Wednesday 29 August 2012

ఆ ఒక్కటీ తప్ప అన్నీ ఓకే!


భారీ చిత్రాల విషయం ఎలా వున్నా, పూర్తి బడ్జెట్ చేతిలో లేకుండా మన టాలీవుడ్ లో నిర్మించే వందలాది చిన్న చిత్రాల నిర్మాణ ప్రక్రియ - ప్రారంభం నుంచీ యమ టెన్షన్ గా వుంటుంది.   

మన సినిమా కథ 'పిచ్చ డిఫరెంట్ గా వుండాలి' అనే సొల్లు కబుర్లకి 'సిట్టింగ్స్' పేరుతో నెలలు గడుపుతారు. డబ్బులు సేకరించుకోడానికి నెలలు గడుపుతారు. ఆఫీసులో కొత్త ఆర్టిస్టుల సెలక్షన్ కీ నెలలు గడుపుతారు. హీరోయిన్ కోసం ముంబై వెళ్లి కనీసం అక్కడా ఒక పది రోజులు గదుపుతారు. ఆఫీస్ కి  కావల్సిన ఫర్నీచర్, డస్టుబిన్ను , చీపురు షాపింగ్ కి కూడా 'డే వన్' నుంచీ క్రియేటివ్ టీం తిరగాల్సిందే.

వీటన్నింటికీ ఇంతింత టైం  కెటాయించే మన టాలీవుడ్ కు - సినిమా విజయానికి అత్యంత ప్రధానమయిన స్క్రిప్టు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అస్సలు టైం వుండదు!   అందర్నీ సెలక్ట్ చేసుకొని, షూటింగ్  డేట్స్ ఫైనల్ చేసుకున్నాక, హడావిడిగా స్క్రిప్ట్ రాసే పని అప్పుడు ప్రారంభమవుతుంది. అప్పుడు రచయిత-కం-దర్శకునికి దొరికే సమయం ఎంత వుంటుంది? ఎంత గొప్పగా రాయగలడు? తెరవెనుక వాస్తవం ఇలా వుంటే - సినిమాలు ఆడమంటే ఇక ఎలా ఆడతాయి?

Monday 27 August 2012

టిట్ బిట్స్


ఇప్పుడిదంతా ఫేస్ బుక్కులూ, ట్విట్టర్ల యుగం...

షార్ట్ కట్ లో రెండు వాక్యాలు, కుదిరితే ఒక బొమ్మ! అంతకు మించి పోస్ట్ చేసే సమయం ఎవరికీ లేదు. చదివే సమయం, ఓపికా నెట్ యూజర్లకు అసలే లేదు.

అందుకే - ఇకనించీ  ఈ బ్లాగ్ లోని పోస్టులన్నీ సాధ్యమయినంత చిన్నగా వుంటాయి. మరోవిధంగా చెప్పాలంటే - సినీ ఫీల్డుకు సంబంధించి  నేను రాయాలనుకొన్న అవే నగ్న సత్యాలు - కొంచెం చిన్నగా, 'టిట్ బిట్స్' సైజులో వుంటాయి.

సో, నో వర్రీస్! మీ సమయం విలువేంటో నాకు తెలుసు. ఎంజాయ్ నగ్నచిత్రం టిట్ బిట్స్!

Sunday 26 August 2012

నీటిమూటలు


సినీ ఫీల్డులో 'హామీలు' అనేవి చాలామటుకు వట్టి నీటిమూటలు. బై మిస్టేక్, ఎవరైనా అలా హామీలను నమ్మారు  అంటే .. అంతకంటె పెద్ద పొరపాటు ఇంకొకటి ఉండదు. జీవితాలే అల్లకల్లోలమైపోతాయి.

