Saturday, 18 March 2017

అసలు సినిమా ఇలా ఉంటుంది!

నా మొదటి సినిమాలో ఒక మంచి విలన్‌ను ఫుల్ లెంగ్త్ రోల్‌లో పరిచయం చేశాను.

అతను నిజంగా చాలా మంచి యాక్టర్. చాలా బాగా చేశాడు.

నేననుకున్న కథ ప్రకారం సినిమా చివర్లో కూడా హీరోకంటే ఎక్కువ వెయిటేజ్ ఆ కేరెక్టర్‌కు ఇచ్చాను.

ఇలా చేయడం వల్ల నేను ఆ విలన్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని అప్పట్లో ఆ చిత్రంలోని హీరో అనుకోవడం, అనడం కూడా జరిగింది.

హీరో నేనూ గుడ్ ఫ్రెండ్స్. అది వేరే విషయం.


కట్ చేస్తే - 

ఇప్పుడా విలన్ మంచి పొజిషన్‌లో ఉన్నాడు. నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటుడు కాబట్టి నాకు నిజంగానే సంతోషంగా ఉంటుంది. ఆ నటునిపట్ల, అతని నటనపట్ల నా అలోచన మారదు. గౌరవం మారదు.

ఇంతకు మించి నేను ఆలోచించను. వేరే ఆశించను.

మొన్నొక మిత్రుడు చెప్పాడు. ఆ నటుని ఇంటర్వ్యూ ఒక దినపత్రిక ఆదివారం ఎడిషన్లో వచ్చింది. ఎవరెవరి గురించో చెప్పాడు కానీ .. తొలి అవకాశం ఇచ్చి, ఇండస్ట్రీకి  పరిచయం చేసి, అంత పూర్తిస్థాయి విలన్ రోల్ ఇచ్చిన నీ పేరు చెప్పలేదు ఆ నటుడు అని.

నేను నవ్వాను.

ఇదంతా ఉట్టి ట్రాష్. అసలు పట్టించుకోకూడదు.

ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు.

అసలు సినిమా అంటేనే ఇది.   

Sunday, 12 March 2017

జీవితం చాలా చిన్నది!

ఫేస్‌బుక్, బ్లాగ్ నుంచి కొద్దిరోజులు పూర్తిగా బ్రేక్ తీసుకుందామనుకుంటున్నాను. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవరకు.

ఇలా ట్వీట్ పెట్టడం ఆలస్యం .. మళ్లీ వెంటనే ఇంకో ట్వీట్ పెట్టాను:

"నా ఫేస్‌బుక్, బ్లాగ్‌ల డియాక్టివేషన్ ఈ అర్థరాత్రి నుంచే అమలు!"
నా టీమ్‌కు, నేను అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమైనవారికి మాత్రం ఫోన్‌లో అప్పుడప్పుడూ అందుబాటులో ఉంటాను .. అని.

అదీ మ్యాటర్.

ఫేస్‌బుక్ మీద నాకు అంత విరక్తి వచ్చేసింది!

అసలు దానిమీద విరక్తి అనేకంటే, నాకే జ్ఞానోదయమైంది అనుకోడం బెటర్.

ట్విట్టర్‌తో అంత టైమ్ వేస్ట్ కాదు. అదొక్కటి మాత్రం అలా కొనసాగిస్తాను. మీడియాలో ఉన్నంతకాలం అదొక్కటయినా ఉండకపోతే కష్టం.

స్ట్రగుల్ ఫర్ ఎక్జిస్టెన్స్!

పైగా, ఫేస్‌బుక్ లాగా ట్విట్టర్ అంత బోరింగ్ కాదు.

ఒక్క ట్వీట్‌తో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యొచ్చు. బాగా తిట్లు కూడా తినొచ్చు.

అది వేరే విషయం.

త్వరలోనే నా ఫేవరేట్ నోకియా 3310 తీసుకొని, వాట్సాప్‌లకు, యాండ్రాయిడ్‌లకు కూడా మెల్లిగా గుడ్ బై చెప్పాలని కోరిక.

