Wednesday 15 May 2013

అంజెలినా 'మెడికల్ హెక్సింగ్' కు బలయిందా ?


ప్రపంచ సుందరీమణుల్లో ఒకరిగా పిలవబడే హాలీవుడ్ నటి అంజెలినా జోలీ తన రెండు వక్షోజాలని సర్జికల్‌గా పూర్తిగా తొలగించుకుంది! వైద్య పరిభాషలో దీన్ని "ప్రివెంటివ్ డబుల్ మాస్టెక్టమీ" అంటారు.

నిన్నటి న్యూయార్క్ టైమ్‌స్ కు స్వయంగా రాసిన ఒక వ్యాసంలో ఈ విషయాన్ని బహిర్గతం చేసి ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనానికి తెరలేపింది అంజెలినా.

అంజెలినా తల్లి 2007లో బ్రెస్ట్ కేన్సర్‌తో చనిపోయింది. BRCA జెనెటిక్ టెస్ట్ అనంతరం, తనకు కూడా బ్రెస్ట్ కేన్సర్ సోకే అవకాశం 87% ఉందంటూ డాక్టర్లు చెప్పటంతో ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది జోలీ. ఏప్రిల్ 27 నాటికే ఈ మెడికల్ ప్రొసీజర్స్ పూర్తయినా, ఇప్పుడు తనిలా బయటపడటానికి కారణం - ప్రపంచవ్యాప్తంగా తనలాంటి రిస్క్‌తోనే బాధపడుతున్న ఇంకెందరో స్త్రీలు కూడా ఇక మీదట ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరని అంజెలినా ఆలోచన.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు అంజెలినాకుంది. ఆ స్వేఛ్చని ఎవ్వరూ కాదనలేరు. కాని, దాన్ని పబ్లిగ్గా ప్రపంచం ముందు పెట్టడమే ఎన్నో విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా వైద్యరంగం నుంచే!

"బయాలజీ ఆఫ్ బిలీఫ్" పుస్తకం రాసిన డాక్టర్ బ్రూస్ లిప్టన్ వాదన ప్రకారం అసలు 'ఫ్యామిలీ హిస్టరీ' గాని, 'జెనెటిక్ ససెప్టిబిలిటీ' గాని ఇంకా శాస్త్రీయంగా నిరూపింపబడలేదు! అలాంటప్పుడు అంత ఖచ్చితంగా అంజెలినా వక్షోజాలకి కేన్సర్ రావడానికి 87% రిస్క్ ఉందని ఏ డాక్టరయినా ఎలా చెప్పగలడు? ఇలాంటి తప్పుడు సలహా ఇచ్చి, అంజెలినాను మానసికంగా బలహీనురాలిని చేయటంద్వారా ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి వైద్యులే కారణం అంటాడు బ్రూస్.

కేన్సర్ వస్తుందేమోనన్న భయంతో, లేదా కేన్సర్ వచ్చే అవకాశం ఉందన్న డాక్టర్ల సూచనతోనో మన శరీరంలోని ఒక్కో భాగాన్నీ అలా తొలగించుకుంటూ పోలేంకదా?!

ఆరోగ్యంగా ఉన్న శరీరంలోని ఒక భాగాన్ని తొలగించడమంటే - కొత్తగా కొన్నయినా ఆరోగ్య సమస్యలకు స్వాగతం పలికినట్టే అంటే అతిశయోక్తికాదు.

"ప్లేసెబో ఎఫెక్టు" కు వ్యతిరేకంగా "నోసెబో ఎఫెక్టు" అని ఒకటుంది. దీని ప్రకారం, నా ఆరోగ్యం బాగాలేదు అని ఎప్పుడూ అనుకుంటే నిజంగానే ఆరోగ్యం బాగుండదు. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనలో - ఒక వ్యక్తికి కేన్సరుందనీ, 3 నెలలకంటే ఎక్కువ అతడు బ్రతకడనీ ఒక తప్పుడు డయాగ్నసిస్ రిపోర్ట్ ఆధారం చేసుకుని వైద్యులు చెప్పారు. ఆ పేషెంటు సరిగ్గా 3 నెలలకి చనిపోయాడు. "అటాప్సీ" చేస్తే, అతనికి ఎలాంటి కేన్సర్ లేదని తేలింది! నోసెబో ఎఫెక్ట్ అంటే ఇదే.  

క్రానిక్, ఇంక్యూరేబుల్, టెర్మినల్, 87% రిస్క్.. వంటి పదాల్ని వాడుతూ ఒక రకంగా పరోక్షంగా పేషంట్లకి తీవ్రమైన హాని చేస్తున్నారు వైద్యులు. దీన్నే "మెడికల్ హెక్సింగ్" అంటారు. తెలుగులో దీన్ని వైద్యసంబంధమైన బాణామతి అనవచ్చేమో. అందాల అంజెలినా జోలీ కూడా బహుశా ఇలాంటి బాణామతికే గురై, అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఆ వత్తిడిలోనే, తన అందాల్ని, సూడో సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ టేబుల్ మీది స్టీల్ కత్తులకు ఆహారం చేసింది.

కట్ టూ సూపర్ స్పెషాలిటీ -

ఆధునిక వైద్య విజ్ఞానం ఏ రోగానికయినా చికిత్సను అందించాలి. అసలు రోగాలు రాకుండా చేయగలగాలి. కాని, పరిస్థితి మరోలా ఉంది. ఆరోగ్యంగా ఉన్న మనిషిలోని ఒక్కో అవయవాన్ని స్వయంగా ఎవరికివారే తొలగించేసుకోవాలన్న నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. ఎటు వెళ్తున్నాం మనం?

1 comment:

  1. కీడెంచి మెలెంచాలని మన పెద్దలంటారు కదా... ముందు జాగ్రత్త మంచిదెనెమో....

    ReplyDelete