Thursday 31 January 2013

అంత సీన్ లేదు!


నిజంగా "విశ్వరూపం" సినిమాలో బ్యాన్ చేయాల్సినంత ఏమీ లేదు. కారణాలు వేరే అని స్పష్టంగా తెలుస్తోంది. ఆ వేరే ఏంటో... ఇంటర్నెట్ బ్రౌజ్ చేసి తెలుసుకోవచ్చు ఎవరయినా. కథలు కథలుగా చెప్పారు. ఆఖరికి, ఆయా వ్యక్తుల ఫోటోలు వేసి, కామిక్స్ లాగా కూడా, పిచ్చి డీటెయిల్డుగా, అసలు కారణం చెప్పారు.

బ్లడీ పాలిటిక్స్! నాకు ఏ మాత్రం పడని సబ్జెక్టు...

హాలీవుడ్‌లో ప్రతి 10 సినిమాల్లో ఒకటి టెర్రరిజం సబ్జెక్ట్ మీద ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మన తమిళనాడుని  ఆదర్శంగా తీసుకుంటే ఇక హాలీవుడ్ లో సినిమాలు తీసినట్టే!

ఈ లెక్కన, బ్యాన్ చేయాలంటే, ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి చూపెట్టి బ్యాన్ చేయవచ్చు.

కట్ చేస్తే -

మన రాంగోపాల్ వర్మ తీస్తున్న "ది ఎటాక్స్ ఆఫ్ 26/11" ఆడియోని ఇంకో 6 రోజుల్లో ముంబైలో రిలీజ్ చేస్తున్నారు. ఆడియో అంటే 6 పాటలు అనుకునేరు! జస్ట్ ఒక్కటంటే ఒక్కటే పాట. ఆ సిన్మాలో ఉన్నది ఆ ఒక్క పాటే. సుఖ్విందర్ సింగ్ పాడాడు. ఇప్పుడా పాటని ఫిబ్రవరి 6 నాడు రిలీజ్ చేస్తున్నారు. దీనికి వెన్యూ ఎక్కడో మీకు తెలుసా?

ముంబైలోని కొలాబాలో ఉన్న ఈటింగ్ జాయింట్ "లియొపోల్డ్ కెఫే" లో!

26/11/2008 నాడు, పాకిస్తానీ టెర్రరిస్టులు ఈ హోటల్ మీద కూడా దాడి చేసి మనుషుల్ని చంపారు. అంత జరిగినా, ఆ హోటల్ యజమాని ఫర్జాద్ తన హోటల్ ను కేవలం 3 రోజుల్లో మళ్లీ మామూలుగా ఓపెన్ చేశాడు! కస్టమర్స్ కూడా కెఫేని "హౌజ్ ఫుల్" చేశారు!! అదీ ముంబైవాసుల స్పిరిట్...

టార్చ్ లైట్ పట్టుకుని వెతికితే ఇందులోనూ ఏదో ఒకటి దొరక్కపోదు... బ్యాన్ చేయడానికి. కానీ ఈ చిత్రం బ్యాన్ కాదు. తమిళనాడులో కూడా బ్యాన్ చేయలేరు. దటీజ్ వర్మ!


Monday 28 January 2013

నిజంగా నేను చింతిస్తున్నాను!


మన దేశపు ఒకప్పటి "హోమ్" శాఖా మంత్రికి స్వంత ఇల్లు లేదు. అంబాసిడర్ కారు కొనుక్కోడానికి ఆయన బ్యాంకు లోన్ తీసుకున్నారు. ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి.

అలాంటి మహోన్నత వ్యక్తిత్వం ముందు ఇప్పుడున్న రాజకీయ నాయకులు, మంత్రులు, సీఎమ్‌లు, పీఎమ్‌లు, ప్రెసిడెంట్లు, గవర్నర్లు ఏపాటి? జస్ట్ పిపీలికామాత్రులు! అంతే..

కట్ చేస్తే -  

ఎన్నడో బ్రిటిష్ పాలన నాటి ప్రెసిడెంట్, గవర్నర్ గిరీలు ఇప్పుడు నిజంగా అవసరమా? తాము తిరగాలనుకున్న దేశాలు తిరగడానికి, వారానికో పది రోజులకో ఏదయినా ఒక ప్రారంభోత్సవం చేయడానికి, రిబ్బన్ కట్ చేయడానికి తప్ప - ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో వీరి అవసరం నిజంగా ఉందా? కేవలం కోట్లకొద్దీ ధనం వృధా చేయటం తప్ప!

