రచ్చ, జులాయి .. ఈ అయిదు సినిమాలూ మెగా ఫ్యామిలీ నుంచే కావడం విశేషం! 

ఈ అయిదు సినిమాల్లో నాయక్, రచ్చ, జులాయి సినిమాలను చాలా రివ్యూల్లో చీల్చి చెండాడారు. జులాయి విషయంలోనయితే, నానా చెత్త రాశారు. బిలో యావరేజి అన్నారు. పది ఇంగ్లిష్ సినిమాల నుంచి బిట్లు బిట్లు తీసుకొని కాపీ చేశారన్నారు. చివరికి ఇలాకూడా రాశారు:  "..If you haven't seen the movie yet, you may wait for couple days to find empty theaters!" 

కానీ జులాయి 41 న్నర కోట్లు వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీలో "టాప్ 10" లిస్టులోకి చేరింది!

కట్ టూ రియాలిటీ -

సినిమా ఎలా తీయాలో, ఏం తీయాలో త్రివిక్రమ్‌కి, అల్లు అర్జున్‌కి, ప్రొడ్యూసర్స్‌కి తెలీదా? రెండు ఇరానీ చాయ్‌లు, నాలుగు సిగరెట్లు తాగివచ్చి ఏదో సొల్లు ఇష్టమొచ్చినట్లు రాయడం చాలా ఈజీ. సినిమా తీయడమే కష్టం.

నా ఉద్దేశ్యంలో - సినిమా ఎలా ఉండాలన్నదాని గురించి ఇంత గొప్పగా మంచి చెడ్డలు బేరీజు వేసి (?) రివ్యూలు రాసే ఈ విమర్శకులంతా చేయాల్సింది ఒక్కటే.

తమ స్వంత డబ్బులు పెట్టుకునో, లేదంటే ఒక ప్రొడ్యూసర్‌ను వెతుక్కొనో - "ఇదిగో ఇలా ఉండాలి సినిమా అంటే!" అని ఈ క్రిటిక్స్  ఒక్కటంటే ఒక్క సినిమా తీసి చూపిస్తే చాలు.

అయితే, అదంత సులభం కాదు. ఆ విషయం వాళ్లకూ తెలుసు.

ముందే చెప్పినట్టు -  ఈ విమర్శకుల రివ్యూలు చదివి సినిమాలకు వెళ్లేవాళ్లతో సినిమాలకు కలెక్షన్లు రావన్నది సిసలైన చేదు నిజం! 

Thursday 22 August 2013

గెస్ట్ బ్లాగింగ్ .. బెస్ట్ బ్లాగింగ్!

పాఠకులకు బోర్ కొట్టని విధంగా, తెలుగులో సులభశైలిలో మీరు రాయగలరా? మీరు రాసినదాన్ని ఏదో ఓ కోణంలో సినిమాకు ముడిపెట్టగలరా? అలా అయితే, "గెస్ట్ బ్లాగర్" గా 'నగ్నచిత్రం' కోసం మీరూ ఏదయినా రాయవచ్చు.

ముందే చెప్పినట్టు, మీరు రాసింది ఏదయినా, 'రీడబిలిటీ' అనేది ముఖ్యం. అది తప్పనిసరిగా ఏదో ఓకోణంలో సినిమాకు, సినిమారంగానికి సంబంధించినదై ఉండాలి.

అది ఒక సినిమా కావొచ్చు. సినీ తారల గురించి కావొచ్చు. సినిమా రచన, నిర్మాణం, దర్శకత్వం గురించి కావొచ్చు. ఇప్పటి ఇండస్ట్రీ గురించి కావొచ్చు. రేపటి సినిమా భవిష్యత్తు గురించి కావొచ్చు. సినీరంగంలో మీ స్వీయానుభవం ఏదయినా కావొచ్చు.

టాపిక్ ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఆకట్టుకునేలా దాన్ని రాయగలగాలి.

ఇక, అన్నింటికంటే ముఖ్యమైన విషయం గురించి చివరగా చెప్తున్నాను. వ్యక్తిగతంగా కానీ, సంస్థాగతంగా కానీ ఎవరినీ ఉద్దేశించి నేరుగా కానీ, నెగెటివ్‌గా కానీ రాయకూడదు.

నగ్నచిత్రంలో నిజమే ఉంటుంది. ఆ నిజం ఎవరినయినా బాధించేవిధంగా ఉంటుందనుకొంటే, దానికి కొంత పాజిటివ్ షుగర్ కోటింగ్ తప్పదు. కొంత బ్యాలెన్స్ తప్పదు. ఎలాంటి హిపోక్రసీ లేకుండా విషయాన్ని బయటికి చెప్పటమే మనకు ప్రధానం.

ఈ విషయంలో అవసరమయితే మీరు రాసినదాన్ని స్వల్పంగా ఎడిట్ చేసే స్వతంత్రం నాకుంటుంది.
సో, నగ్నచిత్రంలో "గెస్ట్ బ్లాగ్ పోస్ట్" రాయడానికి ఆసక్తి ఉన్న తోటి బ్లాగర్స్‌కు, రచయితలకు, కాలమిస్టులకు ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం!


కట్ టూ రెండు "ఫ్రెండ్లీ కండిషన్స్" - 

> మీ బ్లాగ్‌లోనో, మరెక్కడో ఇంతకుముందే పోస్ట్/పబ్లిష్ చేసిన బ్లాగ్‌పోస్టులను, ఆర్టికల్స్‌ను దయచేసి పంపించవద్దు.

> నగ్నచిత్రంలో మీ పోస్టు ప్రచురితం అయ్యాక, కనీసం రెండు వారాలయినా గ్యాప్ ఇచ్చిన తర్వాతే - దాన్ని మీరు మళ్లీ మీ బ్లాగ్‌లో గానీ, మరెక్కడయినాగానీ పబ్లిష్ చేసుకోవచ్చు.

మీ గెస్ట్ బ్లాగ్‌పోస్టులను నీట్‌గా తెలుగులో టైప్ చేసి నాకు పంపించాల్సిన ఈమెయిల్ క్రింద రాస్తున్నాను. ఈమెయిల్ సబ్జెక్ట్‌లో "Guest Blog Post" అని దయచేసి తప్పక రాయండి:
mchimmani10x@gmail.com. 

వాట్సాప్‌లో కూడా పంపించవచ్చు. ఇదీ నా వాట్సాప్ నంబర్: 9989578125. 

కట్ టూ "అసలెందుకీ గెస్ట్ బ్లాగింగ్?"

ప్రస్తుతం నేను యమ బిజీగా ఉన్నాను. రెగ్యులర్‌గా పోస్ట్ చేయటం అప్పుడప్పుడూ యమ కష్టమైపోతోంది. ఇదొక కారణం. రెండోది - నగ్నచిత్రంలో ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్తదనం నేను చూడాలనుకుంటున్నాను. 

ఇంక మూడోదీ, ముఖ్యమైనదీ ఇది: గెస్ట్ బ్లాగర్ బ్లాగ్‌కి గానీ, ఫేస్‌బుక్‌కి గానీ నా బ్లాగ్ నుంచి లింక్ ఇస్తాను. అప్పుడు నగ్నచిత్రం పాఠకులు మీ బ్లాగ్‌ని కూడా విజిట్ చేస్తారు. ఇదే 'వైస్ వెర్సా' కూడా జరుగుతుంది.  ఎలాగూ మీరు కూడా మీ ఈ గెస్ట్ పోస్ట్ లింక్‌ని మీ బ్లాగ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఎలాగూ కోట్ చేస్తారు కాబట్టి - మీ పాఠకులు కూడా నా బ్లాగ్‌ని విజిట్ చేస్తారు! 

గెస్ట్ బ్లాగింగ్ ఎందుకని బెస్ట్ బ్లాగింగో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. 
సో, మీ బ్లాగ్‌పోస్ట్ మ్యాటర్‌తో పాటు - మీ బ్లాగు, ఫేస్‌బుక్ లింకులను కూడా తప్పక పంపించాల్సి ఉంటుంది. మర్చిపోరుగా?!   

Wednesday 21 August 2013

డిజిటల్ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

సినిమా తీయడానికి ఫిలిం నెగెటివ్ వాడటం అనేది క్రమంగా కనుమరుగైపోతోంది. అవక తప్పదు. ఫిలిం నెగెటివ్ అనేది ఇప్పుడొక 'గతం'.

"ఓహో! సినిమాను అలా ఫిలిం నెగెటివ్‌తో కూడా తీసేవాళ్లా?!" అని తర్వాతి తరాలవాళ్లు వాళ్ల చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సిందే.

ఇప్పుడంతా డిజిటల్ యుగం. టెక్నికల్‌గా అయితే, సినిమా నిర్మాణం కోసం ఇదివరకులా కోట్లాది రూపాయలు అవసరం లేదు. కొన్ని లక్షల్లోనే మంచి కంటెంట్‌తో, క్వాలిటీతో సినిమా తీయవచ్చు.

