Monday 27 May 2013

సినిమా తీద్దాం రండి!

ఫిల్మ్ మేకింగ్‌లో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు అసలు ఫిల్మ్ (నెగెటివ్) అనేది లేకుండానే ఫిల్మ్ తీయవచ్చు! అంతా డిజిటల్‌మయమైపోయింది.

ఒకటి రెండేళ్ల క్రితం వరకూ, సినిమా తీయడానికి కోట్లరూపాయల విలువైన కెమెరాలు ఉపయోగించేవారు. ఇప్పుడా కెమెరాలకు పూర్తిగా కాలం చెల్లింది. కేవలం లక్షన్నర రూపాయల కెమెరాతో కూడా ఇప్పుడు ఒక మంచి క్వాలిటీ సినిమా తీయవచ్చు.

అటు అంతర్జాతీయంగా, ఇక్కడ టాలీవుడ్‌లోనూ రికార్డులు సృష్టిస్తున్న కెనాన్ 5 డి కెమెరాలు కూడా చూస్తుండగానే అవుట్‌డేట్ అయిపోనున్నాయి. 5 డి కెమెరా ధరలో సుమారు సగం ధరకే మరింత మంచి క్వాలిటీ సినిమాను షూట్ చేయగలిగే కెమెరాలు మార్కెట్లోకి రావటానికి ఆల్రెడీ లైన్లో ఉన్నాయి!

కట్ టూ స్టూడియోస్ అండ్ ల్యాబ్స్ -

ఈ బ్లాగ్‌లోనే ఇంతకుముందు నేను దీని గురించి రాశాను. బహుశా అది - సింగిల్ బెడ్రూమ్ సినీ స్టూడియో! ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.. అతిశయోక్తి కూడా కాదు. కేవలం ఒక్కటంటే ఒక్క అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ సిస్టమ్ ఇంట్లోనో, ఆఫీస్‌లోనో ఉంటే చాలు. అదే మన సినీ స్టూడియో అవుతుంది!

ఆ ఒక్క సిస్టమ్‌తోనే రికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, రీరికార్డింగ్, ఎఫెక్‌ట్స్ ఎట్సెట్రా హాయిగా చేసుకోవచ్చు.

ఇదంతా నేనేదో ఊహించి చెప్పటం కాదు. హాలీవుడ్‌లో ఎందరో దీన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ఇంకా చెప్పాలంటే - "వన్ మ్యాన్ ఫిల్మ్ మేకింగ్" అనేది ఇప్పుడు హాలీవుడ్‌లో, ఇతర పాశ్చాత్య దేశాల "వుడ్స్"లో ఒక ప్యాషన్! సినిమాను ప్రాణంగా ప్రేమించే వందలాది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఇదే సిస్టమ్‌ను ఫాలో అవుతున్నారు. పైగా, అన్ని ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ వీరికే ఎక్కువ అవార్డులు రివార్డులు దక్కుతున్నాయి. ఇక్కడ నేను చెప్తున్నది "ఆర్ట్" సినిమాల గురించి కాదు. కమర్షియల్ సినిమాలు. ఇది గమనించాల్సిన విషయం!        

కట్ టూ మన మెయిన్ టాపిక్ -

మారుతి "ఈ రోజుల్లో" పూర్తిగా కొత్తవాళ్లతో తీశారు. ఈ సినిమాలో ఎం ఎస్ నారాయణ వేసిన ఆ అతి చిన్న పాత్ర అంతగా లెక్కలోకి రాదు. శాటిలైట్ రైట్స్ దృష్టితో ఈ ఒక్క విషయంలో మనవాళ్లు కాంప్రమైజ్ అయినట్టున్నారు. లేకపోతే, ఆపాత్రలో కూడా కొత్తవారే ఉండేవారన్నది నా ఉద్దేశ్యం. అలాగే, "ఒక రోమాంటిక్ క్రైమ్ కథ", "బస్టాప్",
"3 జి లవ్" సినిమాల్లో కూడా అంతా కొత్తవారే!

ఈ సినిమాలన్నీ ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన చిన్న సినిమాలు! వీటిని తీయడానికి అయిన ఖర్చు.. ఒక రొటీన్ తెలుగు సినిమాలో ఒక పాట చిత్రీకరణకు కూడా సరిపోదంటే అతిశయోక్తికాదు.

మొన్నటి వరకూ పూర్తిగా కొత్తవాళ్లతోనే ఒక చిన్న సినిమా తీయాలన్నా కనీసం కోటి రూపాయలు అవసరం అయ్యేది. కాన్సెప్టు, సెటప్పుని బట్టి, ఇప్పుడు అదే బడ్జెట్లో రెండు లేదా మూడు సినిమాలు తీయవచ్చు. అంటే, 30 నుంచి 50 లక్షల రేంజ్‌లో, కొత్తవాళ్లతో, ఇప్పుడొక మంచి యూత్ సినిమా తీయొచ్చు!

ఇటీవల నేను ప్రారంభించిన కొత్త ప్రాజెక్టు (మైక్రోబడ్జెట్ సినిమాల సీరీస్) ఈ నేపథ్యంలో ప్రారంభించిందే. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న "యురేకా సకమిక" ఈ సీరీస్‌లో మొదటి సినిమా.

సినీ ఫీల్డు పట్ల అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ - భారీ బడ్జెట్లకు భయపడి ఆగిపోయిన ఔత్సాహిక కొత్త నిర్మాతలకు నిజంగా ఇదొక  మంచి అవకాశం. కొత్త వాళ్లతో తీసే యూత్ సినిమాలకు ఇపుడు మంచి మార్కెట్ ఉంది. ఒక మంచి కాన్సెప్టుతో, కొత్తదనమైన ప్రజెంటేషన్‌తో వెళితే ఎలాంటి రిస్కూ ఉండదు.

లేటెస్ట్ టెక్నాలజీపైన అవగాహన, దాన్ని ఉపయోగించి ఫిల్మ్ తీయగల సామర్థ్యం, హీరోలతోనూ, కొత్తవాళ్లతోనూ సినిమాలు చేసి రిలీజ్ చేసిన అనుభవం ఉన్న నాలాంటి ఫిల్మ్ మేకర్స్ సహాయంతో-లేదా-వారి కొలాబరేషన్‌తో, హాయిగా రంగంలోకి దిగిపోవచ్చు. (My direct email: mchimmani@gmail.com)

తక్కువలో తక్కువ, ఒక యావరేజ్ హిట్ ఇచ్చినా కోట్ల వర్షం కురుస్తుంది. ఒక వేళ "ఫట్" అయినా మైక్రో బడ్జెట్ కాబట్టి పెద్ద రిస్క్ ఉండదు. మీరు పెట్టినంతవరకు మీ పెట్టుబడి మీకు సేఫ్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు జీరో రిస్క్!

కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి గట్స్ ఉండాలి. ఫీల్డు పట్ల ఆసక్తి, ప్యాషన్ ఉన్నవారికి ఆ గట్స్ ఎలాగూ ఉంటాయన్నది నా వ్యక్తిగత అనుభవం.

సో, సీ యూ ఆన్ ది సెట్స్!    

Friday 24 May 2013

సినిమాలెందుకు తీస్తారు?


రోజూ రాయాలని ఎంత అనుకున్నా, ఇప్పుడున్న బిజీలో అప్పుడప్పుడూ డుమ్మాలు తప్పటంలేదు, బ్లాగ్‌లో. ఏమైనా సరే ఇవాళ.. ఇప్పుడు.. ఏదో ఒకటి రాసి తీరాలని కూర్చున్నాను. నాకు తెలుసు, ఇంకో అరగంటలో ఈ బ్లాగ్ రాయటం పూర్తిచేసి, ఒక మాంచి ఫోటోతో పబ్లిష్ చేస్తానని.

ఇంత కాన్‌ఫిడెంట్‌గా నేను చెప్పగలగడానికి కారణం.. నాకు "రైటర్స్ బ్లాక్" అనే సమస్య లేదు. పెన్నూ పేపర్ ఎదురుగా ఉన్నాయి అంటే చాలు. బండి ట్రాక్ అదే ఎక్కుతుంది! ఇప్పుడు ఎక్కువగా "నోట్‌బుక్" వాడుతున్నాను కాబట్టి.. జస్ట్, పవర్ ఆన్ చేసి, నెట్ కు కనెక్ట్ అయితే చాలు. బండి ఆటోమాటిగ్గా ట్రాక్ ఎక్కుతుంది.

కట్ టూ పాయింట్ -

'సినిమాలెందుకు తీస్తారు'.. క్యాచీ టైటిల్! రాయనైతే రాశాను కానీ, ఇందులో నేను అనుకున్నది రాయగలిగితే హాపీ. చూద్దాం.