ఈ విషయంలో - ఇటీవలి కాలంలో - ఒకే ఒక్క ఎక్సెప్షన్ గురించి ఇక్కడ నేను ఒప్పుకోక తప్పదు. అతని పేరు అబ్దుల్ కలాం. తాను ప్రెసిడెంట్ పదవిలో ఉన్నన్నాళ్లు ఆ పదవికే నిజంగా ఒక అర్థం, పరమార్థం తీసుకురాగలిగాడు.

ప్రజా ధనం వృధా అనగానే గుర్తొచ్చింది...

మొన్నటి వరకూ మన  ప్రెసిడెంటుగా ఉన్న ప్రతిభా పాటిల్ ఆ పదవిలో ఉన్నన్నాళ్లు ఏం చేసిందో నిజంగా నాకు తెలియదు. లెక్క లేనన్ని దేశాలు తిరిగింది. ఇక, తన పదవీ విరమణ చివరి రోజుల్లో అయితే మరింత గొప్ప రికార్డు క్రియేట్ చేసింది. సేషల్స్, సౌత్ ఆఫ్రికాల్లో ఒక 9 రోజులు పర్యటించింది. ఆ పర్యటన దేని గురించో, ఫలితం ఏంటో నాకు తెలియదు. ఆ వివరాల్ని ఏ న్యూస్ పేపర్ గానీ, టీవీ చానెల్ గానీ కవర్ చేయలేదు. చేసుంటే మాత్రం - పాలిటిక్స్ గురించి అతి తక్కువగానయినా ఆసక్తి చూపే నాలాంటి వాళ్ల దృష్టికి కొంతయినా వచ్చేది. అయితే, ఈ పర్యటనకు సంబంధించి అద్భుతమయిన న్యూస్ ఒకటి మాత్రం నేను చదివాను. దాన్నే ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనిపిస్తోంది.

ప్రతిభా పాటిల్ 9 రోజుల సేషల్స్, సౌత్ ఆఫ్రికా పర్యటనకి అయిన ఖర్చు అక్షరాలా 16.6 కోట్లు! ఆ మొత్తంతో కనీసం ఒక పెద్ద ఫాక్టరీని స్థాపించి, ఓ వెయ్యి మందికి ఉపాధి కల్పించవచ్చు. కాదా?

ఇదిగో ఇలాంటి వార్తలే నన్ను అమితంగా కలచివేస్తుంటాయి. ఏదో ఒకటి నా భావాల్ని ఇలా బ్లాగ్ రూపంలో పంచుకోవాలనిపిస్తుంది. కానీ, ఈ బ్లాగ్ లో పాలిటిక్స్‌ని చర్చించటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. పాలిటిక్స్ అంటేనే నాకు పడదు. అయినా, ఇంతకు ముందు "రాజరికం 2013" పేరుతో ఒక బ్లాగ్ పోస్టు రాశాను. ఇప్పుడు ఇది రాస్తున్నాను. ఈ రెండు పోస్టులు రాసినందుకు నిజంగా నేను చింతిస్తున్నాను. ఇక ముందు మాత్రం ఈ పొరపాటు చేయను.

ఆల్రెడీ సినీఫీల్డులో దిగిపోయి, ఇక్కడే పీక్కోలేక చస్తున్నాను. ఇంక పాలిటిక్స్ బురద కూడానా! ఓ... నో!!!



Friday 25 January 2013

సృజనాత్మక ఉగ్రవాదం!

ఎన్డిటీవీ లో న్యూస్ ప్రజెంటర్ సోనియా అంటే నాకిష్టం. అందంగా ఉంటుందని కాదు. అందంగా, అద్భుతంగా న్యూస్ ని ప్రజెంట్ చేస్తుందని...

ఈ సాయంత్రం టీవీలో చానెళ్లను   స్కాన్ చేస్తోంటే సోనియా కనిపించింది. ఠక్కున ఆపాను. ప్రైమ్ టైమ్ న్యూస్ లో కమలహాసన్  "విశ్వరూపం" చిత్రం బ్యాన్ మీద నడుస్తోంది చర్చ. 

