Wednesday 31 July 2013

అనుష్కకు సిక్స్ ప్యాక్ మీద ఎందుకంత ఇష్టం?

అసలు అందం అనేది శరీరానికి సంబంధించింది కానేకాదు. మనస్సుకి సంబంధించింది.

చూసేనాళ్ల విషయంలోనూ అంతే. ఒకరికి అందంగా కనిపించింది ఇంకొకరికి పరమ చెత్తగా కనిపించవచ్చు. అందుకే అందం అనేది మనస్సుకి సంబంధించిందిగా ఎప్పుడో తేల్చేసారు. కళ్లముందు ఎంత అందం ఉన్నా, మనస్సులో ఆస్వాదించాలన్న ఆ ఫీల్ లేకపోతే అక్కడ ఆ అందానికి విలువ లేదు. ఇంక ఈ విషయంలో నలుపు, తెలుపులకు కూడా ఏ మాత్రం ప్రాముఖ్యం లేదు.  

మనకేం కావాలి, మనం ఎలా ఉండాలి అన్న స్పష్టత మన మనస్సులో ఉన్నప్పుడు మన బాడీ ఎప్పుడూ మన అధీనంలోనే ఉంటుంది. మనం ఎలా ఉండాలనుకుంటామో సరిగ్గా అలాగే ఉంటాం. ఈ విషయంలో ఆడా మగా అనేదేమీ లేదు.

"జీవితం, జీవనశైలి పట్ల అపరిమితమైన మమకారం, స్పష్టత ఉన్న స్త్రీల అందం వారి వయస్సుతోపాటు మరింతగా పెరుగుతుంటుంది!" .. కొంచెం అటూ ఇటూగా, ఈ వాక్యాన్ని సుమారు పదేళ్ల క్రితం ఓ తెలుగు కథానికలో నేను చదివాను.

హీరోయిన్ అనుష్క విషయంలో ఈ ఫిలాసఫీ నూటికి నూరు పాళ్లూ నిజం. "సూపర్" నుంచి మొన్నటి "మిర్చి" దాకా అనుష్క అందాల గ్రాఫ్ పైపైకే పోతోంది తప్ప, ఒక్క గీత కిందకి దిగటం లేదు! మధ్యలో, "బిల్లా" చిత్రంలో ఈ గ్రాఫ్ ఎలాంటి 'ఝలక్' ఇచ్చిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అనుష్క, తమన్నా, తాప్సీ, లక్ష్మీ మంచు, ఉపాసన, నయనతార, దీక్షా సేథ్ లతో పాటు, డైరెక్టర్ రాజమౌళి వంటి సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రెయినర్ అయిన కిరణ్ దెంబ్లా 'స్వీట్ జోన్' జిమ్ యజమానుల్లో ఒకరు. అంతే కాదు, ఈవిడ స్వయంగా తానే ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్.

తన 40 ఏళ్ల వయస్సులోనూ సిక్స్ ప్యాక్ యాబ్స్ మెయింటెయిన్ చేస్తున్న ఈ ఎట్రాక్టివ్ ఫిట్‌నెస్ ట్రెయినర్ కిరణ్ దగ్గర, తన సిక్స్ ప్యాక్ కోరికను గత కొంతకాలంగా వెల్లడిస్తూ వస్తోందట మన 30 ప్లస్ మంగళూర్ బ్యూటీ అనుష్క. ఆల్రెడీ అనుష్కకు ఉన్న టాప్ రేంజ్ హీరోయిన్ ఇమేజ్‌కు, ఈ సిక్స్ ప్యాక్ తో ఇంకాస్త 'డిఫరెంట్' క్రేజ్ కూడా అదనంగా వచ్చి చేరుతుందనటంలో సందేహం లేదు.

అంటే - వ్యక్తిగతమైన అనుష్క సిక్స్ ప్యాక్ ఆసక్తి మరోవైపు తనకి ఒక ప్రొఫెషల్ స్ట్రాటజీగా కూడా పనికొస్తుందన్నమాట!  

ప్రస్తుతం తను చేస్తున్న బాహుబలి, రుద్రమదేవి చిత్రాల షూటింగ్ పూర్తవడం ఆలస్యం .. ఈ యోగా లవర్ అనుష్క సిక్స్ ప్యాక్ కోరిక నెరవేరబోతోంది.

ఫ్రేమ్‌లో అప్పుడే సిక్స్ ప్యాక్ అనుష్క కనిపిస్తోందా? ఇంకేం, ఆ గ్రాఫ్ ఎంజాయ్ చేయండి .. 

Tuesday 30 July 2013

ఒక టాలీవుడ్, రెండు బ్రాంచీలు!

ఈ బ్లాగులో అసలు రాజకీయాలు రాయకూడదన్న నియమం నేనే పెట్టుకున్నాను. ఆ నియమం పూర్తిగా వ్యక్తిగతం. ఒకటి రెండు సార్లు ఈ విషయంలో మాట తప్పాననుకోండి. అది వేరే విషయం.

మళ్లీ ఇప్పుడు కూడా మాట తప్పుతున్నానా అనిపిస్తోంది ఒకవైపు. కానీ, నేను రాయాలనుకుంటున్న పాయింట్ పూర్తిగా సినిమాకు సంబంధించింది కాబట్టి ప్రొసీడవుతున్నాను.

ఇవాల్టి తాజా రాజకీయ పరిణామంతో ఎప్పటినుంచో నానుస్తూ వచ్చిన ఒక విషయం మీద సంపూర్ణమయిన స్పష్టత వచ్చేసింది. ఫలితంగా - రాజకీయంగా, సాంఘికంగా, ఆర్ధికంగా.. ఇంకా ఎన్నో రకాలుగా రాబోయే కొంత కాలం ఎడా పెడా మార్పులుంటాయి. టాలీవుడ్‌తో సహా.

అయితే మన టాలీవుడ్ వాళ్లు ఇదంతా బహుశా ముందే ఊహించారు.

టాలీవుడ్‌కి సంబంధించిన రెండో బ్రాంచి వైజాగ్‌లో ఆఘమేఘాలమీద రూపొందుతోంది. వైజాగ్‌కి తోడు కనీసం ఇంకో రెండు ప్రాంతాల్లో కూడా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృధ్ధి చెందే అవకాశం చాలా ఉంది. ఫిలిం మేకింగ్‌లో ఆధునికంగా వచ్చిన సాంకేతిక అభివృధ్ధి పుణ్యమా అని, ఇప్పుడు స్టూడియోలు నిర్మించడానికి ఇదివరకటిలా కోట్లు అవసరం లేదు. కాబట్టి, జిల్లాకో బ్రాంచి ఏర్పడినా ఆశ్చర్యం లేదు!

ఏది ఎలా ఉన్నా - అక్కడ, ఇక్కడ అన్న భేదం లేకుండా తెలుగు సినిమాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆసక్తికరమయిన పోటీ ఒకవేళ ఏర్పడినా, రెండు బ్రాంచీల్లోనూ బిజినెస్ మరింతగా పెరిగిపోతుంది తప్ప ఎక్కడా ఎలాంటి నష్టం ఉండదు.

కట్ టూ చిన్న డౌట్ -

లేటెస్ట్ రాజకీయ పరిణామాల ప్రభావంతో, టాలీవుడ్‌కి తోడు మరొక "తెలుగువుడ్డు" పోటీగా పుట్టదుకదా?! అలా జరగదనే అనుకుంటున్నాను.

ఎన్నో హిందీ రాష్ట్రాలున్నాయి.  'బాలీవుడ్' ఒకటే కదా ఉంది? 

Sunday 28 July 2013

నచ్చావులే, మాధవీలత! [షాట్ బై షాట్ 2]

"కళ్లు వెళ్లిన ప్రతిచోటికి మనసు వెళ్లకూడదు. మనసు వెళ్లిన ప్రతి చోటికి మనిషి వెళ్లకూడదు!"

ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. సుమారు ఒక నలభై నిమిషాల మా సంభాషణలో ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు మాటలు, కవితాత్మకమైన వ్యక్తీకరణలు ఎన్నో ఆమె నోటి వెంట అలవోకగా, అందంగా, అలా అలా దొర్లాయి. అన్నట్టు, తను కవిత్వం కూడా రాస్తుంది అప్పుడప్పుడూ.

ఆమే "నచ్చావులే"  హీరోయిన్ మాధవీలత.

మాధవీలత నాన్న రైల్వే ఉద్యోగి. అమ్మ గృహిణి. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ముగ్గురు చిన్నారి కోడళ్లు కూడా ఉన్నారు. అందరూ కర్నాటకలో ఉంటారు. ఒక్క చిన్నన్నయ్య మాత్రం ఉద్యోగరీత్యా 'ఆర్మీ'లో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నారు. ఉద్యోగరీత్యానే మాధవీలత కుటుంబం కర్ణాటకలో ఉంటోంది కానీ, వారి స్వస్థలం ప్రకాశం జిల్లాలో ఓ చిన్న గ్రామం.

ఎమ్మే సోషియాలజీ (మైసూర్ యూనివర్సిటీ), ఎమ్మెస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ (UK) చేసిన మాధవీలత పుట్టింది హుబ్లీలో. అక్టొబర్ 2 ఆమె పుట్టిన రోజు కావడం మరొక విశేషం.

కట్ టూ "షాట్ బై షాట్" విత్ మాధవీలత -
^^^

మాధవీలతా, అసలేంటి మీ రంగుల కల? ఏం కావాలనుకొని మీరీ ఫీల్డులోకొచ్చారు? ఏ సంవత్సరం?

హీరోయిన్ కావాలనుకునే నేను ఫీల్డులోకొచ్చాను. అది నా చైల్డ్‌హుడ్ డ్రీమ్. 2008 లో నేను ఫీల్డులోకి ఎంటరయ్యాను.

ఫీల్డులో మీకు మొట్టమొదటగా పరిచయమైన.. మీరు మర్చిపోలేని వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరు?

నేను దేనికీ ఎక్జయిట్ అవని కేరెక్టర్‌ని. సో, నాకు అంత గొప్పగా చెప్పుకొనే పరిచయం ఏదీ ఇండస్ట్రీలో జరగలేదు. ఎవరూ నాకంత స్పెషల్ అనిపించలేదు.

ఇండస్ట్రీలోకి రాకముందు మాత్రం నాక్కొన్ని ఫీలింగ్స్ ఉండేవి. జీవితంలో చిరంజీవిగారిని ఒక్కసారి చూడాలి. నా ఫేవరేట్ హీరో శ్రీకాంత్ గారిని ఒక్కసారి చూడాలి. నాకు బాగా నచ్చిన ప్రభాస్ గారిని ఒక్కసారి చూడాలి.. ఇలా కొన్ని ఫీలింగ్స్ ఉండేవి.  కానీ, ఒక్కసారి ఫీల్డులోకి ఎంటర్ అయ్యాక అన్నీ మారిపోతాయి.