ఇవన్నీలేని పాతరోజులే బాగున్నాయి. నిజానికి, అప్పుడే ఇంకా హాప్పీగా ఉన్నాను.

అసలిదంతా ఎందుకు అంటే .. నేను పూర్తిచేయాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయి. రోజుకి ఒక 40 నిమిషాలు, గంటయినా సరే .. ఫేస్‌బుక్‌కు కెటాయించలేను.

జీవితం చాలా చిన్నది.

గొప్పది కూడా.

ఇప్పుడు నాకదే ముఖ్యం. 

Saturday, 11 March 2017

ది లేటెస్ట్ బిగ్ బిజినెస్!

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.

ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

సరైన మార్కెట్ స్టడీ,  అవగాహనతో ప్లాన్ చేసి సినిమా తీస్తే ఎలాంటి నష్టం ఉండదు. లాభాలు కోట్లలో ఉంటాయి. అవగాహన లేకుండా వేసే స్టెప్పులు, తీసుకొనే నిర్ణయాలు మాత్రమే ఇక్కడ పనిచేయవు.

అది ఇక్కడనే కాదు. ఏ బిజినెస్‌లోనైనా అంతే.

చిన్న బడ్జెట్ సినిమా అయినా, పెద్ద బడ్జెట్ సినిమా అయినా .. 'మనీ ఫ్లోటింగ్' విషయంలో ఈ ఫీల్డులో ఉండేంత ఫెసిలిటీ, ఫ్లెక్సిబిలిటీ మరే బిజినెస్‌లోనూ ఉండదు.

80 కి పైగా సినిమాలు తీసిన ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్ మాటల్లో .. ఒక్క ముక్కలో చెప్పాలంటే .. "అసలు సినిమాల్లో ఉన్నంత డబ్బు మరెక్కడా లేదు."

ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ కూడా ఊహించనంత స్థాయిలో పెరిగింది.

కొన్ని లక్షలుమాత్రమే పెట్టి, కొత్తవాళ్లతో తీసే చిన్న సినిమా సుమారు 20 కోట్లు మార్కెట్ చేస్తుంటే, కోట్లు పెట్టి తీస్తున్న పెద్ద స్టార్స్ సినిమాలు 200 కోట్ల మార్కెట్‌ను ఎప్పుడో దాటేశాయి.

ఇదంతా కొన్ని నెలల్లో జరిగే బిజినెస్!

ఇప్పటి సినిమా వ్యాపార వాస్తవం ఇలా ఉంటే -
 
'ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టొచ్చు కానీ, సినిమాల్లో మాత్రం పెట్టొద్దు' అని మొన్నటివరకూ సొసైటీలో ఒక గుడ్డి వాదన ఉండేది. ఇదొక 'హెవీ గ్యాంబ్లింగ్' అని వాళ్ల ఉద్దేశ్యం.

కానీ అదంతా అర్థంలేని ఉట్టి బుల్‌షిట్ అన్న నిజాన్ని ఇప్పటి తరం అగ్రెసివ్ బిజినెస్‌మెన్ గుర్తించారు. కాబట్టే, "అబ్బో సినిమాల్లోనా!" అని ఇంతకుముందులా భయపడ్డంలేదెవ్వరూ.

అసలు సినిమాల్లో ఎంత డబ్బుందో కూడా గుర్తించారు.

అందుకే ఇప్పుడు ఎందరో ఎన్ ఆర్ ఐ లు, కార్పొరేట్‌లు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్, వాళ్లూ వీళ్లూ అని లేకుండా, అందరూ .. ఇటు ఎంట్రీ ఇస్తున్నారు.


కట్ టూ డబ్బు ప్లస్ -

ఫేమ్, డబ్బుతోపాటు, ఇంకే రకంగా తీసుకున్నా .. ఈ ప్రపంచంలో పాలిటిక్స్, క్రికెట్‌తో పోటీపడేది ఏదన్నా ఉందంటే అది సినిమా ఒక్కటే.

పిచ్చి మనీ ఫ్లోటింగ్‌తోపాటు, సినిమా బిజినెస్‌లో ఉండే మరికొన్ని లాభాలు ఏ ఇతర బిజినెస్‌ల్లోనూ లేవు. ఉండవు.