ఒక ఆర్ట్‌గా.. సినిమా మీద పిచ్చి వ్యామోహం ఉన్నవాళ్లని మొదటి కేటగిరీ అనుకోవచ్చు. ఈ కేటగిరీ వాళ్లంతా కేవలం ఈ కళ మీద వారికున్న ప్యాషన్‌ని సంతృప్తిపర్చుకోడానికే సినిమాలు తీస్తారు. వీరికి పేరూ, డబ్బూ అవన్నీ ప్యాషన్ తర్వాతే. దురదృష్టవశాత్తూ వీరి సంఖ్య చాలా తక్కువ. కానీ, ఆ తక్కువ మందిలోనే కొందరు సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అయిన వాళ్లే ఇండస్ట్రీలో మంచి పొజిషన్‌లో కనిపిస్తుంటారు.

ఎంత ప్యాషన్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా.. కొంతమందికి ఎందుకో ఈ ఫీల్డు అచ్చిరాదు. సైంటిఫిక్‌గా  చెప్పాలంటే, ఒక సినిమా తీయడానికి అవసరమైన అన్ని కాంబినేషన్సూ అనుకూలంగా కుదరవు. వీరు అప్పుడప్పుడూ, అలా కనిపించి, చివరికి కొంతకాలం తర్వాత తెరమరుగైపోతుంటారు.  

ఒక ఆర్ట్‌గా కాకుండా, ఒక "షో బిజినెస్‌" గా ఈ రంగాన్ని ఇష్టపడి సినిమాలు తీసేవాళ్లు రెండో కేటగిరీ. ఏ బిజినెస్‌లో రాని పేరు, పబ్లిసిటీ దీన్లో అంత ఈజీగా వస్తుంది. అలాంటి షో కోసం, ఫేమ్ కోసం ఎంటరై సినిమాలు తీసే వాళ్లు ఈ రెండో కేటగిరీ కిందకి వస్తారు.

పైన చెప్పుకున్న సినిమా మీద పిచ్చి ప్రేమతో ఎంటరైన వాళ్ల సంఖ్యతో పోల్చితే, ఈ రెండో కేటగిరీ వాళ్ల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంటుంది.  

కేవలం డబ్బు పాయింటాఫ్ వ్యూలో ఎంటరై సినిమాలు తీసేవాళ్లు మూడో కేటగిరీ. ఈ ఫిలిం మేకర్స్ కేవలం డబ్బు కోసమే సినిమాలు తీస్తారు. వీరికి సినిమా నేది ఒక మామూలు ప్రొడక్టు. ఆ ప్రొడక్టుని ఎలా రూపొందిస్తే మార్కెట్లో బాగా బిజినెస్ చేయవచ్చు అన్నదానిమీద వీరి సినిమాల నిర్మాణం ఉంటుంది.

ఒక రకంగా వీరు డైరెక్ట్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నట్టే లెక్క. ఎందుకంటే, ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా ఆడదో అంత ఖచ్చితంగా చెప్పటం మహా మహా సినీ పండితులకే కష్టం. ఈ కేటగిరీ వాళ్లు చాలా సార్లు పడిలేస్తుంటారు. అయినా అదే ఆట ఆడుతుంటారు. అడిక్ట్ అయినవాళ్లు ఎవరూ ఈ 'ఆట' ని అంత సులభంగా మర్చిపోలేరు!

ఈ మూడో కేటగిరీలోనే ఇంకో సబ్ కేటగిరీ - బ్ల్లాక్ అండ్ వైట్. డబ్బు విషయంలో నలుపుని తెలుపుగానూ, తెలుపుని నలుపుగానూ చేసుకోవడం అన్నమాట. టెక్నికల్‌గా దీని గురించి నేను ఎక్కువగా చెప్పలేను కానీ, ఈ అవసరంతో కూడా సినిమాలు తీస్తారు.

సినిమా రంగంలో కొన్ని ప్రత్యేక ఆకర్షణలున్నాయి. ఫేమ్, డబ్బు.. తర్వాత అందమయిన హీరోయిన్లు, ఆర్టిస్టులు! కేవలం 'సినీ స్త్రీ' వ్యామోహంతో సినీ రంగంలోకి ఎంటరై సినిమాలు తీసేవాళ్లు చివరి కేటగిరీ. పైకి చెప్పక పోయినా, అంతరాంతరాల్లో వీరి టార్గెట్ లైంగిక వాంఛే. ఆ వాంఛ కోసమే వీళ్లు సినిమాలు తీస్తారు. వీరికి సినిమా ఇండస్ట్రీపైన, ఈ బిజినెస్ పైన అవగాహన చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే, ఆ అవగాహన అవసరమని వీరు అనుకోరు. వీరి ఫోకస్ అంతా హీరోయిన్లపైనే!

అంటే - వీరి ఉద్దేశ్యంలో, సినిమాలు తీసేవాళ్లందరికీ హీరోయిన్లు 'ఈజీలీ అప్రోచబుల్" గా అందుబాటులో ఉంటారు. ఇందులో నిజం ఎంతుందో అబధ్ధం కూడా అంతే ఉంది. ఒకడెవడో కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడని, తనను అందులో హీరోయిన్‌గా బుక్ చేస్తున్నాడనీ, ఒక పేరున్న హీరోయిన్ అతని కోరికకి లొంగిపోవల్సిన అవసరం లేదు. అందరూ అలా ఉండరు. అందరి విషయంలో అలా జరగదు. దానికి కొన్ని లెక్కలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఉండితీరతాయి.

ఆ మాటకొస్తే - ఇలాంటి స్త్రీ వ్యామోహాలు అన్ని ఫీల్డుల్లోనూ ఉంటాయి. కాకపోతే, ఒక్కో ఫీల్డులో ఇది ఒక్కో రకంగా ఉంటుంది. సినిమా ఫీల్డు షో బిజినెస్ కాబట్టి, గోరంత ఉన్నా కొండంత చేసి "బ్రేకింగ్ న్యూస్"లు ఇస్తుంటారు. అలా ఇవ్వకపోతే ఏ చానెల్ కూడా బ్రతకలేదు. ఇంకా చెప్పాలంటే, సినిమాల ప్రకటనలు, సినిమా బేస్డ్ ప్రోగ్రామ్‌లు వంటివి లేకుండా ఈ ప్రపంచంలో ఏ పత్రిక గానీ, చానెల్ గానీ బ్రతకడం కష్టం.

సో, చివరాఖరికి చెప్పొచ్చేదేంటంటే - సినిమాలని వివిధ రకాలవాళ్లు వివిధ రకాల కారణాలతో, కోరికలతో తీస్తుంటారు. ఎవరి టార్గెట్లు వాళ్లకుంటాయి. అందరూ వాటిని బయట పెట్టరు. కానీ బయటపడతాయి!

ఇవన్నీ తెలియకుండా మనం.. ప్రేక్షకులం ఏమేమో అనుకుంటూ ఉంటాము. ఎవరెవరినుంచో ఏమేమో, ఎలాంటి సినిమాలనో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ సినిమాలు తీసేవాళ్లకు ఎవరి టార్గెట్లు వారికుంటాయి. ఆ టార్గెట్ల కోసం వాళ్లు పడే కష్టాలు వాళ్లకే తెలుస్తాయి.

బయటికి అంతా బాగానే కనిపిస్తుంటుంది. అలా కనిపించేలా ఉండక తప్పదు. కానీ..  కొన్ని సినిమా కష్టాలు జీవితాల్ని అతలాకుతలం చేస్తాయి. కొన్ని సినిమా కష్టాలు అసలు జీవితాల్నే ముగించేస్తాయి. దట్ ఈజ్ సినిమా!

Monday 20 May 2013

ఆడియో ఫంక్షన్స్ ఇలా కూడా చేస్తారా?


ఇందాకే కృష్ణవంశీ "పైసా" ఆడియో రిలీజ్ ఫంక్షన్ని టీవీలో చూశాను. ప్రారంభం నుంచి చివరిదాకా కాదు. అక్కడక్కడా, అంతా కలిపి ఓ నలభై నిమిషాలు చూశాను. ప్రోగ్రాం నిజంగా వెరైటీగా ఉంది.

ఇక్కడ "డిఫరెంట్"గా ఉంది అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే సినీఫీల్డులో "డిఫరెంట్" అనే పదం తన అసలు అర్థం కోల్పోయింది. ప్రతివాళ్లూ, ప్రతి విషయాన్నీ, ప్రతి చోటా.. మాది డిఫరెంటు, మాది డిఫరెంటు అని చివరికి డిఫరెంటుని ఒక ఎందుకూ పనికిరాని "రొటీన్" చేసేశారు!