కల్చరల్ టెర్రరిజం... క్రియేటివ్ టెర్రరిజం...

ఎర్ర గులాబీలు, ఆకలి రాజ్యం, టిక్ టిక్ టిక్, వసంత కోకిల, అమావాస్య చంద్రుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, అపూర్వ సహోదరులు, మహానది, క్షత్రియ పుత్రుడు, భామనే సత్యభామనే, మైకేల్ మదన కామరాజు, భారతీయుడు, గుణ, హే రామ్, ఈనాడు, దశావతారం... ఇలా ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు.  

ఎన్నుకొనే కథలోనూ, నటనలోనూ - తన ప్రతి చిత్రంలో ఎప్పుడూ నవ్యత కోసం తపించే అద్భుత నటుడు, ఫిలిం మేకర్... కమలహాసన్. భారతీయ చిత్రానికి ప్రపంచస్థాయి నాణ్యతనూ, ఖ్యాతినీ తీసుకురావటానికి తోడ్పడిన అతికొద్దిమంది వేళ్లమీద లెక్కించదగిన సినీ నటులు, దర్శకనిర్మాతల్లో కమలహాసన్ ఒకరు. 

ఆ కమలహాసన్ రచన, దర్శకత్వంలో... 95 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన "విశ్వరూపం" చిత్రాన్ని ఆశ్చర్యకరంగా  తమిళనాడులో బ్యాన్ చేశారు! కారణం: ఆ చిత్రం ముస్లిమ్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగానూ, ముస్లిమ్‌లను కించపర్చేదిగానూ, ఇంకేదో మన్నూ మశానం గానూ ఉందని ఆరోపణ!!

ప్రపంచవ్యాప్తంగా ఇంకొన్ని గంటల్లో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని ఏ ముస్లిం దేశం కూడా బ్యాన్ చేయకపోవటం ఇక్కడ గమనార్హం!  

ఇంకా ఆ సినిమా రిలీజ్ అవలేదు. నిజంగా అందులో అభ్యంతరకరమైనది ఏమిటో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. "నా చిత్రం మీద చేస్తున్న ఆరోపణలు నాకెంతో అవమానకరంగా ఉన్నాయి. నిజానికి నా చిత్రం చూసిన ముస్లిమ్‌లు.. వాళ్లు ముస్లిమ్‌లు  అయినందుకు గర్విస్తారు!" అని స్వయంగా కమలహాసన్ చెప్పినా ఎవరూ వినలేదు.

ఒక్క తమిళనాడులోనే ఆ చిత్రాన్ని బ్యాన్ చేశారు! అంతకుముందు కమల్ తన చిత్రాన్ని డిటిహెచ్ లో రిలీజ్ చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని కూడా పెద్ద రాజకీయం చేసి, లేని సమస్యలు సృష్టించి, ఆ చిత్రం విడుదల వాయిదాపడటానికి కూడా తమిళనాడే కారణమయింది!!  

బాధాకరమయిన విషయం ఏంటంటే - తమిళనాడు కమలహాసన్ పుట్టిన రాష్ట్రం ... 

ముస్లిమ్ దేశాలతో సహా - ప్రపంచం యావత్తూ అభ్యంతరం చెప్పని సినిమాను ఒక్క తమిళనాడు మాత్రమే బ్యాన్ చేసింది!

ప్రధానంగా "విశ్వరూపం" ఒక రెండున్నర గంటల సినిమా. ఆ సినిమా విడుదలయ్యాక, అది చూసి, అందులో నిజంగా అంత తీవ్రమయిన అభ్యంతరాలు ఉంటే అప్పుడు బ్యాన్ కోసం గొడవ చేయొచ్చు. బ్యాన్ చేయించవచ్చు. కనీసం కమల్ నటించిన, నిర్మించిన చిత్రాల ట్రాక్ రికార్డు చూసి అయినా కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించాలి.  

కమలహాసన్‌లో అంత బాధ్యతారాహిత్యం ఉందని నేననుకోను. నిజంగా అలాంటిది ఏదయినా ఉంటే ముందు సెన్సార్ ఆ చిత్రాన్ని బయటికి పంపదు. 