ఇతర అన్ని వ్యాపారాల్లోనూ బాగా డబ్బు సంపాదించొచ్చు. కానీ ..

రాత్రికిరాత్రే ఫేమ్‌నూ, ఒక సెలబ్రిటీ హోదానూ, ప్రపంచవ్యాప్త గుర్తింపునూ తెచ్చుకోవడం మాత్రం ఒక్క సినిమాల్లోనే సాధ్యం.

కనీసం ఒక 40 టీవీ చానెళ్ళూ, అన్నీ కలిపి కనీసం మరో 100 వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్, న్యూస్ పేపర్లు, వెబ్ చానెళ్ళు, సోషల్ మీడియాల్లో మీ పరిచయం-కమ్-ప్రమోషన్ గ్రాఫ్ ఓవర్‌నైట్‌లో మిమ్మల్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్తుంది.

ఈ అడ్వాంటేజ్ ప్రపంచంలోని మరే ఇతర బిజినెస్‌లో లేదు. ఉండదు.

దటీజ్ సినిమా. 

Wednesday, 8 March 2017

విమెన్స్ డే గురించి నాకెలా తెలిసింది?

"ఏయ్ మనోహర్, ఏంటి నన్ను విష్ చెయ్యవా? నన్నే కాదు .. క్లాస్‌లో ఉన్న అమాయిలందర్నీ విష్ చెయ్యాలి నువ్వీరోజు!"

నేను క్లాస్‌లోపలికి ఎంటరవుతూనే, మా రష్యన్ డిప్లొమా మేడమ్ కల్పన నన్ను పట్టుకొని ఇంగ్లిష్‌లో అన్నారు. 

సుమారు పాతికేళ్లక్రితం, నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్‌లో మూడేళ్ల రష్యన్ పార్ట్‌టైమ్ డిప్లొమా చదువుతున్నప్పటి సందర్భం అది.

నాకేం అర్థం కాలేదు.

మేడమ్‌ను ఒక్కదాన్నే విష్ చెయ్యడం అంటే తన బర్త్‌డే అనుకోవచ్చు. అమ్మాయిలందర్నీ ఎందుకు విష్ చెయ్యాలో ఎంత ఫాస్ట్‌గా ఆలోచించినా నాకు అస్సలు వెలగలేదు.

అప్పుడు ఇప్పట్లా కంప్యూటర్స్ లేవు. ఇంటర్‌నెట్ లేదు. సంవత్సరంలోని 365 రోజులకు 365 ఏవేవో 'డేస్' ఉన్నాయని సొదపెట్టే గూగుల్, ఫేస్‌బుక్కులు లేవు.

ఇంటర్నేషనల్ విమెన్స్ డే గురించి, దాని వెనకున్న రష్యన్ నేపథ్యం గురించీ ఆరోజు మేడమ్ చెప్పారు. తర్వాత, ఆ డిప్లొమా క్లాస్‌లో ఉన్న ఏకైక బాయ్ స్టుడెంట్‌నైన నాతో తను గ్రీటింగ్స్ చెప్పించుకున్నారు. క్లాస్‌లో ఉన్న ఇంకో డజన్ మంది అమ్మాయిలకు కూడా నాతో గ్రీటింగ్స్ చెప్పించారు.


కట్ టూ కల్పనా మేడమ్ - 

మా రష్యన్ ప్రొఫెసర్ మురుంకర్ అంటే నాకెంత గౌరవమో, కల్పనా మేడమ్ అన్నా నాకంతే గౌరవం, ఇష్టం.