నాని, అల్లరి నరేష్, శర్వానంద్, తరుణ్, బ్రహ్మాజీ మొదలైనవారి వెరైటీ బట్ సింపుల్ యాంకరింగ్.. మధ్య మధ్యలో యాంకర్ సుమ (ఒక మంచి కార్పొరేట్ డ్రెస్‌లో) ఎంటరై "ఇంక అంతా మీరే యాంకరింగ్ చేసుకుని, అసలు యాంకర్ని తొక్కేయండి" అని చెణుకులు.. అంతా బావుంది. నిజంగా.

ఎదురుగా స్టేజీ మీద జరుగుతున్న యువతరంగం తతంగాన్ని -  చిరునవ్వులు, నవ్వులు చిందిస్తూ ఎంజాయ్ చేస్తూ, ఆడియన్స్‌లో కూర్చున్న కృష్ణవంశీ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆయన బహుశా ముందే మాట్లాడారో, లేదంటే చివర్లో మాట్లాడారో నాకయితే తెలీదు. నేనా పార్ట్ మిస్సయ్యాను.

కృష్ణవంశీ "మొగుడు" తప్పకుండా ఒక నిన్నే పెళ్లాడతా రేంజిలో హిట్టవుతుందని నేను ఆశించాను. అలా జరగలేదు. కాని, ఎందుకో ఈ "పైసా" మాత్రం తప్పకుండా కృష్ణవంశీ చాలాకాలంగా ఎదురుచూస్తున్న హిట్టునిస్తుందని భావిస్తున్నాను. ఇవాలని మనసారా కోరుకుంటున్నాను.

నా ఉద్దేశ్యంలో, తెలుగులో మనకున్న అతి కొద్దిమంది నిజమైన క్రియేటివ్ డైరెక్టర్లలో ఆయన ఒకరు.

హిట్లూ, ఫట్లూ ఎలా ఉన్నా.. అనవసరమైన అతి చెత్త స్థాయిలో వంశాల పొగడ్తలు, స్టార్ కుటుంబాల ఇంటిపేర్లను, బిరుదులను పదే పదే వల్లిస్తూ చేసే 'వంది మాగధుల తాతల రేంజి' పొగడ్తలు లేకుండా.. చాలా సింపుల్‌గా, వెరైటీగా, బోర్ కొట్టని విధంగా, ముఖ్యంగా ఆడియెన్స్ మస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా "పైసా" ఆడియో ఫంక్షన్ ను డిజైన్ చేసిన పధ్ధతి ఒక కొత్త స్టయిల్‌కు నాంది అయితే బావుండు అని నాకనిపిస్తోంది. అవాలి కూడా.

కట్ టూ "పైసా" మ్యూజిక్ డైరెక్టర్ -

సాయికార్తీక్ ని నేను ఒకసారి.. ఫిలిం నగర్లో ఉన్న ఒక గెస్ట్‌హౌజ్ లో తను సీరియస్‌గా మ్యూజిక్ వర్క్ చేసుకుంటుండగా కలిశాను. అప్పుడు ఆయన నా సినిమాకి చేస్తానన్న బడ్జెట్ వింటే ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు. పైగా నా ముఖం మీదే నవ్వేస్తారు, నావి ఉట్టి కోతలు అంటూ. మళ్లీ ఓ మూడేళ్ల క్రితం శ్రీనగర్ కాలనీలోని ఆయన ఫ్లాట్‌లోనే ఉన్న సొంత మినీ రికార్డింగ్ స్టూడియోలో కలిశాను. అప్పుడు నా సినిమా పాటల్ని అక్కడ రికార్డ్ చేశారు మా మ్యూజిక్ డైరెక్టర్.

ఈరోజు - అదే సాయికార్తీక్‌ని కృష్ణవంశీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా.. ఆయన్ పక్కనే కూర్చుని, తన ఆడియో రిలీజ్ ప్రోగ్రాం ని చూస్తూ చిరునవ్వులు చిందిస్తూండటం చూశాను. ఆ చిరునవ్వుల వెనక ఎంతో శ్రమ ఉంది. ఎన్నో ఏళ్ల పరిశ్రమ ఉంది. అనవసరమైన ఈగోలు లేకుండా, ఒకే లక్ష్యంతో కృషి చేసేవాళ్లు ఎవరైనా, ఎక్కడయినా.. ఏదో ఒక రోజు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు అన్నదానికి తాజా ఉదాహరణ సాయికార్తీక్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్!

కట్ టూ మాస్క్ మ్యూజిక్ డైరెక్టర్స్ -

ఫిలిం నగర్లో, క్రిష్ణా నగర్లో, ఇందిరా నగర్లో, ఇంకా.. ఆ చుట్టుపక్కల నేను ఎందర్నో చూశాను. "సాంగ్ బ్యాంక్"ల మ్యూజిక్ డైరెక్టర్లు, బాత్ రూమ్ రికార్డింగ్ స్టూడియో మ్యూజిక్ డైరెక్టర్లూ, అసలు మ్యూజిక్ లో అ ఆ లు కూడా తెలియని మ్యూజిక్ డైరెక్టర్లూ.. ఇలా ఎందరినో చూశాను. అయితే వీరి విషయం నేను మాట్లాడ్డం లేదు.

కొందరు మ్యూజిక్ డైరెక్టర్లకి టాలెంట్ ఉంటుంది. కాని, దాన్ని ఉపయోగించుకోవటంలో ఎన్నో రకాల ఈగోలు ఫీలౌతారు. కొందరయితే ఇంక ఫిలిం చేయకుండానే "నాది మణిశర్మ రేంజ్" అని చెప్పేస్తుంటారు. కొందరయితే, నేను మణి దగ్గర (అంటే మణిశర్మ!) పని చేసేటప్పుడు చిరంజీవి నన్ను ఇలా మెచ్చుకున్నాడు, అలా మెచ్చుకున్నాడు అని తెగ కోసేస్తుంటారు. కొంతమంది వాళ్లు ఇచ్చే మ్యూజిక్ కి ఒక భారీ రేంజ్ బడ్జెట్ చెప్తారు. అసలు నిజంగా అంత బడ్జెట్ ఉంటే ఈ కొత్త వాళ్లని, కోతలరాయుళ్లని ఎందుకు పెట్టుకుంటారు?

ఇలాంటి వాళ్లకి వంది మాగధులు కూడా ఉంటారు. "అవును.. అంత తక్కువ బడ్జెట్ లో పాటలు చేయగలిగితే.. రెహమాన్, దేవిశ్రీ, మణి, చక్రి, తమన్‌లు అంతెందుకు తీసుకుంటారు" అని కామన్ సెన్స్ లేని ఓ పెద్ద లా పాయింట్ లేపుతారు. చర్చిస్తే ఇదో పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. పుస్తకం కూడా  రాయొచ్చు. త్వరలోనే ఒక ఎట్రాక్టివ్ టైటిల్‌తో సినీఫీల్డుపై నేను రాసి, పబ్లిష్ చేస్తున్న పుస్తకంలో ఈ చాప్టర్ తప్పక ఉంటుంది.

కట్ టూ మై లేటెస్ట్ ఎండి -

నా తాజా చిత్రం "యురేకా సకమిక" కు నేనిప్పుడో కొత్త ఎండీని (మ్యూజిక్ డైరెక్టర్ని) పరిచయం చేస్తున్నాను. సంగీతం అతనికి ప్యాషన్. నాకు కావలసింది అదొక్కటి మాత్రమే. పనికిరాని ఈగోలు, మాస్కులు కావు.  

Sunday 19 May 2013

ప్రతి మనిషికీ రెండో వైపు కూడా ఉంది !


బ్లాగ్ రాయటం కష్టం కాదు. కానీ, నలుగురి గురించి ఆలోచించి బ్లాగ్ రాయాలంటేనే చాలా కష్టం. చిన్నప్పటినుంచీ మనం పెరిగిన వాతావరణంలో మనకు జరిగిన కండిషనింగునుబట్టి.. ప్రతిదానికీ "ఎవరు ఏమనుకుంటారో" అని ఓ తెగ ఇదయిపోతాం.

మొన్న ఒక మీటింగ్ కోసం గ్రీన్ పార్క్ లో కూర్చున్నాము. ఎటు చూసినా - ప్రతి టేబుల్ దగ్గారా ఏదో సీరియస్ డిస్కషన్. అంతలోనే నవ్వులూ, కేకలూ, కేరింతలు!

నిన్న సాయంత్రం మరొక మీటింగ్ కోసం యాత్రినివాస్ లో కూర్చున్నాము. అక్కడా అంతే. ప్రతి టేబుల్  దగ్గరా కొంపలు మునిగిపోతున్న సీరియస్‌నెస్! అంతలో చాయ్‌లూ, డ్రింకులూ, అన్నీ..