ఇదంతా పక్కనపెడితే - అసలు ఒక వ్యక్తిగా, పౌరునిగా, కళాకారుడిగా తన భావాల్ని స్వేఛ్ఛగా ఆవిష్కరించుకునే హక్కు  కమల్‌కు  ఉంది. ఆ హక్కుని కాలరాసింది తమిళనాడు.   ఈ బ్యాన్ కీ, అంతకుముందటి డిటిహెచ్ వివాదానికీ కూడా కారణం  - కుటిల రాజకీయాలు, స్వార్థపూరిత ఆలోచనలే తప్ప మరొకటి కాదు.  

ఒక సగటు పౌరునిగా, కమల్ అభిమానిగా, ఒక దర్శకనిర్మాతగా కమల్‌కు నా ప్రగాఢ సానుభూతిని ఈ బ్లాగ్ ద్వారా తెలుపుతున్నాను. ఒక్క నేనే కాదు - ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ట్వీట్లు,  ఫేస్‌బుక్  పోస్టులు కమల్ పక్షాన సానుభూతిని తెలుపుతున్నాయి. 

కమల్, మీరు తీసిన "విశ్వరూపం" హిట్టా ఫట్టా అన్నది నాకు అనవసరం. 95 కోట్లు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన మీలోని కళాతృష్ణకు, మీ ఆత్మవిశ్వాసానికీ, గట్సుకీ  నేను "హాట్సాఫ్" చెప్తున్నాను. ఇలాంటి బ్యాన్లు మిమ్మల్ని ఆపలేవు. వాళ్లేదో  బ్యాన్ చేశారు. వాళ్లేంటో  వాళ్ల స్థాయి  ఏంటో  ప్రపంచానికి తెలుపుకున్నారు. రేపు తల దించుకోవాల్సిందీ, సిగ్గుతో చచ్చిపోవాల్సింది కూడా వాళ్లే!  

Tuesday 22 January 2013

మనూటైమ్ ఫిలిమ్ అకాడమీ | MFA

ఎప్పటినుంచో అనుకుంటున్న ఆలోచన ఇది. ఇప్పుడు ఆచరణలోకి తెస్తున్నందుకు ఆనందంగా ఉంది...

చాలా వరకు, ఇంకా చెప్పాలంటే... దాదాపుగా అన్ని ఫిలిం స్కూల్స్ లో జరిగేది ఒక్కటే. థియరీ చెప్పటం, ఒకరిద్దరు సినిమా వాళ్లతో స్పెషల్ గా గంట సేపు క్లాస్ పెట్టి వాళ్ల అనుభవాల్ని చెప్పించటం, ఒక రోజు ల్యాబ్ కి తీసుకెళ్లి అంతా "చూపించటం", ఒక రోజు ఏదయినా ఫిల్మ్ షూటింగ్ ని లైవ్ లో చూపించటం - లేదా - ఒక పాత కెమెరాతో "ప్రాక్టికల్స్" చేయించడం! చివరికి, కోర్స్ సక్సెస్ ఫుల్ గా అయిపోయిందంటూ, సినిమావాళ్ల చేతిమీదుగా ఒక సర్టిఫికేట్ చేతికిచ్చి పంపించటం.

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్... కోర్స్ అయినా సరే ... కొంచెం అటూ ఇటూగా - ఫిలిం స్కూల్ లో నయినా జరిగేది  ఇదే. దీనికోసం మన దగ్గర ఫిలిం స్కూళ్లు తీసుకొనే ఫీజు 4 లక్షలనుంచి 40 వేల దాకా ఉంటోంది!

నిజానికి వాటికున్న పరిమితుల్లో, లేదా... వాళ్లు పెట్టుకున్న పరిమితుల్లో వాళ్లు చేయగలిగింది కూడా ఇంతకుమించి ఏమీ లేదు మధ్య ఒకట్రెండు షార్ట్ ఫిలిమ్లు తీయించి పంపిస్తున్నారు. కొంచెం నయం అన్నమాట. కానీ, తర్వాతేంటి?

మీ టాలెంట్ ను ఎవరు గుర్తిస్తారు? ఎవరు చాన్స్ ఇస్తారు?

ఏళ్లతరబడి స్టూడియోల చుట్టూ, ప్రొడ్యూసర్ల చుట్టూ, హీరోల చుట్టూ, పనికిరాని మీడియేటర్ల చుట్టూ తిరగాల్సిందేనా? చాన్స్ ఇప్పిస్తామంటూ - వంచన చేయటానికే పుట్టినట్టుండే ఎందరో క్రిష్ణా నగర్, ఇందిరా నగర్, గణపతి కాంప్లెక్స్ జీవులకు మీ జీవితాన్ని బలిచ్చుకోవాల్సిందేనా?