కేవలం ఆయా హీరో హీరోయిన్లు, ఇతర సహ నటీనటులు, టెక్నీషియన్లకు మార్కెట్లో ఉన్న డిమాండును బట్టి - వారికిచ్చే పారితోషికాలు, ఇతర హంగులు, ఆర్భాటాలు, ఫారిన్ షూటింగులవంటివే బడ్జెట్‌ను పెంచుతాయి.

ఒక 50 లక్షల్లో - కొత్త ఆర్టిస్టులతో, వినూత్నమైన కంటెంట్‌తో,  మంచి రిచ్ లుక్ ఇచ్చే ఒక హిందీ సినిమాను కూడా సులభంగా నిర్మించవచ్చు. అలా హిందీలో నిర్మిస్తున్నారుకూడా. ఇంక తెలుగు విషయం చెప్పాల్సిందేముంది? ఈ బడ్జెట్ ఇంకొంతయినా ఈజీగా తగ్గుతుంది.

ఈ నేపథ్యంలో కొత్త నిర్మాతలు, దర్శకులు చాలామంది పుట్టుకొస్తారు. ఎన్నో సినిమాలు తయారవుతూ ఉంటాయి. అయితే, సమస్యంతా రెండు విషయాల దగ్గరే ఉంటుంది. ఒకటి సినిమా క్వాలిటీ, రెండోది రిలీజ్.

సహజంగానే క్వాలిటీలేని సినిమాలు ఎప్పట్లాగే థియేటర్లలో రిలీజ్ కావు. కథ, కథనం (కంటెంట్) విషయంలో ఒక స్టాండర్డుని మెయింటెయిన్ చేసిన చిత్రాల విషయంలో రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

యూటీవీ, ఇరోస్ వంటి కార్పొరేట్ సంస్థలు ఈ సినిమాలను మంచి ఆఫర్‌తో "అవుట్‌రైట్" పధ్ధతిన కొనేసుకొని రిలీజ్ చేస్తాయి. తమ సినిమాలు ఆడినా ఆడకపోయినా - ఈ పధ్ధతిలో బిజినెస్ చేసిన ఆయా చిత్రాల నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు.  

ఇక కార్పోరేట్లు రిలీజ్ చేసిన చిత్రాల్లో హిట్టయిన చిత్రాల దర్శక నిర్మాతలకు ఎలాగూ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. దాన్నిబట్టే ఆయా దర్శకుల పారితోషికాలు, నిర్మాతల "అవుట్‌రైట్ సేల్స్" స్థాయి కూడా సహజంగానే పెరుగుతుంటుంది.

క్రమంగా కార్పొరేట్ సంస్థలు ఆయా దర్శక నిర్మాతలతో "టై-అప్" అవుతారు. వారికి కావల్సిన పెట్టుబడిని కూడా ఆయా కార్పొరేట్ సంస్థలే ఇచ్చి, తమకు కావల్సినన్ని సినిమాలను తయారుచేయించుకుంటూ ఉంటాయి. అంటే సినిమాల నిర్మాణం, వ్యాపారం అనే వ్యవస్థ చూస్తూండగానే పూర్తిగా కార్పొరేట్‌మయమైపోతుంది.

కట్ టూ సినిమాల రిలీజ్ రేంజ్ -

ప్రతి హిట్ సినిమా, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కనీసం 30 భాషల్లోకి డబ్ చేయబడిగాని, ఆయా భాషల సబ్‌టైటిల్స్‌తో గానీ రిలీజ్ చేయబడుతుంది. క్రమ క్రమంగా సినిమాలను మల్టిప్లెక్సుల్లోంచి, నేరుగా ఇంట్లోకే రిలీజ్ చేయడం అనేది సర్వసాధారణమైపోతుంది.

చాలా సినిమాలను అసలు థియేటర్లలో రిలీజ్ చేయకుండా, ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇంట్లోకే రిలీజ్ చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది వినడానికి. కానీ, నిజం. ఈ ట్రెండు హాలీవుడ్‌లో ఇప్పటికే ప్రారంభమైపోయింది.

థియేటర్లో వందలాదిమంది ఆడియెన్స్ మధ్యలో కూర్చుని కాకుండా - తన సినిమాని ప్రశాంతంగా, ఒంటరిగా, లేదంటే తనకు అతి దగ్గరి వారితోగాని మాత్రమే కూర్చుని  చూడాలనుకున్నాడొక డైరెక్టర్. ఆ సబ్జెక్ట్ ఫీల్ అలాంటిది. అందుకని, థియేటర్లను కాదని, కేవలం అమెజాన్ "వీడియో ఆన్ డిమాండ్", యాపిల్ "ఐట్యూన్స్" ద్వారానే తన చిత్రాన్ని రిలీజ్ చేశాడా దర్శకుడు.  ఆ అద్భుత చిత్రం గురించి మరోసారి - ఇదే బ్లాగ్‌లో ..   

Tuesday 20 August 2013

కొత్త హీరోలు, హీరోయిన్లకు ఆహ్వానం!

త్వరలో ప్రారంభం కానున్న నా రెండో మైక్రో బడ్జెట్ చిత్రం కోసం ఇంతవరకూ ఏ చిత్రంలోనూ నటించని కొత్త హీరోలు, హీరోయిన్లకు అవకాశం కల్పిస్తున్నాము.

హీరో హీరోయిన్లుగా తెలుగు సినిమాల్లో నటించడానికి అవసరమైన సాధారణ క్వాలిఫికేషన్స్‌తోపాటు - సినిమాలన్నా, నటన అన్నా పిచ్చి ఇష్టం, వ్యామోహం విధిగా ఉండితీరాలి. వయస్సు సుమారుగా 18-24 మధ్య ఉండాలి.

పారితోషికమే ప్రధానం అనుకునేవాళ్లు వేరే ప్రయత్నాలు చేసుకోవచ్చు.

ఆడిషన్లకు వచ్చేటప్పుడు విధిగా మీ ఫోటోలను, (ఉంటే) వీడియో క్లిప్స్‌నూ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

ఆసక్తి ఉన్న ఔత్సాహిక హీరోలు, హీరోయిన్లు మీ మీ "ది బెస్ట్" క్లోజ్అప్, ప్రొఫైల్ ఫోటోలతో ముందుగా నాకు ఈమెయిల్ చెయ్యండి. లేదా కింద ఇస్తున్న నా ఫేస్‌బుక్ పేజ్‌లో మెసేజ్ ద్వారా పంపండి. ప్రాథమిక పరిశీలన తర్వాత మీకు మా ఆఫీసు నుంచి కాల్ వస్తుంది.

ఈమెయిల్:
mchimmani@gmail.com
ఫేస్‌బుక్ పేజ్:
www.facebook.com/onemano

గమనిక:
ఇతర సపోర్టింగ్ పాత్రల సెలెక్షన్లు తర్వాత ఉంటాయి. వాటి కోసం మరొకసారి పిలుస్తాము.
 ఈ కాస్టింగ్ కాల్ లింకును మీ మీ ఫేస్‌బుక్ టైమ్‌లైన్స్ మీద కూడా షేర్ చేస్తే సంతోషిస్తాను. మా పని మరింత తొందరగా పూర్తయిపోతుంది. ఈ సపోర్ట్ ఇవ్వగలిగే మిత్రులకు అడ్వాన్స్‌గా థాంక్స్!      

Sunday 18 August 2013

శాటిలైట్ రైట్స్ ఎందుకు అదృశ్యమైపోయాయి?

మా చిన్నతనంలో సినిమాల రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూషన్ అని ఒక మంచి ఆరోగ్యకరమైన వ్యవస్థ ఉందేది (ట!). సినిమా తీసే నిర్మాతలకూ, ఈ డిస్ట్రిబ్యూటర్లకు మధ్య మంచి మానవీయ సంబంధాలు ఉండేవని కూడా చాలా విన్నాను. ఒక నిర్మాత సినిమా ప్రారంభించాడంటే - ఆయనకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా పూర్తయ్యేవరకూ హార్ధికంగా, ఆర్ధికంగా నిర్మాతకు ఎంతో అండగా ఉండేవారట.

ఇప్పుడలాంటి అనుబంధాలేం లేవు. అంతా హెవీ గ్యాంబ్లింగ్!

ఇలాంటి గ్యాంబ్లింగ్ నేపథ్యంలో కొత్తవాళ్లతో తీసిన నిర్మాతలకు అసలు సినిమాని కొని రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్లుంటారన్న ప్రసక్తే లేదు! అయితే ఆ నిర్మాతే రిలీజ్ చేసుకోవాలి. లేదంటే వేరే ఎవరినైనా నమ్మి తన సినిమాని వాళ్ల చేతుల్లో పెట్టాలి. ఆ తర్వాత, మీద తడిగుడ్డ వేసుకొని ఎదురుచూస్తుండాలి.. ఏమయినా డబ్బులు వస్తాయేమోనని! అదంతా జరగని పని అని తర్వాత తెలుస్తుంది. అది వేరే విషయం.