ఈ రోజు ఉదయం. మా ఇంటికి దగ్గర్లో ఇరానీ హోటెల్. నేను యూనివర్సిటీలో చదివినప్పటినుంచీ నాకు ఇరానీ హోటెల్ కల్చర్ ఎందుకో బాగా అలవాటయిపోయింది. ఏ మాత్రం వీలున్నా, నేను కంఫర్టబుల్ గా ఫీలయ్యే ఫ్రెండ్ ఒక్కరు ఎవరయినా ఉంటే చాలు .. నేను గబుక్కున ఇరానీ హోటెల్లో దూరిపోడానికే ఇష్టపడతాను.

అక్కడా అంతే! ప్రతి టేబుల్ దగ్గరా ఏదో అలజడి. ఏదో అసంతృప్తి. మళ్లీ అంతలోనే సిగరెట్లూ, చాయ్‌లూ, నవ్వులూ, అరుపులూ, కేకలూ..

కట్ టూ రియాలిటీ -

ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత హ్యాప్పీగా తుళ్లిపడుతూ బయటికి కనిపించినా .. అదంతా నాణేనికి  ఒక వైపే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికీ రెండో వైపు కూడా ఉంది. అవి మానవ సంబంధాల సమస్యలు కావొచ్చు. అప్పులు కావొచ్చు. ప్రొఫెషనల్ చాలెంజెస్ కావొచ్చు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సమస్య అనేది ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ఉంటుంది..ఉండక తప్పదు. ఎందుకటే ఇది లైఫ్.

నిజానికి లైఫ్ చాలా చిన్నది. మనకు తెలిసి ఈ జీవితం ఒక్కటే. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో, ఏమయిపోతారో చెప్పలేని సిచ్యువేషన్స్ వస్తాయి. ఇంత మాత్రం దానికి.. మన మధ్య ఇన్ని ఈగోలు, ఇన్ని అనవసరపు ఫీలింగ్స్, బిల్డప్పులు, పనికిరాని కవరప్‌లూ, మాస్కులూ  అవసరమా?

లైఫ్ చాలా సింపుల్.  మనమే దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం ..

Friday 17 May 2013

ఒక సినిమా, 48 గంటలు


ఇప్పుడు నేను చేస్తున్న "యురేకా సకమిక" తర్వాత..లేదా, ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పని జరుగుతున్న సమయంలో ఒక చిన్న కమర్షియల్ ప్రయోగం చేయదల్చుకున్నాను. అది - 48 గంటల సినిమా. అంటే, ఆ చిత్రాన్ని నేను కేవలం 48 గంటల్లో చిత్రీకరించటం పూర్తి చేస్తాను.

అలాగని, ఇది ఏ ప్రయోగాత్మక సినిమానో, లేదంటే..రికార్డ్ కోసం చేస్తున్న సినిమానో కాదు. పక్కా కమర్షియల్ సినిమా. యూత్ సినిమా. ఒక్కటే పాట ఉంటుంది. ఆ ఒక్క పాట కూడా లేకపోతే ఏమనుకుంటారని పెట్టడం కాదు. ఈ కాన్సెప్టుకి ఒక్క పాట చాలు.

ఈ చిత్రం కోసం ఆల్రెడీ రెండు కాన్సెప్టులు అనుకున్నాను. కాస్టింగ్ గురించి మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. టైమ్ చాలా ఉంది కాబట్టి.

కట్ టూ "బ్రష్ స్ట్రోక్"/"షాట్ బై షాట్" -

ఈ వీకెండ్ నుంచి ఈ బ్లాగులో రెండు కొత్త ఫీచర్లు మొదలెడుతున్నట్టు మొన్ననే రాశాను. ఇప్పుడు నేనున్న బిజీలో ఈ వారం కుదరటం లేదు. వచ్చే వీకెండ్ నుంచి ఈ కొత్త ఫీచర్లు ప్రారంభమౌతాయి.

Thursday 16 May 2013

ఎవరు బాబూ ఈ ఫోన్ కనిపెట్టిందీ?


మొన్న ఆదివారం ఓ న్యూస్‌పేపర్లో నాది ఇంటర్వ్యూ లాంటిది ఒకటి వచ్చింది. సంతోషం. కల్చరల్ డెస్క్ బ్యూరో చీఫ్ అనుకుంటాను..బాగానే కవర్ చేశారు. కాకపోతే నన్ను హైలైట్ చేసే సదుద్దేశ్యంతో ఒకటి రెండు చోట్ల నేను చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువే రాశారు.

ఇదంతా ఓకే. కానీ, ఆ జర్నలిస్టు నాతో ఒక్కమాట కూడా చెప్పకుండా నా మొబైల్ నంబర్ని కూడా బాగా కనిపించేట్టు పబ్లిష్ చేశారు! ఇది నాకు అస్సలు తెలియని విషయం. ఈ విషయం నాకు ఏ మాత్రం తెలిసిఉన్నా, మొబైల్ నంబర్ కు బదులు, నా ఈమెయిలో, లేదంటే నా బ్లాగ్ అడ్రెస్‌నో వెయ్యమని రిక్వెస్ట్ చేసేవాణ్ణి.

కట్ టూ పాయింట్ -

మెయిన్ ఎడిషన్లో వచ్చిన ఇంటర్వ్యూ కదా, ఇక మొత్తం అన్ని జిల్లాలనుంచీ నాకు ఒకటే ఫోన్లూ..ఫోన్లు.

టెంత్ క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి నుంచి, 70 ఏళ్ల తాతయ్య వరకు..దాదాపు అన్ని ఏజ్ గ్రూపులవాళ్లూ నాకు ఫోన్ చేశారు. ఎవరో కొద్దిమంది మాత్రం ప్లెయిన్‌గా కంగ్రాట్స్ చెప్పారు. మిగిలిన అందరూ దాదాపుగా ఒకటే రకమైన దాడి. ముందు కంగ్రాట్స్.. తర్వాత, మీరు ఇప్పుడు తీస్తున్న సినిమాలో నాకు చాన్స్ ఇవ్వండి అనటం. పైగా, "ఎప్పట్నుంచో ఫోన్ చేస్తున్నాను. ఎత్తరేంటీ?!" అని దబాయింపులు కూడా! అదీ మ్యాటర్..

ఇవాల్టికి 5 రోజులు. ఇంకా ఫోన్ల దాడి కంటిన్యూ అవుతూనే ఉంది. సింపుల్‌గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామంటే.. నాకు రోజూ వచ్చే ఎన్నో ముఖ్యమైన్ కాల్స్ మిస్సయిపోతాను. పైగా ఇదే నా మెయిన్ నంబర్!

అయిదు రోజుల్నుంచీ ఇదే పనిష్‌మెంట్ అనుభవిస్తున్నాను. ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో ఈ ఫోన్ల దాడి. చూడాలి.

కట్ టూ ది అదర్ సైడ్ -

సుమారు ఇరవై ఏళ్ల క్రితం నేను కర్నూల్లో ఉన్నాను. అప్పుడు నేను అద్దెకున్న ఇంటి ఓనర్ ఆంటీ నుంచి నాకు కాల్ రావటం, కుశల ప్రశ్నలు వేయటం ఒక ఊహించని ఎక్స్‌పీరియెన్స్. అలాగే మా గురువుగారు, మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోపి ఫోన్ చేయటం..ఆప్యాయంగా మాట్లాడ్డం..ఒక మంచి అనుభూతి. సుమారు 30 ఏళ్ల క్రితం నాటి నా చిన్నప్పటి క్లాస్‌మేట్ ఫోన్ చేయటం, నేను వరంగల్ అలంకార్ థియేటర్లో ఇంగ్లిష్ సినిమాలు తెగ చూసినప్పుడు..నాకు దాదాపు ప్రతి సినిమాలోనూ కలిసిన ఒక కో-ఫిలిం వ్యూయర్ ఫోన్ చేయటం.. ఇవన్నీ ఒక కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే, నాకు రాకూడని ఫోన్లు, లేదా నేను కలలో కూడా ఊహించని కాల్స్ రెండు వచ్చాయి. ఎవరూ 40 నిమిషాలకి తక్కువ మాట్లాడలేదు. వాటిగురించి ఎంతో రాయాలని ఉంది. కానీ ప్రస్తుతం రాయలేకపోతున్నాను. సినిమా చాన్స్ కోసం వస్తున్న వందలాది ఫోన్లు ఇంకో రెండు రోజులుపోతే ఆగిపోతాయి, నాకు తెలుసు. కానీ ఈ రెండు ఫోన్లు ఆగవు. ఇదే కొంచెం టెన్షన్‌గా ఉంది..కొంచెం ఎక్సయిటింగ్‌గా ఉంది..