ఇంక అవసరం లేదు

మనుటైమ్ ఫిలిమ్ అకాడమీ (MFA) లో కేవలం పదిమందికి మాత్రమే సీట్ ఇవ్వటం జరుగుతుంది. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ లలో శిక్షణ ఉంటుంది. శిక్షణ రెండు రకాలుగా ఉంటుంది:

> మీరు చదువుకోవాల్సిన థియరీ కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో మీకు పంపించటం.

> మేము ఇప్పుడు తీస్తున్న సినిమాలోని యాక్టింగ్/డైరెక్షన్/స్క్రిప్ట్ రైటింగ్ విభాగాల్లో డైరెక్టుగా పని చేయిస్తూ శిక్షణ ఇవ్వటం.

మరో విధంగా చెప్పాలంటే, MFA లో మీరు చేరారు అంటే - కేవలం 6 నెలల్లోనే, స్క్రీన్ మీద టైటిల్ కార్డ్స్ లో మీ పేరు ఉంటుంది. అదే మీకు MFA ఇచ్చే నిజమైన సర్టిఫికేట్! చాన్స్ ముందు, శిక్షణ తర్వాత!!

తర్వాత కూడా, మీ ప్రొఫెషనల్ ఎదుగుదల కోసం ఎలాంటి గైడెన్స్ కావాలన్నా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఒక్క ఈమెయిల్ చాలు. ఒక్క ఫోన్ కాల్ చాలు. ఇప్పటికే 3 సినిమాలు తీసి విడుదల చేసిన నా అనుభవం మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది

ఇంకేం కావాలి

MFA లో సీట్లు కేవలం 10 మాత్రమేయాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ - మూడు విభాగాల్లో, అన్నీ కలిపి, మొత్తం 10 మందిని మాత్రమే చేర్చుకోవటం జరుగుతుంది. చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ, ఇప్పుడు నేను చేస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలో చాన్స్ ఉంటుందిమరిన్నో ఆసక్తికరమైన వివరాలకోసం, ఫీజు వివరాలకోసం నాకు ఈమెయిల్ చేయండి: microbudgetfilms@gmail.com

Sunday 20 January 2013

రాజరికం 2013


"ఇంక వందేళ్లయినా దేశాన్ని గాంధీ-నెహ్రూ వంశమే పాలిస్తూ ఉంటుంది."

సుమారు పాతికేళ్ల క్రితం అనుకుంటాను... ఒక నవల లోనో, ఇంకేదయినా వ్యాసంలోనో ఖచ్చితంగా గుర్తు లేదు.. యండమూరి వీరేంద్రనాథ్ రాశారు మాట.

జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ... ఇప్పుడింక రాహుల్ గాంధీ! మధ్యలో సంజయ్ గాంధీ యాక్సిడెంట్లో చనిపోయాడుగానీ, లేదంటే బహుశా ఆయన కూడా సీన్లో ఉండేవాడు. ఇంక ప్రియాంక గాంధీ, మేనక గాంధీ, ఆవిడ కొడుకు వరుణ్ గాంధీ లు ఎలాగూ ఉండనే ఉన్నారు.  

మధ్య ఒక ఫారిన్ మ్యాగజైన్లో ఒక వ్యాసం చదివాను. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళ గురించిన వ్యాసం. 120 కోట్ల జనాభా ఉన్న ఒక దేశాన్ని తన ఒంటి చేత్తో  కంట్రోల్ చేస్తున్న మహిళ మరెవరో కాదు - సోనియా గాంధీనాకు ఆ వ్యాసంలో గానీ, ఆ స్టేట్‌మెంట్‌లో గానీ... ఎలాంటి అతిశయోక్తి కనిపించలేదు.  వాస్తవంలో జరుగుతున్నది అదే కదా..