నాకు తెల్సిన ఒక దర్శకుడు ఏదో ఒక చిన్న చిత్రానికి తనే నిర్మాతగా కూడా మారాల్సివచ్చింది. అదే పెద్ద తప్పు. దాన్ని మించి ఇంకో పెద్ద తప్పు చేశాడు ఆ దర్శకుడు . తన దగ్గర అంతకు ముందు ఒక చిత్రానికి పనిచేసిన ఒక వ్యక్తిని స్నేహితునిగా మనసా వాచా నమ్మాడు. అతనికి ఏదో 'బాగా' తెలుసు అనుకున్నాడు. అదే అతను చేసిన పొరపాటు.

తప్పు, తను నమ్మిన ఆ అవతలి వ్యక్తిది కాదు. అసలు అలాంటి ఫూలిష్ నిర్ణయం తీసుకొన్న ఆ దర్శకునిది.

ఆ దర్శకుడు అంత పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకోడానికి కారణం -  అవతలి వ్యక్తి ఇచ్చిన హామీలు! ఫీల్డు లోని 24 క్రాఫ్టుల్లో అతనిదో క్రాఫ్టు. ఈ క్రాఫ్టు వారికి, సాధారణంగా ప్రాజెక్టులో  ఎవడు ఎలా చచ్చినా వీరికి ఎలాంటి నష్టం ఉండదు. పర్సెంటేజి పధ్ధతిలో ఫుల్లుగా క్యాష్ ఫ్లో ఉండే విభాగం అన్నమాట. అయినా సరే అతన్ని ఒక మిత్రునిగా ఆ కొత్త దర్శకుడు బాగా నమ్మాడు. అవతలి వ్యక్తి ఇచ్చిన హామీలు అలాంటివి!

ఆ వందలాది హామీల్లో అతను ఒకే ఒక్క హామీని నమ్మాడు. అతనిచ్చిన ఆ హామీ సారాంశం క్లుప్తంగా ఇది:

"సార్! మీరు ఈ సిన్మాకి ఎంతయినా ఖర్చు పెట్టండి. సినిమా ఎలాగయినా తీయండి. ఆఖరికి ఒక అత్యంత చెత్త సినిమా తీసి, ఆ డబ్బా నా ముఖాన కొట్టినా సరే... మీరు ఈ సినిమాకి ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా నా టాలెంట్ తో వెన్నక్కి తెస్తాను. అలా చెయలేని పక్షంలో - ఎట్ లీస్ట్ .. ఒక 50%  బడ్జెట్ అయినా నేను మీకు వచ్చేలా చేస్తాను. మీ డబ్బు ఎక్కడికీ పోదు..."

పాపం ఆ దర్శకుడు ఒక్కటే నమ్మాడు. ఒకవేళ  సినిమా కిందా మీదా అయినా కూడా ఈ వ్యక్తి కనీసం 50% వెనక్కి తెస్తాడు కదా అని!

ఆ సినిమాకి అయిన ప్రతి పైసా ఆ వ్యక్తి ద్వారానే ఖర్చు అయ్యింది. అతనికి డబ్బు ఇవ్వటమే తప్ప, ఏ రోజూ లెక్క అడగలేదు. క్రాస్ చెకింగ్ చేసుకోలేదు. అదీ ఆ దర్శకుని స్థాయి.

సినిమా పోయింది. (ఎలా పోయింది..ఎలా రిలీజ్ అయింది..ఆ స్టేజిలో ఎవరెవరు ఎలా లాభపడ్డారు.. ఇదంతా ఇంకొక ఎపిసోడ్ అవుతుంది!) ఒక్క పైసా వెనక్కి రాలేదు. అయినా ఆ దర్శకుడు యెప్పుడూ ఒక్క మాట ఆ వ్యక్తిని అనలేదు. కనీసం ఆ వ్యక్తి తనకు ఇచ్చిన హామీని కూడా ఎన్నడూ గుర్తు చేయలేదు. అతన్ని ఒక్క పైసా లెక్క అడగలేదు.