Wednesday 15 May 2013

అంజెలినా 'మెడికల్ హెక్సింగ్' కు బలయిందా ?


ప్రపంచ సుందరీమణుల్లో ఒకరిగా పిలవబడే హాలీవుడ్ నటి అంజెలినా జోలీ తన రెండు వక్షోజాలని సర్జికల్‌గా పూర్తిగా తొలగించుకుంది! వైద్య పరిభాషలో దీన్ని "ప్రివెంటివ్ డబుల్ మాస్టెక్టమీ" అంటారు.

నిన్నటి న్యూయార్క్ టైమ్‌స్ కు స్వయంగా రాసిన ఒక వ్యాసంలో ఈ విషయాన్ని బహిర్గతం చేసి ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనానికి తెరలేపింది అంజెలినా.

అంజెలినా తల్లి 2007లో బ్రెస్ట్ కేన్సర్‌తో చనిపోయింది. BRCA జెనెటిక్ టెస్ట్ అనంతరం, తనకు కూడా బ్రెస్ట్ కేన్సర్ సోకే అవకాశం 87% ఉందంటూ డాక్టర్లు చెప్పటంతో ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది జోలీ. ఏప్రిల్ 27 నాటికే ఈ మెడికల్ ప్రొసీజర్స్ పూర్తయినా, ఇప్పుడు తనిలా బయటపడటానికి కారణం - ప్రపంచవ్యాప్తంగా తనలాంటి రిస్క్‌తోనే బాధపడుతున్న ఇంకెందరో స్త్రీలు కూడా ఇక మీదట ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరని అంజెలినా ఆలోచన.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు అంజెలినాకుంది. ఆ స్వేఛ్చని ఎవ్వరూ కాదనలేరు. కాని, దాన్ని పబ్లిగ్గా ప్రపంచం ముందు పెట్టడమే ఎన్నో విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా వైద్యరంగం నుంచే!

"బయాలజీ ఆఫ్ బిలీఫ్" పుస్తకం రాసిన డాక్టర్ బ్రూస్ లిప్టన్ వాదన ప్రకారం అసలు 'ఫ్యామిలీ హిస్టరీ' గాని, 'జెనెటిక్ ససెప్టిబిలిటీ' గాని ఇంకా శాస్త్రీయంగా నిరూపింపబడలేదు! అలాంటప్పుడు అంత ఖచ్చితంగా అంజెలినా వక్షోజాలకి కేన్సర్ రావడానికి 87% రిస్క్ ఉందని ఏ డాక్టరయినా ఎలా చెప్పగలడు? ఇలాంటి తప్పుడు సలహా ఇచ్చి, అంజెలినాను మానసికంగా బలహీనురాలిని చేయటంద్వారా ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి వైద్యులే కారణం అంటాడు బ్రూస్.

కేన్సర్ వస్తుందేమోనన్న భయంతో, లేదా కేన్సర్ వచ్చే అవకాశం ఉందన్న డాక్టర్ల సూచనతోనో మన శరీరంలోని ఒక్కో భాగాన్నీ అలా తొలగించుకుంటూ పోలేంకదా?!

ఆరోగ్యంగా ఉన్న శరీరంలోని ఒక భాగాన్ని తొలగించడమంటే - కొత్తగా కొన్నయినా ఆరోగ్య సమస్యలకు స్వాగతం పలికినట్టే అంటే అతిశయోక్తికాదు.

"ప్లేసెబో ఎఫెక్టు" కు వ్యతిరేకంగా "నోసెబో ఎఫెక్టు" అని ఒకటుంది. దీని ప్రకారం, నా ఆరోగ్యం బాగాలేదు అని ఎప్పుడూ అనుకుంటే నిజంగానే ఆరోగ్యం బాగుండదు. నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనలో - ఒక వ్యక్తికి కేన్సరుందనీ, 3 నెలలకంటే ఎక్కువ అతడు బ్రతకడనీ ఒక తప్పుడు డయాగ్నసిస్ రిపోర్ట్ ఆధారం చేసుకుని వైద్యులు చెప్పారు. ఆ పేషెంటు సరిగ్గా 3 నెలలకి చనిపోయాడు. "అటాప్సీ" చేస్తే, అతనికి ఎలాంటి కేన్సర్ లేదని తేలింది! నోసెబో ఎఫెక్ట్ అంటే ఇదే.  

క్రానిక్, ఇంక్యూరేబుల్, టెర్మినల్, 87% రిస్క్.. వంటి పదాల్ని వాడుతూ ఒక రకంగా పరోక్షంగా పేషంట్లకి తీవ్రమైన హాని చేస్తున్నారు వైద్యులు. దీన్నే "మెడికల్ హెక్సింగ్" అంటారు. తెలుగులో దీన్ని వైద్యసంబంధమైన బాణామతి అనవచ్చేమో. అందాల అంజెలినా జోలీ కూడా బహుశా ఇలాంటి బాణామతికే గురై, అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఆ వత్తిడిలోనే, తన అందాల్ని, సూడో సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ టేబుల్ మీది స్టీల్ కత్తులకు ఆహారం చేసింది.

కట్ టూ సూపర్ స్పెషాలిటీ -

ఆధునిక వైద్య విజ్ఞానం ఏ రోగానికయినా చికిత్సను అందించాలి. అసలు రోగాలు రాకుండా చేయగలగాలి. కాని, పరిస్థితి మరోలా ఉంది. ఆరోగ్యంగా ఉన్న మనిషిలోని ఒక్కో అవయవాన్ని స్వయంగా ఎవరికివారే తొలగించేసుకోవాలన్న నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. ఎటు వెళ్తున్నాం మనం?

Tuesday 14 May 2013

ఫిలిం మేకింగ్ మేడ్ ఈజీ!


ఆ మధ్య, నా 'మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్' కాన్సెప్ట్ మీద ప్రత్యేకంగా వేరొక బ్లాగ్‌ని క్రియేట్ చేసి, అందులో కొన్ని పొస్టులు రాశాను. తర్వాత, నా "లెస్ ఫిలాసఫీ" ని అనుసరిస్తూ.. ఒక్క బ్లాగ్‌లోనే ఎన్నయినా రాయొచ్చు. ఏదయినా రాయొచ్చు అని డిసైడ్ అయిపోయి, ఇక ఆ బ్లాగును అలా వదిలేశాను. ఇప్పుడే దాన్ని "అన్ పబ్లిష్" కూడా చేసేశాను.

ఇక, "నగ్నచిత్రం" ఒక్కటే నా బ్లాగ్. నేను ఏం రాసినా దీన్లోనే.

ఇప్పుడు నా మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్ బ్లాగ్ లేదు కాబట్టి, ఆ బ్లాగ్‌లో నేను పంచుకున్న మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన కొన్ని ప్రాధమిక అంశాలతోపాటు, న్యూస్‌నూ, వ్యూస్‌నూ ఇకమీదట ఇదే బ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను.

కట్ టూ మైక్రో బడ్జెట్ ఫిలిం మేకింగ్ -

ఇప్పుడింక సినిమా ఎవరైనా తీయవచ్చు. ఇదివరకులాగా కోటి, లేదా కోట్ల రూపాయలక్కర లేదు. కొన్ని లక్షలు చాలు. ఇంకా చెప్పాలంటే, కొంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్‌తో కూడిన ఒక చిన్న క్రియేటివ్ టీమ్ చాలు. ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ.. అందరూ అదే టీమ్.  

అవును, నమ్మటం కష్టం. కానీ నిజం. ఇప్పుడంతా డిజిటల్ యుగం. ల్యాబ్‌లూ, స్టూడియోలు, ఫిలిం నెగెటివ్‌లూ, ప్రాసెసింగులూ, పడిగాపులూ.. ఆ రోజులు పోయాయి.

కొన్ని లక్షలు చాలు. కేవలం 45 రోజుల్లో ఒక మంచి కమర్షియల్ సినిమా తీయవచ్చు. మరొక 45 రోజుల్లో ఆ సినిమాని ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ చేయవచ్చు. మంచి కథ, కథనంతో ప్రేక్షకులను ఒప్పిస్తే చాలు. సినిమాలు ఆడతాయి. లాభం ఊహించనంతగా ఉంటుంది.

2007 లో వచ్చిన "పేరానార్మల్ యాక్టివిటీ" సినిమా ఈ సంచలనానికి నాంది పలికింది. అతి తక్కువ బడ్జెట్లో తీసిన ఆ సినిమా 655,000% రిటర్న్స్ పొందింది! అప్పటినుంచీ మనవాళ్లకు ఎన్ని రకాలుగా చెప్పినా - ఎన్ని ఉదాహరణలు చూపించినా - వినలేదు ఎవ్వరూ. చివరికి ఒక పేరున్న దర్శకుడు చేసి చూపించాకగాని మనవాళ్లకు విషయం అర్థం కాలేదు.