మన రాజ్యాంగం ఒప్పుకోలేదు కానీ, లేదంటే - సోనియా ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయ్యుండేది. మన్మోహన్ సింగ్ సీన్లో ఉండేవాడే కాదు. మన్మోహన్ సింగ్‌నే ఎందుకు కావాలనుకున్నారు అసలు? ఆయన్ను మించిన సమర్థులు కాంగ్రెస్‌లో లేరా? ఉన్నారు. కానీ, సమర్థులు సీన్లోకి ఎంటర్ అవుతే రాజరికానికానికే ఎసరొచ్చే సమస్య ఉంటుంది.  కాబట్టి అలాంటి పిచ్చి స్టెప్ వాళ్లు వెయ్యలేదు.

ఇలాంటి రాజరికపు పోకడల్ని మనం పెంచి పోషిస్తున్నంత కాలం మన దేశం ఇలాగే ఉంటుంది. అవినీతి మరింతగా ఎదిగి అకాశాన్ని అంటుతుంది. అలాగని, ఇది కేవలం ఆ ఒక్క వంశానికి సంబంధించిన విషయమే కాదు. రాష్ట్రాల్లోని ఇంకెంతోమంది రాజకీయ నాయకుల వంశాలకూ వర్తిస్తుంది.   

ఢిల్లీ విషయానికొస్తే మాత్రం -

ఎవరి స్వీయ ప్రయోజనాల కోసం వాళ్లు చూసుకొంటూ - ఢిల్లీలో భజన చేస్తున్నంత కాలం, బానిస మనస్తత్వంతో బ్రతుకుతున్నంత కాలం .. ఇంకో వంద ఏళ్లతర్వాత, అంటే, 3013 లో నయినా సరే... నెహ్రూ-గాంధీ వంశమే ఈ దేశాన్ని పాలిస్తూ ఉంటుంది. 

ఎంతో సామర్థ్యం ఉండీ, అనుభవం ఉండీ, అదేపనిగా భజన చేసే మన సీనియర్ నాయకులెందర్నో చూసినప్పుడు నాకు చాలా జాలి కలుగుతుంది. ఎందుకంటే, ఈ భజన కార్యక్రమంలో అందరికంటే ముందుంటున్నది వాళ్లే!

Sunday 13 January 2013

లవ్ ఇన్ మెట్రో!


ప్రపంచంలో చూడదగ్గ 41 గొప్ప ప్రదేశాలతో - 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక గత సంవత్సరం ఒక లిస్టు ప్రచురించింది. అందులో మన హైదరాబాద్ 19 స్థానంలో ఉండటం గొప్ప విషయమే. రేంజ్లో దూసుకుపోతున్నాం మనంఈ బ్లాగ్ చదివాక బహుశా మీకూ అవుననే అనిపిస్తుంది..  

"పబ్లిగ్గా ముద్దుపెట్టుకోవడం" నేరం ఏమీ కాదంటూ డిల్లీ హైకోర్టు పచ్చ జెండా ఊపిందని గత ఏప్రిల్లో  ఒక బ్లాగ్లో చదివానుపై ఫోటో అప్పటిదే!

పదేళ్ల కిందటే నేనీ "లిప్ టూ లిప్" పబ్లిక్ కిస్సింగ్ దృశ్యాల్ని డిల్లీ, ముంబైలలో చూశాను. ఇప్పటికి కల్చర్ మరింత గట్టిపడిపోయుంటుంది. అందులో నో డౌట్. డిల్లీలో బహుశా ఇది మరింత "కామన్" అయిపోయిందేమోలే అనుకుని అప్పటికి సరిపెట్టుకున్నాన్నేను

కట్ చేస్తే -

ఇదే దృశ్యాన్ని నిన్న సాయంత్రం 4 గంటలకు, నేను వెళ్తున్న కారు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు చూసి కొద్దిగా షాక్ అయిపోయాను. అది కూడా రోడ్డు పక్కనో, ఏదో ఒక మూలనో కాదు. సాక్షాత్తూ సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండు చౌరస్తాలో!  

పక్కనే ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు వాళ్ల డ్యూటీలో వాళ్లు బిజీగా న్నారు. బస్సులు, కార్లు, టూ వీలర్లూ, నడిచే మనుషులూ ... ఎవరి రొటీన్ పరుగులో వాళ్లున్నారు. ఇద్దరు ప్రేమికులకు ఇవేవీ పట్టలేదు. అసలు పట్టించుకునే ఫీలింగ్లోనే వాళ్లు కనిపించలేదు! అలాగని, పబ్లిగ్గా వాళ్లు చేస్తున్న  పని ఏమాత్రం ఎబ్బెట్టుగా కూడా కనిపించలేదు.