నాకు నాలుగు ముక్కలు ఇంగ్లిష్ రావడానికి, రష్యన్ భాషలో నేను నా పెన్ ఫ్రెండ్స్‌కు వందలకొద్దీ ఉత్తరాలు రాయడానికీ, ఆ కాలంలో టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌కు వెళ్లి ల్యాండ్ ఫోన్ నుంచి ఫ్రీగా రష్యాకు ఫోన్ చేసి అక్కడున్న ఫ్రెండ్స్‌తో రష్యన్‌భాషలో మాట్లాడ్దానికీ, మూడేళ్ల రష్యన్ డిప్లొమాలో నేను యూనివర్సిటీ టాపర్ కావడానికీ, ఎన్నో కథానికలు గట్రా నేరుగా రష్యన్ నుంచి తెలుగులోకి నేను అనువాదం చెయ్యడానికీ, ఇండియా వచ్చిన రష్యన్ సైంటిస్టులకు, ఆర్టిస్టులకు ఇంటర్‌ప్రీటర్‌గా నేను పనిచెయ్యడానికీ, చివరికి అసలు డ్రైవింగ్ అంటేనే తెలియని నేను మొట్టమొదటిసారి ఒక టూవీలర్ ఎక్కి డ్రైవ్ చెయ్యడానికి కూడా ఒక తిరుగులేని కారణం .. ఒక ఊహించని ఇన్స్‌పిరేషన్ .. కల్పనా మేడమ్.

ఇప్పుడు తను ఎక్కడున్నారో నాకు తెలియదు. కనుక్కోవాలి. వీలైతే కలవాలి.

హాపీ విమెన్స్ డే మేడమ్! 

Sunday, 5 March 2017

జస్ట్ ఫర్ ఫన్!

మనలో చాలా మందికి ఫేస్‌బుక్‌లో ఒక 5 వేలమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకో 2 వేలమంది కనీసం ఫాలోయర్స్ ఉంటారు.

నిజంగా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, లేదా అత్యవసరమైన సహాయం ఏదైనా కావల్సివచ్చినప్పుడు .. ఈ వేలాది ఫ్రెండ్స్‌లో నిజంగా ఎంతమంది స్పందిస్తారు?

దీనికి సమాధానం మీ అందరికీ తెలుసు.

కేవలం ఒకరో, ఇద్దరో స్పందించినా గొప్పే. అలా స్పందించినవాళ్లే నిజమైన ఫ్రెండ్స్.  మిగిలినవాళ్లంతా జస్ట్ పేపర్ రిలేషన్స్.

అంతే.

ఈ కోణంలో చూసినప్పుడు ఫేస్‌బుక్ అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. ఒక టైమ్‌పాస్. అంతకుమించి ఏం లేదు. ఏం ఆశించకూడదు.


కట్ చేస్తే - 

సోషల్ మీడియా చాలా శక్తివంతమైంది. దీన్ని నిజంగా బాగా ఉపయోగించుకోగలిగితే .. దానికి ఆకాశమే హద్దు.

నేను ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్ లను ఈ కోణంలోనే చూస్తాను. ఈ కోణంలోనే ఉపయోగిస్తాను. అప్పుడప్పుడూ కొంత చెత్త తప్పదనుకోండి. నిజానికి అదికూడా నా ప్రొఫెషనల్ వర్క్‌లో భాగమే ఒక రకంగా. కానీ అలా కనిపించదు ఏదీ.

ఫేస్‌బుక్ క్రియేటర్ దీంతో ప్రపంచాన్నే కనెక్ట్ చేశాడు. బిలియన్లు సంపాదిస్తున్నాడు. మరి మనమేం చేస్తున్నాం దీంతో?

ఒకసారి ఆలోచించాలి ...  

Saturday, 4 March 2017

ఫిల్మ్ మేకింగ్ మేడ్ ఈజీ!

ఇప్పుడెంత చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తోనయినా ఫీచర్ ఫిల్మ్ తీసేయొచ్చు. టెక్నాలజీ అంతగా డెవలప్ అయింది. అంత సింపుల్ అయింది.

డిజిటల్ లైఫ్.

డిజిటల్ ఫిల్మ్ మేకింగ్.

అప్పట్లో వచ్చిన 'ఈరోజుల్లో', 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ', 'దొంగలముఠా', 'ఐస్‌క్రీమ్' ఎట్సెట్రాల నుంచి, మొన్నటి 'పెళ్లిచూపులు' సినిమా దాకా .. ఇదే విషయాన్ని వివిధ కోణాల్లో నిరూపించాయి.


కట్ చేస్తే - 

వీటన్నింటికీ అసలు ఇన్స్‌పిరేషన్ హాలీవుడ్‌లో వుంది.