ఇప్పుడిక అంతా అదే దారి. డిజిటల్ ఫిలిం మేకింగ్ -- DSLR ఫిలిం మేకింగ్.

Monday 13 May 2013

నా బ్లాగ్, మీ ఇష్టం!


"నాక్కొంచెం తిక్కుంది. కానీ, దానికో లెక్కుంది!" ..

గబ్బర్‌సింగ్‌ సినిమాలో డైలాగులాగా, నా బ్లాగ్‌కూ ఓ లెక్కుంది. దాన్ని రాస్తున్న నాకో టార్గెట్టుంది. ఈ టార్గెట్ గురించి ఇదివరకే ఒక పోస్టులో కొంత రాశాను.

ఈ రోజు నుంచీ, ఒక 180 రోజుల్లో, ఈ బ్లాగ్ విజిటర్స్ సంఖ్య 100,000 దాటాలి. దీనికి మీ అందరి సహాయం కూడా కొంత అవసరం. మీకు నచ్చిన పోస్టు ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చకపోతే, ఎందుకు/ఏ కారణం చేత నచ్చలేదో కామెంట్ చేయండి. డీసెన్సీ లేని కామెంట్స్‌ను మాత్రం నేను పబ్లిష్ చెయ్యలేను. ఈ విషయంలో మీ కోపరేషన్‌కి అడ్వాన్సుగా థాంక్స్ చెప్తున్నాను.

మీకు నచ్చిన పోస్టులను వీలయితే మీ ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో/ఫేస్ బుక్ పేజీల్లో/ట్విట్టర్లో/బ్లాగుల్లో ప్రస్తావించండి. లింకివ్వండి. ఈ సహాయాన్ని మీలో కొందరయినా తప్పక చేస్తారని ముందుగానే మీకు "థాంక్స్" చెప్తున్నాను.

కట్ టూ.. బ్లాగులో కొత్త మార్పులు -

> ఇకనుంచీ, ప్రతిరోజూ ఒక పోస్టు రాస్తాను. ఏ రోజయినా మిస్సయితే, పనిష్‌మెంటుగా ఆ మర్నాడు రెండు పోస్టులు రాయాలని నాకు నేను ఒక రూల్ పెట్టుకున్నాను.

> పుస్తకాలు, సినిమాలు, సక్సెస్ సైన్స్ .. ఇవీ నాకిష్టమైన అంశాలు. ఇకనుంచీ, నాకెంతో ఇష్టమైన "సక్సెస్ సైన్స్" పైన కూడా అప్పుడప్పుడూ రాస్తుంటాను.

> బ్లాగులో నా వ్యక్తిగతమైన అనుభవాలు, ఫీలింగ్స్ గురించిన రాతలు మామూలుగా కంటిన్యూ అవుతాయి. కాకపోతే ఇంకొంచెం సీరియస్ విషయాల పైన కూడా ఇకనుంచి రాస్తాను.

> నేను సినీ ఫీల్డులో ఉన్నంత కాలం ఈ సినిమా రాతలు కూడా ఉంటాయి ఎప్పట్లాగే. ఫిలింస్, ఫిలిం మేకింగ్ లో వస్తున్న ఆధునిక పోకడలు, ఆధునిక పరిజ్ఞానం మీద కూడా ఇకనుంచి కొంచెం ఎక్కువగా రాస్తాను.  

> అన్నింటి కంటే ముఖ్యంగా ఈ బ్లాగులో రెండు కొత్త ఫీచర్లు ప్రారంభించబోతున్నాను. అవేంటన్నది మీకు ఈ శని, ఆదివారాల్లో తెలిసిపోతుంది. అంతదాకా కొంచెం సస్పెన్స్! క్లూ ఇమ్మంటారా? ..

బ్రష్ స్ట్రోక్ ..     
షాట్ బై షాట్!

విషయం గెస్ చేసే ఉంటారు. త్వరలో ఈ రెండు ఫీచర్లూ ఎంజాయ్ చేశాక.. మీరు రాసే కామెంట్స్ చదవటం కోసం ఎదురుచూస్తుంటాను.

హావె వండర్‌ఫుల్ ఈవెనింగ్..

Sunday 12 May 2013

బోధివృక్షం క్రింద బిజినెస్‌మేన్!

నా మిత్రుల్లో చాలామంది చాలా విషయాల్లో నిష్ణాతులు. వాళ్లల్లో ఒకడింకా పెళ్లికూడా చేసుకోలేదు. అలాగని, ఏదో ప్లేబాయ్‌లా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడని అనుకోడానికి కూడా లేదు. ఏమో, నేనయితే అలా అనుకుంటున్నాను.  నిజానిజాలు వాడికీ, ఆ పైవాడికీ మాత్రమే తెలియాలి. అయినా అదంతా వ్యక్తిగతం.

అన్నట్టు ఈ మిత్రుడు మంచి కవి, రచయిత కూడా. కానీ రాయడు. వాడికి అదొక రోగం. అదొక టైప్ అన్నమాట!

కవిత్వం, కథలు, స్క్రిప్టులు రాయరా బాబూ అంటే.. మెహర్బానీ కోసం ఇంకా ఏవేవో పనికిరాని పనులు చేస్తుంటాడు. ఈ ఒక్క మెహర్బానీ గుణమే ('గుల' అంటే కరెక్టేమో!) వాడి కొంప ముంచింది. ఇదొక్కటి మినహాయిస్తే, చాలా మంచివాడు. వాడు నిజంగా ప్రయత్నిస్తే సినిమాల్లో బాగా పైకి వస్తాడని నాకు ఇప్పటికీ గట్టి నమ్మకం.

కట్ టూ పాయింట్ -

ఇప్పుడు నేను తీస్తున్న మైక్రో బడ్జెట్ (నిజానికి ఇది అసలు బడ్జెట్టే కాదు!) సినిమాకు సంబంధించి,  ఈ రైటర్ మిత్రుని ద్వారా ఇంకో మిత్రునితో మాట్లాడ్డం జరిగింది, ఒక విషయంలో. "నేను అంత తక్కువలో ఆ పని చేయలేను, సాధ్యం కాదు" అన్నాడతను. అతని స్థాయిని, ఉద్దేశ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. నో ప్రాబ్లం. అతని నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను.

నేనేదో మైక్రో బడ్జెట్లో సినిమా తీస్తున్నానని అతను తన స్థాయిని మైక్రో లెవెల్ కు తగ్గించుకోనవసరంలేదు.

కానీ, దీన్ని ఇక్కడితో వదిలేయకుండా, దీనికి నానా భాష్యాలు చెప్పాడు నా మిత్రుడు. నేను ఎలా "బిజినెస్" చేస్తున్నదీ చెప్పాడు. ముమ్మాటికీ నాది బిజినెస్సేనన్నాడు! నా కళ్లు తెరిపించాడు. నాకు జ్ఞానోదయం కావించాడు.

కట్ టూ .. నాకు తెలిసిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ -

నాకు చాలా దగ్గరగా తెలిసిన ఒక దర్శక నిర్మాత తీసిన ఓ చిన్న సినిమాకు ఇలాంటి ఓ రచయితే పాటలు రాశాడు, అతి కష్టం మీద తన విలువైన టైమ్ అడ్జస్ట్ చేసుకుంటూ! వివిధ కారణాలవల్ల ఆ సినిమా ఆగుతూ, ఆగుతూ పూర్తయి, చివరికి ఎలాగో రిలీజయింది. ఫ్లాపయింది.

సుమారు ఒక అరవై లక్షలు డబ్బు పోగొట్టుకుని ఆ ఫిలిం మేకర్ చావాలా బ్రతకాలా అని ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటే, ఆ రైటర్ ఓడియన్ థియేటర్ నుంచి ఆయనకి ఫోన్ చేసి అడిగే పధ్ధతి ఇలా ఉంటుంది:

"నేను నా లైఫ్ అంతా ధారపోసి మీ సినిమాకు పాటలు రాశాను. థియేటర్ దగ్గర కనీసం ఓ పెద్ద ఫ్లెక్సీ లేదు. ఒక ప్రమోషన్ లేదు, ఏం లేదు. ఏం పట్టించుకోరు. ఏం మనుషులు మీరు!?"

పాపం ఆ ఫిలిం మేకర్ ఎన్నో యేళ్ల తర్వాత, ఇతన్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ పాటలు రాయించుకున్నాడు. వేరే గీత రచయితలు దొరక్క కాదు. ఇతనితో రాయించాలన్న అభిమానంతో! తప్పు ఫిలిం మేకర్‌దే. కో అంటే కోటిమంది అత్యంత సమర్థులైన కొత్త రచయితలు ఫ్రీగా రాయడానికి రెడీగా ఉన్నా, ఈయన్ని రాయమనటం నిజంగా తప్పే.