టీవీ చానెల్స్ పుణ్యమా అని, ఆకాశంలోంచి ఊడిపడ్డట్టుగా కొత్తగా "శాటిలైట్ రైట్స్" అనేది ఒకటి వచ్చింది. కొత్తవాళ్లతో సినిమాలు తీసేవాళ్లకు ఇదొక ఊహించని ఖచ్చితమైన ఆదాయ మార్గం. ఎంతో కొంత డబ్బు అనేది వచ్చితీరుతుందన్నమాట!

శాటిలైట్ రైట్స్ అంటే మరేంటో కాదు. సినిమా రిలీజ్ అయ్యాక, ఆ సినిమాని టీవీ చానెల్స్ ప్రసారం చేస్తాయి. అలా చేసినప్పుడు వాళ్లకి బోలెడన్ని యాడ్స్, స్పాన్సర్స్ రూపంలో చాలా డబ్బు వస్తుంది. ఇలా ఆ సినిమాను టెలికాస్ట్ చేసిన ప్రతిసారీ వస్తుంది.  

ఇలా వచ్చే డబ్బు కోసం, ప్లస్, చానెల్స్ మధ్య ఉండే పోటీ తట్టుకోవడం కోసం చానెల్స్ కి సినిమాలు కావాలి. అందుకని చానెల్స్ సినిమాలని కొంటాయి. అదే శాటిలైట్ రైట్స్.

సినిమా సక్సెస్ అయినా, ఫెయిలయినా శాటిలైట్ రైట్స్ కి సంబంధం లేదు. ఆ సినిమా మార్కెట్ విలువను బట్టి ఒక రేట్ కి సినిమాను కొంటారు. ఆ డబ్బు సినిమా రిలీజ్ లోపే రెండు మూడు ఇన్స్‌టాల్‌మెంట్స్‌లో వచ్చేస్తుంది! ఇంకేం కావాలి?

అయితే, మనవాళ్ల తెలివి చిన్నది కాదుకదా? ఒక వరంలా వచ్చిన దీన్ని ఎంత దారుణంగా మిస్‌యూజ్ చేయవచ్చో అంతా చేశారు.

కేవలం ఇలా వచ్చే డబ్బు కోసమే సినిమాలని 2,3 రోజుల్లో చుట్ట చుట్టేస్తూ కొంతమంది కోట్లు సంపాదించారు. ఆ మాత్రం ఓపిక కూడా లేని మరికొంతమంది ఇంకో విచిత్రం చేశారు. సినిమా ఓపెన్ చేయటం, శాటిలైట్ రైట్స్ అగ్రీమెంట్ చేసుకోవటం, అడ్వాన్స్ తీసుకోవడం, తర్వాత దుకాణం మూసేయడం!

ఇదిగో, ఇలాంటి పరిణమాలవల్ల  - నిజమైన ప్యాషన్‌తో, కొత్తవాళ్లతో చిన్న సినిమాలని తీసే ఔత్సాహికులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇప్పుడు అసలు కొత్తవాళ్లతో తీసే సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఇవ్వడానికి ఏ చానెల్ కూడా ముందుకు రావటం లేదు. సినిమా అంతా పూర్తయ్యి, అది రిలీజ్ అయ్యాకే శాటిలైట్ రైట్స్!

అయినా ఓకే. ఎందుకంటే, ఈ ఒక్క శాటిలైట్ రైట్స్ అనేదే సినిమా తీశాక ఖచ్చితంగా వచ్చే మొదటి ఆదాయం!

మిగిలినవన్నీ స్పెక్యులేషన్ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే, ఇక్కడ సినిమా రంగంలో రూల్స్ అనేవి ఉండవు. ఏదో ఒక సినిమాకి వచ్చిన బిజినెస్‌ను చూసి మన సినిమాకూ అలాగే వస్తుంది అనుకోవటం కుదరదు. ఇంకా చెప్పాలంటే కొన్ని చిన్న సినిమాలు హిట్టయినా డబ్బులు రాని సందర్భాలుంటాయి.

ఇక్కడ నిర్మాత చేతికి వచ్చిందే డబ్బు. మిగిలిన మాటలన్నీ ఉట్టి ట్రాష్.

ఒక మైక్రో బడ్జెట్ సినిమా ప్లాన్ చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ మార్కెట్ పరిధిని దాటకుండా చూసుకోవాలి. ఆ పరిధి దాటిన బడ్జెట్‌కు తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు.

కట్ టూ శాటిలైట్ రైట్స్ సత్తా -

ఆ మధ్య హిట్తయి ట్రెండ్ సెట్ చేసిన ఒక చిన్న యూత్ సినిమా రిలీజ్ కు ముందు థర్డ్ పార్టీకి అమ్మిన శాటిలైట్ రైట్స్ 30 లక్షల లోపే. ఆ సినిమా రిలీజ్ తర్వాత, అదే థర్డ్ పార్టీకి, చానల్ నుంచి అదే సినిమాకు వచ్చిన అసలు శాటిలైట్ రైట్స్ 2 కోట్లు! అదీ సినిమా ..     

Friday 16 August 2013

ఒక మిలియన్ డాలర్లు చాలు!

వరలక్ష్మీ వ్రతం ఆడవాళ్లు చేసుకొనే పూజేనా కాదా.. ఆ రోజు పూజ చేస్తే డబ్బులు బాగా వస్తాయా రావా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. కనీసం ఈ ఒక్క రోజయినా మనం మన ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచిస్తాం. ఇంకా ఏం కావాలో, ఎంత కావాలో ఆలోచిస్తాం.

ఈ విషయంలో నాకు ఇంతకు మించిన క్లారిటీ అవసరం లేదు.

పొద్దుట లేవగానే ఒక పది నిమిషాలపాటు ఫేస్‌బుక్‌లో ఏదో ఒక "నాన్‌సెన్స్" పోస్ట్ చేయడం నాకలవాటు. ఇవాళ పొద్దుటే ఎందుకో కుదర్లేదు. తర్వాత ఆఫీసుకి వెళ్లేటప్పుడు హడావిడిగా నా నోట్‌బుక్ ఓపెన్ చేసాను. సందర్భంగా ఉంటుందని - లక్ష్మీదేవి ఫోటో ఒకటి పోస్ట్ చేస్తూ, "మనందరికీ లక్ష్మీదేవి కావల్సినంత ధనాన్ని ఇచ్చి అశీర్వదించుగాక!" అని ఓ లైన్ రాసి పోస్ట్ చేసేశాను.

ఉన్నట్టుండి నాలోంచి బయటికి వచ్చాడు.. నా 'డబుల్ యాక్షన్'-ఉరఫ్-'డీఏ'.

"ఏంటి.. నీకీ కొత్త అలవాటు ఎప్పట్నించి?" ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు డీఏకి నేనిచ్చిన సమాధానమే ఈ పోస్టు ప్రారంభంలో నేను రాసిన మొదటి రెండు పేరాలు!

అందరి సెంటిమెంట్లనూ నేను మనస్పూర్తిగా గౌరవిస్తాను. నా సెంటిమెంటు మాత్రం నాదే. అదే నా క్లారిటీ.

"సరే, ఏమాలోచించావు మరి ఇవాళ?" అడిగాడు నాలోని డీఏ.

"అలోచించిందంతా చెప్పనా.. అంకె చెప్పనా?" అడిగాన్నేను.

"అంకె చెప్పు చాలు!" నీ సొదంతా యెవడు వింటాడు అన్న ఫీలింగ్‌తో అన్నాడు డీఏ.

"వన్ మిలియన్ డాలర్స్!" చెప్పాన్నేను.

"యూ ఎస్ కరెన్సీలో చెప్తున్నావు!?"

"ఇండియన్ కరెన్సీలో చెప్తే అంత కిక్ రాదు!"

"పెద్ద కోరికేం కాదు. నువ్వు చచ్చేలోపు ఆ మాత్రం సంపాదించలేకపోతే వేస్టు!"

"చచ్చేలోపు కాదు. వచ్చే సంవత్సరం లోపు! అంటే, జస్ట్ ఇంకో 365 రోజుల్లో!!" అన్నాన్నేను.

అదిరిపడి చూశాడు డీఏ.

"అంత ఈజీ కాదనుకుంటాను.." లో వాయిస్‌తో అన్నాడు డీఏ.

"కొంచెం కష్టమే కావొచ్చు. బట్, ఆ అంకె నాకిష్టం." స్థిరంగా చెప్పాన్నేను.