మీకు వచ్చిన తొలి ఫిలిం చాన్స్ ఏది? ఆ చాన్స్ మీకు ఎలా ఉపయోగపడింది? ఎలాంటి కిక్ ఇచ్చింది?

నాకు వచ్చిన తొలి ఫిలిం చాన్స్‌తో నేను చేసిన సినిమా వేరే ఉంది. అయితే అదింకా రిలీజ్ కాలేదు. సో, ముందుగా ఆడియెన్స్‌లోకి వచ్చిన సినిమానే నేను నా తొలి సినిమాగా భావిస్తాను. అది - "నచ్చావులే" సినిమా. ఆ సినిమా ఓపెనింగ్‌కి రామోజీ రావు గారు రావటం అనేది నేనిప్పటికీ మర్చిపోలేను.

ఈ రోజు మాధవీలత అనే ఒక అమ్మాయి ఉంది అని ఆడియెన్స్‌కు గానీ, ఇండస్ట్రీకి గానీ నేనుగా చెప్పుకోవాల్సినంత అవసరం లేనంత గుర్తింపుని "నచ్చావులే" నాకిచ్చింది. నా పేరు చెప్పినా సినిమా పేరు చెప్తారు. సినిమా పేరు చెప్పినా నా పేరు చెప్తారు. కాకపోతే, దాన్ని నేనే సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను. కారణాలు చాలా ఉన్నాయి. ఒకవైపు డాడీ చదువుకోమన్నారు. మరో వైపు నా ల్యాక్  ఆఫ్ ఇన్నోసెన్స్, ఫీల్డులో నా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, నా కాంటాక్ట్స్, నెట్‌వర్కింగ్ ప్రాబ్లమ్... ఇలా ఏవేవో. మొత్తానికి నేనే చాలా మిస్ చేసుకున్నాను.

ఫీల్డులో మీరు బాధపడిన సందర్భం గానీ, మర్చిపోలేని చేదు జ్ఞాపకం గానీ ఏదయినా ఉందా? ఉంటే ఏంటది?

అలాంటిదేమీ లేదు. నేను చాలా స్పోర్టివ్‌ని. మరోవైపు చాలా ఎమోషనల్‌ని కూడా. ఈ సందర్భంగా ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను.

ఫీల్డులోకి వచ్చేముందు మైండ్‌ని స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసుకొని రావాలి. ఫోకస్ అంతా మన లక్ష్యం మీదే ఉండాలి.

అందుకే, నాకు ఎంత అరచేతిలో స్వర్గం చూపించినా నేనసలు పట్టించుకోను. ఐ బిలీవ్ వాట్ ఐ బిలీవ్. అంతే. అందుకే నాకు ఫీల్డులో ఎలాంటి చేదు అనుభవాలుగానీ, జ్ఞాపకాలు లేవు. ఇకముందు కూడా నాకు ఎలాంటి చేదు అనుభవాలు, జ్ఞాపకాలుండవు.

ఎందుకంటే - ఇండస్ట్రీలో ఒకసారి సక్సెస్ వచ్చాక కష్టాలు చాలా తక్కువగా ఉంటాయి!

ఫీల్డులో మీరు మర్చిపోలేని మధుర స్మృతి?

హీరోయిన్ కావాలన్న నా కల నిజం కావటం. నేను నటించిన నా తొలి సినిమానే ఒక పెద్ద హిట్ కావటం.

ఇప్పటివరకు మీరు ఫీల్డులో ఎన్ని సినిమాలు చేశారు?

నచ్చావులే, స్నేహితుడా, మంచివాడు (స్పెషల్ అప్పియరెన్స్), అరవింద్-2, చూడాలని చెప్పాలని.. ఇవీ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు. ఇప్పుడొక ప్రత్యేకమైన సినిమా చేస్తున్నాను. మొన్న 25 వ తేదీ నుంచే దాని షూటింగ్ ప్రారంభమయింది. 1950 లలోని కథ. నేషనల్ అవార్డుని పొందగల స్థాయి కూడా ఈ సినిమాకుంది.  కృష్ణ వాసా దర్శకుడు.

అంటే, ఇలాంటి ఒక మంచి స్క్రిప్టుతో మీ దగ్గరకు వస్తే, మీ రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకోరనుకోవచ్చా?

అవును. కృష్ణ వాసా సినిమాకి నేనిప్పుడు కేవలం ఒక నామమాత్రపు రెమ్యూనరేషన్‌నే తీసుకుంటున్నాను.  

ఒకవేళ మీరు ఫీల్డులోకి రాకపోయి ఉంటే.. ఏమయ్యేవారు? ఏం చేస్తూ ఉండేవారు?

ఛాన్సే లేదు. ఫీల్డులోకి రావాలి, నటించాలి అన్నది నా ఫిఫ్త్ క్లాస్ నాటి డ్రీమ్! అమ్మ నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకొంది. నాన్న నేనొక డాక్టర్ కావాలనుకొన్నారు. నేను జర్నలిస్ట్ కావాలనుకొన్నాను. చివరికి నేను ఫిక్స్ అయ్యింది హీరోయిన్ దగ్గర! హీరోయిన్ కావాలనుకొన్నాను. అయ్యాను.  

ఇప్పుడు ఫీల్డులో మీ ప్రధాన లక్ష్యం ఏంటి? ఇంకా ఏంకావాలని?

స్టార్ హీరోయిన్ అవాలి. తర్వాత ఒక నేషనల్ అవార్డ్ తీసుకోవాలి. స్టార్ హీరోయిన్ అవుతానా లేదా.. నేషనల్ అవార్డ్ తీసుకుంటానా లేదా అన్నది సెకండరీ. ఇప్పుడు నేను పెట్టుకొన్న లక్ష్యాలు అవి. కలలు కనడంలో తప్పులేదు. వాటిని నిజం చేసుకొనే ప్రయత్నం  మాత్రం తప్పక చేయాలి.  

సినీ ఫీల్డుమీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడెలా ఉంది ఫీల్డు.. ఇకముందు ఎలా ఉండబోతోంది?

నేను ఇష్టపడి వచ్చిన ఫీల్డు కాబట్టి నాకు బాగానే ఉంది. ఎప్పుడు గానీ ఫీల్డులో తప్పు ఉండదు. మనుషుల్లో ఉంటుంది.

ఫీల్డులో బ్రతకడం ఈజీ. సమాజంలో బ్రతకడమే కష్టం. ఫీల్డులోకెళితే చాలా సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఇంటికి రావొచ్చు. బయటికి వెళ్తేనే ఇంటికి వచ్చేవరకూ నమ్మకం ఉండదు. అలా ఉంది ఇప్పటి సమాజం. దాంతో పోలిస్తే సినీ ఫీల్డు చాలా బాగుంది. ఇదొక ఫ్రీ వరల్డ్. ఇక్కడ నీకు నచ్చితే చేయవచ్చు. నచ్చకపోతే వదిలేయవచ్చు. తప్పు ఎవరిదీ కాదిక్కడ. మన జీవితం. మన ఇష్టం. ఇకముందంటారా.. మనం మంచిగా ఉంటే, ఫీల్డులో మన చుట్టూ ఉండే నలుగురు కూడా మంచివాళ్లే ఉంటారు.

ఇంతకు ముందయినా, ఇప్పుడయినా, ఎప్పుడయినా.. చాలా వరకు, అంతా మనల్ని బట్టీ, మనం ఎంచుకునే మనుషుల్ని బట్టే ఉంటుంది.

కట్ టూ నగ్నచిత్రం -

ఎన్నో విషయాలను, ఎంతో అలవోకగా నాతో మాట్లాడిన మాధవీలతలో కొన్ని(పాజిటివ్) బలహీనతల్ని కూడా నేను మాటల మధ్యలో గుర్తించాను. అయితే, ఆ బలహీనతలే ఒక రకంగా తన బలం అంటుంది మాధవీలత.

"నేను బయటికి ఎంతో గర్విష్టిలా కనిపిస్తాను చాలా మందికి. కానీ - నా అంత ఎక్స్‌ట్రీమ్‌లీ ఎమోషనల్, నా అంత ఎక్స్‌ట్రీమ్‌లీ సెంటిమెంటల్ బహుశా ఎవరూ ఉండరు. అలాగే, నేను ఎంత సున్నితమైనదాన్నో అంత గట్టిదాన్ని కూడా" అంటుంది మాధవీలత.

"చాలా మంది సినీ ఫీల్డులో - తాము అనుకున్న గోల్ రీచ్ కావడానికి ఎంతటి మూల్యాన్నయినా చెల్లిస్తారు. దేన్నయినా వొదులుకుంటారు. స్నేహాలు, ప్రేమలు, బంధాలు, అనుబంధాలు.. ఏవయినా కావొచ్చు. తమ కెరీర్ కోసం వాటిని తృణప్రాయంగా వొదిలేస్తారు. అది నేను చేయలేను. బహుశా అదే నా బలహీనత. అదే నా బలం కూడా. నా తొలి సినిమా మంచి హిట్టయినా నేను దాన్ని క్యాష్ చేసుకోలేకపోడానికి ఇది కూడా ఒక కారణం" అంటుంది మాధవీలత.

చివరగా, తన మనసులోని కొన్ని కఠోర వాస్తవాల్ని కూడా నగ్నచిత్రంతో పంచుకొంది మాధవీలత..

"మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కటి మాత్రం నిజం. ఆడది ఆడదే. ఆది నుంచీ ఒక వస్తువుగానే చూడబడింది. ఇప్పుడూ అంతే. కారణాల జోలికి నేను పోవటం లేదు. ఇది మాత్రం నిజం."

"మాధవీలతది సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చే మైండ్‌సెట్ కాదు. కేవలం నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నేనిక్కడ ఉన్నాను!"

ఇంత మంచి భాష, భావుకత్వం, వ్యక్తీకరణ, స్వీయ విశ్లేషణ ఉన్న మన తెలుగు హీరోయిన్ మాధవీలతకి.. ఆమె కలలన్నీ త్వరలోనే నిజం కావాలని "బెస్టాఫ్ లక్" చెప్పకుండా ఎలా ఉండగలం?  

Friday 26 July 2013

"క్రౌడ్ ఫండింగ్" మీకు తెలుసా?

అమెరికాతో పాటు, ఇతర పాశ్చాత్య దేశాల్లో ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్.

ఎవరైనా ఏదయినా ప్రాజెక్ట్ ప్రారంభించడానికో, లేదంటే - ఆల్రెడీ ప్రారంభించిన ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికో అవసరమయిన డబ్బు లేనప్పుడు, చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువమంది నుంచి ఆ డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్. 