కానీ, ఆ వ్యక్తి మాత్రం తన బిల్డప్ కోసం ఇండస్ట్రీ అంతా ఒక విషయం బాగా ప్రచారం చేసుకున్నాడు. "నేను ఎంతో చెప్పాను. వినలేదు. కొత్తవాళ్లతో సినిమా తీస్తే ఏమవుతుందో తెలియదా? ఫ్రీగా పని చేశాను. నా టైం వేస్ట్ అయ్యింది. నా  స్వంత డబ్బు కూడా చాలా పెట్టాను. అదీ పోయింది. ఇంక ఎవడికీ చాకిరీ చెయ్యొద్దు! బాగా బుధ్ధి వచ్చింది!!" ...అని.

ఆ వ్యక్తి డబ్బు పెట్టాడో లేదో ఆ దేవునికి, అతనికి మాత్రమే తెలుసు. అతన్ని నమ్మి, అన్ని లక్షలు చేతుల్లో పోసిన ఆ దర్శక మిత్రునికి మాత్రం తనే అప్పు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగాడు ఆ వ్యక్తి!

అయితే  - ఇక్కడ విషయం డబ్బు కాదు. మాటకు ఉండే విలువ. ఒక హామీ ఇచ్చాము  అంటే దాన్ని
నిలుపుకోగలగాలి. అలా సాధ్యం కానప్పుడు, ఆ వాస్తవం ఒప్పుకొనే నిజాయితీ ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు -  అసలు హామీలు ఇవ్వకూడదు. తన స్వల్పకాలిక స్వార్థంకోసం ఏదో అలా ఇచ్చే 'హామీ' తనను నమ్మి అంత డబ్బు అప్పుగా తెచ్చి పెట్టిన ఆ దర్శకుని జీవితాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో ఆలోచించగలగాలి. ఆ మానవత్వం మనుషులకు అవసరం.

కానీ, దురదృష్టవశాత్తు సినీ ఫీల్డులో ఇలాంటి మనుషులే ఎక్కువ. అమాయక 'బకరా'లు ఇలాంటి వ్యక్తులనే మళ్లీ మళ్లీ నమ్ముతారు. వారిచ్చే కొత్త హామీలను కొత్తగా నమ్ముతారు. కొత్తగా మోసపోతారు.

ఇంతకూ ఈ ఎపిసోడ్ లో తప్పు ఎవరిది? మనస్పూర్తిగా అవతలి వ్యక్తిని నమ్మిన దర్శకునిదా, లేదంటే నమ్మించిన ఆ అవతలి వ్యక్తిదా??

తప్పు ఎవరిది అయినా - ఆ దర్శకుడు  మాత్రం ఆ సినిమా కోసం తను బయట తెచ్చిన అప్పులకు ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నాడు.

దటీజ్ సినిమా!

Friday 24 August 2012

జూదం

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం...

సినిమా ఒక అద్భుతమైన కళ నిజమే. కానీ ఇది ఒక వ్యాపారం. ఒక జూదం. కొంచెం అటూ ఇటూగా, మహాకవి శ్రీ శ్రీ ఇదే అన్నారు.  నా పుస్తకం 'సినిమా స్క్రిప్టు రచనా శిల్పం' లో దీన్ని ఎక్కడో 'కోట్' చేసినట్టు కూడా గుర్తు.

ముఖ్యంగా సినీ ఫీల్డు లో వున్నవాళ్లు - వున్నామని అనుకొనే వాళ్లు - ఇప్పటికి ఫీల్డులో లేకపోయినా, ముందు ముందు ఎలాగయినా సరే ఎంటరయి 'ఫీల్డులో వుండాలని' అనుకొనే వాళ్లు .. ఎవ్వరూ ఈ నిజాన్ని ఒప్పుకోరు. కానీ, వాస్తవం మాత్రం ఇదే.

ఒక నిర్మాత యాంగిల్లో చూసినా, ఆర్టిస్టుల కోణంలో చూసినా, టెక్నీషియన్స్ దృష్టిలో చూసినా ఇదే నిజం. సినిమా ఒక జూదం...