"నిన్ను మార్చడం నావల్ల కాదు. అయినా.. ఆల్ ది బెస్ట్!" మనస్పూర్తిగా చెప్పాడు డీఏ.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత మళ్లీ గొంతు సవరించుకున్నాడు డీఏ.

"నువ్వింకా సినిమానే మొదలెట్టలేదు. సీన్లు మాత్రం బాగా క్రియేట్ చేస్తున్నావు. కౌంటింగ్ మిషన్ కొన్నావా మరి?"

"బ్లాక్ అయితే కౌంటింగ్ అవసరం. నాకు బ్లాక్ ఇష్టం లేదు. అంతా వైటే!"

"నువ్విప్పుడు చేస్తున్న సినిమాల ద్వారా ఇదంతా అయ్యేదేనా?" కొంచెం డల్ అయింది డీఏ వాయిస్.

"365 రోజుల్లో అవాలంటే మాత్రం ఒక్క సినిమాల్లోనే అవుతుంది!" నాలో కాన్‌ఫిడెన్స్ లెవెల్ మరింత పెరిగింది.

"ఇంకో చోట కూడా అవుతుంది.. గ్యాంబ్లింగ్!" ఏదో కొత్త విషయం కనుక్కున్నట్టుగా, తనకూ అంతో ఇంతో  తెలుసన్నట్టుగా నవ్వుతూ అన్నాడు డీఏ.

"సినిమా కూడా గ్యాంబ్లింగే!"

నాకు తెలిసిన ఆ ఒక్క ముక్క తాపీగా చెప్పేసి, నా పనిలో నేను మునిగిపోయాను.

దానికి నా 'డబుల్ యాక్షన్'-ఉరఫ్-'డీఏ' రియాక్షన్ ఎలా ఇచ్చాడో నేను చూడలేదు. అక్కడ్నించి మాయమయిపోయినట్టుగా ఒక ఫ్లాష్ సౌండ్ ఎఫెక్ట్ మాత్రం విన్నాను. 

Monday 12 August 2013

2014 ప్రధానితో మన టాలీవుడ్!

మన తెలుగు ఇండస్ట్రీలో ఒక సాంప్రదాయం ఉంది ..

రాష్ట్రంలో ప్రభుత్వం ఏది మారినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా - పుష్పగుచ్చాలు, శాలువాలతో మొత్తం టాలీవుడ్ కదిలివెళ్తుంది. అభినందిస్తుంది. 'వాళ్లంతా కూడా కొంపదీసి అదే పార్టీనా' అన్నంత అభిమానాన్ని కురిపించి మరీ అభినందనలు తెలుపుతారు. మనవాళ్లకు ఇదొక ఆనవాయితీ అయింది.

పాజిటివ్ కోణంలో  ఆలోచిస్తే ఇందులో తప్పేంలేదు. కళాకారులకు పార్టీలు, ప్రాంతాలు, భాషలు ఎలాంటి అడ్డు కాదు. కాకూడదు.

ఈ విషయంలో ఉదాహరణకు .. మన తెలుగు హీరోయిన్లు, విలన్లనే తీసుకుందాం. మన హీరోయిన్లలో 90 శాతం మంది నార్త్ లేదా కేరళ నుంచి వచ్చినవాళ్లే! అలాగే విలన్లలో కనీసం 60% మంది మన తెలుగువాళ్లు కాదు. మన హీరోల్లో కొందరికి తమిళ దర్శకులంటే చాలా అభిమానం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్లకే ఇస్తారు.

అంతదాకా ఎందుకు, మన వర్మ వెళ్లి బాలీవుడ్‌లో ఒక ప్యారలల్ ఇండస్ట్రీని నడిపిస్తున్నాడు! ఇలా మనం ఎన్నయినా చెప్పుకోవచ్చు ..

కళకూ, కళాకారులకూ ఎలాంటి ఎల్లలు లేవు. ఉండవు. ఒక రకంగా మనమంతా "ఫ్రీ బర్డ్స్" అన్నమాట!

కట్ టూ మన మోడీజీ -

2014 లో మోడీ ప్రధాని అవుతారని చాలామంది నమ్మకం. వ్యక్తిగతంగా నేనూ అదే ఫీలవుతాను. కానీ ఎలాంటి పొత్తులు లేకుండా బిజెపి ఒక్కటే స్వీప్ చేయగలిగితేనే ఏదయినా ప్రయోజనం, ఫలితం ఉంటుంది. లేదంటే అంతే సంగతులు. షరా మామూలే!

అసలు పాయింట్ ఏంటంటే - పొత్తుల విషయం ఎలా ఉన్నా, స్వయంగా వాళ్ల పార్టీలోనే మోడీ పీఎం కావొద్దు అని నానా గొడవ చేస్తున్నవాళ్లు బోలెడంతమంది ఉన్నారు. ఇవన్నీ దాటుకొని మోడీ 2014 లో పీ ఎం అయితేనే బాగుంటుంది అని నేననుకుంటాను. అందరూ అలా అనుకోవాలని రూలేమీ లేదు.

ఇది నేను పార్టీ మీద ప్రేమతో చెబుతున్నది మాత్రం కాదు. దేశం మీద ప్రేమతో.

ఇక క్లయిమాక్సుకు వద్దాం -

బాలకృష్ణ, యావత్తు మోహన్ బాబు కుటుంబం, మురళీమోహన్, సుమన్, జగపతి బాబు, నటి గౌతమి, ప్రొడ్యూసర్లు రామా నాయుడు, సురేశ్ బాబు, ఏ ఎం రత్నం, దిల్ రాజు, అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు, కీరవాణి మొదలైన అతిరథమహారథులయిన వాళ్లెందరో వెళ్లి నిన్న హైదరాబాద్ వచ్చిన మోడీజీని కలిశారు. పుష్పగుచ్చాలు, శాలువాలు మామూలే.

ఈ విషయంలో నేను హాప్పీగా ఫీలవుతున్నదేంటంటే - ఇంతకు ముందువరకూ కేవలం మన రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సీ ఎం లను మాత్రమే ఇలా కలిసేవారు మన వాళ్లు. ఇప్పుడా ఆనవాయితీ, "కాబోయే పీ ఎం" రేంజికి వెళ్లటం అనేది ఖచ్చితంగా గొప్ప విషయమే. వాళ్ల ఆత్మవిశ్వాసానికి నా హాట్సాఫ్!

అక్కడ మన వాళ్లు ఏం చర్చించారు, దేనికోసం కర్చీఫ్ వేసే ప్రయత్నం చేశారు అన్నది ఇప్పుడంత అవసరం కాదు. కాబోయే మన దేశ ప్రధాని మోడీ అని ఆయన మీద ఎంతో నమ్మకంతో వెళ్లి కలిశారు. ఆ ఒక్క పాయింటే నేనీ పోస్ట్ రాయడానికి ప్రేరేపించింది. ఇది నిజం.   

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్‌లలో ట్రెయినింగ్!

నిన్న బేగంపేట్‌లో మా కొత్త ఆఫీసు ప్రారంభమయింది. ఈ ఆఫీసునే కేంద్రంగా చేసుకొని, మైక్రో బడ్జెట్ సినిమాల కార్పొరేషన్ దిశగా మేము అడుగులు వేస్తున్నామని మొన్నటి పోస్టులో చెప్పాను.

కట్ టూ ట్రెయినింగ్ -

మేము ప్రారంభిస్తున్న మైక్రో బడ్జెట్ సినిమాలు పూరిగా కొత్తవాళ్లతో తీస్తున్న ఒక సీరీస్ కాబట్టి - ముఖ్యమైన అన్ని విభాగాల్లోనూ మాకు కొత్త వాళ్ల అవసరం చాలా ఉంటుంది. వారిలోనూ, నిజంగా సినిమాల పట్ల అంత ప్యాషన్, సినిమాలో పనిచేయడానికి అవసరమైన బేసిక్ టాలెంట్స్ విధిగా ఉండాలి. అనుభవంతో ఎలాంటి పనిలేదు.

ఈ కోణంలో డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, యాక్టింగ్‌లలో మేమే మాకు అవసరమైన విధంగా శిక్షణ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేశాము. దీనికి మినిమమ్ ఫీజంటూ ఒకటి ఉంటుంది.

అది కూడా లేకపోతే క్యాండిడేట్‌లో ఉండాల్సినంత సీరియస్‌నెస్ ఉండదనేది ఎవ్వరయినా ఒప్పుకుతీరాల్సిన నిజం. ఇక్కడ మాకు ఫీజు కాదు ముఖ్యం. మేము కోరుకోనేలాంటి ఆర్టిస్టులను, టెక్నీషియన్లను మేమే తయారుచేసుకోవడం మాకు ముఖ్యం.  

సో, యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్‌లలో నిజంగా చచ్చేంత ఆసక్తి ఉండి, సినీ ఫీల్డులోకి ఎలాగయినా సరే ఎంటర్ కావాలనుకొనే ఔత్సాహికులకు ఇదొక మంచి అవకాశం.