ఉదాహరణకు,  సినిమా విషయమేతీసుకుందాం

ఒక ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ఓ కోటిరూపాయలు కావాలనుకుంటే - ఆ మొత్తాన్ని ఒక 100 మంది దగ్గర, 10 వేల నుంచి 10 లక్షల వరకు, వివిధ డినామినేషన్లలో సేకరించడం ద్వారా సులభంగా సేకరించవచ్చు. ప్రతి డినామినేషన్లో, ఇన్వెస్టర్లకు తాయిలాలుంటాయి. అవికాకుండా, ప్రపోర్షనేట్ గా లాభాల్లో వారికి షేర్ కూడా ఉంటుంది. ఎవరికీ పెద్దగా రిస్క్ ఉండదు.  

అంతర్జాతీయంగా  మధ్య బాగా ప్రాచుర్యం పొందిన  ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయివాటి కమిషన్ అవి తీసుకుంటాయి. ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా  విషయం పూర్తిగా అర్థమైపోతుంది. 

కట్ టూ సినిమా - 

ఒకప్పుడు 'ఇండీ సినిమా' (ఇండిపెండెంట్ సినిమా) అంటే ఒక యజ్ఞంలా జరిగేది. డబ్బే ప్రధాన సమస్య కాబట్టి, సినిమా పూర్తిచేయడానికి సంవత్సరాలు కూడా పట్టేది.  గెరిల్లా ఫిలిం మేకింగ్, రెనగేడ్ ఫిలిం మేకింగ్, నో బడ్జెట్ ఫిలిం మేకింగ్ లాంటి ధోరణులన్నింటికీ నేపథ్యం ఇదే. సరిపోయేంత డబ్బు లేకుండానే సినిమా పూర్తిచేయడం! 

అయితే ఇప్పుడా సమస్య లేదు. రెండు కారణాలవల్ల. ఒకటి - ఫిలిం మేకింగ్‌లో ఆధునికంగా వచ్చిన సాంకేతిక అభివృధ్ధి. రెండవది - క్రౌడ్ ఫండింగ్.   

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా ఇండీ సినిమాలు ఈ క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ ద్వారా, లేదా ఆ వెబ్‌సైట్స్‌కి బయట ప్రత్యేకంగా ఇలాంటి పధ్ధతిని పాటించటం ద్వారా అనుకున్నంత బడ్జెట్‌ను సులభంగా సేకరించుకోగలుగుతున్నాయి. 

ఇదే పధ్ధతిని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నిర్మాణం కోసం కూడా ఈజీగా అనుసరించవచ్చు అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. 

సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ఆసక్తి ఉండీ, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించి తమ కోరికని అలా తొక్కిపెట్టి ఉంచేవారికి ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే - వారి ఊహకి అందని విధంగా, ఎంత చిన్న పెట్టుబడితోనయినా వారు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు! 
^^^

మీలో/మీకు తెలిసిన వారిలో - ఎలాంటి రిస్క్ లేకుండా, అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో సినీ ఫీల్డులోకి ఎంటర్ అవ్వాలన్న ఆసక్తి ఉన్న మైక్రో ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే నేరుగా సంప్రదించాల్సిన ఈమెయిల్ ఇది:
mchimmani@gmail.com
 

Thursday 25 July 2013

కవిత్వం రాసే మన తెలుగు హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

నిదురిస్తున్న హృదయాన్ని
నీ వైపు లాగింది నీవేగా!

నా నీడయినా నువ్వే అయి
నన్ను నేను మరిచానే

వొద్దు వొద్దని నువ్వన్న
వలపే పుట్టింది నీ మీద

అప్పుడు పంచిన నీ మనసే
ఇవ్వనని అనవొద్దు

నాలో ఉన్న నా ప్రాణం
నువ్వయి నిలిచావు

కాదు కాదని నీవన్నా
కాదనలేకున్నా..
కన్నీటి కడలిలో నేనున్నా...

***

కొన్ని నమ్మటం కష్టం. అలాంటిదే మొన్నొకటి జరిగింది.

చాలామంది తెలుగు హీరోయిన్లు తెలుగుని ఎంత స్టయిలిష్‌గా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. అసలు తెలుగు రానట్టే నటిస్తారు. లేదంటే, ఓ అయిదారు ఇంగ్లిష్ పదాల మధ్య ఒక తెలుగు పదాన్ని అలా పడేస్తూ స్టయిలిష్‌గా మాట్లాడుతున్నామనుకుంటారు.

అలాంటి మాస్కులేవీ లేకుండా తీయటి తెలుగులో మాట్లాడిందా అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడుతున్నంతసేపూ హాయిగా విన్నాను. ఆ అమ్మాయి మాటల మధ్యలో, కేవలం కవిత్వం రాయగలవాళ్లు మాత్రమే మాట్లాడే శైలిని గుర్తించాను.

అవును. నేను ఊహించింది నిజమే. ఆ అమ్మాయి అప్పుడప్పుడూ కవిత్వం కూడా రాస్తుందట!

ఆ అమ్మాయి మన తెలుగు హీరోయిన్. ఆమె నటించిన తొలి సినిమానే పెద్ద హిట్. అయినా ఎందుకో వెనకే ఉండిపోయింది! పైన మీరు చదివిన కవిత ఆ హీరోయిన్ రాసిందే..

ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకని వెనకపడిపోయింది? ఇప్పుడు మళ్లీ ఎలా ముందుకు దూసుకొస్తోంది?
ఆసక్తికరమయిన ఎన్నో వివరాలతో - ఈ ఆదివారం, ఇదే బ్లాగ్‌లో,  "షాట్ బై షాట్"లో కలుద్దాం. 

Wednesday 24 July 2013

డబుల్ కంగ్రాట్స్ టూ జెస్సీ!

సుమారు రెండు దశాబ్దాల క్రితం తెలుగులో "అంకురం", తమిళంలో "దేవర్ మగన్ (క్షత్రియ పుత్రుడు)" సినిమాల్లో తన అద్భుత సహజ నటనకు ఓకే సంవత్సరం రెండు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకొంది రేవతి.

ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత - ఇప్పుడా రికార్డుని సమం చేసింది సమంతా.

మొన్నటి సౌత్ ఫిలిం ఫేర్ అవార్డుల్లో 2012 సంవత్సరానికిగాను తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ "బెస్ట్ యాక్ట్రెస్" గా అవార్డులందుకొని డబుల్ ధమాకా క్రియేట్ చేసింది సమంతా. తెలుగులో తను నటించిన "ఈగ", తమిళంలో "నీదాన్ ఎన్ పొన్ వసంతం (ఎటో వెళ్లిపోయింది మనసు) చిత్రాల్లోని తన నటనకు ఈ రెండు ఫిలిం ఫేర్ అవార్డులు ఆమెను వరించాయి.

ఈ సింపుల్ గ్లామర్ డాల్ ఇప్పుడు టాలీవుడ్లో దాదాపు నంబర్ వన్ హీరోయిన్ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తోందని ప్రెస్‌లో వస్తున్న నిజం ఒప్పుకోవాల్సిందే! పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్‌టీయార్, సూర్య, నాగచైతన్య (మనం) లతో నటిస్తూ నిజంగానే ప్రస్తుతం మంచి రేంజ్‌లో ఉంది సమంతా.

2010 లో తెరంగేట్రం చేసిన సమంతా, ఈ మూడేళ్లలో - తెలుగు, తమిళం, హిందీల్లో కలిపి మొత్తం 24 సినిమలు తన ఖాతాలో వేసుకుందంటే నమ్మటం కష్టం! కానీ నిజం. వీట్లో 7 సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి..లేదా ఇంకా షూటింగ్ ప్రారంభం కానున్నాయి.

కట్ టూ జెస్సీ -

సమంతా ఎన్ని సినిమాల్లో నటించి, ఇంకెన్ని అవార్డులు అందుకొన్నా - వ్యక్తిగతంగా నాకు మాత్రం తను నటించిన జెస్సీ పాత్రే బాగా నచ్చింది. బహుశా, గౌతమ్ మీనన్ ఆ పాత్రను కేవలం సమంతా కోసమే సృష్టించాడా అన్నంత సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయింది.. జీవించింది సమంతా.

సమంతా, ఏ మాయ చేసావె!      

Sunday 21 July 2013

గౌతమ్ 'కూల్ మాంక్!' [షాట్ బై షాట్ 1]

గౌతమ్ పుట్టింది తెనాలిలో. నాన్నగారు డి.ఐ.జి.గా రిటైర్ అయ్యారు. అమ్మ హోమ్ మేకర్. గౌతమ్ కి ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. ఇంట్లో చిన్నోడు కాబట్టి సహజంగానే కొంచెం గారాబంగా పెరిగాడు.

ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ చదివి అందులో బ్యాచ్ ఫస్ట్‌గా నిలిచాడు గౌతమ్. అయితే, దీనికంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. అసలు గౌతమ్ ఇంటర్మీడియట్ పూర్తిచేయగానే సినిమాల్లోకి వెళ్లే ప్లాన్ చేసాడు. నాన్నగారు అందుకు ఒప్పుకోలేదు.

"ముందు డిగ్రీ చెయ్యి. తర్వాతే సినిమాలు" అన్నారాయన.

కనీసం డిగ్రీ అయినా ఉంటే, రేపు సినిమాల్లో ఫెయిల్ అయినా, బయటకొచ్చి ఏదయినా జాబ్ చేసుకొని బ్రతికే అవకాశం ఉంటుంది అన్నది ఆయన ప్రధాన ఉద్దేశ్యం. అదొక్కటే కాదు. అసలు డిగ్రీ పూర్తయ్యేటప్పటికి సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచనని గౌతమ్ మర్చిపోవచ్చు కూడా అన్నది వాళ్ల నాన్నగారిలో అంతర్లీనంగా ఉన్న మరొక ఆశ కావొచ్చు.

నాన్నగారి కోరిక ప్రకారం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ని సక్సెస్‌ఫుల్ గా పూర్తిచేశాడు గౌతమ్. అతని బ్యాచ్ ఫస్ట్ రిజల్ట్‌తో మరింతగా సంతోషించారు గౌతమ్ నాన్నగారు.

కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది!

తన సినీ ఫీల్డు ఇంటరెస్ట్‌ని మళ్లీ గుర్తు చేశాడు గౌతమ్. భారీ చర్చల తర్వాత, అతి కష్టం మీద నాన్నగారిని ఒప్పించి "డిప్లొమా ఇన్ యాక్టింగ్" కోర్స్‌లో చేరి, దాన్ని పూర్తిచేశాడు గౌతమ్. ఇదీ క్లుప్తంగా గౌతమ్ నేపథ్యం.

కట్ టూ "షాట్ బై షాట్" విత్ గౌతమ్ -
^^^

అసలేంటి నీ రంగుల కల, గౌతమ్? ఏం కావాలనుకొని నువ్వీ ఫీల్డులోకి వచ్చావు? ఏ సంవత్సరం?
యాక్టింగ్, డైరెక్షన్ రెండూ నాకు చాలా ఇష్టమైన అంశాలు. యాక్టర్ కావాలనుకున్నాను. డైరెక్టర్ కూడా కావాలనుకున్నాను. 2005 లో నేను సినీ ఫీల్డులోకి ఎంటర్ అయ్యాను.