ఇక - సినిమాతో ఎలాంటి సంబంధంలేని బయటివారి కోణంలో చూస్తే  పరిస్థితి  అత్యంత దారుణం. దాదాపు 90 శాతం మంది దృష్టిలో సినిమా అనేది ఒక అంటరాని.. అసహ్యకరమయిన వస్తువు! సినిమాతో కొంచెమయినా లింకు వున్న 'సినిమా వాళ్లు'  అంటే 90 శాతం మందికి ఒక రకమయిన చెత్త అభిప్రాయం వుంటుంది. 'సినిమా వాళ్లని నమ్మొద్దు' అని ముఖం మీదే అనేస్తారు మాత్రం  మొహమాటం లేకుండా!

అయితే - 90 శాతం మందికికూడా  - టీవీ చానెల్ పెట్టినా సినిమాలే కావాలి. న్యూస్ పేపర్, మ్యాగజైన్ తిరగేసినా సినిమా వాళ్ల న్యూస్, సినీ హీరోయిన్ల బొమ్మలే కావాలి. అవి లేకుండా  వారి జీవితం జీవితం కాదు. వారు బ్రతకలేరు!!

అయితే - సినిమా మీదా, సినిమా వాళ్ల మీదా అభిప్రాయం ఇప్పటికిప్పుడు పుట్టిందికాదు. సినిమా పుట్టినప్పట్నించీ వుంది. 60 యేళ్ల కిందటే  ఒక అగ్రశ్రేణి నటుడు సినిమా హీరో అయిన పాపానికి నీకు  'పిల్లనివ్వం ఫో' అన్నారట! ఇప్పుయితే - 'సినిమా వాళ్లు' అయిన పాపానికి సింపుల్ గా 'ఇల్లు అద్దెకివ్వం ఫో' అంటున్నారు!! 
బయటవాళ్లు అనటం కాసేపు పక్కన పెడదాం. అసలు మనమే చాలా సందర్భాల్లో మన సినిమా నేపథ్యం చెప్పుకోడానికి ఇబ్బంది పడతాం.

అసలు ఎందుకని ఇలాఇదేమయినా 'ప్రొహిబిటెడ్' ప్రొఫెషనా? కాదు. మరి ఇలాంటి ఇబ్బందికరమయిన పరిస్థితి సినిమాకు, సినిమా వాళ్లకు ఎందుకు?? 

ఎందుకంటే ఇదొక జూదం కాబట్టి. ఇక్కడ దేనికీ గ్యారంటీ వుండదు కాబట్టి...

ఇండస్ట్రీకి వున్న ఒకే ఒక్క లక్షణం ...  ఇండస్ట్రీలోని ఎంతోమంది చేత ఎన్నో అబధ్ధాలు చెప్పిస్తుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చేయిస్తుంది. ఎన్నో మోసాలకు, వెన్నుపోట్లకు కారణమవుతుందిఎంతోమంది జీవితాలు, కుటుంబాలు రోడ్డునపడ్డానికి కారణమవుతుంది. ఇండస్ట్రీలో కష్టసుఖాలు పంచుకొంటూ, సహజీవనం చేయాల్సిన తోటి మనుషులను నిలువునా ముంచి - లేదా దారుణంగా  వంచించి  - అలా రోడ్డునపడేసేవాళ్లు, నాశనం చేసేవాళ్లూ కూడా సినిమా వాళ్లే కావడం అత్యంత దురదృష్టకరం!

కట్ టూ ఒక వాస్తవం -

ఎన్నో వ్యాపారాల్లాగే సినిమా కూడా ఒక మంచి వ్యాపారం. ఒక మంచి అవగాహనతో, ప్రణాళికతో, ఎలాంటి హెచ్చులకు పోకుండా సినిమాలో పెట్టుబడి పెట్టిన ఎవ్వరూ ఇంతవరకు నష్టపోలేదు.

మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మార్కెట్ అంచనాలకు మించి ఖర్చుపెట్టడం, ఇతర ఆకర్షణలకు లొంగిపోవటం, బానిసవ్వటం వంటివి మాత్రమే ఇక్కడ నష్టానికి దారితీస్తాయి. ఇవన్నీ బయటి ప్రపంచానికి తెలియవు.

మారిన లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు సినిమా బిజినెస్‌ని మరింత ఓపెన్ చేసేసింది. ఇప్పుడు ఎవ్వరయినా సినిమా తీయవచ్చు. ఏదీ ఇక్కడ ట్రేడ్ సీక్రెట్ కాదు. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా - మార్కెట్ వాల్యూకి లోబడి ఖర్చుపెట్టిన ప్రతిపైసా నూటికి నూరు శాతం తిరిగివస్తుంది. దాన్ని మించి ఎన్నో రెట్లు లాభం కూడా వస్తుంది. అది ఎన్ని రెట్లు అన్నది ఆ సినిమా నడిచిన రేంజ్‌ను బట్టి ఉంటుంది.  

ఈ నిజాన్ని గుర్తించాయి కాబట్టే, ఇప్పుడు రిలయెన్స్ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఎన్నో డైరెక్టుగా ఫీల్డులోకిదిగాయి! ఇప్పుడు సినిమా ఒక కార్పొరేట్ బిజినెస్.

Tuesday 21 August 2012

ఎందుకు?

ఇప్పటికిప్పుడే అనుకొని.. ఇప్పుడే ప్రారంభించాను ఈ బ్లాగ్ ని. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశిస్తూ ఈ బ్లాగ్ ని క్రియేట్ చేయటం జరిగింది. అది .. ఎలాంటి మాస్కులు లేకుండా, షుగర్ కోటింగ్ లేకుండా, సెలెక్టివ్ గా  సినీఫీల్డుకు సంబంధించిన కొన్ని అంశాలమీద 'నేకెడ్' నిజాలు రాయాలని.

ఫీల్డు గురించి తెలియని కొత్తవారికీ, ఫీల్డులోనే వుండీ ఇంకా భ్రమల్లోనే బ్రతుకుతున్న పాతవారికీ ఈ నిజాలు కొంతయినా ఉపయోగపడాలనీ నా ఉద్దేశ్యం.

'నగ్నచిత్రం' టైటిల్ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఉంటుంది, నాకు తెలుసు. కాని, నా ఉద్దేశ్యంలో ఈ టైటిలే ఈ బ్లాగ్ కు సరిగ్గా సరిపోతుంది. అఫ్కోర్స్ , కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. అంతే తప్ప మీరు అనుకొనే 'నగ్నం' ఏదీ ఇందులో ఉండదు. అలాగే .. అనవసరమైన సుత్తి, పేజీలకు పేజీల రాతలు  కూడా ఇందులో ఉండవు. అంత టైం ఎవరికీ లేదు అన్న నిజం నాకు బాగా తెలుసు.

ఫీల్డుకు సంబంధించిన వివిధ శాఖల్లో పనిచేసిన, ఇంకా చేస్తున్న కొంతమంది ప్రముఖుల ఇంటర్వ్యూలు కూడా ఈ బ్లాగులో ఉంటాయి. రెగ్యులర్ గా కాదు, అప్పుడప్పుడూ. ప్రముఖులు కానివారి ఇంటర్వ్యూలు కూడా ఉండొచ్చు. ఉండే అవకాశం చాలా ఉంది.

మరొక విషయం. ఈ బ్లాగులో రాసే రాతలు ఎవరినీ ఉద్దేశించి రాసేవి కావు. అలా రాయటం నా ఉద్దేశ్యం కాదు కూడా. ఫీల్డులో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పటమే నా ఉద్దేశ్యం.

సో, సినీ ప్రేమికులందరికీ ఇదే నా ఆహ్వానం. ఆప్పుడప్పుడూ విజిట్ చేయండి. నచ్చిన పోస్టులను మీకు నచ్చినచోట లింక్ చేయండి. థాంక్స్ ఇన్ అడ్వాన్స్ !...