మరొక గుడ్ న్యూస్ ఏంటంటే - 'మనుటైమ్  ఫిలిం అకాడెమీ'లో ఈ శిక్షణా విభాగం కేవలం కొంతకాలం మాత్రమే. ఇంకా చెప్పాలంటే కొన్ని నెలలు మాత్రమే! ఆ కొన్ని నెలలు కూడా, రోజుకి కొన్ని గంటల చొప్పున, ఈ శిక్షణ బాధ్యతని స్వయంగా నేనే నిర్వహిస్తున్నాను.

ఇంకేం కావాలి?

పూర్తి వివరాలకు ఈ లింక్‌ని క్లిక్ చేయండి. లేదా, నాకు పర్సనల్‌గా ఈమెయిల్ పెట్టండి:

Website:
http://mfamax.weebly.com/training.html
Email:
mfamax@in.com

సీ యూ ఇన్ మై ఆఫీస్, గైస్ .. 

Sunday 11 August 2013

మైక్రో బడ్జెట్ సినిమాల కార్పొరేషన్ దిశగా 'మనుటైమ్!'..

ఈ రోజు ఉదయం 9.31 నుంచి ప్రారంభమవుతున్న బేగంపేట్‌లోని మా కొత్త ఆఫీసుని దాదాపు ఒక పూర్తి స్థాయి కార్పొరేట్ పధ్ధతిలో రూపొందించడం జరిగింది.

మా ఇంటికీ, ఫిలిం నగర్‌కూ దాదాపు మధ్యలో ఉండేట్టుగా తీసుకున్న ఈ ఆఫీసు నాకు అన్నివిధాలా బాగా నచ్చింది. ఇది కమర్షియల్ బిల్డింగులోనే ఉండటం అనేది మరో ప్లస్ పాయింట్. ఇవాళ ఉదయం 9.31 నిమిషాలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఇక అసలు పనులన్నీ (ఇన్నాళ్లూ నత్తనడక నడచినవి!) ప్రారంభమౌతాయి.

 >  TFCC (తెలంగాణా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్)లో నేను రిజిస్టర్ చేసిన మనుటైమ్ ఫిలిం అకాడమీ ద్వారా, ప్లస్, నా మిత్రుడు కె జె దశరథ్ రిజిస్టర్ చేస్తున్న మరొక కొత్త బ్యానర్ ద్వారా ఈ ఆఫీసు నుంచి చిత్రాల నిర్మాణం ప్రారంభమౌతుంది.

> అవసరాన్ని బట్టి, అంతకు ముందే నేను లైఫ్ మెంబర్‌గా ఉన్న APFCC (ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్) లోని నా మనుటైమ్ మూవీ మిషన్ బ్యానర్ ద్వారా కూడా సినిమాల నిర్మాణం ఉంటుంది.

పూజ తర్వాత, మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.     

Thursday 8 August 2013

ఉదయ భానులో మనం చూడని మరో కోణం!

కొన్ని క్షణాల క్రితమే ఇది చూశాను. యూట్యూబ్‌లో నేనేదో వెతుకుతోంటే అనుకోకుండా ఈ లింక్ కనిపించింది. దీని గురించి అంతకు ముందు కొన్ని రోజుల క్రితం ఎక్కడో ఏదో విన్నాను కానీ, అప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు నేను.

ఇప్పుడు మాత్రం చూడగానే ఇలా బ్లాగ్‌లో పెట్టాలనిపించింది. వెంటనే రాయడానికి ఇలా కూర్చున్నాను.

కట్ టూ కాంట్రవర్సీ -

ఇది మా టీవీలోని "రేలా రె రేలా!" ప్రోగ్రామ్‌లో ప్రసారమయింది. ఈ పాటని భాను, వాళ్ల అమ్మ ఇద్దరూ కలిసి రాసి, బాణీ కట్టినట్టుగా తెలుస్తోంది.

ఇప్పటి సమాజంలోని అన్యాయాల్ని, దుష్ట రాజకీయాల్నీ కడిగిపారేసే ఈ పాటలో ఎన్నో ధ్వనులు వినిపిస్తాయి. కొన్ని సూటిగా కూడా ఉంటాయి.

ఇక - ఈ పాటలోని కొన్ని పదాల్ని బహుశా ఇప్పటివరకూ ఏ రచయితా ఉపయోగించే సాహసం చేయలేదు. ఆ సాహసం భాను చేసింది. బాణీ కట్టింది. పాడింది.

ఇప్పటివరకూ భానుని ఒక యాంకర్‌గా, ఒక నటిగా, డ్యాన్సర్‌గా చూశాము. 'రేలా రే రేలా' వంటి ప్రోగ్రాముల్లో  పాటలు కూడా పాడింది. కానీ ఇంత గాఢమైన సీరియస్‌నెస్ ఉన్న పాటను మాత్రం ఇంతవరకూ టచ్ చేయలేదు ఉదయ భాను.

సుమారు ఓ 3 నెలల క్రితం - మేం అనుకున్న ఒక మైక్రో బడ్జెట్ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రతో పాటు, ఒక పాట కోసం కూడా ఉదయ భానుని తీసుకోవాలనుకున్నాను. ఆమెకు అతి దగ్గరయిన ఒక సోర్స్ ద్వారా ప్రయత్నించటం కూడా  జరిగింది. ఉదయ భానుతో అగ్రిమెంట్ కూడా అయిపోయేదేమో బహుశా. కానీ, ఇంతలో మా ప్రాజెక్ట్‌లోనే బోల్డన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇక ఆ విషయం పక్కన పెట్టేశాం.

ఉదయభాను గురించి రక రకాల కామెంట్స్ సినీ, టీవీ ఇండస్ట్రీల లోపలా, బయటా మనకు వినిపిస్తాయి. కొన్ని నిజ జీవిత వాస్తవాలు కూడా ఉండవచ్చు. ఒకవేళ ఏవయినా వ్యక్తిగ విషయాలున్నా మనకు వాటితో పనిలేదు. ఉండకూడదు కూడా. ఇండస్ట్రీలో కానీ, ఇంకెక్కడయినా కానీ - కొంచెం యాక్టివ్‌గా, ఫాస్ట్‌గా కనిపిస్తే చాలు. ఏవేవో కథలు అళ్లేస్తారు. అదంతా మామూలే. ఒక మాస్క్ అని నా ఉద్దేశ్యం.

ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి కొన్ని మాస్కులు ధరించక తప్పదు.

కట్ టూ భాను రూట్స్ -

అయితే, ఆ మాస్క్ వెనక, తన అసలు రూట్స్ మర్చిపోని ఉదయభాను విశ్వరూపమే ఈ పాట. నా వ్యక్తిగత ఉద్దేశ్యం ప్రకారం, భాను ఏదో ఒక హల్ చల్ కోసం ఈ పాటని క్రియేట్ చేయలేదు. అంత అవసరం ఆమెకు లేదు. రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే తను ఈ పాట పాడకుండా కూడా వెళ్లవచ్చు. ఆమె కోరుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆమెను ఇట్టే చేర్చేసుకుంటుంది.

భానుకి అంత పాప్యులారిటీ ఉంది!


ఇంకో విధంగా చెప్పాలంటే, ఇలాంటి పాటలు పాడటం అనేది, సాఫీగా, బాగా నడుస్తున్నతన  కెరీర్‌ని తానే పాడుచేసుకోవటం అవుతుందన్నది కామన్‌సెన్స్. అయినా, ఉదయభాను పాడింది. ఇది తన హృదయంలోంచి వచ్చిన పాట అని నాకనిపించింది. అందుకే నగ్నచిత్రంలో దీన్ని పోస్ట్ చేస్తున్నాను.

పాట పూర్తయ్యాక - భానుని అభినందిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ, అనంత శ్రీరామ్, వందేమాతరం, గోరటి వెంకన్నల కామెంట్స్ కూడా ఆర్టిఫీషియల్ అని నేను అనుకోవడం లేదు. అంతగా పొగడాల్సిన అవసరం వారిలో ఏ ఒక్కరికీ లేదు.

'రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా'.. పాటనిండా ఇలాంటి వర్డింగ్స్ బోలెడన్ని ఉన్నాయి. వినండి పాట. చూడండి భాను ఫీలింగ్స్..  

Monday 5 August 2013

కొత్త టాలెంట్‌కు స్వాగతం!

లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి, తెలుగులో మేము ప్లాన్ చేస్తున్న మైక్రో బడ్జెట్ చిత్రాల సీరీస్ కోసం, సినీ ఫీల్డుపట్ల ఆసక్తి ఉన్న 'కొత్త' మైక్రో-ఇన్వెస్టర్లు/కో-ప్రొడ్యూసర్లు/ప్రొడ్యూసర్లతో సహా - క్రింది విభాగాల్లో "కొత్త టాలెంట్" కోసం చూస్తున్నాము:

> స్క్రిప్ట్ రైటర్స్ / అసోసియేట్ స్క్రిప్ట్ రైటర్స్
> అసిస్టెంట్ డైరెక్టర్లు
> పోస్ట్ ప్రొడక్షన్‌లో లేటెస్ట్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న ఎడిటర్లు
> ఇతర టెక్నీషియన్లు
> సింగర్లు
> లిరిక్ రైటర్లు

> హీరోలు
> హీరోయిన్లు (తెలుగు)
> సపోర్టింగ్ ఆర్టిస్టులు
^^^

ఇంటర్నెట్ నాలెడ్జ్‌తో పాటు - ఫోటోషాప్, వెబ్ డిజైనింగ్‌లలో కొంతయినా ప్రవేశం ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లకు ప్రాధాన్య్యం ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్లకు స్వంత ల్యాప్‌టాప్ తప్పనిసరి.

కొత్త ఫిమేల్ అసిస్టెంట్ డైరెక్టర్లకు ప్రోత్సాహం తప్పక ఉంటుంది.

ఈ అవకాశం - టాలెంట్ ఉండీ, ఇప్పటివరకూ చాన్స్ దొరకని కొత్తవాళ్లకి మాత్రమే.
^^^

ఈ చిత్రాలు పూర్తిగా మైక్రో బడ్జెట్ లో తీస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్  కమర్షియల్ చిత్రాలు. సినిమా మీద ప్యాషన్, టాలెంట్ లతో పాటు - పారితోషికం గురించి ఆలోచించకుండా, 'వాలంటరీగా పనిచేస్తాం' అని ముందుకు వచ్చేవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ఇక, ఈ సినిమాలకు పని చేసిన ప్రతి ఒక్కరికీ, వారు చేసిన పని మేరకు, తప్పనిసరిగా స్క్రీన్ మీద ‘టైటిల్ కార్డ్స్’ లో పేరు వేయటం జరుగుతుంది.

ఆసక్తి వున్నవారు  ఫోటోతో కూడిన మీ బయోడేటా, ఇతర వివరాలు, మొబైల్ నంబర్ తో ఈమెయిల్ పంపించండి. మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. లేదా, నేనే మీకు కాల్ చేస్తాను.

"ఇంటర్వ్యూలు, ఆడిషన్లు ఈ ఆగస్ట్ 12 సోమవారం నుంచి  బేగంపేట్ (హైద్రాబాద్) లో ఉంటాయి."

email:
mfamax@in.com 
   

Sunday 4 August 2013

ఆస్కార్ అవార్డ్ చిత్రానికి పనిచేసిన మన కిషోర్! [షాట్ బై షాట్ 3]

నా ఫేస్‌బుక్ పేజ్ ద్వారా పరిచయమయ్యాడు కిషోర్. "ఒక సారి మిమ్మల్ని కలుస్తాను సార్!" అంటుండేవాడు ఎప్పుడూ. ముందు ఫేస్‌బుక్ మెసేజ్‌లు, తర్వాత ఫోన్ కాల్స్.

ఒక రోజు అనుకోకుండా కిషోర్ ప్రొఫైల్ చూశాను. వెంటనే కలుద్దాం రమ్మన్నాను.

మా ఇంటికి దగ్గర్లో ఉన్న కాఫీ డేలో ఒక సాయంత్రం కలిశాము. తనతో పాటు తన అసిస్టెంట్ రాహుల్ కూడా వచ్చాడు. కాఫీ తాగుతూ చాలా సేపు మాట్లాడుకున్నాము.

కిషోర్ పుట్టింది విజయవాడ. నాన్న దుర్గా మల్లేశ్వర రావు, అమ్మ కనకలక్ష్మి. రవి, అనిల్ - కిషోర్ సోదరులు.

మా సంభాషణ చివర్లో ఒక విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. సుమారు 9 ఏళ్ల క్రితం ఇదే కిషోర్ నా తొలి చిత్రం "కల" కి సెకండ్ కెమెరా అసిస్టెంట్‌గా మా టీమ్‌తో మారిషస్ వచ్చాడు! అప్పుడు బహుశా కిషోర్‌కి 18 కూడా పూర్తిగా నిండి ఉండవు. మా కెమెరామాన్ శంకర్‌ గారికి  లెన్స్‌లు అందిస్తూ, కెమెరాని అటు మోస్తూ, ఇటు మోస్తూ, దాన్ని స్టాండుకి ఫిక్స్ చేస్తూ, తీస్తూ, తుడుస్తూ...ఒక కెమెరా అసిస్టెంట్‌గా ఎప్పుడూ తన పనిలో తాను మునిగిపోయి ఉండేవాడు కిషోర్.

అప్పటి ఆ సెకండ్ కెమెరా అసిస్టెంట్ కిషోర్, తర్వాత ముంబై వెళ్లాడు. అక్కడి పరిచయాలు, అతని వ్యక్తిగత ప్రవర్తన, పనితీరు అతని దశని, దిశనీ మార్చేశాయి. కట్ చేస్తే - ఆ తర్వాత కనీసం ఒక అర డజన్ హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాడు. వాటిల్లో, ఎనిమిది ఆస్కార్ అవార్డులు సాధించిన మాస్టర్ పీస్ "స్లమ్‌డాగ్ మిలీయనేర్" ఒకటి. "మిషన్ ఇంపాజిబుల్ 4"  రెండోది! (పైన ఫోటోలో కెమెరా దగ్గర కూర్చున్నది కిషోర్. వెనకే "స్లమ్‌డాగ్ మిలియనేర్" డైరెక్టర్ డేనీ బాయల్ ఉన్నారు. తను మాట్లాడుతోంది DOP ఆంథొనీ మాంటిల్‌తో.)

కట్ టూ "షాట్ బై షాట్" విత్ కిషోర్ -
^^^


అసలేంటి మీ రంగుల కల? ఏం కావాలనుకొని మీరీ ఫీల్డులోకొచ్చారు? ఏ సంవత్సరం?
ఇండస్ట్రీలోకి రావాలన్నదే నా కల. సినిమాటోగ్రాఫర్ కావాలనుకున్నాను. 2002 లో రవిప్రసాద్ యూనిట్‌లో కెమెరా అసిస్టెంట్‌గా చేరటంతో ఇండస్ట్రీలో నా కెరీర్ మొదలైంది.

ఫీల్డులో మీకు మొట్టమొదటగా పరిచయమైన.. మీరు మర్చిపోలేని వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరు?
2007 లో నేను ముంబైకి వెళ్లాక నాకు అక్కడ జి మోనిక్ కుమార్ పరిచయమయ్యారు. నా పని తీరు చూసి, తన దగ్గర పని ఉంది రమ్మంటూ ఆఫర్ చేశారు. అప్పుడు నాకు వివరాలేం తెలియవు. కానీ, అదొక ఇంగ్లిష్ సినిమా అని మాత్రం చెప్పారు. అదే "స్లమ్‌డాగ్ మిలియనేర్." ప్రపంచ సినిమాటోగ్రాఫర్స్‌తో నా ప్రయాణం అలా ప్రారంభమయింది. అలా, మోనిక్ కుమార్ నాకు మంచి మిత్రులు, గురువు కూడా.  

"స్లమ్‌డాగ్ మిలియనేర్"కు పని చేయటం ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఇంక ఆ తర్వాత వెనుతిరిగి చూసే అవకాశమే రాలేదు. ఒకదానివెంట ఒకటి.. చాలా అవకాశాలొచ్చాయి. ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నాను.

ఫీల్డులో మీరు బాధపడిన సందర్భం కానీ, మర్చిపోలేని చేదు జ్ఞాపకం గానీ ఏదయినా ఉందా? ఉంటే ఏంటది?
అలాంటివేమీ లేవు. కాకపోతే - మనం ఎంతో ప్యాషన్‌తో, ఎంతో కష్టపడి పనిచేసిన సినిమా ఏదయినా రిలీజ్ కావడం ఆలస్యమౌతుంటే మాత్రం చాలా బాధేస్తుంది.

ఫీల్డులో మీరు మర్చిపోలేని మధురస్మృతి?  
నేను పనిచేసిన "స్లమ్‌డాగ్ మిలియనేర్"కు 8 ఆస్కార్ అవార్డులు రావటం ఒక గొప్ప అనుభూతి. "మిషన్ ఇంపాజిబుల్" 1,2,3 లకు నేనో పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది.. "మిషన్ ఇంపాజిబుల్ -4"కు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో పని చేసే అవకాశం రావటం కూడా నాకు నిజంగా ఒక మధురస్మృతే.

