Sunday 21 July 2013

షాట్ బై షాట్ !

సినీ ఫీల్డు ఒక అద్భుత మాయాలోకం. ఇక్కడ లేనిది లేదు!

మరో కోణంలో చూస్తే - ఇదొక హెవీ గ్యాంబ్లింగ్ ఫీల్డు. ఈ గ్యాంబ్లింగ్ అనేది ఇక్కడ కేవలం డబ్బుతోనే కాదు, జీవితాలతో కూడా ఉంటుంది.

ఫీల్డులో అంతా బానే ఉన్నట్టుంటుంది. కానీ, నిజంగా ఎప్పుడు బావుంటుందో ఎవరికీ తెలీదు. చూస్తుంటే నెలలూ, సంవత్సరాలూ ఇట్టే గడిచిపోతాయి. ఓ అయిదేళ్ల తర్వాతో, దశాబ్దానికో, ఊహించని విధంగా "ఓవర్‌నైట్" సక్సెస్ వరిస్తుంది. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతాయి.

ఆ సక్సెస్ వరించని 90 శాతం మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సినీ ప్రయాణం మాత్రం అనుక్షణం మారిపోయే అగమ్యాలవైపు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా, ఇకముందు కూడా .. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎక్కడయినా.. ఈ ఫీల్డులో సక్సెస్ రేట్ ఎప్పుడూ పది శాతం దాటదు. చెప్పాలంటే, ఇంకా తక్కువే!

ఇది తెలిసి ఆడే జూదం. క్రియేటివ్ గ్యాంబ్లింగ్. ఒక కల్చరల్ ఫేంటసీ.

కట్ టూ "షాట్ బై షాట్" -

ఫీల్డులో సక్సెస్ సాధించి విజయపథంలో నడుస్తున్న స్టార్స్ గురించీ, స్టార్ టెక్నీషియన్ల గురించీ రాయడానికీ, చెప్పడానికీ, చూపించడానికీ, బ్యానర్ హెడ్‌లు పెట్టడానికీ, బ్రేకింగ్ న్యూస్‌లు ఇవ్వడానికీ పత్రికలు, చానెళ్లు పోటీ పడతాయి. వెంటపడతాయి.

అలాగే - ఫీల్డులో కాస్తో కూస్తో నిలదొక్కుకొని కొనసాగుతున్నవారికీ ఈ విషయంలో సమస్య లేదు. ఎక్కడో ఓ ఫిలిం మేగజైన్‌లోనో, దిన పత్రిక సినిమా పేజీలోనో, టీవీ చానెల్ ఫిలిం బేస్‌డ్ ప్రోగ్రామ్‌లోనో వీరికీ అంతో ఇంతో కవరేజ్ ఉంటుంది.

టాలెంట్ ఉండీ ఇంకా చెప్పుకోదగ్గ సక్సెస్ వరించని, నిలదొక్కుకొనే అవకాశం రాని ఆర్టిస్టులను, టెక్నీషియన్లను మాత్రం ఏ పత్రికా, ఏ చానెల్ పట్టించుకోదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్లకి! పాలసీలు, పాయింట్లు, రేటింగ్స్ వంటి నానా గొడవలు వాళ్లవి వాళ్లకుంటాయి.

విచిత్రంగా - కొంతమంది సక్సెస్ సాధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లని కూడా ఎందుకో మరి ఈ ప్రెస్ అసలు పట్టించుకోదు! కారణమేంటో వారికే తెలియాలి.

ఈ నేపథ్యంలో - నా పరిథిలో, నాకు తెలిసిన కొందరు టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లను 'నగ్నచిత్రం' ద్వారా పరిచయం చేయాలన్న ఆలోచనలోంచి పుట్టిందే ఈ "షాట్ బై షాట్" ఫీచర్.  

ఈ బ్లాగ్ కోసం నేను క్రియేట్ చేసుకొనే సమయాన్నిబట్టి - వారానికి కనీసం ఒక ఆర్టిస్టునయినా/టెక్నీషియన్నయినా పరిచయం చేయాలన్నది నా ఆలోచన. ఒక భారీ బయోగ్రఫీలా కాకుండా .. చాలా క్లుప్తంగా, ఒక చిన్న ఇంటర్వ్యూలా ఉంటుందీ పరిచయం.

కట్ టూ 'కూల్ మాంక్' -

"షాట్ బై షాట్" శీర్షికన ఈ సాయంత్రం ఒక 'కూల్ మాంక్' ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరా 'కూల్ మాంక్'.. ఏంటా ఆర్టిస్ట్ కథ.. ఇప్పుడేం చేస్తున్నాడు? .. అన్నీ తెల్సుకుందాం - ఈ సాయంత్రం "షాట్ బై షాట్"లో!

ఎంజాయ్ చేయండి. కామెంట్ చేయండి. షేర్ చేయండి. ఆ 'కూల్ మాంక్' కి మీ బెస్ట్ విషెస్ చెప్పండి.     

1 comment:

  1. సినీ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు సాంకేతిక నిపుణులు!వారి సమాచారం జనానీకానికి అందించడం ముదావహం!

    ReplyDelete