ఫీల్డులో నీకు మొట్టమొదటగా పరిచయమైన .. నువ్వు మర్చిపోలేని వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరు?
దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల, రాజీవ్ కనకాల, సుమ .. ఈ నలుగురూ నాకు ఇండస్ట్రీలో మొదటగా పరిచయమైన నలుగురు వ్యక్తులు. వీరి "టీవీ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" లోనే నేను ఫిల్మ్ డిప్లొమా చేసాను. దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కనకాల నా గురువులు.  

నీకు వచ్చిన తొలి ఫిలిం చాన్స్ ఏది? చాన్స్ నీకు ఎలా ఉపయోగపడింది? ఎలాంటి కిక్ ఇచ్చింది?

 నాకు వచ్చిన తొలి సినిమా చాన్స్ - చిమ్మని మనోహర్ గారి "అలా" చిత్రంలో. అది 2006.

మనోహర్ గారి "సినిమా స్క్రిప్ట్ రచనా శిల్పం" పుస్తకాన్ని అంతకు ముందే నేను చదివాను. నంది అవార్డు పొందిన ఆ పుస్తకాన్ని చదివి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒకరోజు,  ఓ ఫిలిమ్ మేగజైన్‌లో మనోహర్ గారి సినిమాకు ఆడిషన్స్ కోసం ఇచ్చిన యాడ్ చూసి నేను ఆయన ఆఫీస్‌కు వెళ్లాను.  ఆడిషన్స్ ఇచ్చాను. 

అంతకు ముందు నేను మనోహర్ గారి పుస్తకం చదివినప్పుడు, ఆయనకు ఏ 50య్యో, 60య్యో వయస్సు ఉంటుంది అనుకున్నాను. ఎందుకటే, పుస్తకంలో ఆయన చర్చించిన విషయాల్లో అంత మెచ్యూరిటీ, అంత అనుభవం నాకు కనిపించింది. కానీ, అక్కడ ఆడిషన్లో ఆయన్ను చూశాక ఆశ్చర్యపోయాను.

"అలా" చిత్రం ఆడిషన్లో సెలెక్టయ్యాను. నిజం చెప్పాలంటే - అదే నా హాప్పీ మూమెంట్ ఆఫ్ లైఫ్! చెప్పటానికి కాస్త బుకిష్ లాంగ్వేజ్‌లా అనిపించినా, ఆ క్షణం నిజంగా ప్రపంచాన్ని జయించినట్టుగానే ఫీలయ్యాన్నేను. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే, "కాల్ సెంటర్" సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది నాకు.  

ఫీల్డులో నువ్వు బాధపడిన సందర్భం కానీ, మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకం గానీ ఏదయినా ఉందా? ఉంటే ఏంటది?
'హాప్పీడేస్' సినిమాకి నేను ఆడిషన్స్ ఇచ్చాను. రకరకాల గెటప్స్‌లో నన్ను ఒక పది రోజులు ఆడిషన్స్‌కి పిలిచారు వాళ్లు. నా రోల్ ఫైనలైజ్ అయ్యిందని కూడా చెప్పారు. చివరికి - ఇంట్లో ఫామిలీకి, బయట ఫ్రెండ్స్‌కి కూడా ఈ గుడ్‌న్యూస్  చెప్పేసుకోవచ్చన్నారు. 

నేను చాలా హాప్పీగా అందరికీ 'హాప్పీడేస్' సినిమాలో నాకు వచ్చిన అవకాశం గురించి చెప్పాను. కానీ, తర్వాత నాకు కనీసం ఎలాంటి కారణం చెప్పకుండా నన్ను ఆ సినిమాలోంచి డ్రాప్ చేశారు! ఇండస్ట్రీలో నాకు బాగా బాధ కలిగించిన సంఘటన ఇదే. అయినా ఈ విషయంలో నేను ఎవ్వర్నీ తప్పుపట్టటం లేదు. ఎవరి రీజన్స్ వారికుంటాయి. కొన్ని బయటకు చెప్పుకోలేకపోవచ్చు! ఈ సంఘటన వల్ల కొంత బాధ పడ్డానే గానీ, నా లక్ష్యాన్ని మర్చిపోలేదు. నా పట్టుదల సడలనివ్వలేదు.

ఫీల్డులో నువ్వు మర్చిపోలేని మధుర స్మృతి ?
"కాల్ సెంటర్" సినిమా కోసం ఆడిషన్ ఇచ్చిన వెంటనే - డైరెక్టర్ కన్మణి గారు బాగా ఇంప్రెస్ అయ్యి, "నువ్వు ఈ సినిమాలో హీరోగా చేస్తున్నావు!" అని చెప్పిన మూమెంట్ ఫీల్డులో నేను మర్చిపోలేని మధుర స్మృతి.
ఇప్పటివరకు నువ్వు ఫీల్డులో ఏం చేశావు?

అలా, కాల్ సెంటర్, రాజు మహరాజు, శశిరేఖా పరిణయం, అరవింద్-2 .. ఇవీ యాక్టర్‌గా నేను ఇప్పటివరకు నటించిన సినిమాలు.

జెమిని టీవీలో వచ్చిన "శ్రీమతి శ్రీ" డెయిలీ కామెడీ సీరియల్లో హీరోగా చేశాను.

2010 లో "థింక్ ట్వైస్" అనే షార్ట్ ఫిల్మ్‌ని డైరెక్ట్ చేశాను. 'బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్' గా దానికి నంది అవార్డ్ వచ్చింది.

 
ప్రస్తుతం ఏం చేస్తున్నావు? 
"హృదయం ఎక్కడున్నది" అనే సినిమాతో పాటు ఇంకో రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. వాటికి ఇంకా పేరు పెట్టలేదు.
ఒకవేళ నువ్వు సినీ ఫీల్డులోకి రాకపోయి ఉంటే... ఏమయ్యేవాడివి/ఏం చేస్తూ ఉండేవాడివి
సినీ ఫీల్డు తప్ప నేను వేరే ఆప్షన్ ఏదీ నేను అసలు ఆలోచించలేదు. బహుశా.. ఇకముందు కూడా ఆలోచించను.
 

ఇప్పుడు ఫీల్డులో నీ చీఫ్ గోల్ ఏంటి? ఏం కావాలని?
మంచి యాక్టర్‌గా, డైరెక్టర్‌గా మంచి సక్సెస్ సాధించి, పది మందికి మార్గదర్శకుడిగా ఉండాలని నా కోరిక.
 

సినీ ఫీల్డు మీద నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడెలా ఉంది ఫీల్డు.. ఇకముందు ఎలా ఉండబోతోంది
ఒకప్పుడు ఈ ఫీల్డులో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడలా కాదు. ప్రతిరోజూ పోరాటం తప్పదు ఇండస్ట్రీలో. అంతే కాదు. సక్సెస్ రావటం ఎంత కష్టమో, దాన్ని నిలుపుకోవటం కూడా అంతే కష్టం. ఇక ముందు కూడా ఇండస్ట్రీలో ఇంతే కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా పెరగొచ్చు కూడా. 
అయితే - నిరుత్సాహపడకుండా, మన ప్రయత్నం మనం చేస్తూవుంటే.. ఏదో ఒక రోజు మనల్నీ ఒక మంచి సక్సెస్ తప్పక వరిస్తుంది. 

సినీ ఫీల్డు నాకు ఒక ఆలయం లాంటిది. భక్తితో శ్రధ్ధతో కళామతల్లిని పూజిస్తే, ఆ తల్లి ఎవరినీ నిరుత్సాహపర్చదు.
ఇది నా నమ్మకం.
^^^ 

  
కట్ టూ నగ్నచిత్రం - 

సుమారు ఏడేళ్ల క్రితం అనుకుంటాను. మొదటిసారి "అలా" చిత్రం ఆడిషన్స్‌లో గౌతమ్‌ను నేను చూశాను. అప్పటికీ, ఇప్పటికీ అతని ప్రవర్తనలో గానీ, వ్యక్తిత్వంలో గానీ ఎలాంటి మార్పు లేదు. చిరునవ్వుతో కూడిన ఆ పలకరింపు అలాగే ఉంది. ఫోన్ చేయగానే గుర్తుపట్టే ఆ ఆత్మీయతా అలాగే ఉంది.  

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ఒకటి రెండు సినిమాల తర్వాత ఇండస్ట్రీలో ఇవన్నీ హుష్‌కాకి అయిపోతాయి. ఎవరూ ఎవర్ని గుర్తుపట్టనంతగా నటిస్తారు. ఈగో, హిపోక్రసీలతో కోటింగ్ వేసిన అందమయిన "మాస్కు"లను ధరిస్తారు. అసలు తమ రూట్స్ నే మర్చిపోతారు.   

ఇవేవీ గౌతమ్‌ని చేరలేకపోయాయి. నా దృష్టిలో గౌతమ్‌కి ఎసెట్ కూడా అదే. యాక్టర్ ఎలాగూ అయ్యాడు. నా అంచనా ప్రకారం 2014 చివరికల్లా తప్పకుండా గౌతమ్ డైరెక్టర్ కూడా అవుతాడు.
^^^
Follow Goutham on Facebook:
https://www.facebook.com/hyderabadi777 

షాట్ బై షాట్ !

సినీ ఫీల్డు ఒక అద్భుత మాయాలోకం. ఇక్కడ లేనిది లేదు!

మరో కోణంలో చూస్తే - ఇదొక హెవీ గ్యాంబ్లింగ్ ఫీల్డు. ఈ గ్యాంబ్లింగ్ అనేది ఇక్కడ కేవలం డబ్బుతోనే కాదు, జీవితాలతో కూడా ఉంటుంది.

ఫీల్డులో అంతా బానే ఉన్నట్టుంటుంది. కానీ, నిజంగా ఎప్పుడు బావుంటుందో ఎవరికీ తెలీదు. చూస్తుంటే నెలలూ, సంవత్సరాలూ ఇట్టే గడిచిపోతాయి. ఓ అయిదేళ్ల తర్వాతో, దశాబ్దానికో, ఊహించని విధంగా "ఓవర్‌నైట్" సక్సెస్ వరిస్తుంది. రాత్రికి రాత్రే జాతకాలు మారిపోతాయి.

ఆ సక్సెస్ వరించని 90 శాతం మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సినీ ప్రయాణం మాత్రం అనుక్షణం మారిపోయే అగమ్యాలవైపు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా, ఇకముందు కూడా .. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా, ఎక్కడయినా.. ఈ ఫీల్డులో సక్సెస్ రేట్ ఎప్పుడూ పది శాతం దాటదు. చెప్పాలంటే, ఇంకా తక్కువే!