కొన్ని క్షణాల తర్వాత, ప్రేమ జంటలోని అబ్బాయి వేగంగా రైల్వే స్టేషన్ వైపు కదిలాడు. అతను వెళ్తున్న వైపు ఒక్క క్షణం అలాగే చూసి, అమ్మాయి వేగంగా "బ్లూసీ" వైపు కదిలింది.

నడిరోడ్డుమీద కొన్ని క్షణాలు నేను చూసిన ఓపెన్ 'లిప్ టూ లిప్' ముద్దు సీన్లో నేనెలాంటి అసభ్యత, అసహజత్వం ఫీలవ్వకపోవటం నాకే ఆశ్చర్యమేసింది. యవ్వనం కోరిక ఆపుకోలేక పెట్టుకున్న ముద్దు కాదది... ఖచ్చితంగా. కానీ, 24 గంటలు గడిచినా నేనింకా దృశ్యం గురించే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు బ్లాగ్లో కూడా రాస్తున్నాను

కారణం -

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా - నాలుగు రోడ్ల కూడలిలోఅలా లిప్ లాక్ సీన్లో మునిగి పోయిన ఆ ప్రేమికులిద్దరూ జస్ట్ ఇప్పుడిప్పుడే టీనేజ్ లోకి వచ్చిన పిల్లలు!

ఆక్టోపస్లా అన్నివైపులా కదులుతూ విస్తరిస్తున్న గ్లోబలైజేషన్ పుణ్యమా అని బయటి సంస్కృతిని మనం అనుకరిస్తున్నామా? లేదంటే, కాలంతోపాటు సహజంగానే మన సంస్కృతి కూడా మారిపోతోందా?

Friday 11 January 2013

నిజమైన భక్తులు మన్నించాలి!


పైన టైటిల్ పెట్టకపోతే - బ్లాగ్ పోస్ట్ చదివాక, సిన్సియర్గా అయ్యప్పను కొలిచే భక్తులు నన్ను బాగా తిట్టుకునే ప్రమాదముంది. సో, వారి నిజమయిన భక్తిని గౌరవిస్తూ, ముందే వారికి మాట చెప్పేస్తూ - ఇక టాపిక్లోకి వస్తున్నా .. 

నేను చూసిన ప్రపంచం, నాకు తెలిసిన ప్రపంచం చాలా తక్కువ కావొచ్చు. కానీ, కొంచెం లోనే నన్ను తీవ్రంగా డిస్టర్బ్ చేసిన అంశాలు వందలకొద్దీ ఉన్నాయి. వాటిలో ఒకటి - అయ్యప్ప మాల.

శబరిమలలో - ప్రత్యేకమైన రోజున - దూరంగా కొండ మీద జ్యోతి కనిపించడం వెనకున్నది అయ్యప్ప మహిమా లేక మరొక మానవ క్రీడా అన్నది నేనిక్కడ చర్చించబోవటం లేదుఎదుటివారి నమ్మకం ఒక పాజిటివ్ రిజల్ట్కు, ఒక మంచి జీవన శైలికి తోడ్పడుతుందంటే, నమ్మకాన్ని బేషరతుగా నేను గౌరవిస్తాను. అలా అందరూ గౌరవించాలని కూడా కోరుకుంటాను. ఇంక దాని వెనకున్న, లాజిక్కులు, జిమ్మిక్కుల గురించి తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదు.

తెల్లవారు జామునే చన్నీళ్లతో స్నానం చేస్తూ, నల్ల దుస్తులు (లేదా మరో రంగు దుస్తులు) వేసుకుని, కాళ్లకు చెప్పుల్లేకుండా, వేరుగా వంట చేసుకుని తింటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, మరే ఇతర దురలవాట్ల గురించి ఆలోచించకుండా, రోజుకి కనీసం రెండు సార్లు గుడికో, భజనకో వెళ్తూ .. సుమారు 40 రోజులపాటు కఠోరమైన క్రమశిక్షణతో అయ్యప్ప మాల వేసుకొని దీక్షలో ఉండటం అనేది నా దృష్టిలో చాలా గొప్ప విషయం.