ఆరెన్ పేలి తీసిన 'పారానార్మల్ యాక్టివిటీ', ఎడ్వర్డ్ బర్న్స్ తీసిన 'న్యూలీ వెడ్స్', మైక్ కెరోల్ తీసిన 'నైట్ బీట్స్' ఎట్సెట్రా సినిమాలు కేవలం 9 వేల డాలర్లలోపు బడ్జెట్లో  తీసినవే. కలెక్షన్ మాత్రం మిలియన్లలో కొల్లగొట్టారు!

ఇంకొన్ని సినిమాలైతే పూర్తిగా జీరో బడ్జెట్లో తీసినవి కూడా ఉన్నాయి. వాటిగురించి మరోసారి రాస్తాను.

డిజిటల్ యుగం రాకముందే ఇలా నో బడ్జెట్/లో బడ్జెట్ ప్రయోగాలు హాలీవుడ్‌లో చేసిన ఒకే ఒక్కడు రాబర్ట్ రోడ్రిగ్జ్. ఆ సినిమా పేరు 'ఎల్ మరియాచి.' జస్ట్ 7 వేల డాలర్లలో అసలు క్రూ లేకుండా సినిమాతీశాడు. మిలియన్ల డాలర్ల కలెక్షన్ కొల్లగొట్టాడు.

కట్ చేస్తే .. ఆ అనుభవాన్ని ఒక పుస్తకంగా కూడా రాశాడు రోడ్రిగ్జ్, 'రెబల్ వితౌట్ క్రూ' అని!

ఫైనల్‌గా పాయింట్ ఏంటంటే .. భారీ బడ్జెట్ సినిమాలు తీసే అవకాశం అందరికీ రాదు. దానికి సవాలక్ష కారణాలుంటాయి. అలాంటి నేపథ్యంలో, మనకు అందుబాటైన బడ్జెట్‌ను ఏ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో, ఏ లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ ద్వారానో సేకరించుకొని, మైక్రో బడ్జెట్‌లోనే మనకిష్టమైన సినిమాలు తీసుకోవడం ఉత్తమం.

చిన్న బడ్జెట్ సినిమాలకు రిస్క్ ఫాక్టర్ తక్కువ. హిట్ కొడితే ప్రొడ్యూసర్‌కు కోట్ల రూపాయలు. డైరెక్టర్‌కు కూడా కోట్ల రూపాయల ప్యాకేజీతో ప్రొడ్యూసర్స్ నుంచి ఆఫర్లు!

నా దృష్టిలో ఇదే రహదారి. ఇదే బెటర్ కూడా. 

Friday, 3 March 2017

వీడింతే!

పూరీ జగన్నాధ్ సినిమా "నేనింతే!" లాంటి టైటిలే కావొచ్చు ఈ బ్లాగ్ పోస్ట్ టైటిల్. కానీ, ఇక్కడ కంటెంట్ వేరే.

పర్సనల్ డెవలప్‌మెంట్.

మైండ్‌సెట్.

ఎన్నో ఇతర రంగాల్లో, ఎన్నో విషయాల్లో తిరుగులేని విజయాల్ని సాధించిన ఒక వ్యక్తి ఒక్కచోట మాత్రం అత్యంత దారుణంగా విఫలమయ్యాడు అంటే అదేదో అందరూ అనుకొనే బ్యాడ్‌లక్ కాదు.

మనం ఎంచుకొన్న పని, లేదా ఫీల్డులో మనం సంపూర్ణంగా పనిచెయ్యడం లేదు. చెయ్యలేకపోతున్నాం. చెప్పాలంటే, ఆ ఫీల్డులో మనల్ని మనం "ఫిట్" చేసుకోలేకపోతున్నాం .. అని నా ఉద్దేశ్యం.

అవతల 100 మంది నిర్ణయాల మీద నీ సక్సెస్ ఆధారపడి ఉందంటే, తప్పకుండా ఆలోచించాల్సిందే ఎవరైనా. మనం ఇక్కడ ఫిట్ అవుతామా లేదా అనేది.

ఇది బాగా ఆలోచించాలి.