ఇది తెలిసి ఆడే జూదం. క్రియేటివ్ గ్యాంబ్లింగ్. ఒక కల్చరల్ ఫేంటసీ.

కట్ టూ "షాట్ బై షాట్" -

ఫీల్డులో సక్సెస్ సాధించి విజయపథంలో నడుస్తున్న స్టార్స్ గురించీ, స్టార్ టెక్నీషియన్ల గురించీ రాయడానికీ, చెప్పడానికీ, చూపించడానికీ, బ్యానర్ హెడ్‌లు పెట్టడానికీ, బ్రేకింగ్ న్యూస్‌లు ఇవ్వడానికీ పత్రికలు, చానెళ్లు పోటీ పడతాయి. వెంటపడతాయి.

అలాగే - ఫీల్డులో కాస్తో కూస్తో నిలదొక్కుకొని కొనసాగుతున్నవారికీ ఈ విషయంలో సమస్య లేదు. ఎక్కడో ఓ ఫిలిం మేగజైన్‌లోనో, దిన పత్రిక సినిమా పేజీలోనో, టీవీ చానెల్ ఫిలిం బేస్‌డ్ ప్రోగ్రామ్‌లోనో వీరికీ అంతో ఇంతో కవరేజ్ ఉంటుంది.

టాలెంట్ ఉండీ ఇంకా చెప్పుకోదగ్గ సక్సెస్ వరించని, నిలదొక్కుకొనే అవకాశం రాని ఆర్టిస్టులను, టెక్నీషియన్లను మాత్రం ఏ పత్రికా, ఏ చానెల్ పట్టించుకోదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్లకి! పాలసీలు, పాయింట్లు, రేటింగ్స్ వంటి నానా గొడవలు వాళ్లవి వాళ్లకుంటాయి.

విచిత్రంగా - కొంతమంది సక్సెస్ సాధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లని కూడా ఎందుకో మరి ఈ ప్రెస్ అసలు పట్టించుకోదు! కారణమేంటో వారికే తెలియాలి.

ఈ నేపథ్యంలో - నా పరిథిలో, నాకు తెలిసిన కొందరు టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లను 'నగ్నచిత్రం' ద్వారా పరిచయం చేయాలన్న ఆలోచనలోంచి పుట్టిందే ఈ "షాట్ బై షాట్" ఫీచర్.  

ఈ బ్లాగ్ కోసం నేను క్రియేట్ చేసుకొనే సమయాన్నిబట్టి - వారానికి కనీసం ఒక ఆర్టిస్టునయినా/టెక్నీషియన్నయినా పరిచయం చేయాలన్నది నా ఆలోచన. ఒక భారీ బయోగ్రఫీలా కాకుండా .. చాలా క్లుప్తంగా, ఒక చిన్న ఇంటర్వ్యూలా ఉంటుందీ పరిచయం.

కట్ టూ 'కూల్ మాంక్' -

"షాట్ బై షాట్" శీర్షికన ఈ సాయంత్రం ఒక 'కూల్ మాంక్' ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరా 'కూల్ మాంక్'.. ఏంటా ఆర్టిస్ట్ కథ.. ఇప్పుడేం చేస్తున్నాడు? .. అన్నీ తెల్సుకుందాం - ఈ సాయంత్రం "షాట్ బై షాట్"లో!

ఎంజాయ్ చేయండి. కామెంట్ చేయండి. షేర్ చేయండి. ఆ 'కూల్ మాంక్' కి మీ బెస్ట్ విషెస్ చెప్పండి.     

Saturday 20 July 2013

ఫిల్మ్ మేకింగ్ మేడ్ ఈజీ!

ఇప్పుడింక సినిమా ఎవరయినా తీయవచ్చు...

ఇదివరకులాగా కోటి లేదా కోట్ల రూపాయలు అవసరం లేదు. కొన్ని లక్షలు చాలు. ఇంకా చెప్పాలంటే, కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తో కూడిన ఒక చిన్న క్రియేటివ్ టీమ్ చాలు. అర్టిస్టులు, టెక్నీషియన్లు, 
ఇన్వెస్టర్లూ అందరూ అదే టీమ్!

మంచి సినిమా - అనుకున్న కథతో - అనుకున్న విధంగా తీయవచ్చు. రిలీజ్ చేయవచ్చు.

అవును. నమ్మటం కష్టం. కానీ నిజం. ఇప్పుడంతా డిజిటల్ యుగం.  ల్యాబ్ లూ, స్టూడియోలూ, ఫిల్మ్ నెగెటివ్ లూ,  ప్రాసెసింగ్ లూ, పడిగాపులూ ...

ఆ రోజులు నిజంగా పోయాయి. 
తక్కువలో తక్కువ 30 లక్షలు చాలు. కేవలం 45 రోజుల్లో ఒక మంచి కమర్షియల్/యూత్ సినిమా తీయవచ్చు. మరొక 45 రోజుల్లో - ఆ సినిమాని యే టెన్షన్ లేకుండా రిలీజ్ చేయవచ్చు.  మంచి కథతో, కథనంతో ప్రేక్షకులను ఒప్పిస్తే చాలు. సినిమాలు ఆడతాయి.  లాభం వూహించనంతగా వుంటుంది. 

ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం - ఈ మధ్య విడుదలై కలెక్షన్ల పరంగా కోట్లు కుమ్మరించిన ఒక అర డజను తెలుగు యూత్ చిత్రాలే!  అవన్నీ కూడా అత్యంత తక్కువ బడ్జెట్లో, ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి, ఆడుతూ పాడుతూ నిర్మించిన మైక్రో బడ్జెట్ చిత్రాలు. 

2007 లో వచ్చిన 'పేరానార్మల్ యాక్టివిటీ' ('ఫుటేజ్-ఫౌండ్/సస్పెన్స్/హారర్' జన్‌రా సినిమా) ఈ సంచలనానికి నాంది పలికింది. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఆ సినిమా 655,000% రిటర్న్స్ పొందింది! అప్పటి నుంచీ, మనవాళ్లకు యెన్ని రకాలుగా చెప్పినా - యెన్ని వుదాహరణలతో చూపించినా - వినలేదు యెవరూ. చివరికి ఒక పేరున్న దర్శకుడు చేసి చూపించాకగానీ మనవాళ్లకు విషయం అర్థం కాలేదు. 

ఇక ఇప్పుడంతా అదే దారి. డిజిటల్ ఫిలిం మేకింగ్ .. డిఎస్సెల్లార్  ఫిలిం మేకింగ్. అలెక్సా, రెడ్, కెనాన్ ... ఇంకెన్నో కెమెరాలు! మన ఇండస్ట్రీలో స్పెక్యులేషన్లో ఉన్న కొన్ని ప్రచారాల్ని భరించలేక,  నేను మాత్రం నా మైక్రో బడ్జెట్ సినిమాల సీరీస్‌ని పూర్తిగా రెడ్ ఎమెక్స్ గానీ, రెడ్ ఎపిక్ కెమెరాని గానీ ఉపయోగించి తీయదల్చుకున్నాను.

ముందు బిజినెస్. తర్వాత బ్రాండ్ ఇమేజ్. డబ్బు ఎలాగూ అదే వస్తుంది. ఈ రేంజ్ బడ్జెట్లో మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంటుకి అసలు రిస్క్ అనేది నిజంగా - జీరో! 


సక్తి వున్న కొత్త ప్రొడ్యూసర్లు / కో-ప్రొడ్యూసర్లు / మైక్రో ఇన్వెస్టర్లు / ఇన్వెస్టర్-హీరోలు / ఇన్వెస్టర్-యాక్టర్లు / 
"క్రౌడ్ ఫండింగ్" స్పెషలిస్టులు / ఫినాన్షియల్ మీడియేటర్స్/ నెగొషియేటర్స్...  ..  మీ ఫోన్ నంబర్ ఇస్తూ, ఈమెయిల్ ద్వారా  నన్ను సంప్రదించవచ్చు. లేదా, మీ ఫోన్ నంబర్ తో నా ఫేస్‌బుక్ పేజ్‌లో మెసేజ్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. లేదా నేనే ఫోన్ చేస్తాను.

ఈమెయిల్: mchimmani@gmail.com
ఫేస్‌బుక్ పేజ్: 
https://www.facebook.com/onemano

సినీ ఫీల్డు పట్ల, సినిమా బిజినెస్ పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు.. ఈ బ్లాగ్‌పోస్ట్ లింకుని లైక్-మైండెడ్ ఔత్సాహికులకోసం కోసం షేర్ చేస్తే మరింత సంతోషం. 

Friday 19 July 2013

టోటల్ సినిమా!

ఇప్పుడంతా ఫేస్‌బుక్కులూ, ట్విట్టర్ల యుగం. షార్ట్‌కట్‌లో రెండు వాక్యాలు, కుదిరితే ఒక మంచి బొమ్మ! అంతే. అంతకు మించి ఎవరికీ టైమ్ లేదు. పోస్ట్ చేసే వారికీ, చదివే వారికీ. 

ఒక పూట వంట చేసుకోకుండా, తినకుండానయినా బ్రతకగలుగుతున్నాం కానీ, ఒక్క నిమిషం ఇంటర్నెట్ లేకుండా  లైఫ్‌ని ఊహించలేకపోతున్నాం. ఇంటర్నెట్‌తో ఇంతగా పెనవేసుకుపోయిన ఈ ఆధునిక హరీబరీ జీవనశైలికి ఒక చిన్న క్రియేటివ్ అవుట్‌లెట్ కూడా దొరికింది. 

అదే బ్లాగింగ్.      


మనం మర్చిపోయిన ఒక మంచి అలవాటుని మళ్లీ మనకు పరిచయం చేశాయి బ్లాగులు. యునికోడ్ పుణ్యమా అని, తెలుగులో కూడా మనం ఏదంటే అది ఎంతో ఈజీగా టైప్ చేసుకోగలుగుతున్నాం. టైమ్ లేకపోయినా సరే - మనకోసం కొంత టైమ్ క్రియేట్ చేసుకొని, బ్లాగుల్ని రాస్తున్నాం. ఎన్నో బ్లాగుల్ని చదువుతున్నాం. 'నగ్నచిత్రం' నేపథ్యం కూడా ఇదే.

నగ్నచిత్రం ఇకనుంచీ ఒక "టోటల్ సినిమా" బ్లాగ్.

అంటే - ఇకనుంచీ ఇందులో పూర్తిగా ఫిలింస్, ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన అంశాలనే రాస్తాను. న్యూస్, టిట్‌బిట్స్, ఇంట్రోలు, ఇంటర్వ్యూలు, రెవ్యూలు, ఫెస్టివల్స్, పుస్తకాలు... ఏవయినా కావొచ్చు. అవి పూర్తిగా సినిమాతో సంబంధం ఉన్నవే అయిఉంటాయి. అప్పుడు - నా స్వంత సినిమాల న్యూస్, నా సినీ అనుభవాలు కూడా ఇందులో భాగమే అవుతాయి.  