ఈ మధ్యే ఒక కొత్త ప్రాజెక్టు గురించి చర్చించడానికి దర్శకుడు మనోహర్ చిమ్మని గారిని కలిశాను. ఆ సమయంలోనే నేనొక విషయం రియలైజ్ అయ్యాను. ఏంటంటే, మనోహర్ గారి తొలి చిత్రం "కల" టీమ్‌లో నేను కూడా కెమెరా డిపార్ట్‌మెంట్లో పనిచేశాను. షూటింగ్ కోసం నేను వెళ్లిన మొదటి ఫారిన్ ట్రిప్ కూడా అదే. సో, మేమిద్దరం మళ్లీ అప్పటి మారిషస్ షూటింగ్ జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. అదొక మంచి అనుభూతి.  

నేను మర్చిపోలేని మధురస్మృతి ఇంకొకటి చెప్పాలనిపిస్తోంది. "ది లెటర్స్" అనే హాలీవుడ్ సినిమాకు ఇటీవలే ఒక 3 నెలలపాటు పనిచేశాను. ఆ సినిమా షూటింగ్ 20 రోజులపాటు గోవాలో జరిగింది. ఆ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) జాక్ గ్రీన్. ఆపరేటివ్ కెమెరామాన్ అతని కొడుకు పీటర్ గ్రీన్. నేనూ, నా పనీ వాళ్లిద్దరికీ బాగా నచ్చింది. ఇద్దరూ నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. షూటింగ్ పూర్తయ్యాక చివరి రోజు జాక్ గ్రీన్ నాతో ఒక మాటన్నారు. "ఈ రోజు నుంచీ నువ్వు కూడా నాకు కొడుకువే! ఇకనుంచీ నీ పేరు కిషోర్ గ్రీన్!!" అని. ఆ రోజుని కూడా నేను మర్చిపోలేను.       

ఇప్పటి వరకు మీరు ఫీల్డులో ఎన్ని సినిమాలు చేసారు? 
ఫోకస్ పుల్లర్‌గా, ఫస్ట్/సెకండ్ కెమెరా అసిస్టెంట్‌గా తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సుమారు 30 సినిమాలకు పని చేసాను. టీవీ కమర్షియల్స్ కూడా చాలా చేశాను.  "బాయ్ మీట్స్ గాళ్", "సంద్రం" అనే ఈ రెండు తెలుగు సినిమాలకు ఈ మధ్యే (2013) పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌/డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) గా పనిచేశాను.  అవి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

ఒకవేళ ఫీల్డులోకి రాకపోయి ఉంటే ఏమయ్యేవారు మీరు? 
దాదాపు మా కుటుంబమంతా సినిమాలోనే ఉంది. మా నాన్న దుర్గా మల్లేశ్వరరావు గారు మంచి స్టేజ్ ఆర్టిస్టు, పెయింటర్, మంచి రైటర్ కూడా. నా చిన్నతనంలో మా నాన్న ఫోటో సీరియల్స్ చేస్తుండేవారు. మా అన్నయ్య ఇటీవలివరకూ ముంబైలోనే కెమెరా డిపార్ట్‌మెంట్లోనే పనిచేశారు. మా ఇంకో సోదరుడికి ఈ మధ్యే డైరెక్టర్‌గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది త్వరలో మొదలవబోతోంది. అలాగే మా నాన్న ఇద్దరు తమ్ముళ్లు కూడా ఫీల్డులోనే ఉన్నారు. ఒకరు సినిమాటొగ్రాఫర్ రామ్ కుమార్. మరొకరు ప్రముఖ PRO బి ఏ రాజు. ఇలా మా కుటుంబమంతా సినిమా ఫీల్డులోనే ఉంది. సినిమా తప్ప వేరొకదాని గురించి నేనసలు ఆలోచించలేదు.

విజయవాడ నుంచి హైద్రాబాద్ రాగానే ఒక షూటింగ్ చూడ్డానికెళ్లాను. అక్కడ పని చేస్తున్న ప్రతి ఒక్కరినీ గమనించాను. అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను సినిమాటోగ్రాఫర్ కావాలని. అయ్యాను.

ఇప్పుడు ఫీల్డులో మీ ప్రధాన లక్ష్యం ఏంటి? ఇంకా ఏం కావాలని? 
ఇంకా బాగా కష్టపడాలి. ఫీల్డులో ఒక మంచి సినిమాటోగ్రాఫర్‌గా, మంచి మనిషిగా పేరు తెచ్చుకోవాలి. అంతే.

సినీ ఫీల్డు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడెలా ఉంది ఫీల్డు.. ఇకముందు ఎలా ఉండబోతోంది? 
సినీ ఫీల్డంటే నాకు చాలా గౌరవం. ఈ ఫీల్డు మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అయితే - సినిమా ప్రొడక్షన్ విషయంలోనూ, రిలీజ్ విషయంలోనూ చాలా మార్పులు రావాలి ఇక్కడ. ఫిలిం మేకింగ్‌లో ఆధునికంగా, వేగంగా వస్తున్న మార్పుల్నీ, అభివృధ్ధినీ ఇండస్ట్రీ ఎప్పుడూ ఆహ్వానించాలి. అడ్డుపడకూడదు. అలాగే - కేవలం కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉండటం దురదృష్టకరం. చిన్న సినిమాల ప్రదర్శనకు పెద్ద ఆటంకమైన ఇలాంటి ధోరణులు సమూలంగా తొలగిపోయే మార్పు ఇండస్ట్రీలో రావాలి. దీనికి ఇంకొంత సమయం పడుతుంది. కానీ ఆ మార్పు తప్పక వస్తుంది.
^^^
 

కట్ టూ నగ్నచిత్రం -

కిషోర్ పెద్దగా చదువుకోలేదు. సినిమాటోగ్రఫీ గురించి కూడా ఏ ఫిలిం స్కూలుకి వెళ్లలేదు. పని చేస్తూ నేర్చుకున్నదే అంతా! "ముందు మనం చేసే పనిని గౌరవించాలి" అంటాడు కిషోర్. అలాగే, "నాకు పెద్ద ఎడ్యుకేషన్ లేకపోవడం అనేది ఒక అడ్దంకిగా నాకెప్పుడూ అనిపించలేదు" అంటాడు మన కిషోర్. ఆ నిజం మనం ఒప్పుకోవాలి. డేనీ బాయల్, బ్రాడ్ బర్డ్ వంటి హాలీవుడ్ డైరెక్టర్స్‌తో పని చేసాడు కిషోర్!

కిషోర్ నాన్నకి డ్రామా అన్నా, సినిమా అన్నా చాలా ఇష్టం. ఆయన నుంచే కిషోర్‌కి సినిమా మీద, సినిమాటోగ్రఫీ మీదా ఆసక్తి పెరిగింది. దురదృష్టవశాత్తూ కిషోర్ నాన్న కేవలం ఒక వారం క్రితం మొన్న సోమవారమే (29 జూలై) మరణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనీ, మన కిషోర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనీ, తన కలలన్నీ నిజం చేసుకోవాలనీ మనసారా కోరుకుందాం ..
^^^
Follow Kishore on Facebook:
https://www.facebook.com/kishor.boyidapu     

Saturday 3 August 2013

అసలు సినిమాలెందుకు ఆగిపోతాయి?

నా చిన్నప్పటినుంచీ వింటున్నాను - బోలెడన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ప్రసాద్ ల్యాబ్‌లో కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయని. అది అబధ్ధమేం కాదు. 100% నిజం.

అయితే, ఒక్క ప్రసాద్ ల్యాబే కాదుగా? ఇంకా ఎన్నో స్టూడియోలు, ల్యాబ్‌లూ ఉన్నాయి. వాటిల్లో కూడా, నిజంగానే రిలీజ్ కాని చాలా సినిమాలు అలా పడిపోయుంటాయి.

ప్రతి సంవత్సరం ప్రారంభమయ్యే ఎన్నో సినిమాల్లో - కొన్ని సినిమాలు పూర్తికాకపోవటం, పూర్తయినా రిలీజ్ కాకపోవటం అనేది ఒక అత్యంత సర్వసాధారణమైన విషయం.

ఈ పరిస్థితి ఒక్క తెలుగు సినిమాలకే పరిమితం కాదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అంతటా ఉన్నదే. ఇక ముందు కూడా ఈ మాటను మనం వింటూనే ఉంటాం, ఒక ఎవర్ గ్రీన్ స్టేట్‌మెంట్‌లా.

అన్నేసి లక్షలు, కోట్లు కుమ్మరించి కూడా అసలెందుకీ పరిస్థితి? ఎందుకు సినిమాలు ఆగిపోతాయి?

ఈ పరిస్థితికి సాధారణంగా 90 శాతం కారణం ఒక్కటే అయి ఉంటుంది. అది - సినిమా నిర్మాణం పట్ల, సినిమా వ్యాపారం పట్ల ఒక కనీస అవగాహన లేకపోవడం.