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగే ఉండాలన్న సామెత మర్చిపోవద్దు. తాడిచెట్టుకిందకెళ్లి పాలు తాగుతానంటే కుదర్దు. అక్కడ కల్లే తాగాలి.

ఈ మైండ్‌సెట్‌కు షిఫ్ట్ అవ్వటం చాలా అవసరం.


కట్ టూ సక్సెస్ సైన్స్ - 

మన నిత్యజీవితంలో, మనచుట్టూ, మనకు అతి దగ్గరగా ఉండే అయిదుగురిమీదే మన జయాపజయాలు ఆధారపడిఉంటాయంటే మనం నమ్మలేం. కానీ నిజం.

ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ చుట్టూ మీకు అతిదగ్గరగా మెదిలే ఆ అయిదుగురు ఎవరో, వారిలో ఎవరి మైండ్‌సెట్ ఎలా ఉందో.

"నేను అది పొడుస్తా, ఇది పొడుస్తా" అని ఓ 20 నిమిషాలపాటు ఎగిరి .. ఓ గంట తర్వాత పలకరించి అదే విషయం గుర్తుచేసినప్పుడు అసలు ప్రాణం లేనట్టుగా మాట్లాడేవాడు .. ఒక్కడు నీ అయిదుగురిలో ఉన్నా .. నువ్వేం చెయ్యలేవు.

అందరూ "ఇక వీడింతే" అని నిన్ను అంటారంటే, అందులో వారి తప్పేం లేదు. అక్కడ కనిపిస్తోంది అదేగా?!

సో, ముందా ఒక్కడి మైండ్‌సెట్ మార్చు. లేదా నీ అయిదుగురి సెట్ మార్చుకో. నీకోసం. వాళ్ల కోసం.

అంతా మన చేతుల్లో ఉంది. మన చేతల్లో ఉంది. మన మైండ్‌సెట్‌లో ఉంది. అంతే తప్ప .. "వీడింతే!" అన్నది ఎప్పుడూ నిజం కాదు. కాకూడదు.

ఏదిఎలా ఉన్నా .. నేనైతే ఇది నిజం కానీయను.

ఇంక చాలు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ...

Friday, 24 February 2017

హరహరమహాదేవ్!

మా ఇంటి దేవుడు వేములవాడ రాజన్న.

శివుడు.

ఇక, శివరాత్రి అంటే నాకు వెంటనే వరంగల్‌లో నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.

పొద్దున్నే స్నానం, శివునికి దండం పెట్టుకోడం, అమ్మ చేసిన ప్రత్యేక ప్రసాదం, ఉడికించిన కందగడ్డలు .. ఇలా ఎన్నో.

ఇవన్నీ ఎలా ఉన్నా, శివరాత్రికి మా వీధిలో అందరూ ఉపవాసంతో జాగరణ చేసేవాళ్లు. గ్రూపులు గ్రూపులుగా.

భక్తి భక్తే .. కానీ తెల్లారేవరకు ఎలా జాగరణ చేయాలి అన్నది అసలు కొశ్చన్.

ఆడాళ్లు కబుర్లు చెప్పుకుంటూ, మగాళ్లు పేకాట ఆడుకుంటూ, చిన్న పిల్లలు ఏవేవో ఆటలాడుకుంటూ జాగరణ చేసేవాళ్లు. కొంచెం ఎదిగిన కుర్రాళ్లు మాత్రం, ఆరోజు సినిమాహాళ్లలో సెకండ్ షో తర్వాత ప్రత్యేకంగా వేసే రెండు మిడ్‌నైట్ షో లకు వెళ్లేవాళ్లు.


కట్ టూ అసలు పాయింట్ - 

శివరాత్రి అనగానే ఇప్పటికీ నాకు బాగా గుర్తొచ్చేవి రెండు: ఒకటి, నేను చిన్నప్పుడు నాన్ డిటెయిల్డ్ లో చదువుకున్న శివభక్తుడు గుణనిధి కథ. రెండు, బాపు గారు తీసిన భక్తకన్నప్ప.

గుణనిధి, కన్నప్ప .. ఇద్దరూ హార్డ్‌కోర్ శివభక్తులే.