ఈ చిన్న మార్పు బహుశా ఒక 365 రోజులు కావొచ్చు. (35 రోజులు కూడా కావొచ్చు. ఎందుకంటే - "మైండ్ చేంజెస్ లైక్ వెదర్" అన్నారు!) లేదా, ఇలాగే కంటిన్యూ కూడా కావొచ్చు. వ్యక్తిగతంగా మాత్రం నాకిదొక ప్రయోగం.  

సో, ఎంజాయ్ నగ్నచిత్రం. ఎంజాయ్ ద ఫిల్మీ స్టఫ్. 

Thursday 18 July 2013

ఒక్క బ్లాగ్ ఉంటే చాలు.. ఏదయినా సాధించవచ్చు!

"ఏ రచయితైనా, తన జీవన పర్యంతం రాయటం అనే తన ప్యాషన్ ను మర్చిపోలేడు. ఇదే ఇతర సృజనాత్మక రంగాల్లోని వారికందరికి కూడా వర్తిస్తుంది. నా విషయంలోనూ అంతే. పైగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు అందించిన ఒక అందమైన బహుమతి 'బ్లాగ్'. ఈ బహుమతిని నేను మనస్పూర్తిగా స్వీకరించాను.

ఇదివరకటిలా కాగితం మీద రాసి, పోస్ట్ చేసి, దాని ప్రచురణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మనం ఏదంటే అది రాసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే. 

ఒక్క బ్లాగ్‌ ఉంటే చాలు. రచయిత ఏదయినా రాయవచ్చు. ఎన్ని ప్రయోగాలయినా చేసుకోవచ్చు. ఎంతయినా సాధించవచ్చు. ప్రస్తుతం నా ఆలోచనలు ఆ దిశలో సాగుతున్నాయి."

...

ఇది ఎవరి కొటేషనూ కాదు. నా మాటలే! 

థాంక్స్ టూ పూదండ! తెలుగు బ్లాగుల అడ్డా.. "పూదండ" లో వచ్చిన నా ఇంటర్వ్యూలోంచి ఒక చిన్న భాగాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. ఆసక్తి ఉన్నవారు, ఇంటర్వ్యూ మిగిలిన భాగాన్ని ఈ లింకు ద్వారా వెళ్లి "పూదండ"లో చదవవచ్చు.
 

నా దృష్టిలో నిజానికి ఇది ఇంటర్వ్యూ కాదు. నన్ను నేను ఒకసారి పలకరించుకోడానికీ, విశ్లేషించుకోడానికీ పూదండ నాకిచ్చిన అవకాశం.  

Monday 15 July 2013

ఏదో ఓ "బ్లా బ్లా" రాయడం ఎలా?

బ్లాగ్‌లో మనం రాసేది పది వాక్యాలు కావొచ్చు. వంద వాక్యాలు కావొచ్చు. 'ఏదో ఒకటి రాయొచ్చులే' అనుకుంటాం. ఆ ఏదో ఒకటి రాయడం కూడా నిజానికి అంత సులభం కాదు. ఎంత రాయాలనుకున్నా ఆ ఫ్లో సహజంగా రాదు.

నా వ్యక్తిగత అధ్యయనంలో, బ్లాగింగ్‌కి సంబంధించి కొన్ని అంతస్సూత్రాల్ని గుర్తించాను. వాటిల్లో కొన్నిటి గురించి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను.

ఒక సక్సెస్‌ఫుల్ బ్లాగర్ - లేదా - ఒక 'ఏ గ్రేడ్ బ్లాగర్' కావాలనుకొనేవాళ్లకి ఇప్పుడు నేను చర్చించబోయే రెండు పాయింట్లు తప్పక ఉపయోగపడతాయని నా ఉద్దేశ్యం.

బ్లాగ్ పోస్టుల్లో రెండే రెండు రకాలుంటాయి:

1. చాలా విలువయిన పోస్టులు / మాసివ్ వేల్యూ పొస్ట్స్ (MVPs)
2. ఖాళీని నింపే పోస్టులు / ఫిల్లర్ పోస్టులు (FPs)  

ఒక MVP లో రాసిన అంశంతో ఒక పుస్తకం కూడా రాయొచ్చు. అంత విలువయిన సమాచారం గానీ, ఫీల్ గానీ అందులో ఉంటుంది. FP అలా కాదు. ఏదో ఒకటి రాయాలని అన్నట్టుగానే రాస్తారు. కానీ, అందులోనూ కనీసం ఒక్క వాక్యమయినా సెన్సిబుల్‌గానూ, విలువైనదిగానూ ఉంటుంది. ఉండి తీరుతుంది. ఆ ఒక్క వాక్యంతోనే ఆ FP కి ఆ వాల్యూ వస్తుంది.

సహజంగానే ఒక MVP రాయడానికి కొన్ని గంటల సమయం తీసుకుంటుంది. FP కి మాత్రం ఒక అరగంట చాలు.

సాధారణంగా 'ఏ-క్లాస్' బ్లాగర్లందరి బ్లాగుల్లోనూ ఈ రెండు రకాల పోస్టులుంటాయి. వీటి రేషియో మామూలుగా 1:4 గా ఉంటుంది. అంటే ఒక MVP పోస్టు రాస్తే, కనీసం ఒక నాలుగు FP పోస్టులు రాస్తారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం రాస్తారని కాదు. అదలా జరిగిపోతుందంతే!  

కట్ టూ నగ్నచిత్రం -

నగ్నచిత్రంలో నేను ఎక్కువగా ఏదో ఒక 'నాన్సెన్స్' రాయాలనుకొనే ప్రారంభిస్తాను. రాయడం పూర్తయ్యేటప్పటికి అది తప్పక ఒక FP నో, MVP నో అవుతుంది. ఈ రెండింటి రేషియో కూడా నా బ్లాగ్‌లో ఇంచు మించు 1:4 గానే కనిపిస్తోంది. నా ఈ కొద్ది నెలల బ్లాగింగ్ అనుభవంలో నేను తెలుసుకొన్నది ఏంటంటే - మనం ఏ చెత్త రాసినా అది తప్పక పాఠకుడ్ని ఆకర్షించే చెత్తనే అయి ఉండాలి. దానికి తోడు, చదివించే గుణం కూడా చాలా ముఖ్యం.

సో, మన బ్లాగే కదా అని ఏదో ఒకటి రాసేస్తే సరిపోదు. కొంచెం ఆలోచించి రాయాలి, కొంచెం ఎట్రాక్టివ్‌గా కూడా రాయాలన్నమాట!    

Friday 12 July 2013

ఇంటర్‌నెట్‌లో ఒక నిమిషంలో ఏం జరుగుతోంది?

639,800 జీబీల గ్లోబల్ IP డేటా ట్రాన్స్‌ఫర్ అవుతోంది.

20 మిలియన్ల ఫోటో వ్యూస్ ఒక్క ఫ్లిక్కర్‌లోనే రిజిస్టర్ అవుతున్నాయి.

3000 ఫోటోలు ఫ్లిక్కర్లో అప్‌లోడ్ అవుతున్నాయి.

61,141 గంటల మ్యూజిక్ వింటున్నారు.

47,000 యాప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి.

1300 కొత్త మొబైల్ యూజర్స్ కనెక్ట్ అవుతున్నారు.

6 కొత్త వికీపీడియా ఆర్టికిల్స్ పబ్లిష్ అవుతున్నాయి.

20 ఐడెంటిటీలని దొంగిలించే కేసులు రిజిస్టర్ అవుతున్నాయి.

135 బోట్‌నెట్ ఇన్‌ఫెక్షన్లు అటాక్ చేస్తున్నాయి.

83,000 డాలర్ల సేల్స్ ఒక్క అమేజాన్ డాట్ కామ్‌లోనే జరుగుతున్నాయి.

100,000 కొత్త ట్వీట్లని ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు.

320 మంది కొత్తగా ట్విట్టర్లో చేరుతున్నారు.

6 మిలియన్ల ఫేస్‌బుక్ వ్యూస్ రిజిస్టర్ అవుతున్నాయి.

277,000 ఫేస్‌బుక్ లాగిన్స్ రిజిస్టర్ అవుతున్నాయి.

2 మిలియన్ల గూగుల్ సెర్చ్ జరుగుతోంది.

1.3 మిలియన్ల వీడియోల్ని యూట్యూబ్‌లో చూస్తున్నారు.

30 గంటల వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతోంది.

... ...

ఇదంతా ఇంటర్‌నెట్లో ఒక్కటంటే ఒక్క నిమిషంలో జరుగుతోంది! ఒక చిన్న శాంపుల్ అనుకోండి.

ఈ లెక్కన ఇంకెన్ని సైట్స్‌లో, ఇంకా ఎంత ఇన్‌ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవుతోందో, ఎన్ని మిలియన్ల సేల్స్ జరుగుతోందో మనం ఊరికే అంచనా వేయవచ్చు.

సుమారు రెండు దశాబ్దాల క్రితమే యూనివర్సిటీలో నేను లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ చదువుతున్నప్పుడు ఈ "ఇన్‌ఫర్మేషన్ ఎక్స్‌ప్లోజన్" గురించి కూడా చదవటం జరిగింది.

అప్పుడు ఇదంత పెద్ద విషయంలా అనిపించలేదు. అంత సీనుందా అనుకున్నాము. ఎంతో సీనుందని ఇప్పుడర్ధమౌతోంది. కళ్ళారా చూస్తున్నాము.

కట్ టూ నా షేర్ -

ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అనీ, అదనీ, ఇదనీ... మొత్తానికి రోజుకి కనీసం 45 నిమిషాలు నేనూ ఈ ఇంటర్‌నెట్లో మునిగితేలుతున్నాను. మరి మీ సంగతేంటి? :)  

Monday 8 July 2013

కొత్తవాళ్లతో సినిమా తీయడం ఎందుకు సాహసం కాదు?

మొన్నొక ఆడియో కార్యక్రమంలో అనుకుంటాను.. సీనియర్ దర్శకుడు ఒకరు  ఒక మాటన్నారు. "కొత్తవాళ్లతో సినిమా తీయడం సాహసం" అని! ఇది దాదాపు ఇండస్ట్రీలోని అందరు సీనియర్లూ ఎప్పుడూ చెప్పేదే. అందులో ఎలాంటి సందేహం లేదు. అబధ్ధమూ కాదు.

అయితే, చిన్న బడ్జెట్లో సినిమా తీయాలనుకునేవారికి మరో గత్యంతరం లేదు.