సాధారణంగా ఇలా ఆగిపోయే సినిమాల్లో 99% సినిమాలు కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు తీసినవే అయి ఉంటాయి. ముందూ వెనకా ఆలోచించకుండా, కొత్త ఉత్సాహంతో రంగంలోకి దూకేస్తారు. తర్వాత ఫీల్డులోని వాస్తవాలు, బిజినెస్‌లోని వాస్తవాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే గిల గిల కొట్టుకుంటారు. కానీ అప్పటికే పరిస్థితి వారి చేయి దాటిపోయి ఉంటుంది.

మనం ఎలాంటి కథతో సినిమా తీస్తున్నాం, దాని టార్గెట్ ఆడియెన్స్ ఎవరు, ఎవరితో తీస్తున్నాం, వారికి ఫీల్డులో ఉన్న మార్కెట్ ఏంటి, మనం ఆ మార్కెట్‌కు లోబడే ఖర్చు పెడుతున్నామా, మార్కెట్ పరిమితి దాటి రిస్కు తీసుకుంటున్నామా.. ఇవన్నీ అలోచిస్తే ఒక్క సినిమా కూడా ఆగదు. అది ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా అన్నది తర్వాతి ప్రశ్న.

కానీ, సినిమా బిజినెస్ పట్ల కనీస అవగాహన తెచ్చుకొని సినిమా తీస్తే మాత్రం సినిమాలు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉండదు.

> సినిమాలు ఆగిపోవడం ఎక్కువగా ముందు అనుకున్న బడ్జెట్ దాటిపోవటం వల్ల జరుగుతుంది. సగం సినిమా షూటింగ్ తర్వాత డబ్బులు అయిపోతే ఇంక చెయ్యడానికి ఏముంటుంది? శుభం కార్డు స్టూడియోలోనే పడుతుంది. ఇంక ఆ సినిమా బయటికి రాదు.

> కొన్ని సినిమాలు పూర్తవుతాయి. కానీ, వాటిని కొని రిలీజ్  చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ రారు. స్వంతంగా రిలీజ్ చేసుకొనే శక్తి నిర్మాతకి ఉండదు. అంతే. ఇంక ఆ సినిమా రిలీజ్ అవదు.

సినిమా బిజినెస్ అన్ని వ్యాపారాల్లా కాదు. ముందే ఒక ఖచ్చితమైన్ ప్లాన్‌తో, ఒక అవగాహనతో - అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే ఎలాంటి సమస్యలు రావు. అలా కాకుండా ఓవర్‌కాన్‌ఫిడెన్స్‌తో గుడ్డిగా వెళితే మాత్రం అంతిమ ఫలితం ఇలాగే ఉంటుంది.

పైన మనం చర్చించిన కారణం కాకుండా, కొన్ని ఊహించని కారణాలవల్ల కూడా అరుదుగా కొన్ని సినిమాలు ఆగిపోతాయి. వాటిల్లో నాకు తెలిసిన ఒక ఆసక్తికరమైన ఉదాహరణతో మరొక బ్లాగ్ పోస్ట్‌లో కలుద్దాం.

కట్ టూ మై కేస్ -

నేను తీసిన రెండు చిత్రాలూ అనుకున్న బడ్జెట్లో పూర్తిచేశాను. రిలీజ్ కూడా చేశాను. బిజినెస్ బాగానే వచ్చింది. శాటిలైట్ రైట్స్ కూడా బాగానే పలికింది. శివాజీ హీరోగా ఇటీవలే పూర్తిచేసిన నా మూడో చిత్రానికి కూడా మంచి శాటిలైట్ రైట్స్ వచ్చాయి. త్వరలో రిలీజ్ కూడా కాబోతోంది.

సరిగ్గా చేసుకుంటే ఈ షో బిజినెస్‌ని మించిన బిజినెస్ లేదు.  డబ్బూ, డబ్బుతోపాటు ఓవర్‌నైట్‌లో మనం ఊహించనంత ఫేమ్ కూడా ఈ ఒక్క బిజినెస్‌లోనే సాధ్యం. అందుకే ఈ ఫీల్డంటే అందరికీ అంత ఆసక్తి. అంత ఎట్రాక్షన్.

ఒక్క హిట్ గానీ ఇచ్చామా.. ఇంక అంతే. అప్పటివరకూ మీరు పడ్డ అన్ని కష్టాలూ హుష్ కాకి అయిపోతాయి. ఇంక మీరు ఏది అనుకుంటే అదే!   

Thursday 1 August 2013

మా కొత్త ఫిలిం ప్రొడక్షన్ హౌస్, కొత్త సినిమాలు!

ఆగస్టు 11 నుంచి 24/7 ఇక అంతా సినిమానే ...

అలాగని ఏదో నిద్రాహారాలు మానేస్తామని కాదు. మాకున్న ఇతర వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ పక్కనపెడతాం. మా పూర్తి ఫోకస్ ఇక సినిమానే, సినిమాల నిర్మాణమే.

మైక్రో బడ్జెట్ సినిమాల సీరీస్ కోసం నేనూ, నాకు అతి దగ్గరి ఇంకో ప్రొడ్యూసర్ మిత్రుడూ కలిసి ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టు మా ఇద్దరికీ నిజంగా ఒక చాలెంజ్ లాంటిదే. ఆ చాలెంజ్‌ను మేం స్వీకరిస్తున్నాం. ఎదుర్కోడానికి సిధ్ధమయిపోయాం.

బేగంపేట్‌లో మేము తీసుకున్న కొత్త ఆఫీసు దీనికోసమే.

ప్రారంభంలో మా సినిమాలన్నీ దాదాపు అంతా కొత్తవాళ్లతోనే, కొత్త టాలెంట్‌తోనే నిర్మించడానికి ప్లాన్ చేశాము. మేము తీస్తున్న సినిమాల సీరీస్ ప్రత్యేకతలు ఇవి:

> మా సినిమాల షూటింగ్ కేవలం రెండు వారాల్లోనే ఎట్టిపరిస్థితుల్లోనూ అయిపోతుంది. వారంలో అయిదు రోజులు మాత్రమే పనిదినాలు!

> కాల్షీట్లు, యూనియన్ గొడవలు లేకుండా - మా ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్లను టి ఎఫ్ సి సి (తెలంగాణా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్) లో రిజిస్టర్ చేశాము. మా ఇష్టమయిన వాళ్లను, ఇష్టంగా పని చేసేవాళ్లను మేము బుక్ చేసుకుంటాము. లంచ్‌లో బొమ్మిడాయిలు పెట్టలేదని పని ఎగ్గొట్టే టెక్నీషియన్లు, ఆర్టిస్టుల కల్చర్‌కు మేం చాలా దూరం.

> అందరి భోజనం ఒక్కటే. గ్రేడ్లు ఉండవు.

> ఫోకస్ అంతా క్రియేటివిటీ, సక్సెస్‌ల  మీదే తప్ప మరొకటి కానేకాదు. మిగిలినవన్నీ మాకు సెకండరీ. ఇంకా చెప్పాలంటే, అనవసరం.

> మాకున్న అతి చిన్న బడ్జెట్లోనే మంచి కమర్షియల్ సినిమాలు తీసి మెప్పించటం మా ప్రధాన లక్ష్యం. పెట్టిన పెట్టుబడికి మినిమమ్ గ్యారంటీ ఉంటుంది.

> మా సినిమాల్లో అన్ని ప్రాంతాలవాళ్లూ ఉంటారు. క్రియేటివిటీకి ఎలాంటి ప్రాంతీయ హద్దులు ఉండవు. ఉండకూడదు. నేనూ, నా ప్రొడ్యూసర్ మిత్రుడు ..ఇద్దరం రెండు ప్రాంతాలవాళ్లం. ఈ విషయంలో ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటాను.

> మా సినిమాల్లో 'బయటినుంచి పెట్టుబడులు' పెట్టాలి అనుకునేవాళ్లకోసం, కొత్తగా సినిమా బిజినెస్ లోకి ఎంటరయి, చిన్న స్థాయిలోనే పెట్టుబడి పెట్టాలనుకొనేవారికోసం... మా దగ్గర కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఇస్తున్న ఈమెయిల్ కు మీ పేరు, ఊరు, ఇప్పుడున్న బిజినెస్ వంటి క్లుప్తమయిన పరిచయ సమాచారం పంపిస్తే చాలు. మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఇదీ మా ఈ మెయిల్:   mfamax@in.com

> మా ప్రాజెక్టుల పట్ల ఆసక్తి ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఒకసారి ఈ వెబ్‌సైట్‌ను విజిట్ చేస్తే అన్ని విషయాలూ తెలుస్తాయి. www.mfamax.weebly.com సులభంగా మమ్మల్ని సంప్రదించవచ్చు కూడా.

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

మా ప్రొడక్షన్ హౌజ్, మా సినిమాల మోటో:
Make Movies That Make Money!