వాళ్ల రేంజ్‌లో నేను కష్టాలు పడకపోవచ్చు కానీ, శివుడిపట్ల భక్తి విషయంలో మాత్రం ఇప్పుడు నా సిన్సియారిటీ సేమ్ టూ సేమ్.

ఇది మా ఇంటి దేవుడైన శివుడికి తెలుసు. నాకు తెలుసు.

కాకపోతే, మొన్నటిదాకా మా ఇంటిదేవుడైన శివుడ్ని కాస్త విస్మరించాను. ఆయన్నొక్కన్ననే కాదు. అసలు భక్తిమీదనే భక్తిలేదు నాకు ఇటీవలివరకూ.

నాలో ఈ భక్తి అనేది ఎంటరయ్యాక, ముందు కొంచెం సిన్సియర్‌గా నేను కనెక్ట్ అయ్యింది షిర్డీ సాయిబాబాకు. ఎందుకో నాకే తెలీదు. షిర్డీ సాయిబాబాకు, నాకూ మధ్య చాలా నడిచింది. అదంతా ఒక అద్భుతమైన పుస్తకంగా కూడా రాశాను. అయితే, ఆ పుస్తకాన్ని ఎప్పుడు బయటికి తెస్తానో నాకే తెలియదు.    

ఈమధ్యకాలంలో నాలో బాగా గాఢతను పెంచుకొంటున్న ఈ భక్తి ఒక మూఢత్వం కాదు. ఇటీవలివరకూ నేను విస్మరించిన ఒక క్రమశిక్షణ.

"రెలిజియన్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ థింగ్" అన్న నిజం నాకు తెలుసు. 'దేవుడు' అన్న కాన్సెప్ట్ అందులో ఒక భాగం అని కూడా నాకు తెలుసు.

అయినా ఈ పోస్ట్ రాస్తున్నాను.

చాలామంది నవ్వుకుంటారని కూడా నాకు తెలుసు.

అయినా నేనీ పోస్ట్ రాస్తున్నాను.

ఎందుకలా అంటే నేనిప్పుడేం చెప్పను.   

అది ఎవరికివాళ్లకు అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది.

జీవితంలో ఎవ్వరు ఎంత ఎదిగినా, ఎగిరెగిరిపడ్దా, ఎన్ని లాజిక్కులు మాట్లాడినా, ఎంత ఈగోతో చెలరేగినా .. అందరూ చివరికి ఏదో ఒక శక్తికి సరెండర్ అవ్వాల్సిందే.

ఆ శక్తికి మనం పెట్టుకొనే పేరు ఏదైనా కావొచ్చు. కానీ, సరెండర్ అవ్వక మాత్రం తప్పదు.

అదే జీవితం. అదే ఆధ్యాత్మికమ్.

ఆధ్యాత్మికంలో ఉండే ఆ కిక్కే వేరు. అందుకే, మహా రచయిత చలం లాంటివాడు కూడా చివరికి రమణమహర్షి ఆశ్రమం చేరక తప్పలేదు. 

Wednesday, 22 February 2017

కొన్ని మనమే నమ్మలేం!

ఎంత వద్దనుకున్నా కొన్ని నిర్ణయాలు, అనుభవాలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రిపీటవుతుంటాయి. మనచేతుల్లో ఏదీ ఉండని పరిస్థితిని క్రియేట్ చేస్తూ.

ఇలాంటివాటిని నేను అస్సలు నమ్మను. ఇప్పటికి కూడా.

మనలోనో, మన ప్రయత్నంలోనో, మన నిర్ణయంలోనో ఉంటుంది తప్పు. మన పనివిధానంలోనో, మన చుట్టూ మనం క్రియేట్ చేసుకొన్న వాతావరణంలోనో ఉంటుంది తప్పు.

ఈ తప్పుని గుర్తించడం అంత ఈజీ కాదు.

గుర్తించినా, చాల్లాసార్లు మన ఈగో ఒప్పుకోదు. మనకిలాంటి ఈగో ఉందన్న నిజాన్ని మన మనసొప్పుకోదు.