బడ్జెట్ విషయం అలా ఉంచితే - అంతా కొత్తవాళ్లతో తీస్తున్న సినిమాలకు బిజినెస్ ట్రెండు ఈ మధ్య చాలా బావుంది. కనీసం సపోర్టింగ్‌కి కూడా తెలిసిన ఆర్టిస్టులను, సీనియర్ ఆర్టిస్టులను తీసుకోకుండా ఇప్పటి దర్శకులు విజయాల్ని సాధించి మరీ చూపిస్తున్నారు.

ఈ విప్లవాత్మక మార్పుని సో కాల్డ్ సీనియర్ సినీ పండితులు గమనిస్తున్నారనుకుంటాను. "సపోర్టింగ్‌కి ఫలానా ఫలానా ఆర్టిస్టుల్ని, కమెడియన్లని పెట్టండి. ఫోటో కార్డు మీద, పోస్టర్ మీద.. కనీసం వాళ్ల తలకాయల్ని చూసయినా జనాలొస్తారు సినిమాకి!" అని పాత చింతకాయ పచ్చడి రూల్స్‌ని చెప్పేది ఈ సినీ పండితులే. ఆ తలకాయలే లేకపోతే అసలు సినిమాకి శాటిలైట్ రైట్స్ రానే రావు అనీ, అసలు సినిమానే రిలీజ్ కాదనీ సొద పెట్టేదీ వీళ్లే.

కానీ అవన్నీ హాయిగా జరిగిపోతున్నాయి.  

వరుసగా హిట్లు కొడుతూ, క్రిటిక్స్ మన్ననలు కూడా (!) అందుకొంటున్న ఇటీవలి కొత్త సినిమాల్లో ఈ రూల్‌ని ఏ డైరెక్టరూ అసలు పట్టించుకోలేదు.

అయితే ఒక్కటి మాత్రం నిజం. సినిమాలో స్టఫ్ ఉండాలి. స్టఫ్ లేకపోయినా, ఆడియన్స్‌ని థియేటర్‌కు రప్పించగల యూ.ఎస్.పి. (యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్) ఏదో ఒకటి ఉండాలి. ఆ రేంజ్‌లోనే ప్రమోషన్ కూడా అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కొత్తవాళ్లతో సినిమా తీసినా ఎలాంటి రిస్క్ ఉండదు.

ఈ నిజాన్ని, ఇటీవలే రిలీజయి కోట్లు కుమ్మరించిన కొన్ని చిన్న సినిమాలు నిరూపించాయి.

బడ్జెట్ పరంగా నాకున్న పరిధిలో, ఇప్పుడు నేను చేపట్టిన మూడు మైక్రో బడ్జెట్ సినిమాల ప్రాజెక్టులో అంతా కొత్తవారినే పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే చేస్తున్నాను.

ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా మీతో పంచుకోవాలి. ఆల్రెడీ ఖాతాలో హిట్లు ఉండి, కాస్త బాగానే పేరున్న చిన్న హీరోల సినిమాలు, ఇంతకు ముందే భారీ హిట్లిచ్చిన కొందరు సీనియర్ దర్శకుల కొత్త చిత్రాలు కూడా కొన్ని ఈ మధ్య బిజినెస్‌కు నోచుకోవడం లేదు!

ఈ చిత్రాలతో పోలిస్తే, కొత్తవాళ్లతో తీసే చిత్రాల బడ్జెట్ చాలా చాలా తక్కువ. కాబట్టి - సినిమా హిట్టయినా, ఫట్టయినా రిస్కు శాతం కూడా చాలా చాలా తక్కువ. ఇంక ఇతర భారీ హీరోలు, దర్శకుల చిత్రాలతో పోలిస్తే - అంతా కొత్తవాళ్లతో తీసే ఈ చిత్రాలకు అసలు రిస్క్ అనేది దాదాపు లేనట్టే!  
(My direct email: mchimmani@gmail.com)

Saturday 6 July 2013

మీ అసలు లక్కీ నంబర్ మీకు తెలుసా? - 2

రోజుకి మనకున్న 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్రకు సరిపోతుంది. ఇంకో 8 గంటలు మన వ్యక్తిగత జీవితం, మన దైనందిన వ్యక్తిగత వ్యవహారాలకీ, వేస్ట్ వ్యవహారాలకీ సరిపోతుంది. ఈ 16 గంటల సమయాన్ని మినహాయిస్తే - ప్రతిరోజూ మనం పని చేసే సమయం సగటున 8 గంటలు అన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే, నిజానికి ఆ 8 గంటలు కూడా మనం మనసుపెట్టి పనిచేయం అన్నది మనం ఒప్పుకోడానికి ఇష్టపడని నిజం!

శాస్త్రీయ అధ్యయనం ప్రకారం - ప్రతి 3 పనిగంటల్లో కేవలం ఒక గంట మాత్రమే మనం పనిచేసేది! చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో, ఎన్నో ప్రయివేట్ ఆఫీసుల్లో, సొంత వ్యాపారాల్లో, వృత్తుల్లో.. చాలా మంది ఆ గంటసేపు కూడా పనిచేయరనుకోండి. అది వేరే విషయం.

ఫార్చూన్ 500 కంపెనీల 'సీ.ఈ.ఓ' లే రోజుకి కేవలం 28 నిమిషాలపాటు మాత్రమే పనిచేస్తారట. దీన్నిబట్టి మనవాళ్లెంత సమయం పనిచేస్తారో ఊహించవచ్చు. మరి మిగిలిన సమయం అంతా ఏమయిపోతోంది అంటే - విష్ చేసుకోడాలు, కుశల ప్రశ్నలు, గాసిప్స్, పాలిటిక్స్, చాయ్‌లు, సిగరెట్లు, పనిచేయడానికి 'మూడ్' తెచ్చుకోడం, లంచ్, స్నాక్స్, పర్సనల్ పనులు, క్రికెట్, ఫోన్ కాల్స్, ఫేస్‌బుక్, చాటింగ్ వగైరాలకే సరిపోతుందన్నమాట.

కట్ టూ మన లక్కీ నంబర్ -

ఒక కేలండర్ యియర్లో - లేదా వచ్చే 365 రోజుల్లో - మీరు నిజంగా ఎంత సంపాదించాలనుకుంటున్నారు? ఊరికే, రఫ్‌గా ఒక 5 లక్షలు అనుకుందామా? డన్.

వీకెండ్స్, సమ్మర్ హాలిడేస్, వింటర్ హాలిడేస్ (ఉంటే), పండగలు, పబ్బాలు, లీవులు, ఎగ్గొట్టడాలు.. ఇవన్నీ మైనస్ చేస్తే - సగటున ఒక సంవత్సరంలో 220 మాత్రమే పనిదినాలుంటాయి. మీరు లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల్ని ఈ 220 రోజుల్లోనే పనిచేసి సంపాదించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మీ ప్రతీ పనిదినం (వర్కింగ్ డే) విలువ 2,273 రూపాయలు. దీన్ని 8 గంటలతో భాగిస్తే - గంటకి సుమారు 284 రూపాయలు అవుతుంది.

కాని, ముందు మనం అనుకున్న విధంగా - సగటున, మనం పనిచేసే 8 గంటల్లో కేవలం 1/3 భాగం మాత్రమే మనం పనిచేస్తాం. కాబట్టి ఈ 284 రూపాయల్ని 3 చేత హెచ్చవేయాల్సి ఉంటుంది. అంటే, 284 x 3 = 852 రూపాయలు. దీన్ని 60 చేత భాగిస్తే వచ్చేదే మీ అసలు అదృష్ట సంఖ్య.

842 ని 60 చేత భాగిస్తే 14 వస్తుంది. అంటే మీ ప్రతి పని నిమిషం విలువ 14 రూపాయలు!

1 నుంచి 9 లక్కీ నంబర్ల విషయం నాకు తెలీదు. కానీ - ప్రాక్టికల్ గా ప్రతి నిమిషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మీ జీవితాన్ని అభివృధ్ధిపథంలోకి తీసుకెళ్లే మీ అసలు లక్కీ నంబర్ మాత్రం ఇదే.

ఇది తెలిస్తే - మీ జాతకం ఏంటో మీకే తెలుస్తుంది. ఇప్పటివరకు మీ జీవితంలో ఏం జరిగిందో తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుస్తుంది. ఇకముందు ఏం జరగబోతోందో తెలుసుకుంటారు. ఇంకా చెప్పాలంటే - మీ జీవనశైలి, మీ ఆలోచనా విధానం.. అన్నీ మీరు ఊహించని విధంగా మారిపోతాయి.

ఒక్కసారిగా మీ నిర్ణయాలు మారిపోతాయి. మీరు కలిసి కబుర్లు చెప్పే వ్యక్తులు మారిపోతారు. మీరు సెల్ ఫోన్లో మాట్లాడే ప్రతి కాల్ అసలు విలువ తెల్సిపోతుంది. ఇంకా ఎన్నో నిజాలు మీరే కనుక్కుంటారు.      

ఇకనుంచీ, మీ లక్కీ నంబర్ విలువకు సరిపోని పనులను మీరు చేపట్టరు. అంత విలువైన పనులు మీకు లభించాలంటే ఏం చేయాలో మీరు ఆలోచిస్తారు. లేదా, అంత విలువైన పనుల్ని మీరే క్రియేట్ చేసుకుంటారు. లక్ష్యం మీదే మీ దృష్టి ఫోకస్ అవుతుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. అనుకున్నంత సంపాదిస్తారు.

మీ లక్ష్యాలను బట్టి ప్రతి సంవత్సరం, లేదా ప్రతి నెలా మీ లక్కీ నంబర్ ను మీరే మార్చుకోవచ్చని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను.

ఈ సంవత్సరానికి నా అసలు లక్కీ నంబర్ 280. ఇప్పుడు చెప్పండి.. మీ అసలు లక్కీ నంబర్ ఎంత?

నిజానికి ఈ లక్కీ నంబర్ మన డబ్బు సంపాదనకు సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. మన చేతుల్లోంచి జారిపోతున్న మన సమయం అసలు విలువ తెలిసినప్పుడే మనం ఏదయినా సీరియస్‌గా తీసుకోగలుగుతాం. ఏదయినా సాధించగలుగుతాం.

దీన్ని మించిన టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్, పర్సనల్ డెవలప్‌మెంట్ సీక్రెట్ ఏదీ లేదు. జీవితంలోని అన్ని సీక్రెట్లూ దీనిచుట్టూనే గిరగిరా తిరుగుతుంటాయి. ఈ నిజాన్ని మీరూ ఒప్పుకుంటారనుకుంటాను.      

Friday 5 July 2013

మీ అసలు లక్కీ నంబర్ మీకు తెలుసా? - 1

టైమ్ మేనేజ్‌మెంట్ అన్న అంశం మీద ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వేలాది పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. 'సమయపాలన' అన్న సబ్జెక్టుకు ఇంత క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం ఏమీలేదు.