అప్పుడు అతను పిలిచి ఇచ్చిన అవకాశమే. మళ్లీ ఎందుకో ఇప్పటి వరకూ మరే చిత్రానికీ పాటలు రాయలేకపోయాడు ఆ రైటర్!

కట్ టూ అసలు పాయింట్ -

సమర్థులైన గీత రచయితలు ఎందరో ఫిలిం నగర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పరిచయం చేస్తే చాలు.. వీళ్లు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా పని చేస్తారు. ఇంకా నాకు తెలిసిన సీనియర్లు ఉన్నారు. నా సినిమా కోసం ఎలాంటి సహాయమైనా చేస్తారు. వీరందరినీ కాదని, నేను కూడా, కనీసం ఇంకా పేరుకూడా బయటికి రాని నా మిత్రున్ని వెతుక్కుంటూ వెళ్లి పాటలు రాయించటం "బిజినెస్" ఔతుందని నాకు ఈ బోధి వృక్షం కిందే తెలిసింది!

నేనెప్పుడో ఆలిండియా రేడియోలో పని చేస్తున్నప్పటి పరిచయాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని, నా సినిమాలో రెండవ అతి ప్రాముఖ్యమైన విభాగానికి చీఫ్ టెక్నీషియన్‌గా ఇంకో మిత్రుడిని పరిచయం చేయటం కూడా "బిజినెస్సే"నని నాకు ఈ మిత్రుడి ద్వారానే.. ఈ బోధి వృక్షం కిందే తెలిసింది!

ఒక సినిమాలో అవకాశం దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఒక దశాబ్దం గడచినా ఆ అదృష్టం వరించని వాళ్లు ఎప్పుడూ వేలల్లో ఉంటారు. ఈ కఠోర సత్యం నా మిత్రునికీ తెలుసు. ఆ నిజం అలా ఉంటే, అభిమానంతో పిలిచి అవకాశం ఇవ్వటం నిజంగా బిజినెస్సే!

నా కళ్లు తెరిపించిన నా మిత్రునికి ధన్యవాదాలు చెప్పితీరాల్సిందే. ఇప్పుడు నేను అభిమానంతోనో, ఆబ్లిగేషన్‌తోనో పిలిచి అవకాశం ఇచ్చే బిజినెస్ పూర్తిగా మానుకున్నాను. సినీఫీల్డులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమర్థులు ఎందరో ఉన్నారు. ఇప్పటికే అలాంటివారిని ఎందరినో నేను పరిచయం చేశాను. వాళ్లల్లో చాలామంది ఫీల్డులో మంచి పొజిషన్లో ఉన్నారిప్పుడు. అలా పరిచయం చేస్తే కనీసం కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుపెట్టుకుంటారు. వారు గుర్తుపెట్టుకోకపోయినా నష్టం లేదు. సమర్థులైన వాళ్లను పరిచయం చేసిన తృప్తి ఉంటుంది నాకు. ఆ తృప్తిలోఉన్న కిక్ మరెక్కడా దొరకదు. ఆ కిక్ చాలు నాకు.

Tuesday 7 May 2013

ఏ కెమెరాతో తీశాం అన్నది కాదన్నయ్యా..


ఇండస్ట్రీ చాలా చిత్రమైంది. ఇక్కడ రాజ్యమేలేది రెండే రెండు విషయాలు. ఒకటి - ఈగో. రెండోది - అజ్ఞానం.

ఇండస్ట్రీ అంటే ఇక్కడ టాలీవుడ్ అని మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఇంకెన్ని "వుడ్డు"లున్నాయో అవన్నీ కూడా.

కాన్స్ తో సహా, ఏ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనయినా ఎక్కువగా అవార్డుల పంట పండించుకొనేది చాలా తక్కువ బడ్జెట్‌లో తీసిన "ఇండిపెండెంట్" సినిమాలే. ఇంకా చెప్పాలంటే, "లో బడ్జెట్" సినిమాలు, "నో" బడ్జెట్ సినిమాలు. ఇవే ఎక్కువగా ఏ అంతర్జీతీయ చిత్రోత్సవాల్లోనయినా పాల్గోనేవీ, ప్రైజులు కొట్టేసేవీ.

గోవాలో ప్రతియేటా నవంబర్-డిసెంబర్లలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరుగుతాయి. దీన్నే మనం ఇఫ్ఫీ (IFFI) అనికూడా అంటాం. కేవలం ఈ ఇఫ్ఫీ చిత్రోత్సవాలమీద వ్యామోహంతో నేను దాదాపు ప్రతియేటా గోవా వెళ్తుంటాను.

అంతర్జాతీయంగా ప్రేక్షకుల మన్ననలు, అవార్డులు పొందిన ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు అత్యంత తక్కువ బడ్జెట్ లో  తీసినవే. కొన్ని సినిమాల్లోనయితే, సీన్ జరుగుతుంటే పైన ఒక మూలన మైక్ వేలాడుతూ కనిపిస్తుంటుంది! కావాలంటే ఆ షాట్‌ని రీ-షూట్ చేయవచ్చు. కానీ, ఆర్టిస్టుల నటన ఆ షాట్‌లో బాగుండటం వల్ల..పైన పొరపాటుగా మైక్ అడ్డం వచ్చినా.. ఆ షాట్‌ను అలాగే పెట్టారు. కొన్ని సినిమాల విషయంలో రీ-షూట్ చేయటానికి బడ్జెట్ కూడా కారణం కావొచ్చు. ఇలాంటివి నేను ఎన్నో చూశాను.

అంతర్జాతీయంగా అవార్డులు పొందిన ఇలాంటి వందలాది చిత్రాలన్నీ కూడా అతి తక్కువ బడ్జెట్‌లో దొరికే కెమెరాలతో తీసినవే! ఇంకా చెప్పాలంటే, వీటిలో కొన్ని మామూలు హ్యాండికామ్‌లతో తీసినవి కూడా ఉంటాయి!

ఈ చిత్రాలని చూస్తున్నప్పుడు ఎవ్వరూ వాటిని ఏ కెమెరాతో తీశారు అని చూడరు. నిజానికి ఆ విషయం ఎవ్వరికీ గుర్తుకు రాదు.

కట్ టూ మన పాయింట్ -

ఫిలిం మేకింగ్ లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ముఖ్యంగా టెక్నికల్‌గా. ఇప్పుడసలు సినిమా తీయడంలో "ఫిలిం" అనేదే లేకుండాపోయింది. అంతా డిజిటల్ మయమైపోయింది. ఈ డిజిటల్ ఫిలిం మేకింగ్‌ని  ఆపాలని మొదట హాలీవుడ్‌లో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే - అప్పటికే బిలియన్ల డాలర్లు పోసి కట్టుకున్న ఫిలిం స్టూడియోలన్నీ నష్టాలపాలౌతాయి.

కానీ.. హాలీవుడ్డయినా, చివరికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తలొగ్గక తప్పలేదు.  

మన తెలుగులో ఈ మధ్య విడుదలై విజయఢంకా మోగించిన కొన్ని యూత్ చిత్రాలను డిజిటల్లోనే తీశారు. అదీ కానన్ 5డి కెమెరాతో. అయితేనేం.. ప్రేక్షకులకెవ్వరికీ అది 5డి  కెమెరాతో తీశారా, లేకపోతే ఫిలిం కెమెరాతో తీశారా అన్నది తెలీదు. సినిమా నచ్చింది, ఆడించారు. కావల్సింది కూడా అదేగా!

కానీ, మన ఇండస్ట్రీలకి ఇది మింగుడు పడలేదు. అంత చిన్న బడ్జెట్‌లో.. అలాంటి ఊహించని ఆధునిక పరిజ్ఞానంతో, 5డి వంటి కెమెరాలతో సినిమాలు తీయటం, అవి ఆడటం వారు ఒప్పుకోలేకపోతున్నారు. సినిమా అంటే, భారీ హీరోలూ, భారీ బడ్జెట్లే వారి దృష్టిలో!

ఫలితంగా.. చెన్నైలో అసలు 5డి  తో సినిమాలు తీయటం బ్యాన్ చేశారు! ఇక్కడ మనవాళ్లు 5డి  తో చేసేవాళ్లకి రకరకాల చెక్కులు పెడుతున్నారు. శాటిలైట్ రైట్స్ వాళ్లంతా సిండికేటై అసలు 5డి  తో తీసిన సినిమాలను కొనొద్దు అనుకున్నారట కూడా! అసలు ఇలా తక్కువ బడ్జెట్‌లో తీయడనికి వీలయ్యే 5డి  ఫిలిం మేకింగ్‌ని చెన్నై తరహాలోనే బ్యాన్ కూడా చెయ్యాలనుకుంటున్నారట!