అయితే, ఈ లాజిక్కులెలా ఉన్నా, ఈ నిజాల్ని ఒప్పుకొనే సమయం కూడా మనకొస్తుంది. కానీ అప్పటికే మన జీవితంలో చాలా విలువైన సమయాన్ని మనం కోల్పోయుంటాము.

ఇష్టం లేకపోయినా సరే, అప్పుడు చెప్తాము. ఒక్కటే మాట.

సరెండర్.

దేవుడు గుర్తుకొస్తాడు.

ఇలా మనల్ని సరెండర్ చేయించగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఒకటిరెండు విషయాలకే ఉంది. వాటిలో ప్రధానమైనది ..

డబ్బు.

జీవితంలో ఏం జరిగినా జాంతానై. డబ్బు డబ్బే! ఈ ఒక్కవిషయంలో ఎలాంటి ఫీలింగ్స్‌కు తావులేదు. బంధువులైనా, మిత్రులైనా, శత్రువులైనా, శ్రేయోభిలాషులైనా.

అనుభవిస్తేనేకానీ తెలీని నిజం మన జీవితంలో ఇదొక్కటే.

డబ్బుదగ్గర ఏ లాజిక్కులూ, ఏ నమ్మకాలూ, ఏ రిలేషన్లు పనిచేయవు. నిలవవు.

అస్సలు నమ్మలేం.

దటీజ్ ద పవరాఫ్ డబ్బు! 

ఓ నలుగురు లైక్‌మైండెడ్ కలిస్తే చాలు!

ఒక టీనేజ్ కుర్రాడిలా ఇప్పుడు నేనేదో కొత్తగా ఓ గాళ్ ఫ్రెండ్‌ను వెదుక్కోడానికో, వెంటపడటానికో ఫేస్‌బుక్‌లో లేను.

నా సినిమా ప్రొఫెషన్‌కు సంబంధించిన నెట్‌వర్కింగ్ కోసమే నేనిక్కడున్నాను. నాదంటూ ఒక లైక్‌మైండెడ్ టీమ్‌ను ఎప్పటికప్పుడు తయారుచేసుకోవడం కోసమే నేనీ సోషల్ మీడియాలో ఉన్నాను.

నా ఇతర ప్రొఫెషన్లు, ఆసక్తులన్నీ ప్రస్తుతానికి సెకండరీ.

ఇది వివరణ కాదు. వాస్తవం.

కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసం నేను ఎప్పటికప్పుడు విడిగా ఆడిషన్స్ ఎనౌన్స్ చేస్తుంటాను. అప్పుడు మాత్రమే ఆడిషన్స్‌కు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

నేను ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరగను. నాక్కావల్సిన ప్రొడ్యూసర్స్‌ను, కోప్రొడ్యూసర్స్‌ను, ఇన్వెస్టర్స్‌ను నేనే క్రియేట్ చేసుకొంటుంటాను.

ఓ నలుగురు లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ కలిస్తే చాలు. వాళ్లే నా ప్రొడ్యూసర్స్. అదే నా ప్రొడక్షన్ కంపెనీ. అదే నా దేవాలయం.

ఇప్పుడు నాక్కావల్సింది కేవలం ఒకరిద్దరే. ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా తక్కువ.

మిగిలిందంతా నేను చూసుకుంటాను.

తక్కువ స్థాయిలోనైనా సరే, మీరొకవేళ సినిమా ఇన్వెస్ట్‌మెంట్ మీద ఆసక్తి ఉన్న కొత్త "ఇన్వెస్టర్‌లు", "ఇన్వెస్టర్ ఆర్టిస్టులు" గానీ అయితే .. వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లైతే .. మీ ఆసక్తి వివరాలు తెలుపుతూ, మీ మొబైల్ నంబర్ ఇస్తూ, నా ఫేస్‌బుక్‌లోగానీ, ట్విట్టర్‌లోగానీ నాకు మెసేజ్ పెట్టండి.

లైక్‌మైండెడ్ అయితే చాలు. నేనే మీకు కాల్ చేస్తాను.

లెట్స్ వర్క్ టుగెదర్ ..