ఒక అతి చిన్న పని చేయడం నుంచి, అతి పెద్ద లక్ష్యం సాధించేవరకు - ఏ స్థాయిలోనైనా, సమయపాలన అనేది తప్పనిసరి. సరైన టైమ్ మేనేజ్‌మెంట్‌ని పాటించలేనివాళ్లు జీవితంలో ఏదీ సాధించలేరు. ఇక డబ్బు సంపాదన అనేది వీరి విషయంలో కలలోమాట!

టైమ్ మేనేజ్‌మెంట్ మీద వివిధ భాషల్లో వచ్చిన పుస్తకాల్లో, ఆడియో వీడియో కోర్సుల్లో, చాలా వరకు 'థియరీ'నే ఉంటుంది. అంటే ఏదో నాన్-ఫిక్షన్ 'టిప్స్ బుక్స్'లో లాగా "ఇలా చేయాలి..అలా చేయాలి" అని మాత్రమే ఉంటుంది. ఉట్టి చిట్కాలన్నమాట! కాకపోతే, ఆ  మ్యాటర్ అంతా చదివించేవిధంగా, ఇంకా వినాలనిపించేలా.. ఒక రకమైన 'ఫీల్ గుడ్' అనుభూతినిస్తుంది.

అదొక్కటే, ఈ పర్సనల్ డెవలప్‌మెంట్ పుస్తకాలు, ఆడియో వీడియోల ప్రత్యేకత. నిజానికి ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఏమాత్రం పనికి రావు.

ఇందుకు పూర్తి భిన్నంగా - కొన్ని మాత్రమే అరుదైన పుస్తకాలు, కోర్సులు ఉంటాయి. వీటిని అనుసరిస్తే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు. వీటి రచయితలంతా ఆయా టెక్నిక్స్‌ని పాటించి, వృత్తిలోనూ జీవితంలోనూ ఎన్నెన్నో విజయాల్ని సాధించిన అనుభవంతో రాసినవారు.

ఇలాంటి నిజమైన "రాగ్స్ టూ రిచెస్" మనీ మేకర్స్ రాసిన పుస్తకాలు, రూపొందించిన కోర్సులు ఫాలో కావడం అనేది మనకి మనం ఇచ్చుకొనే "లైఫ్ టైమ్ గిఫ్ట్" అవుతుంది. అంటే, ఫలితాలు అంత బాగా ఉంటాయన్నమాట!  

నిజానికి, ఇప్పుడున్న 'జెట్‌స్పీడ్' జీవనశైలికి ఆయా పుస్తకాల్లో చెప్పిన టెక్నిక్స్‌ని అనుసరించే తీరిక, ఓపిక లేవు. అయితే - మీ జీవితం కోసం, జీవితంలో ఆనందం కోసం, సంపద కోసం... ఒక అయిదు నిమిషాలు మాత్రం కెటాయించగలిగితే చాలు. ఈ టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ అన్నింటి సారాంశంగా ఒక సూపర్ టెక్నిక్ మీరు కనుక్కోవచ్చు.

అదే మీ అసలు లక్కీ నంబర్!

(అదేంటో తర్వాతి బ్లాగ్‌లో చదవండి...)                

Wednesday 3 July 2013

నా బెస్ట్ ఫ్రెండ్!

'నగ్నచిత్రం'లో నా బ్లాగింగ్ నాకు చాలా సహాయం చేస్తోంది. నాకు మూడ్ బాగా ఉన్నప్పుడు బ్లాగ్ రాయటం మామూలే. కానీ, నేనేదయినా టెన్షన్లో ఉన్నా, చిరాగ్గా ఉన్నా దాన్ని "రబ్ ఆఫ్" చేసుకోవటం కోసం నేను ముందుగా వెళ్లేది నా బ్లాగ్ దగ్గరికే.

ఏదయినా రాస్తాను. లేదంటే, అంతకుముందు రాసిన పోస్టులు ఒకసారి బ్రౌజ్ చేస్తాను. రాసిన వాటిని చదువుతోంటే, కొత్తగా నేను రాయాల్సిన టాపిక్స్ అప్పటికప్పుడు మనసులో మెరుస్తాయి. ఈ మధ్యలో నా టెన్షన్ పూర్తిగా ఎగిరిపోతుంది. మళ్లీ నా నేచురల్ మూడ్ లోకి వస్తాను.

అలా - నగ్నచిత్రం బ్లాగ్ నన్ను బాగా కాపాడుతోంది. కావల్సినప్పుడు ఉత్సాహాన్నిస్తోంది. కొన్ని కొన్ని సార్లు కొత్త ఆలోచనలు నాలో క్రియేట్ అవ్వడానికి ఓ కేటలిస్ట్‌గా కూడా పనిచేస్తోంది!

వీటన్నింటినీ మించి, ఎలాంటి సంకోచం లేకుండా, నా ఆలోచనలను పంచుకోడానికి ఒక దగ్గరి మిత్రునిలా, ఒక "అవుట్‌లెట్‌"గా కూడా పనిచేస్తోంది.

నా వ్యక్తిగత విషయాల్ని, కొన్ని స్వగతాల్ని పక్కన పెడితే - ఇప్పుడు నేను ఎక్కువగా సినిమాల గురించి, సినీ ఫీల్డులోని కొన్ని నిజాల గురించే ఎక్కువగా రాస్తున్నాను ఈ బ్లాగ్‌లో. అయితే ఈ సినిమా రాతలు క్రమంగా తగ్గిపోతాయి. ఇవి కొంతకాలం మాత్రమే అనుకున్నాను. కానీ చూస్తుంటే అలా జరిగేట్టు లేదు.

ఇప్పుడు అంతా కొత్తవాళ్లతో సినిమాలు తీస్తూ, మంచి బిజినెస్‌లు చేస్తున్న "యూత్ సినిమాల ట్రెండ్"ని క్యాష్ చేసుకోవాలన్నదే ప్రస్తుతం నా అసలైన గోల్. కానీ, దీన్ని ఓవర్‌టేక్ చేస్తూ, బ్యాగ్రౌండ్‌లో ఇంకా నూటొక్క కారణాలున్నాయి. అవన్నీ ఇక్కడ చర్చించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.

చాలా కాలం తర్వాత మళ్లీ నేను సినిమాలు చేస్తున్నాను. చేయాల్సి వస్తోంది. సినిమాలు చిన్నవే అయినా, మొత్తం మూడు సినిమాల సీరీస్ కాబట్టి, నిజానికి దీన్నొక పెద్ద ప్రాజెక్ట్ గా చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న రకరకాల ఆలస్యాల్నీ, పరిణామాలనీ చూస్తోంటే, నిజంగానే నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

కానీ, ఖచ్చితంగా.. నేను ఈ మూడు మైక్రోబడ్జెట్ సినిమాలతో అప్పుడే గుడ్‌బై చెప్పటం లేదు. చిన్నగా నా ఆలోచనలు మైక్రోబడ్జెట్ సినిమాల "ఫ్యాక్టరీ" వైపు కదులుతున్నాయి. విష్ మీ బెస్టాఫ్ లక్! :)

ఏది ఎలా వున్నా - ఈ బ్లాగ్‌లో సినిమా రాతలతోపాటు, నాకు ఎంతో ఇష్టమయిన "పర్సనల్ డెవెలప్‌మెంట్, స్పిరిచువాలిటీ"ల మీద కూడా ఇకనుంచీ బాగా రాయాలనుకుంటున్నాను. రాస్తాను.  

Monday 1 July 2013

అన్నీ ఫ్రీ!

"ఫ్రీ గా వస్తే పెట్రోల్ త్రాగే టైపురా వాడు!" అంటూంటాం. నిజానికి పెట్రోలయినా, ఫినాయిలయినా ఎక్కడా ఫ్రీగా రావు. కానీ, వెబ్‌లో మాత్రం మనకు ఏది కావాలంటే అది ఫ్రీగా దొరుకుతోంది.

వెబ్‌సైట్లు, బ్లాగులు, ఫోరమ్‌లు.. ఇలా ఏదయినా మనకి మనం ఫ్రీగా క్రియేట్ చేసుకొనే వీలుని నెట్‌లోని ఎన్నో రిసోర్సెస్ మనకు కల్పిస్తున్నాయి.

వీబ్లీ, బ్లాగర్, వర్డ్‌ప్రెస్ మొదలైనవి అలాంటివే. ఇంక ఈమెయిల్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్‌డ్ ఇన్, యూట్యూబ్‌ల గురించి చెప్పే పనేలేదు. సోషల్ నెట్వర్కింగ్ కోసం వెబ్‌లో దాదాపు అన్నీ ఫ్రీనే!

వెబ్‌సైట్ల కోసం ఒకప్పుడు ".com" అని సొంతంగా డొమెయిన్, స్పేస్ కొనుక్కొని మరీ సైట్లు క్రియేట్ చేసుకొనే మోజు, క్రేజ్ ఉండేది. ఫేస్‌బుక్ క్రేజ్‌లో ఆ మోజు ఎగిరిపోయింది.  వ్యక్తులుగానీ, కంపెనీలు గానీ.. వారి ఫేస్‌బుక్ అడ్రసే వెబ్ అడ్రెస్ అయిపోయిందంటే అతిశయోక్తికాదు!

నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఏవో భారీ కంపెనీలకు తప్ప ఇప్పుడు 'డాట్ కామ్‌'లు  లు ఎవరికీ అవసరం లేదు.

ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల సీరీస్‌కు ఉపయోగపడే విధంగా - ఇన్వెస్టర్స్‌నీ, కొత్త ఆర్టిస్టులూ, టెక్నీషియన్లనీ టార్గెట్ చేస్తూ, మొన్ననే వీబ్లీలో ఒక సింపుల్ సైట్ క్రియేట్ చేశాను. కేవలం రెండుగంటల్లోపే నేనిది క్రియేట్ చేయగలిగానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.

వెబ్ రిసోర్సెస్ అన్నీ అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం ఏదయినా క్రియేట్ చేసుకోవాలంటే - మనం ఏ బీటెక్కులో, వెబ్ డిజైనింగులో చేసి ఉండాల్సిన పనిలేదు. అన్నీ అంత ఈజీ!

నేను మొన్నే  క్రియేట్ చేసిన ఈ వీబ్లీ సైట్, కేవలం రెండు రోజుల్లో రికార్డు చేసిన "హిట్స్" సంఖ్య 630! నాట్ బ్యాడ్, కదూ?

ఫ్రీగా వస్తున్నాయి కదా అని వీటి మీదపడిపోయి టైమ్ వేస్ట్ చేసుకోవడమా.. లేదంటే, వీటినే ఉపయోగించుకుని మన టైమ్‌ని బాగుచేసుకోవడమా అన్నది మాత్రం పూర్తిగా మనమీదే ఆధారపడి ఉంది.