ఇదే గాని నిజమయితే, ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. ఈగో కూడా కాదు.. ఇది నిజంగా మనవారి అజ్ఞానమే ఔతుంది.

భారీ బడ్జెట్‌లో తీసినా, తక్కువ బడ్జెట్‌లో తీసినా.. సినిమా బాగాలేకపోతే దాన్ని వెనక్కి పంపేది ప్రేక్షకులే. మధ్యలో వీరి బాధ ఏంటి?

సినిమాలో విషయం ఉంటే ఆడతాయి. లేదంటే ఆడవు. అసలు రిలీజే కావు. వీరికేంటి బాధ? భారీ బడ్జెట్లో, భారీ కెమెరాలతో తీసినా..అసలు సినిమాలో విషయం లేని చెత్త సినిమాలు ఎన్ని రావటం లేదు? వాటిని ఆపగలుగుతున్నారా?

ఒక్క సినిమాల విషయంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలోనయినా, ఆధునికంగా వచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా ఎవ్వరూ దేన్నీ ఆపలేకపోయారు. ఆపగలిగిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. ఉండవు కూడా. ఏ చట్టం అందుకు ఒప్పుకోదు అన్నది కామన్ సెన్స్.

ఇక్కడ విషయం.. సినిమాను ఏ కెమెరాతో తీశారన్నది కాదు. అది ఎలా ఆడిందన్నదే ముఖ్యం.

Saturday 4 May 2013

ఆప్పుడూ ఇప్పుడూ ఒక్కటే!

ఈ పోస్టు రాయటం వెనక ఎలాంటి దురుద్దేశ్యాలు లేవు. నిజాలు తప్ప ..

నూరేళ్ల భారతీయ సినిమా గురుంచి "నమస్తే తెలంగాణ" వరంగల్ ఎడిషన్లో నిన్న (3 మే, 2013) ఒక మంచి ఇన్‌ఫర్మేటివ్  ఫీచర్ వచ్చింది. నిన్న నేను షిర్డీలో ఉన్నాను కాబట్టి ఆ ఫీచర్‌ను ఆన్‌లైన్లో చదివాను. వరంగల్ జిల్లా నుంచి ఎంతమంది సినీఫీల్డులోకి వచ్చారు.. ఎవరెవరి కంట్రిబ్యూషన్ ఎంత.. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు.. ఇదంతా బావుంది. అదే ఫీచర్లో - పెద్దగా ఏం సాధించకపోయినా, నా గురించి నేనే చదువుకోవడం కూడా ఒక కొత్త అనుభవం.

కట్ టూ పాయింట్ -

ఆ ఫీచర్లో నన్ను నిజంగా ఆకట్టుకున్నది ఇవన్నీ కావు. 1979 లో వరంగల్ వాళ్లు నిర్మించిన ఒక చిత్రం. ఆ చిత్రం పేరు "మంచికి స్థానం లేదు". సుమారు 34 యేళ్ల క్రితం కొంతమంది ఔత్సాహికులు రూపొందించిన ఆ సినిమాను అప్పటి సెన్సార్ అభ్యంతర పెట్టిందట. టైటిల్ మార్చాలని సూచించిందట. ఎంత హాస్యాస్పదం?!

సినిమాలో ఏవయినా అభ్యంతరకరమయిన సీన్లుంటే వాటికి సెన్సార్ అభ్యంతరం చెప్పొచ్చు. కానీ, టైటిల్ మార్చండని చెప్పడానికి సెన్సార్ ఎవరు? అంత ఘోరమయిన టైటిలా అది?? ఏ కోణంలో ఆలోచించినా ఆ టైటిల్ కు అభ్యంతరం చెప్పడానికి లేదు.

ఏవైనా మతకలహాలని ప్రొత్సహిస్తుందా ఆటైటిల్? ఏదయినా కులాన్ని గానీ, వర్గాన్ని గానీ రెచ్చగొడుతుందా ఆ టైటిల్? ఆ టైటిల్లో ఏమయినా సెక్స్ ఉందా? .. అదేమీ కాదు. ఫీచర్లో రాసినట్టు .. అది అప్పటి ఆధిపత్యం, అణచివేత కు పరాకాష్ట తప్ప మరొకటి కాదు.

ఓ పాతికేళ్ల తర్వాత, 2005 లో, కట్ టూ నా స్వీయానుభవం  -

నా రెండో సినిమా కోసం "ఒక్కటి" అన్న టైటిల్ ను రిజిస్ట్రేషన్ కోసం చాంబర్‌కు పంపాను. వాళ్లు అంతా చెక్ చేసుకుని, అప్పటి వరకూ ఎవ్వరూ ఆ టైటిల్ ని ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, నా అప్లికేషన్‌ను తీసుకున్నారు.

సుమారు నెల తర్వాత చాంబర్ నుంచి నాకో లెటర్ వచ్చింది. సాంకేతిక కారణాలవల్ల మీరు అప్లై చేసుకున్న "ఒక్కటి" టైటిల్ ని ఆమోదించటం లేదు. మరేదయినా టైటిల్ ని కొత్తగా అనుకుని పంపించండి, పరిశీలిస్తాం .. అని ఆ లెటర్ సారాంశం.

అప్పటి మా మేనేజర్ (ఇప్పుడు ప్రొడ్యూసర్!) ని "అసలు విషయం ఏంటో కనుక్కో" అని చెప్పి పంపాను. మేనేజర్ చాంబర్‌కి వెళ్లొచ్చాడు.

విషయం ఏంటంటే, అప్పటికే 'ఒక్కడు', 'ఒక్కడే' వంటి టైటిల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి, మీ టైటిల్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందన్న ఉద్దేశ్యంతో ఆమోదించలేదు.. అని చాంబర్ వాళ్ల వివరణ!

నిజానికి అప్పడు వాళ్లు కారణంగా చూపిన ఆ టైటిల్స్ అన్నీ నాకు ఈ రోజు ఖచ్చితంగా గుర్తు లేవు. కానీ, అవన్నీ వ్యక్తిని తెలిపేవే. కానీ నా టైటిల్ అలా కాదు. "ఒక్కటి".. అంటే ఇంగ్లిష్‌లో 'వన్', హిందీలో 'ఏక్'. అసలు నా టైటిల్‌కూ, వాళ్లు చెప్పిన కారణానికీ ఏమైనా సంబంధముందా?

అదండీ విషయం. చాంబర్ మీటింగ్స్‌లో ఫిలిం టైటిల్స్ అనేవి అలా ఓకే చేయబడతాయి. లేదా, అలా రిజెక్ట్ చేయబడతాయి. ఈ స్థాయి మేధోమథనానికి నెలకుపైగా సమయం పడుతుంది!

కట్ టూ TFCC, తెలంగాణా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (Estd in 1941) -

'యురేకా సకమిక' టైటిల్‌ని ఈ మధ్యే రిజిస్ట్రేషన్‌కు పంపాను.. 'లవ్ జస్ట్ హాపెన్స్' అన్న ట్యాగ్‌లైన్‌తో సహా. కేవలం 5 వర్కింగ్ డేస్‌లో అటు చెన్నైలోనూ, ఇటు ఏపి ఫిలిం చాంబర్లోనూ ఈ టైటిల్ అంతకుముందు రిజిస్టర్ కాలేదని కన్‌ఫర్మ్ చేసుకున్నారు. 5వ రోజున నాకు TFCC ఆఫీస్ నుంచి ఫోన్ రానే వచ్చింది. "మీ టైటిల్ 'యురేకా సకమిక' రిజిస్టర్ అయ్యింది. ఎవర్నయినా పంపించండి. సర్టిఫికేట్ బై హ్యాండ్ అయినా ఇచ్చేస్తాం".. అన్నారావిడ.

నా అసిస్టెంట్ బైక్ మీద వెళ్లాడు. తర్వాతి 30 నిమిషాల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో నా ముందు నిల్చున్నాడు!

కట్ టూ నీతి -

పనికిరాని ఈగోనో, పక్షపాతమో ప్రదర్శిస్తూ సతాయించాలనుకుంటే, ఆధిపత్యం చూపాలనుకుంటే ఏ రకంగానయినా చూపవచ్చు. సహాయపడాలి, ప్రోత్సహించాలి అనుకుంటే మరుక్షణమే అలా కూడా చేయవచ్చు. ఇది ఆయా వ్యక్తుల, గుత్తాధిపత్యంలో ఉన్న ఆయా సంస్థల ఎజెండాల మీద ఆధారపడి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త!