ఎందుకు గొప్ప విషయమంటే - కనీసం 40 రోజులయినా వారు అబధ్ధమాడకుండా - ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ  ఎదుటి వాడిని మోసం చేయకుండా, దోచుకోకుండా, దురాలోచనలు చేయకుండా, న్యాయంగా, ధర్మంగా, సంపూర్ణ మానవత్వంతో స్వఛ్ఛంగా ఉండటం అనేది వారికి మాత్రమే దొరికే అదృష్టం. అదృష్టం అందరికీ దొరకదు. అందుకే ఇది చాలా గొప్ప విషయం.

సగటు మనిషి నిత్య జీవితం లోని వృత్తి వ్యవహారాల్లో ఇది చాలా మందికి, చాలా వరకు సాధ్యం కాని విషయం

 ఇంతవరకూ ఓకే. ఇక్కడ కట్ చేస్తే -

నాకు
తెలిసిన కొందరు భక్తులు ప్రతి యేటా అయ్యప్ప మాల వేస్తారు. వీరిలో కొందరు - కనీసం మాల వేసుకున్న కొద్దిరోజులయినా "మందు" మానేయవచ్చుననే ఉద్దేశ్యంతో వేసుకుంటారు. "జ్యోతి"ని దర్శించి - శబరిమల నుంచి అలా తిరిగి వస్తారో లేదో ... మళ్లీ త్రాగుడు షురూ!

అన్ని రోజుల 'బ్యాక్‌లాగ్‌'ని ఒక్క వారంలో బ్యాలెన్స్ చేసేస్తారు! ఇది నిజం. ఎంత నిజం అంటే - ఆయా వ్యక్తులతో (భక్తులతో) సంవత్సరాలుగా ఇదే టాపిక్ పైన నేను ఇంకా చర్చిస్తూనేవున్నంత నిజం!!  

ఇది
ఇలా ఉంటే - ఒక అగ్ర దర్శకుని ఆఫీసు కాంపౌండులో అయ్యప్ప మాల వేసుకున్న మేనేజర్ గబుక్కున ఒక మూలకెళ్లి సిగరెట్ తాగేస్తుంటాడు. షాకయిపోయి "అదేంటి, మీరు మాల వేసుకుని ఉన్నారు కదా!?" అని అమాయకంగా మనం అడిగితే - "పోండి సార్! అన్నీ ఎలా వీలవుతాయ్? ప్రతి నియమానికీ కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి" అంటాడు!

అదే కాంపౌండులో - మాల వేసుకున్న తండ్రీ కొడుకులిద్దరూ పేకాట టీమ్లో ఎదురెదురుగా కూర్చుని పేకాడుతుంటారు! ఏదో టైంపాస్ కి కూడా కాదు... డబ్బులు పెట్టే!!

ఇంకో అయ్యప్ప భక్తుడు, ఇంకో మూలన, ఒక లేడీ ఆర్టిస్టుతో రొమాన్స్ విషయాలు మాట్లాడుతుంటాడు!

" సినిమా వాళ్లు అంతా ఇంతే" అనుకోవచ్చు. కానీ, ఇవి మాత్రమే కాదు. ఇంతకుమించినవి ఎన్నిటినో, ఇతర ఫీల్డుల్లోని అయ్యప్ప భక్తుల్లో కూడా చూసి ఎన్నోసార్లు డిస్టర్బ్ అయ్యాన్నేనుఒకసారి "గూగుల్" కు వెళ్లండి. "Ayyappa Mala" అని టైప్ చేసి, పైన ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. మీకు కనిపించే వందలాది అయ్యప్ప వీర భక్తుల్ని చూసి మీరే అశ్చర్యపోతారు.

ఇలాంటి మీది మీది భక్తులంతా కూడా - మాల వేసినన్ని రోజులూ - నోరు తెరిస్తే చాలు .. "స్వామి శరణం!" అంటుంటారు - చాలా విచిత్రంగా, అసహజంగానా బాధల్లా ఒక్కటే. వీరి వీరి స్వప్రయోజనాల కోసం, కేవలం ఒక "మాస్క్" గా వాడుకోవటం కోసం ఒక క్రమ శిక్షణకు తోడ్పడే అయ్యప్ప దీక్షకు అనవసరంగా చెడ్డ పేరు తేవడం ఎందుకూ అని...

స్వామి శరణం!!!